close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలానికి కరవొచ్చింది!

‘నేనొకటడుగుతా సమాధానం చెప్పగలవా?
’‘అడుగు... ప్రయత్నిస్తా.’
‘అందరికీ సమానంగా ఉంటుంది...
కానీ సరిపడా లేదని కొందరూ అస్సలు లేదని కొందరూ చెబుతుంటారు. ఏమిటది?’
‘డబ్బు..?’
‘ఊహూ... డబ్బు అందరి దగ్గరా సమానంగా ఉండదుగా’
‘మరి... అహం కదూ?’
‘కాదు...’
‘కాదా, ఇంకేమిటీ... అయినా నీ పొడుపు కథలు విప్పి చెప్పే టైమ్‌ నాకు లేదు,
చాలా పనులున్నాయి, నే పోతున్నా...’
‘అదిగో చూడు, నువ్వు కూడా లేదంటున్నావ్‌..!’
‘ఓ... టైమా..! నిజమే కదా. అందరికీ సమానంగానే ఉంటుంది. అయినా చాలామంది టైమ్‌ లేదనే చెబుతుంటారు. ఎందుకనీ..?’ ఎందుకనీ అంటే... కాలాన్ని మన చేతుల్లో ఉంచుకోకుండా కాలం చేతుల్లో మనం ఇరుక్కున్నాం కాబట్టి..!
వానలు కురవకపోతే నీళ్లకు కరవొస్తుంది.
పంటలు పండకపోతే తిండికి కరవొస్తుంది.
కానీ సాంకేతికత ఎక్కువైన కొద్దీ కాలానికి కరవొస్తోంది.
ఒక్కసారి గుర్తుచేసుకోండి... పొద్దున్న లేచినప్పటినుంచీ టైమ్‌ లేదు అన్నమాట మీరు ఎన్నిసార్లు అని ఉంటారో? ఆడా మగా, చిన్నా పెద్దా, పేదా గొప్పా, దేశమూ జాతీ... తేడా లేకుండా ఈ భూమ్మీద ఉన్న మనుషులందరికీ సమానంగా రోజుకు 24 గంటలే ఉన్నాయి. అయినా కొందరేమో హాయిగా ఇష్టమైన పని చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారు. సినిమాలకూ షికార్లకూ తిరిగేస్తుంటారు. కొందరికేమో ముఖ్యమైన పనులు చేయడానికీ టైమ్‌ సరిపోదు. తిండికీ నిద్రకీ కూడా మొహం వాచిపోయినట్లుంటారు. ఎప్పుడు చూసినా టైమ్‌ లేదు... టైమ్‌ లేదు... అంటుంటారు. ఎందుకిలా- అని ఆలోచించిన నిపుణులు దీనికి ‘టైమ్‌ ఫెమైన్‌’ (కాలానికి కరవు) అని పేరు పెట్టారు. దాదాపు ఇరవయ్యేళ్ల క్రితమే వాడుకలోకి వచ్చిన ఈ పదం మానసిక శాస్త్రవేత్తలకు చేతినిండా పని కల్పించింది. ఈ కాలానికి కరవనేది... ఒక్క సమస్య కాదు, ఒక్కరి సమస్యా కాదు. ఎందరినో ఇబ్బందిపెడుతూ ఎన్నో సమస్యలకు అది కారణమవుతోందని పరిశోధనలు తేల్చాయి. ఒక రకంగా ఇప్పటి ప్రజలు కాలంతో పోరాటం చేస్తున్నారనీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ ఆ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

కాలానికి కరవెందుకొస్తోంది?
అందరికీ ఒకటే సమయం ఉన్నా దాన్ని వాడుకోవడంలో చాలా తేడా ఉంటోంది. సంపాదనకీ, కుటుంబానికీ, సొంత ఆనందానికీ... ఇలా ప్రాధాన్యాల మేరకూ సమయాన్ని ఖర్చుచేస్తూ ఒక పద్ధతిగా పోయేవారికి టైమ్‌ చాలదన్న మాటే ఉండదు. కానీ, మనలో చాలామందికి ఆ పద్ధతే ఉండదు. దానికి తోడు ఎన్నో పనులు చేయాలని ఆశపడుతుంటాం. చేస్తున్న పని మీద దృష్టి నిలపకుండా చేయాల్సిన పనుల్ని గుర్తు చేసుకుంటూ పగటి కలలు కంటాం. దాంతో ఏ పనీ సవ్యంగా జరక్కపోగా పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. ఇలా చాలా పనులు చేయాలన్న ఆత్రుతా, చేసేందుకు అవసరమైన ప్రణాళిక లేకపోవడమూ, టైమ్‌ సరిపోవడం లేదన్న ఆందోళనా కలిసి సమయానికి కరవును తెస్తున్నాయి. దేనికీ సమయం సరిపోవడం లేదని మనం వాపోయేలా చేస్తున్నాయి.

