close
టీమిండియా జెర్సీ ఎక్కబోతున్నాం..!

బైజూస్‌... భారత క్రికెట్‌ జట్టు జెర్సీ మీద త్వరలో కనిపించనున్న పేరు. బెంగళూరులో కేవలం ఒక్క కోచింగ్‌ సెంటర్‌గా మొదలైన బైజు ఇప్పుడు రూ.40వేల కోట్ల ఎడ్‌టెక్‌ కంపెనీగా ఎదిగింది. క్రికెట్‌ అభిమాని అయిన బైజు రవీంద్రన్‌... తమ సంస్థ పేరుని టీమ్‌ ఇండియా జెర్సీమీదకు ఎక్కించే స్థాయికి ఎలా తీసుకువెళ్లగలిగాడో అతడి మాటల్లోనే...
ఇంజినీరింగ్‌ తర్వాత 2001లో ఒక షిప్పింగ్‌ కంపెనీలో సర్వీస్‌ ఇంజినీర్‌గా చేరాను. మూడున్నరేళ్లపాటు చేసిన ఆ ఉద్యోగంలో కొత్త కొత్త ప్రదేశాలు తిరిగొచ్చేవాణ్ని. అందులోనే ఉన్నతస్థాయికి చేరాలని అనుకునేవాణ్ని. షిప్‌మీద ఒకసారి సముద్రంలోకి వెళ్తే నాలుగైదు నెలలు తిరిగి రావడమనేది ఉండదు. వచ్చాక రెండు నెలలు సెలవులు దొరికేవి. అలా సెలవులకు వచ్చినపుడు ఓసారి బెంగళూరులోని ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్లాను. వాళ్లలో కొందరు ఐఐఎమ్‌ ప్రవేశ పరీక్ష అయిన ‘క్యాట్‌(కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)కు సిద్ధమవుతుంటే మ్యాథ్స్‌ సాల్వ్‌ చేయడంలో సాయపడ్డాను. ఆ తర్వాత స్నేహితుల స్నేహితులూ మ్యాథ్స్‌ చెప్పమని అడిగేవారు. దాంతో కాదనలేక ఓ నెలన్నరపాటు పాఠాలు చెప్పాను. వాళ్లతోపాటు నేనూ పరీక్ష రాశాను. నేను పాఠాలు చెప్పిన వాళ్లలో నలుగురికి ఐఐఎమ్‌లలో సీట్లు వచ్చాయి. నేను టాపర్‌గా నిలిచాను. సెలవులు పూర్తవగానే ఉద్యోగానికి వెళ్లిపోయాను. ఆర్నెల్ల తర్వాత 2005లో సెలవులకు మళ్లీ వచ్చాను. బెంగళూరుకు తిరిగిరాగానే మళ్లీ మ్యాథ్స్‌ చెప్పమని అడిగారు. ఆరువారాలపాటు బెంగళూరులోనే ఓ కాలేజీలో క్లాస్‌రూమ్‌ అద్దెకు తీసుకుని శిక్షణ ఇచ్చాను. రెండు వారాల్లో శిక్షణ తీసుకునేవారి సంఖ్య 1200కు చేరింది. దాంతో కాలేజీ ఆడిటోరియం అద్దెకు తీసుకున్నాను. ఈసారి విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేశాను. నన్ను నేను పరీక్షించుకోవడానికి ఈసారి కూడా క్యాట్‌ రాశాను. మరోసారి టాపర్‌గా నిలిచాను. నా టీచింగ్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి ఉద్యోగానికి వెళ్లాలనిపించలేదు. పెద్ద కంపెనీలో మంచి జీతం వస్తున్నాసరే  ఉద్యోగం వదిలేస్తానంటే అమ్మానాన్న అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఐఐఎమ్‌లో ఎంబీఏ చేయమన్నారు. నాకు ఇష్టంలేదని చెబితే సరేనన్నారు. అలా అనుకోకుండా టీచర్‌ అయిపోయాను.

