close
పండుటాకులకు ఆసరా!

జీవితంలో ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న వాళ్లకి వృద్ధాప్యం దినదిన గండంగా మారింది. కడుపున పుట్టినవాళ్లు దూరం పెట్టినవాళ్లు కొందరూ, నా అన్నవాళ్లు లేక ఇంకొందరూ... ఇళ్లకు దూరమై ఎక్కడెక్కడో భారమైన జీవితం గడుపుతుంటారు. అలాంటివాళ్లకి గూడిచ్చి పట్టెడు అన్నం పెడుతున్నాయి ఈ సంస్థలు!

అందరిదీ... ఆనంద నిలయం

యానాం... కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగం. ఈ పట్టణంలో అనాథ వృద్ధులను ఆదుకోవడానికి ఏర్పాటైందే ‘యానాం ఓల్డేజ్‌ హోమ్‌’. పుదుచ్చేరి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో 1998లో దీన్ని ప్రారంభించారు. స్థానిక వ్యాపారులూ, దాతల సాయంతో భవనాన్ని నిర్మించారు. దీనికే ‘ఆనంద నిలయం’ అని పేరు. విశాల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో 28 గదులున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 60 మందికిపైగా వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా పరుపులూ, మంచాలూ, దుప్పట్లూ, పండగలకు కొత్త బట్టలూ, నెలకు కావాల్సిన వస్తువులూ అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు టిఫిన్‌, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, మూడు గంటలకు అల్పాహారం, సాయంత్రం ఏడు గంటలకు భోజనం అందిస్తారు. పూల, పండ్ల, అలంకరణ మొక్కలతో ఆనంద నిలయం ఆవరణ చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తుంది.  ఆశ్రమంలోని చాలామంది ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రకృతి నీడన సేదదీరుతారు. ఈ భవనంలోనే అనాథ పిల్లల కోసం 2009లో ప్రత్యేక విభాగాన్నీ నెలకొల్పారు. ప్రస్తుతం ఇక్కడ 20 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. కాలేజీ చదువులు పూర్తిచేసే వరకూ వారికి అన్నివిధాలా చేయూతనిస్తారు. ఆనంద నిలయం నిర్వహణకు అవసరమైన నిధుల్ని స్థానికులే విరాళాల రూపంలో అందివ్వడం విశేషం.

అనాథల అమ్మ!

నాథ వృద్ధులు ఎక్కడ కనిపించినా తనవాళ్లనుకొని చేరదీస్తుంటారు కాజీపేటకు చెందిన మహమ్మద్‌ యాకూబీ. అక్కడే ‘సహృదయ అనాథాశ్రమం’ నిర్వహిస్తున్నారామె. అనాథల సమాచారం తెలుసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను ఇంట్లో ఉంచేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అలా కాని పక్షంలో తన ఆశ్రమానికి తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇప్పటివరకూ 90 మందికి పైగా అనాథల్ని చేరదీశారామె. ‘పిల్లలు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఓ వృద్ధురాలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పత్రికలో వచ్చిన వార్త చూసి చలించిపోయా. అప్పటికే సేవా కార్యక్రమాలు చేయాలని ఉండేది. అదే విషయాన్ని మావారితో చెబితే అంగీకరించారు. దీంతో ఇద్దరం కలిసి దాతల సాయంతో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాం’ అంటారామె. ప్రస్తుతం చాలామంది కుటుంబ సభ్యుల పుట్టిన రోజులూ, పెళ్లిరోజు వేడుకల్ని ఆశ్రమంలో అనాథల మధ్యనే జరుపుతూ వృద్ధులకు ఆహారం, పండ్లు వంటివి అందిస్తారు. అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటారు.

ఆదివారం అన్నదానం!

మురుగన్‌ సొంతూరు చెన్నై. 27 ఏళ్ల కిందట పదో తరగతి తప్పి, భయంతో ఇల్లు వదిలి ఓ అర్ధరాత్రి కోయంబత్తూరు చేరుకున్నాడు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. కానీ అక్కడ ఎందరో నిరాశ్రయులు రోడ్లమీద కనిపించారు. రెండ్రోజులు వాళ్లమధ్యనే తిరిగాడు. వాళ్లంతా మురుగన్‌ని ఇంటికి తిరిగి వెళ్లమంటూ బస్సు ఛార్జీలకు అవసరమైన డబ్బులిచ్చారు. కానీ మురుగన్‌ మనసు అందుకు అంగీకరించలేదు. ఆత్మహత్య ఆలోచనను వీడి అలాంటి వాళ్లకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ తనకే నిలువనీడలేదు ఇతరులకు ఏం సాయం చేయగలడు. అందుకే మొదట ఒక హోటల్‌లో సర్వర్‌గా కుదురుకున్నాడు. అక్కడే దాదాపు పదిహేనేళ్లు పనిచేశాడు. తర్వాత మరెన్నో చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు. చివరకు ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అప్పట్నుంచీ తన సంపాదనలో కొంత మొత్తాన్ని అనాథలకు అన్నం పెట్టేందుకు ఖర్చుచేస్తున్నాడు. వారంలో ఆరు రోజులు ఆటో నడుపుతూ ఆదివారంనాడు అనాథలకూ, ఆశ్రమాల్లో ఉండే వృద్ధులకూ అన్నం పెడుతుంటాడు. మురుగన్‌ చేస్తున్న పని నచ్చి దాదాపు 20 మంది స్నేహితులు అతడితో కలిశారు. వీరంతా విరాళాలు వేసుకుని శనివారమే బియ్యం, కూరగాయలూ, పప్పులూ కొని... కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయాన్నే అన్నం, సాంబారు వండుతారు. వాటిని ఆటోల్లో వివిధ వృద్ధాశ్రమాలకు తరలిస్తారు. అలా ఆ ఒక్కరోజు సుమారు 1300 మందికి మధ్యాహ్న భోజనం పెడతారు. దీనికోసం నెలకు రూ.30 వేల వరకూ ఖర్చుచేస్తున్నారు. అనాథ వృద్ధులు కనిపిస్తే ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేర్చేంతవరకూ వారికి ఆశ్రయమిస్తారు కూడా.
- రఘు మాధవ్‌ మోడెం, ఈనాడు డిజిటల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.