close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓ తల్లి తీర్పు

- తాడిమేటి శ్రీదేవి

టో ఆగిన శబ్దం వినగానే ‘‘బామ్మా!’’ అంటూ వచ్చి చుట్టేసుకున్నారు నవ్య, భవ్య. చెరొక బ్యాగు పట్టుకుని అరుంధతిని లిప్ట్‌ వైపు నడిపించుకెళ్ళారు. మనవరాళ్ళ ముద్దు మొహాలు చూసి మురిసిపోతూ వాళ్ళ మాటలు వింటూ కొడుకింట్లో అడుగుపెట్టింది అరుంధతి.
‘‘అమ్మ ఆఫీస్‌ నుంచి వచ్చేసిందా?’’ అని అడుగుతున్న ఆవిడని- ‘‘రండత్తయ్యా’’ అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చింది సుహాసిని.
ఆవిడ ఫ్రెష్‌ అయి వచ్చేసరికి కాఫీ రెడీగా వుంది. ‘బామ్మా!’ అంటున్న పిల్లల్ని- ‘‘ముందు కాఫీ తాగనివ్వండమ్మా, ప్రయాణం చేసి వచ్చారు. తలనొప్పి వస్తుం’’దంటూ గట్టిగా చెబుతున్న కోడల్ని వారించింది అరుంధతి.
‘‘ఫరవాలేదులే, వాళ్ళకన్నా కాఫీ ఎక్కువా నాకు’’ అంటూ సోఫాలో పిల్లలిద్దర్నీ చెరొకవైపు కూర్చోబెట్టుకుంది.
బ్యాగ్‌లో జంతికలూ బర్ఫీ ఉంటాయి... తీసి పిల్లలకి పెట్టమని పురమాయించింది. వాళ్ళవి ఇష్టంగా తింటుంటే ఆవిడకి కడుపు నిండినట్లయింది. ‘‘సుధా ఇంకా రాలేదేమిటమ్మా?’’ అన్న ఆవిడ ప్రశ్నకి ‘‘ఇవాళ ఆఫీసులో లేట్‌ అవుతుందన్నారత్తయ్యా’’ అంటూ వంట గదిలోకి దారితీసింది సుహాసిని. పిల్లలు తినేసి మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తామంటూ ఆటలకి వెళ్ళారు.
అరుంధతి స్నానం చేసి వచ్చేసరికి వంట మొదలుపెట్టింది సుహాసిని. అత్తగారితో కబుర్లు చెప్తూ పనులు చేస్తున్నా కోడలి పరధ్యానాన్ని అరుంధతి పసికట్టింది. సుధాకర్‌ ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదయింది. ‘‘పదిరోజులదాకా రాలేనన్నావు, పిల్లల మీద బెంగ పెట్టుకున్నావామ్మా?’’ కొడుకు ప్రశ్నకి నవ్వుతూ బదులిచ్చింది అరుంధతి.
‘‘అవున్రా సుధా...మీరీమధ్యన వాళ్ళని తీసుకురావడం లేదు. మీ పనులంటారు, లేకపోతే వాళ్ళ చదువులంటారు. ఏ పనీ లేనిదాన్ని నేనేగా అందుకే వచ్చాను. ఇవాళ లేట్‌ అయ్యిందేమిట్రా’’ అంటున్న తల్లితో ‘‘అవునమ్మా’’ అంటూనే బాత్‌రూమ్‌ వైపు నడిచాడు.
‘‘బామ్మా, మరే... నాన్న...’’ అంటున్న నవ్యను కోడలు కళ్ళతోనే వారించడం గమనించింది అరుంధతి.
భోజనాలయిన వెంటనే ‘‘ఇవాళేమిటో నిద్ర ముంచుకు వస్తోందమ్మా’’ అంటూ గదిలోకి వెళ్ళిపోతున్న కొడుకుని వింతగా చూసింది అరుంధతి. సుహాసిని మౌనంగా వంటిల్లు సర్దుతోంది.