ఆటల్లో ఫస్ట్‌...
నేను పుట్టి పెరిగింది కేరళలోని కన్నూర్‌ జిల్లా అళికోడ్‌లో. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే. నాన్న రవీంద్రన్‌ ఫిజిక్స్‌, అమ్మ శోభనవల్లి మ్యాథ్స్‌ చెప్పేవారు. వాళ్లు పాఠాలు చెప్పిన మలయాళం మీడియం స్కూల్లోనే నేనూ చదువుకున్నాను. సాధారణంగా టీచర్లు తమ పిల్లల్ని చదువుమీద ఎక్కువ దృష్టి పెట్టమని చెబుతుంటారు. కానీ అమ్మానాన్న మాత్రం నేను ఎంతసేపు ఆటలాడినా ఏమీ అనేవాళ్లు కాదు. స్పోర్ట్స్‌ కోసం వెళ్తూ చాలాసార్లు క్లాసులు మిస్సవుతున్నానని అమ్మానాన్నకి మిగతా టీచర్లు కంప్లయింట్‌ చేసేవాళ్లు కూడా. ఫుట్‌బాల్‌, క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌... ఈ మూడూ బాగా ఆడేవాణ్ని. ఎంత ఆడినా చదువుని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. క్లాసులకు వెళ్లకపోయినా ఇంట్లోనే సొంతంగా అన్ని సబ్జెక్టుల్నీ చదువుకునేవాణ్ని. మ్యాథ్స్‌లో ఎప్పుడూ టాపర్‌గానే ఉండేవాణ్ని. రాష్ట్రస్థాయి మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ విన్నర్‌ని కూడా. మెడిసిన్‌ అయితే ఎక్కువ సమయం పుస్తకాలకే కేటాయించాల్సి వస్తుందనీ, అదే ఇంజినీరింగ్‌ తీసుకుంటే ఆటలకీ సమయం ఉంటుందని ఇంజినీరింగ్‌ ఎంచుకున్నాను. కన్నూర్‌లోనే ఓ ప్రైవేటు కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. ఆ సమయంలో యూనివర్సిటీ స్థాయి క్రీడల్లోనూ ఆడాను. కెరీర్‌లో స్పోర్ట్స్‌మేన్‌ని కాలేకపోయినా బృందంలో ఒకడిగా ఉండటం, బృందాన్ని ముందుండి నడపడం, ఒత్తిడిని ఎదుర్కోవడం... ఇలా చాలా పాఠాల్ని ఆటల నుంచే నేర్చుకున్నాను. ఇంజినీరింగ్‌లో చేరాక ఇంగ్లిష్‌ ప్రాముఖ్యత అర్థమైంది. క్రికెట్‌ కామెంట్రీ వింటూ చాలా వరకూ ఇంగ్లిష్‌ నేర్చుకున్నాను.

స్టేడియం నిండిపోయేది...
శిక్షణ సంస్థను మొదలుపెట్టినపుడు వారాంతాల్లోనే క్లాసులు చెప్పేవాణ్ని. వారంలో మిగిలిన అయిదురోజులు లెక్కల్ని వినూత్నంగా, సులభంగా ఎలా చెయ్యొచ్చో తెలుసుకోవడానికి నేనూ ప్రాక్టీసు చేసేవాణ్ని. డిమాండ్‌ పెరిగితే చాలామంది బ్యాచ్‌లు పెంచుతారు. నేను మాత్రం క్లాస్‌రూమ్‌ సైజు పెంచాను. నా క్లాసులో వేల సంఖ్యలో విద్యార్థులు ఉండేవారు. క్లాసులు చెప్పడానికి పుణె, దిల్లీ, చెన్నై, ముంబయి కూడా వెళ్లేవాణ్ని. దిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం, పుణెలోని బాలేవాడి స్టేడియం, హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం... ఇలా స్టేడియంలలో క్లాసులు చెప్పేవాణ్ని. ఒకసారి గరిష్ఠంగా 25 వేల మందికి పాఠం చెప్పాను. ఇదంతా పదేళ్ల కిందటి మాట. అప్పటికి 4జీ రాలేదు. వీడియో పాఠాలు అంత పాపులర్‌ కాలేదు. అయినా కూడా వీడియోలు తయారుచేసి స్టేడియంలో పెద్ద స్క్రీన్‌మీద వేసేవాణ్ని. ఓ పక్కన నిలబడి తెరమీద పాఠాలూ చెప్పేవాణ్ని. క్లాసులు చెప్పడం మొదలుపెట్టినప్పట్నుంచి స్టూడెంట్సే ‘బైజూస్‌ క్లాసెస్‌’ అంటుండేవారు. సంస్థకు ఓ పేరు పెట్టాల్సి వచ్చినపుడు ఆ పేరునే కొనసాగించాను. క్లాసులు చెప్పడానికి  బస్సులూ, రైళ్లూ, విమానాల్లో నిత్యం ప్రయాణాలు చేసేవాణ్ని.

