close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టెన్నిస్‌బాల్‌ వల్లనే క్రికెట్‌ సాధ్యమైంది!

నవ్‌దీప్‌ సైనీ... క్రికెట్‌ని అకాడమీల్లో చేరి నేర్చుకోలేదు. అండర్‌-16, అండర్‌-19 అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ రాలేదు. గల్లీబాయ్‌ ర్యాపర్‌ అయినట్లు, ఈ గల్లీ క్రికెటర్‌ అనుకోని సంఘటనలవల్ల ఈరోజు భారతజట్టులోకి వచ్చాడు. ఆ జర్నీ గురించి సైనీ ఏం చెబుతాడంటే...
బ్రెట్‌లీ, మిచెల్‌ జాన్సన్‌ నా ఆరాధ్య క్రికెటర్లు. వాళ్లని అనుకరిస్తూ ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసేవాణ్ని. చిన్నప్పట్నుంచీ ఏ అకాడమీలోనూ చేరలేదు. దిల్లీ రంజీ ఆటగాడు సుమిత్‌ నర్వాల్‌ది మా కర్నాల్‌(హరియాణా) జిల్లానే. ‘కర్నాల్‌ ప్రీమియర్‌ లీగ్‌’ పేరుతో అక్కడో లీగ్‌ని నిర్వహించేవాడు సుమిత్‌. అది టెన్నిస్‌ బాల్‌ లీగ్‌. ఆ టోర్నీకి స్థానిక యువతనే ఎంపికచేసేవారు. ఎంపిక పోటీలో పాల్గొనాలంటే రూ.400 ఫీజు. నాన్న హరియాణా ప్రభుత్వంలో ఓ చిరుద్యోగి. ఇంట్లో బతిమాలి ఆ డబ్బు తీసుకున్నాను. మొత్తానికి నేను ఆ లీగ్‌కి ఎంపికయ్యాను. లీగ్‌లో ఒక మ్యాచ్‌కి రూ.200 ఇచ్చేవారు. అక్కడే నా బౌలింగ్‌లోని వేగం సుమిత్‌ను బాగా ఆకట్టుకుంది. ఏదైనా అకాడమీలో చేరమని టోర్నీ ముగిసిన రోజు సలహా ఇచ్చాడు. కానీ నేను చేరలేదు. తర్వాత ఏడాది కూడా లీగ్‌లో ఆడి రాణించాను. మళ్లీ సుమిత్‌ నన్ను పిలిచి మాట్లాడాడు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితిని వివరిస్తే కర్నాల్‌లో తను ప్రాక్టీసు చేస్తున్న స్టేడియానికి నన్ను రమ్మని చెప్పాడు. ఇద్దరం అక్కడ ప్రాక్టీసు చేస్తుండేవాళ్లం. ఓసారి దిల్లీ వెళ్లినపుడు రంజీ జట్టు నెట్‌ (ప్రాక్టీస్‌) బౌలర్‌గా రమ్మని పిలిచాడు సుమిత్‌. అప్పటికి నాకు షూస్‌ కూడా మంచివి లేవు. దిల్లీ జట్టులో చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. వాళ్లు ఎలా ఆడతారో చూడాలన్న  ఉత్సాహంతో దిల్లీలోని రోషనార స్టేడియానికి వెళ్లాను. అప్పటికి గంభీర్‌ ఆ జట్టు కెప్టెన్‌. నన్ను తనకు పరిచయం చేశాడు సుమిత్‌. లెదర్‌ బాల్‌ క్రికెట్‌ అనుభవం లేదని చెబితే, ‘టెన్నిస్‌ బాల్‌ వేసినట్లే వేయి. టెన్షన్‌ పడకుండా నాలుగు బంతులు వేస్తే నీకే అర్థమైపోతుంది’ అని ధైర్యం చెప్పాడు. అక్కడ గంభీర్‌కు ఓ పదిహేను నిమిషాలు బౌలింగ్‌ చేశాను. నా బౌలింగ్‌లో వేగం, లైన్‌ నచ్చి... ‘ఇకనుంచి రెగ్యులర్‌గా ప్రాక్టీసుకి వస్తుండు’ అని చెప్పి మంచి స్పోర్ట్స్‌ షూ ఇచ్చాడు.