‘‘బామ్మా త్వరగా కథ చెప్పు, లేట్‌గా పడుకుంటే రేపు స్కూల్‌ టైమ్‌కి రెడీ అవ్వలేం’’ అంటూ పిలుస్తున్న మనవరాళ్ళ దగ్గరికి నడిచింది.
బామ్మ చెప్పే కథలూ వాటి మధ్యలో కథల్లో పాత్రల్లాగా గొంతులు మార్చి మాట్లాడటం, ప్రశ్నలు అడిగి వాళ్ళచేత సమాధానాలు చెప్పించడం... ఇవన్నీ వాళ్ళకిష్టం. మా బామ్మ చెప్పిందంటూ వాళ్ళ ఫ్రెండ్స్‌ దగ్గర చెప్పుకుని మురిసిపోతుంటారు. ‘మా ఫ్రెండ్స్‌ బామ్మలూ అమ్మమ్మలూ గిఫ్ట్‌లు ఇస్తారు కానీ, నీలాగా కథలు చెప్పరు బామ్మా! నువ్వు గ్రేట్‌’ అన్న వాళ్ళ మాటలకి ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది. భర్త పోయిన తర్వాత తల్లిని పల్లె నుంచి వచ్చెయ్యమని చాలాసార్లు అడిగాడు సుధాకర్‌. ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉంటుంది ఆవిడ. కొడుకూ కోడలూ ఎంత బాగా చూసే వాళ్ళయినా ఓపిక ఉన్నన్నాళ్ళూ తమ ఇంట్లో తాను పెంచుకున్న మొక్కల మధ్య గడపడం అరుంధతికి ఇష్టం. కొడుకు ఉండే ఫ్లాటులో ఉంటే ఆవిడకి కాంక్రీట్‌ జంగిల్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. కాకపోతే తరచూ వచ్చి వెళ్తూ ఉంటుంది. కోడలు కూడా ఉద్యోగస్తురాలవడం వలన వచ్చినప్పుడల్లా ఇల్లంతా సర్దిపెట్టడం, వంట సులువుగా తెమిలేలా పచ్చళ్ళూ పొడులూ తయారుచేసిపెట్టడం చేస్తూ ఉంటుంది.
సుహాసినికి ఇంటర్‌ చదివేటప్పుడే తల్లీ, తండ్రీ యాక్సిడెంట్‌లో పోయారు. అన్నగారూ తనూ చదువుకుంటూ పైకి వచ్చారు. ఆర్థికంగా ఫరవాలేకపోయినా పెళ్ళీ పేరంటాల టైముకి పెద్దవాళ్ళు లేని లోటు బాగా అనుభవించారు. సుహాసినికి ఉద్యోగం వచ్చిన వెంటనే దగ్గరి బంధువులు పూనుకుని పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే వీధిలో ఉంటున్న ప్రాణ స్నేహితురాలి ద్వారా సుహాసిని గుణగణాలు తెలుసుకున్న అరుంధతి తన కోడల్ని చేసుకుందామనుకుంది.
సుధాకర్‌ కూడా ఇష్టపడటంతో పెళ్ళి జరిగింది. మొదటి పురిటికి పుట్టింటి బంధువులు తీసుకువెళ్ళినా నెల వెళ్ళగానే తెచ్చుకుని అన్నీ తానై చూసుకుంది అరుంధతి. రెండోసారి వాళ్ళెవరూ అడగకుండానే ఎడపిల్ల నాదగ్గర అలవాటు ఇక్కడయితే సులువుగా ఉంటుందంటూ మర్యాదగా చెప్పేసింది అరుంధతి. తల్లికన్నా ఎక్కువగా చూస్తూ తన మనసుని చెప్పకుండానే అర్థం చేసుకునే అత్తగారంటే సుహాసినికి ఎనలేని గౌరవం.
‘‘మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదత్తయ్యా! శాంతి సెలవులకి ఇక్కడికే వస్తుంది. పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు’’ అంటూ ఉంటుంది.