కానీ రోజూ తిరగాలంటే కష్టంగా అనిపించేది. అందుకని 2009లో నా పాఠాల్ని వి-శాట్‌ ద్వారా 45 నగరాల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేశాను. ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తిచేసుకుని వచ్చిన నా విద్యార్థుల్లో కొందరు బైజూస్‌ని ఓ సంస్థగా మార్చాలని సలహా ఇచ్చారు. క్లాసుల ద్వారా సంపాదించిన రెండు లక్షల రూపాయలతో ‘థింక్‌ అండ్‌ లెర్న్‌’ పేరుతో 2011లో కంపెనీ పెట్టాం. నా విద్యార్థులైన 30 మంది ఉద్యోగులతో సంస్థ మొదలైంది.

జుకర్‌బర్గ్‌ పెట్టుబడి...
క్యాట్‌ శిక్షణతోపాటు ఇంకా ఎలాంటి శిక్షణ అందివ్వాలన్న ప్రశ్న వచ్చినపుడు స్కూల్‌ విద్యార్థులకు అవసరమయ్యే పాఠాల్ని వీడియోల రూపంలో అందించాలనుకున్నాను. నేను పాఠాలు చెప్పినపుడు- సరైన పునాది లేకపోవడంతో చాలామంది సులభమైన కాన్సెప్టుల్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం గమనించాను. సబ్జెక్టుని నేర్చుకోవాల్సిన పద్ధతికీ నేర్పుతున్న తీరుకీ పొంతన ఉండటంలేదని అర్థమైంది. నాణ్యమైన టీచర్లు లేకపోవడం కూడా ఇందుకో కారణం. ఆప్‌ద్వారా ఆ లోటుని తీర్చాలనుకున్నాను. మొదట 8-12 తరగతుల విద్యార్థుల్ని లక్ష్యంగా పెట్టుకుని వీడియో పాఠాలు తయారుచేశాం. 2011 నుంచి 2015 వరకూ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌తో కూడిన వీడియో పాఠాల తయారీలో నిమగ్నమైపోయాం. మరోవైపు వి-శాట్‌ తరగతులు కొనసాగేవి. మణిపాల్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాత్రి తొమ్మిది గంటలకు దాదాపు 400 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు నా వీడియో పాఠాలు చూస్తుండగా సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రంజన్‌ పాయ్‌ చూశారట. అలా వీడియో పాఠాన్ని అంతమంది శ్రద్ధగా చూడటం ఆయనకు ఆశ్చర్యంగా అనిపించి తర్వాత రోజు నాకు ఫోన్‌ చేసి ‘మీరు దీన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లాల్సిందే, మేం పెట్టుబడికి సిద్ధం’ అని చెప్పారు. మణిపాల్‌ గ్రూప్‌నకు చెందిన మోహన్‌దాస్‌ పాయ్‌, రంజన్‌ పాయ్‌ 2013లో బైజూస్‌లో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టారు. అలా అడగకుండానే డబ్బు మా దగ్గరకి వచ్చిచేరింది. ఆ డబ్బుని మేం బోధన-సాంకేతిక సిబ్బందినీ, కంటెంట్‌నీ పెంచుకోవడానికి ఉపయోగించాం. 2015లో ‘బైజూస్‌ ఆప్‌’ని ప్రారంభించాను. దీనిద్వారా 6-12 తరగతుల విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌ పాఠాలతోపాటు క్యాట్‌, సివిల్స్‌, జేఈఈ, నీట్‌ లాంటి ప్రవేశ పరీక్షలకూ అవసరమైన శిక్షణనీ ఆన్‌లైన్లో అందిస్తున్నాం. తర్వాత జీఆర్‌ఈ, జీమ్యాట్‌ కూడా చేర్చాం. 2016లోనే సికోయా క్యాపిటల్‌, సోఫినా సంస్థలు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాయి. అదే సంవత్సరం చివర్లో ‘చన్‌ జుకర్‌బర్గ్‌ ఇనేషియేటివ్‌’ రూ.332 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆసియాలో ఇప్పటివరకూ వాళ్లు బైజూస్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టారు. సాంకేతికతతో క్లాస్‌రూమ్‌ వాతావరణాన్ని ఇంట్లోనే కల్పించడం, నగరాలతోపాటు, పట్టణ విద్యార్థులకూ నాణ్యమైన విద్యను అందించడం... ఈ రెండూ వాళ్లని ఆకర్షించాయి.

