close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అది నేనే... ఇది నేనే..!

బతకడానికి ఏదో ఒకటి చేస్తున్నాంలే అనుకుని సంతృప్తి పడిపోయేవారు చాలామందే ఉంటారు. వీరు అలాకాదు... ఆత్మసంతృప్తికోసం వృత్తికి న్యాయం చేస్తూ ప్రవృత్తిలోనూ దూసుకుపోతున్నారు.

మేయర్‌ పాలప్యాకెట్లు వేస్తుంది

కేరళలోని త్రిశూర్‌కు చెందిన అజిత విజయన్‌ భర్త మిల్క్‌బూత్‌ నడుపుతుంటాడు. ఆమె పద్దెనిమిదేళ్లుగా తాముండే కనిమంగళం ప్రాంతంలో ఓ రెండొందల ఇళ్లకి స్కూటీ మీద వెళ్లి పాలప్యాకెట్లు వేస్తుంది. ఆ పనయ్యాకే అజిత దినచర్య మొదలవుతుంది. అయితే ఈ మధ్య అజిత త్రిశూర్‌ మేయర్‌గా ఎన్నికైనా పాలప్యాకెట్లు వేయడం మానుకోలేదు. ‘మేయర్‌ అయితే ఎంచక్కా కారుల్లో తిరిగి... హోదాను అనుభవించొచ్చు కదా’ అని ఎవరన్నా అంటే ఒప్పుకోదు. ‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ మూలాలను ఎప్పుడూ మర్చిపోను. ఈ పదవులు తాత్కాలికం. మనం చేసే పనే శాశ్వతం’ అని చిరునవ్వుతో సమాధానమిస్తుంది. అంతేకాదు పాలప్యాకెట్లు వేస్తూ ఇంటింటికీ తిరిగితే సమస్యలన్నీ తెలిసిపోతాయనీ అంటున్న అజిత కొంత కాలం అంగన్‌వాడీ టీచర్‌గానూ పని చేసింది. కష్టపడే మనస్తత్వమున్న అజిత ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేలా చూడ్డమే తన లక్ష్యం అంటోంది.

నటిస్తూ, ఆటో నడుపుతూ...

‘అత్తారింటికి దారేది’లో పవన్‌కల్యాణ్‌ తాతగా నటించిన బొమన్‌ ఇరానీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అయింది. ఒక రోజు అర్ధరాత్రి షూటింగ్‌ నుంచి ఇంటికెళుతున్న బొమన్‌ఇరానీ ఆటో నడుపుతున్న ఓ మహిళని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే చేయెత్తి ఆటో ఆపాడు. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్‌ మరాఠీ సీరియల్‌ నటి. కొన్ని సినిమాల్లోనూ నటించింది. పేరు లక్ష్మి. బొమన్‌ ఇరానీ ఆటోలో కాసేపు ప్రయాణించి వీడియో తీసుకున్నాడు. అంత రాత్రిపూట లక్ష్మి ఆటో నడపడానికి కారణం తెలుసుకుని బాధపడిన బొమన్‌ ఇరానీ ఆ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నాడు. ముంబయికి చెందిన లక్ష్మి తల్లిదండ్రులు నిరుపేదలు. ఐదుగురు ఆడపిల్లల్లో లక్ష్మి చిన్నది. పరిస్థితులు సహకరించక ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది. ఆమెకి చిన్నతనం నుంచీ నటన అంటే ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల వల్ల బ్యూటీపార్లర్‌, ఆసుపత్రుల్లో కొంత కాలం పనిచేసింది. చివరికి తెలిసిన వారి ద్వారా ‘జై మహారాష్ట్ర ధాబా భాటిండా’ అనే సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశం వచ్చిది. ఆ తరవాత టీవీ షోలూ, సీరియళ్లలోనూ ఛాన్స్‌ రావడంతో నటిగా నిరూపించుకుంది. ఇంతలో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత లక్ష్మి పైనే పడింది. తల్లిని చూసుకుంటూ, క్యాన్సర్‌ బారిన పడిన అక్కకి చికిత్స చేయిస్తోంది. మరో ఇద్దరు అక్కలకు పెళ్లి చేయాల్సి ఉంది. అందుకే అర్ధరాత్రి ఆటో నడుపుతుంది.

స్విగ్గీ బాయ్‌ నటుడు కూడా

మధ్య సూపర్‌హిట్‌ అయిన సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’ సినిమాలో చేతన్‌రావ్‌ కీలక పాత్ర పోషించాడు. నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. అంతకు ముందు చేతన్‌ టీవీ షోలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘దిల్లీక్రైం’ అనే వెబ్‌ సిరీస్‌లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా రాణిస్తున్న చేతన్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. ఎందుకంటే.. దిల్లీకి చెందిన రాజేశ్‌ తైలాంగ్‌ అనే నటుడు స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. ఓ అరగంటకి ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ని డెలివరీబాయ్‌గా చేతన్‌ తీసుకెళ్లడంతో రాజేశ్‌ ఆశ్చర్యపోయాడు. అతనితో కలిసి సెల్ఫీ దిగి ట్విటర్‌లో ఆ ఫొటోలతోపాటు అసలు విషయాన్నీ పంచుకున్నాడు. దిల్లీకి చెందిన చేతన్‌ రావు నిరుపేద. చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలనేది అతని కోరిక. అందుకు మంచి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకుంటూనే సినిమాల్లో స్పాట్‌బాయ్‌గా కొంతకాలం పనిచేసినా వచ్చిన డబ్బులు సరిపోక స్విగ్గీలో చేరాడు. క్రమంగా షోల్లో, సినిమాల్లో అవకాశాలు వచ్చినా అక్కడితో ఆగిపోలేదు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఎలాగైనా మంచి యాక్టింగ్‌ స్కూల్లో చేరాలని డబ్బు కూడబెడుతున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.