‘‘అది కాదమ్మా, కొన్నాళ్ళపాటు అక్కడ ఉంటే మీకూ శాంతికీ బోర్‌ కొట్టినప్పుడు రావడానికి ఒక చోటంటూ ఉంటుంది. పిల్లలక్కూడా అక్కడి వాతావరణం అదీ నచ్చుతుంది’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది. ‘‘నెలకోసారో, రెండుసార్లో వస్తూనే ఉన్నాను కదమ్మా. నాకు ఒకచోట కాలు నిలవదు’’ అంటూ నవ్వేస్తుంది.
సుఖసంతోషాలకు నెలవుగా ఉండే కొడుకింట్లో ఏదో చెప్పలేని కొరత కనిపించింది అరుంధతికి. ఈమధ్యన ఎండలు ఎక్కువగా ఉన్నాయని తను ఇల్లు కదల్లేదు. మధ్యలో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి సుధాకర్‌ సకుటుంబంగా వచ్చి వెళ్ళాడు. దానాదీనా ఆమె వచ్చి నాలుగు నెలలపైనే అయింది. నువ్వు నాకు అమ్మవని మర్చిపోతున్నావమ్మా ఎప్పుడూ సుహా తరఫునే మాట్లాడతావంటూ సరదాగా గొడవపడే సుధాకర్‌ మాటలే తగ్గించేశాడు. పిల్లలతోపాటు అల్లరిచేస్తూ వాళ్ళు తనని కొట్టడానికొస్తే మా అమ్మకి చెప్తానంటూ అరుంధతి వెనుక దాక్కోవడం లాంటివేమీ లేవు. కోడలి మొహం పాలిపోయినట్లు ఉండటం, చాటుగా కళ్ళు తుడుచుకోవడం అరుంధతి దృష్టిని దాటిపోలేదు. పిల్లలిద్దరూ చదువూ ఆటలూ తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి ఇదివరకటిలా చనువుగా చేరడం లేదు. కారణం ఏమిటో తానే తెలుసుకోవాలనుకున్నా ఎలాగో తెలియక కొట్టుమిట్టాడసాగింది.
ఆ రాత్రి ఎవరో ఘర్షణ పడుతున్నట్లు అనిపించి మెలకువ వచ్చింది అరుంధతికి. కొడుకూ కోడలూ గట్టిగా అరచుకోవడంలేదుగానీ ఏదో గొడవ పడుతున్నారని అర్థమయిందామెకు. చప్పుడు చెయ్యకుండా బాల్కనీలోకి వచ్చి వాళ్ళ గదివైపు కిటికీ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. ‘‘మీరెందుకిన్నిసార్లు విజయవాడ వెళ్తున్నారో తెలుసుకోలేనిదాన్ననుకుంటున్నారా? మీకసలు ఏం లోటు చేశాను? పిల్లల మొహాలయినా గుర్తురావడం లేదా?’’ సుహాసిని గొంతు పూడుకుపోయి మాటలు కీచుగా వస్తున్నాయి.
‘‘నీకు అనవసరం. నా ఇష్టమొచ్చినట్లు ఉంటాను. ఏడుపుగొట్టు మొహం వేసుకుని ఉంటావెప్పుడూ.’’
పురుషాధిక్యత నిండిన ఆ గొంతు సుధాదేనా... నేను కని పెంచిన సుధా ఇలా తయారయ్యాడా... భగవంతుడా, పచ్చని ఈ సంసారంలో చిచ్చెలా రేగింది... ఎలా వచ్చి గదిలో పడిందో ఆవిడకే తెలియదు. ఇక నిద్రలేక పొడికళ్ళు పడిపోయాయి. తెల్లారి పిల్లలు స్కూలుకి రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నా కాళ్ళూ చేతుల్లో సత్తువ లేనట్లయి లేవలేకపోయింది.