గంభీర్‌ పోరాటం...
కొద్దిరోజుల ప్రాక్టీసు తర్వాత నాపై గురి కుదిరిందేమో, దిల్లీ రంజీ జట్టులోకి నన్ను తీసుకోమని యాజమాన్యానికి గంభీర్‌ సూచిస్తే, ‘స్థానికత, అనుభవం’ అంటూ వాళ్లు అడ్డు చెప్పారు. ఏడాదిపాటు సెలెక్టర్లూ, కోచ్‌, మేనేజ్‌మెంట్‌... ఇలా అందరితో పోరాడితే చివరకు 2013-14 రంజీ సీజన్లో నన్ను జట్టులోకి తీసుకున్నారు. ఆ ఎంపిక ‘కలా నిజమా’ అన్నట్టుండేది నాకు. నేను వచ్చిన తీరునిబట్టి నా ఆటని అందరూ నిశితంగా గమనిస్తుంటారని తెలుసు. అందుకే మైదానం లోపలా, బయటా ఎంతో జాగ్రత్తగా ఉండేవాణ్ని. మొదట్లో గంటకు 130-135 కి.మీ. వేగంతో బంతులు వేసిన నేను ప్రాక్టీసుతో క్రమంగా 140-145 వేగంతోనూ బంతులు వేయగలిగాను. తర్వాత ‘ఇండియా-ఎ’కి కూడా ఎంపికయ్యా. 2017 ఐపీఎల్‌లో దిల్లీ జట్టు రూ.10 లక్షలకు తీసుకుంది. అక్కడ ఆడే ఛాన్స్‌ రాకున్నప్పటికీ రాహుల్‌ ద్రవిడ్‌, జహీర్‌ఖాన్‌ల శిష్యరికం దొరికింది. 2017-18 సీజన్‌ రంజీ ట్రోఫీలో సెమీస్‌లో బెంగాల్‌మీద ఏడు వికెట్లు తీసి దశాబ్దం తర్వాత దిల్లీ ఫైనల్స్‌కి చేరడంలో కీలకపాత్ర పోషించాను. ఆ సీజన్లో మొత్తం 34 వికెట్లు తీశాను. 2018 ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు రూ.3కోట్లు పెట్టి వేలంలో సొంతం చేసుకుంది. గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఎంపికైనా తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే అప్పటికే నెట్‌ బౌలర్‌గా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ పర్యటనలకు టీమ్‌ ఇండియాతోపాటే వెళ్లాను.

కండలు పెంచను!
2019 ఐపీఎల్‌లో రాణించడంతో ప్రపంచకప్‌లో స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపికచేశారు. ప్రపంచకప్‌లో జట్టుతోపాటు వెళ్లి నెట్‌ బౌలర్‌గానూ సేవలు అందించాను. ఎన్నో ఏళ్లుగా టీమ్‌ ఇండియాతోనే ప్రయాణిస్తున్న నాకు ఎట్టకేలకు జట్టులో స్థానం దొరికింది. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన ఇండియా-ఎ పర్యనటలో మెరుగైన ప్రదర్శన చేయడంతో విండీస్‌ పర్యటనకే వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యా. గంభీర్‌ భయ్యా పరిచయమైన రోజునుంచీ అతడు చెప్పినట్టు చేశాను. ఈరోజు ఇక్కడున్నాను. ఇప్పటికీ గంభీర్‌ గురించి మాట్లాడమంటే కాస్త భావోద్వేగానికి గురవుతుంటాను. నేనిపుడు గంటకు 150 కి.మీ. వేగంతోనూ బంతులువేయగలుగుతున్నాను. 20 ఏళ్ల వరకూ టెన్నిస్‌ బంతితో క్రికెట్‌ ఆడటంవల్లనే ఇది సాధ్యమవుతోంది. టెన్నిస్‌ బంతి తేలిగ్గా ఉంటుంది. దాన్ని ఫాస్ట్‌గా వేయాలంటే, చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా విసరాలి. అది నాకు చిన్నప్పట్నుంచీ అలవాటైపోయింది. నేను కండలు పెంచను. ఎందుకంటే మోచేతిలో వేగం ఉండాలంటే ఇప్పటిలానే సన్నగా ఉండాలి. ఇది నా ప్రత్యేకత కూడా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.