దానివల్ల అంత పెద్ద నష్టమేముంది?
ఆ నష్టం గురించి తెలియాలంటే ముందు ఈ జెన్‌ కథ చదవాలి.
ఓ గురువు దగ్గరికి కొత్త విద్యార్థి వచ్చాడు.
‘నేను చాలా కష్టపడి అన్నీ నేర్చుకుని గురువుని అవ్వాలనుకుంటున్నాను. దానికి ఎంత సమయం పట్టవచ్చు’ అని అడిగాడు.
‘పదేళ్లు’ సమాధానమిచ్చాడాయన.
‘చాలా చాలా కష్టపడి చదివితే’ ‘పదిహేనేళ్లు’
‘రాత్రింబగళ్లు నిద్రాహారాలు మాని కష్టపడితే..?’ ‘ఇరవయ్యేళ్లు’
‘అదేంటి, ఎక్కువ కష్టపడితే త్వరగా నేర్చుకోవచ్చు కదా, మీరు ఇంకా ఇంకా ఎక్కువ సమయం చెబుతున్నారు?’
అయోమయంగా అడిగాడు శిష్యుడు.
‘సగం దృష్టి ఎంత త్వరగా చదువు పూర్తవుతుందా అన్న దానిమీద ఉన్నపుడు సగం దృష్టే కదా చదువు మీద ఉంటుంది... కాబట్టి ఆలస్యమే అవుతుంది’ చెప్పాడు గురువు.
మన సమాజంలో చాలామందిది కూడా ఆ శిష్యుడి ధోరణే. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలన్న ఆత్రుతలో ఒత్తిడికి లోనవుతారు. ‘టైమ్‌ స్ట్రెస్‌’ అనే ఈ ఒత్తిడి వల్ల చేసే పనిని కూడా సరిగా చేయలేరు. పొరపాట్లు చేస్తారు. పనితీరుతో పాటు ఆత్మవిశ్వాసమూ దెబ్బతింటుంది. సమయానికి తగినట్లుగా పనిచేయలేకపోవడాన్ని వైఫల్యంగా భావించి ఆందోళన చెందుతారు. ఆ పరిస్థితి పలు రకాల సమస్యలకు దారితీస్తుంది.

ఆ ఒత్తిడిని ఎదుర్కొనలేమా?
ఉన్న పనుల్లో ఏది అవసరమైనదీ, ఏది అనవసరమైనదీ అన్నది నిర్ణయించుకోగలిగి, కాలాన్ని వృథా చేయకుండా పనిచేసుకునే నైపుణ్యం ఉన్నవారు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. టైమ్‌ స్ట్రెస్‌ని ఎదుర్కొనే ప్రధాన ఆయుధం క్రమశిక్షణ. అయితే దానికన్నా ముందు ‘టైమ్‌’ పట్ల మనకున్న అభిప్రాయమూ మారాలి. చాలామంది ‘టైమ్‌ ఈజ్‌ మనీ’ అంటారు. సమయాన్ని డబ్బుతో పోలుస్తారు. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. సమయాన్ని అలా సంపాదించుకోవడం అసాధ్యం. అందుకే టైమ్‌ డబ్బు కన్నా చాలా విలువైనదనీ దాన్ని సంతోషంతో పోల్చుకోమనీ చెబుతున్నారు నిపుణులు. డబ్బు విషయంలో ధనికులూ పేదలూ ఎలా ఉంటారో టైమ్‌ విషయంలోనూ అలాగే ఉంటారనీ అయితే డబ్బున్న వారికన్నా టైమ్‌ ఎక్కువ ఉన్నవారు ఎక్కువ ఆనందంగా ఉంటారనీ అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ప్యూ రీసెర్చ్‌ వారి సర్వే ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఆ సర్వేలో పాల్గొన్నవాళ్లలో నూటికి 68 మంది తమకు తీరిక సమయం ఉండటం చాలా ముఖ్యమని చెబితే 12 మంది మాత్రమే డబ్బు ముఖ్యం అని చెప్పారట.