నెమ్మదిగా లేచి బ్రష్‌ చేసుకుని వచ్చేసరికి ‘‘అత్తయ్యా, అన్నీ టేబుల్‌మీద పెట్టాను. మీరు ముందే కాఫీ తాగెయ్యండి. తర్వాత స్నానం, పూజ పూర్తి చేసుకుని టిఫిన్‌ తినెయ్యండి. మళ్ళీ నీరసం వస్తుంది- లేట్‌ అయితే. నేను స్నానానికి వెళ్తున్నాను’’ అంటున్న సుహాసినిని దగ్గరకు పిలిచి- ‘‘ఇవాళ సెలవు పెట్టగలవామ్మా’’ అనడిగింది అరుంధతి.
‘‘ఏంటత్తయ్యా, ఒంట్లో బాలేదా?’’ ఆదుర్దాగా అడుగుతున్న కోడల్తో-
‘‘ఫరవాలేదమ్మా వీలైతే పెట్టమంటున్నాను’’ అంది.
‘‘సరే అత్తయ్యా, ఫరవాలేదు ఫోన్‌ చేసి చెప్తా’’నంటూ లోపలికి వెళ్ళింది.
‘‘ఏంటమ్మా ఒంట్లో బావుండలేదా. నేను అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను. అక్కడ మా బ్రాంచ్‌ ఒకటి ఓపెన్‌ అయింది. సుహాసిని సెలవు పెడుతోంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్తుంది. అవసరమనిపిస్తే ఫోన్‌ చెయ్యండి, వస్తాను’’ అన్న కొడుకుని కొత్తవాణ్ణి చూసినట్లు చూసింది అరుంధతి.
‘‘ఏంటమ్మా, అలా చూస్తున్నావు’’ రాని నవ్వును నవ్వే ప్రయత్నం చేశాడు సుధాకర్‌.
ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొహం విప్పారేలా నవ్వే కొడుకునే చూసిన ఆ తల్లి హృదయం
ఈ నవ్వుచూసి ముడుచుకుపోయింది. ‘‘ఫరవాలేదులే వెళ్ళిరా’’ పొడిపొడిగా చెప్పింది.
ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక కోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వెన్ను నిముర్తూ విషయం రాబట్టింది అరుంధతి. ముందు సంకోచించినా ఆవిడ ఆప్యాయతకు మనసులోని బాధ కరిగి కళ్ళల్లోంచి దూకింది. సుధాకర్‌ను విజయవాడ బ్రాంచ్‌ ఆఫీస్‌కు డెప్యూట్‌ చేయడం నిజమేకానీ అక్కడ రజని అతన్ని ఆకర్షించింది. ఎలా పెరిగిందో ఇద్దరిమధ్యా అనుబంధం పెరిగింది. ఇంట్లో విసుగూ కోపంతో కూడిన విసుర్లూ మనసును బాధపెట్టే మాటలూ పెరిగిపోయాయి. విజయవాడలోనే ఉంటున్న సుహాసిని కజిన్‌ ద్వారా తెలిసిందేమిటంటే రజని కుటుంబం అంత మంచి పేరున్నదికాదనీ, ఆ పిల్ల జీతం వాడుకోవడం మరిగిన తండ్రి ఆమె పెళ్ళి విషయం మర్చిపోయాడనీ, మిగిలిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా ఇలా పక్కదార్లు పట్టే రకాలేననీ.
అరుంధతి కళ్ళు వర్షించసాగాయి. ‘‘నేను నీకు అమ్మను కాదు కదమ్మా. లేకపోతే నాకు ఏమాత్రం తెలియజేసినా నేనేమన్నా చెయ్యగలిగేదాన్నేమో’’ అంది.
సుహాసిని వెంటనే ‘‘అలా అనకండత్తయ్యా, నేనసలు ఇలా జరుగుతుందని కల్లోకూడా అనుకోలేదు. తెలిశాక చెబుదామని ప్రయత్నించానుగానీ...’’ డగ్గుత్తికలో ఆగిపోయింది.
‘‘నువ్వీ అన్యాయాన్ని భరించనవసరం లేదమ్మా, నీకేం తక్కువ’’ ఆవేశంగా అంటున్న ఆమెను ఆశ్చర్యంగా చూసింది సుహాసిని.