ప్రపంచమంతా విస్తరిస్తాం!
ప్రస్తుతం మా ఆప్‌ని ఏడాదికి 33 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వారిలో 23 లక్షల మంది పెయిడ్‌ యూజర్లు ఉన్నారు. అందులో 15 శాతం విదేశాల్లో ఉన్న భారతీయులు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1400 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. ఏది చేసినా చిన్నగా ఉండటం నాకు నచ్చదు. టార్గెట్‌ని అందుకుంటున్న ప్రతిసారీ దాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లడం నా నైజం. ఇప్పటికే దేశంలో విద్యారంగంలోని అతిపెద్ద టెక్‌ కంపెనీగా ఎదిగాం. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా రంగ సంస్థగా అవతరించాలన్నది మా లక్ష్యం. ఇంగ్లిష్‌ బోధన మాధ్యమంగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ ఇంకా కామన్వెల్త్‌ దేశాలకు విస్తరించాలనేది మా ప్రణాళిక. ఈ ఏడాది ప్రారంభంలో రూ.800 కోట్లు పెట్టి అమెరికాకు చెందిన ఓస్మో అనే అంకుర సంస్థని కొన్నాం. ప్రాథమిక విద్యా విభాగంలో ఇది పనిచేస్తుంది. ఈ ఆప్‌ గేమ్స్‌ ఆడుతూ నేర్చుకునేలా కంటెంట్‌ను తయారుచేస్తుంది. 4-9 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఆటలతో నేర్పే పద్ధతులపైన దృష్టి పెడుతున్నాం. ఆ దిశగా ఇది మా తొలి అడుగు. వినూత్నమైన కంటెంట్‌ తేవడానికి డిస్నీతోనూ జతకట్టాం. మాది పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌. ఎనిమిదో తరగతి విద్యార్థికి ఒక కాన్సెప్ట్‌ సరిగ్గా అర్థం కాకపోతే అదే కాన్సెప్ట్‌ని ఆరో తరగతి స్థాయి వీడియోద్వారా చూపిస్తాం. దాంతో వాళ్లకు సులభంగా అర్థమవుతుంది. అలాగే ఎక్కువ మంది ఒక కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఇంకా సులభంగా అర్థమయ్యేలా వీడియోల్ని చేస్తాం. ఇంగ్లిష్‌తోపాటు హిందీలోనూ కొన్ని వీడియోలు చేస్తున్నాం. మరిన్ని భారతీయ భాషల్లోకి వెళ్తాం. ప్రస్తుతం మా సంస్థ ఉద్యోగుల సంఖ్య 3300. వీరి సగటు వయసు 25. వీళ్లలో చాలామందికి క్రీడలంటే ప్రాణం. అందుకే బాగా రాణించేవాళ్లని క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లు నేరుగా చూడటానికీ పంపించాం. సెప్టెంబరు నుంచి ‘బైజూస్‌’ పేరు టీమిండియా జెర్సీమీద కూడా కనిపించనుంది. క్రికెట్‌ అభిమానిగా ఈ విషయంలో ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను.

ఉదయం నాలుగింటికే నిద్రలేస్తాను. 5-7 మధ్య ఇంటినుంచి పనిచేసి ఏడున్నరకు ఆఫీసు చేరుకుని అక్కడ మరో పన్నెండు గంటలు పనిచేస్తాను. కేవలం డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో ఇవన్నీ చేయలేం. ముఖ్యంగా విద్యా రంగంలో... సమాజంలో గొప్ప మార్పు తెస్తున్నామన్న సంతృప్తే నన్ను ముందుకు నడిపిస్తుంది.

బిలియనీర్‌... బైజు

బైజూస్‌ ప్రస్తుత విలువ రూ.40వేల కోట్లు. కంపెనీలో బైజూ వాటా 21 శాతం. భార్య దివ్య, తమ్ముడు రిజు రవీంద్రన్‌లకూ చెరో పది శాతం వాటా ఉంది.
* దివ్య కూడా బైజూ విద్యార్థి. వీళ్లకి అయిదేళ్ల బాబు ‘నిష్‌’ ఉన్నాడు.
* ఆఫ్‌లైన్లో పెద్ద మార్కెట్‌ని వదిలి ఆప్‌ తెచ్చాక పూర్తి ఆన్‌లైన్‌ కంపెనీగా మారింది.
* బైజూ ఆప్‌ని విద్యార్థులు రోజూ సగటున గంటపాటు చూస్తుంటారు.
* బైజూకి రోజర్‌ ఫెదరర్‌ స్ఫూర్తి. ‘ఫెదరర్‌ పాతికేళ్లకంటే 37 ఏళ్ల వయసులోనే అద్భుతంగా ఆడుతున్నాడు. నన్ను నేను అలా ఛాలెంజ్‌ చేసుకుంటాను’ అంటాడు 38 ఏళ్ల బైజు.
* పెట్టుబడులుగా వచ్చిన మొత్తంలో దాదాపు రూ.3800 కోట్లు బ్యాంకుల్లోనే విస్తరణ కోసం సిద్ధంగా ఉన్నాయి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.