‘‘అవునమ్మా... సాటి ఆడదానిగా నీకు నేనున్నాను. ఏమైనా ఇద్దరం కలిసే పోరాడదాం’’ అంటున్న ఆవిడ అభిప్రాయం అర్థంకాక వింతగా చూస్తుండిపోయింది.
నాలుగురోజులు పోయాక వచ్చాడు సుధాకర్‌. మధ్యమధ్యలో ఫోన్‌లో తల్లి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉన్నాడు. సుధాకర్‌ వచ్చిన రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కొడుకునీ కోడలినీ పిలిచింది అరుంధతి. తప్పించుకుని తిరుగుతున్న సుధాకర్‌ ఆవిడ పిలిచి మాట్లాడతాననడంతో తప్పనిసరిగా వచ్చి కూర్చున్నాడు. ‘‘నేను ఊళ్ళో ఉన్న ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడ సుహాసినికీ, పిల్లలకీ తోడుగా ఉందామనుకుంటున్నాను’’ అన్న అరుంధతి మాటలకి ఇద్దరూ తెల్లబోయారు.
‘‘మంచిదమ్మా, నేనెప్పటినుంచో అదే చెప్తున్నాను కదా’’ వెంటనే సుధాకర్‌ అన్నాడు.

‘‘మేమందరం ఇక్కడ ఉంటాం. నువ్వు విజయవాడ వెళ్ళిపోవచ్చు సుధా’’ అన్న తల్లి మాటలకి సుధాకర్‌ నిటారుగా అయ్యాడు. ఏదో అనబోతున్న కొడుకుని వారిస్తూ అరుంధతి కొనసాగించింది. ‘‘ముసుగులో గుద్దులాట అనవసరం సుధా. ఇక సుహాసినీ పిల్లలూ నేనూ నీతో కలిసి ఉండదలుచుకోలేదు. ఎందుకనేది నీకే బాగా తెలుసు. అనుకూలవతి అయిన భార్యనూ ముద్దులొలికే పిల్లలనూ వదులుకునేంత ఆకర్షణ ఎందుకు కలిగిందో నీకే తెలియాలి. అందమూ చదువూ ఉద్యోగమూ అన్నీ ఉండి కూడా నువ్వు చేసే ఈ అన్యాయాన్ని భరించాల్సిన అగత్యం సుహాసినికి లేదు. ఒకవేళ భర్తకు దూరమయితే ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆలోచిస్తోందేమో. నేను తనతోపాటే ఉండి ధైర్యాన్నిస్తాను. ఈ విషయంలో నా కోడలి తప్పు ఇసుమంతైనా లేదని లోకానికి చాటుతాను. చుట్టాలూ స్నేహితులూ ఎవరూ వేలెత్తి చూపించకుండా నేనే తనవైపు ఉంటాను. మరో విషయం... నువ్వు పిల్లల పేరున చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లుకాక నీ ఆదాయాన్నిబట్టి న్యాయంగా వాళ్ళకి చెందాల్సినవన్నీ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకకపోయినా, వారసత్వంగా రావల్సినవేమీ రాకుండా పోవడానికి వీలులేదు’’ ఖచ్చితంగా ధ్వనించిన ఆ గొంతుకి సుహాసిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ వుండిపోయింది. సుధాకర్‌కి నిలువుగుడ్లు పడ్డాయి.
‘‘అమ్మా!’’ అని ఎలాగో అనగలిగాడు.
‘‘నేను చాలా సిగ్గు పడుతున్నాను సుధా- నీలాంటి కొడుకుని కన్నందుకు. అందుకనే నష్టపరిహారంగా నేను చేయగలిగినంత ఈ తల్లీ కూతుళ్ళకి చేస్తాను’’ స్థిరంగా అంది.
‘‘అమ్మా, అమ్మా!’’ ఆక్రోశంగా అన్నాడు సుధాకర్‌.
‘‘ఎందుకురా... ఇంత తేలిక చేసేస్తారు మీ మగాళ్ళు భార్యల ప్రేమను. మీ తాతగారు... అంటే... మా నాన్న... ఇలా చేసినందుకే మీ అమ్మమ్మ కుమిలిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళూ పేరంటాలూ భర్త పక్కన కూర్చుని యథావిధిగా నిర్వర్తిస్తున్నా నిజమైన సంతోషాన్ని ఆమె కళ్ళల్లో మేము చూడలేకపోయాం. భర్త అవసానదశలో సేవలు చేసినా అవి పరాయి వారికి చేసినట్లే ఉండేవి. వాళ్ళిద్దరిమధ్యా ఉన్న అపురూపమైన, సున్నిత బంధమేదో తెగిపోయినట్లనిపించేది. చివరిరోజుల్లో నాన్నగారి కళ్ళలో బాధా ఆవేదనా కదలాడేవి. కానీ అమ్మ హృదయం మాత్రం మంచులా గడ్డకట్టుకుపోయిందనిపించేది. పరాయి ఆడదానిలో తన భర్త ఏమి చూడగలుగుతున్నాడు, తను ఏమివ్వలేకపోతోందనే బాధ స్త్రీ మనసుని రంపంలాగ కోసేస్తుంది సుధా. నేనేమీ సుహాసినిని నీకు బలవంతంగా కట్టబెట్టలేదు. ప్రేమ వివాహం కాదుగానీ చూసి, ఇష్టపడి చేసుకున్నావు. పిల్లల్ని కన్నావు. మరింక ఏమిటి? ఒక్క నిమిషం ఆలోచించు. నీలానే నీ భార్యకూడా అనుకుంటే నువ్వేమవుతావు?’’ ఆవేశంతో అరుంధతి శరీరం వణికి రొప్పు వచ్చింది.
గబగబా లేచి అత్తగారికి మంచినీళ్ళిచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది సుహాసిని. తన బాధను తనకన్నా బాగా అర్థం చేసుకుని వ్యక్తపరచిన ఆ స్త్రీమూర్తి దగ్గర కూర్చుంటే మండుటెండలోంచి వచ్చి చల్లని నీడలో సేదదీరినట్టయింది. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్‌. అత్తా, కోడళ్ళు స్పర్శద్వారా ఒకళ్ళనొకళ్ళు సాంత్వనపరుచుకుంటూ ఉండిపోయారు.
రాత్రి గడిచిపోయి తెలతెలవారుతుండగా బయటకు వచ్చిన సుధాకర్‌ తల్లి కాళ్ళను చుట్టేసుకుని భోరుమన్నాడు. పది లంఖణాలు చేసినవాడిలా మొహం పీక్కుపోయి జాలి గొలిపేలా ఉన్నాడు. సుహాసిని చేతులు పట్టుకుని క్షమించమన్నట్లుగా నుదుటికి చేర్చుకున్నాడు.
‘‘నీ ప్రవర్తనకు నలిబిలి అయినా సుహాసిని అన్నీ మౌనంగా భరించిందంటే తనకి నీమీద ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకో సుధా. నువ్వూ అలాగే ఉండాలని కోరుకోవడం తన తప్పకాదుగా’’ గంభీరంగా అంది అరుంధతి.
‘‘అవునమ్మా, నాకేం దెయ్యం పట్టిందోగాని క్షమించలేని తప్పే చేశాను’’ పిడికిలి బిగించి నేలపై కొడుతూ అన్నాడు సుధాకర్‌.
ఈసారి సుధాకర్‌ చేతినందుకున్న సుహాసిని స్పర్శలో తనను క్షమించానన్న ఓదార్పు కనబడి చటుక్కున ఆమె భుజం వంపులో తన తల దాచుకున్నాడు. సుహాసిని చెయ్యి అతని వీపుని చుట్టింది. ఇద్దర్నీ చెరొక చేత్తో చేరదీసుకుంది అరుంధతి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.