సమయంతో సంతోషం ఎలా?
చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లాక ఎక్కడో ఏదో జరిగిందని హఠాత్తుగా బడికి సెలవు ప్రకటించేస్తే ఎంత ఆనందించేవాళ్లమో గుర్తుందా? అంతెందుకు, ఇప్పుడైనా ఏ బ్యాంకు పనో ఉండి దానికో మూడు గంటలు పడుతుందని లెక్కేసుకుని ఆఫీసుకు హాఫ్‌డే సెలవు పడేస్తాం. అనుకోకుండా ఆ పని అరగంటలో అయిపోతుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ మిగిలిన రెండున్నర గంటలూ మన ఇష్టం ఉన్నట్లు వాడుకోవచ్చు. అలా అనుకోకుండా టైమ్‌ దొరకడం ఎప్పుడో ఓసారి జరుగుతుంది. అదే రోజూ మనకు తీరిక సమయం కావాలంటే అందుకు కాస్త కష్టపడాలి. ప్రణాళికాబద్ధంగా పనుల్ని పూర్తిచేసుకోవటం అలవాటు చేసుకోవాలి. దాన్నే ‘టైమ్‌ అఫ్లుయెన్స్‌’(సమయ సంపద) అంటున్నారు. చాలినంత సమయం ఉందనుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్పష్టంగా ఆలోచించగలుగుతుంది. మనకి కూడూ గుడ్డా నీడా లోటు లేకుండా అమరాక ఎంత డబ్బున్నా అది మానసిక తృప్తిని ఇవ్వదనీ అదే కావలసినంత సమయం ఉంటే మాత్రం ఎంతో తృప్తిగా ఉంటుందనీ అంటారు మనస్తత్వ పరిశోధకుడు టిమ్‌ కాసర్‌. శక్తికి మించిన పనులు పెట్టుకుని ఎప్పుడూ బిజీగా ఉండడమే గొప్ప అనుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నామన్నది ఆయన చేసిన పరిశోధనల సారాంశం. కావలసినంత సమయం ఉంటే మనసుకు నచ్చిన పని చేస్తాం. విశ్రాంతి తీసుకుంటాం. అయినవారితో గడిపి అనుబంధాలను పెంచుకుంటాం... అందుకే సమయం ఇచ్చే ఆనందం డబ్బు ఇవ్వదంటారు ఆయన. పైగా అలా మనకోసం మనం మిగుల్చుకునే సమయం వ్యక్తిగానూ ఉద్యోగిగానూ కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ఎంతో ఉపయోగపడుతుందట.

టైమ్‌కీ కెరీర్‌కీ ఏమిటి సంబంధం?
ఖాళీ సమయంలో మనసు ఎలాంటి ఒత్తిడీ లేకుండా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతుంది. కెరీర్‌లో పైపైకి ఎదగడానికి ఆ ఆలోచనలు పెట్టుబడి అవుతాయి. అసలు తీరిక అనేది లేకుండా రోజుకు పద్దెనిమిది గంటలూ గడియారంతో పోటీపడి పరుగులు తీయడం వలన కొత్త ఆలోచనలకు ఆస్కారమే లేకుండా పోతోందన్నది నిపుణుల వాదన. దాంతో అలాంటివారు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కోల్పోతున్నారట.

పరుగులు తీయక తప్పదుగా మరి?
తీరిక దొరక్కపోతే టైమ్‌ని కొనుక్కోవాలి. దాన్ని కూడా అమ్మడం ఎప్పటినుంచి మొదలెట్టారని కంగారు పడకండి. రెండేళ్ల క్రితం హార్వర్డ్‌ సైకాలజీ ప్రొఫెసర్‌ యాష్లే విలాన్స్‌ ‘బైయింగ్‌ టైమ్‌ ప్రమోట్స్‌ హ్యాపినెస్‌’ పేరుతో ఓ అధ్యయనం చేశారు.
ఆఫీసుల్లో పని ఎక్కువున్నా, సంబంధిత నిపుణులు లేకపోయినా ఔట్‌సోర్సింగ్‌ చేసినట్లే, మన పనులు కూడా కొన్ని అలా ఔట్‌ సోర్సింగ్‌ చేసుకుంటే పనిభారం తగ్గుతుంది. ఖాళీ సమయమూ దొరుకుతుంది. ఇంట్లో పనికి పెట్టుకున్నట్లే వంటకీ ఓ మనిషిని పెట్టుకోవచ్చు. పిల్లల చదువులూ హోంవర్కులూ చూడడానికి హోమ్‌ట్యూషన్‌ పెట్టించవచ్చు. రకరకాల ఆప్‌లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని షాపింగ్‌, బిల్లులు కట్టడం లాంటి పనులు ఆన్‌లైన్లో చేసేయొచ్చు. ఇలా అంతగా నైపుణ్యం అక్కర్లేని, ఎవరైనా చేయగల పనికోసం మన టైమ్‌ని వృథా చేయకుండా డబ్బిచ్చి ఆ పని చేయించుకుంటే మనకు తీరిక సమయం దొరుకుతుంది- అంటే టైమ్‌ని కొనుక్కున్నట్లే కదా అంటారు యాష్లే. అరగంట పనికి వంద రూపాయలా... జత బట్టలు ఇస్త్రీకి పన్నెండు రూపాయలా... అంటూ చాలామంది ఆ పనులన్నీ స్వయంగా చేసుకుందామనుకుంటారు. కానీ అందుకు పట్టే విలువైన సమయాన్ని తాము కోల్పోతున్నామని అర్థం చేసుకోరు. ఓ పక్క ఆదాయాలు పెరుగుతున్నా చాలామంది టైమ్‌ గురించి ఒత్తిడికి గురవడానికి కారణం ఇలాంటి స్వభావమే. ఫలితంగా ఆరోగ్యాన్నీ ఆనందాన్నీ కోల్పోతున్నారనీ మానసికాందోళన, నిద్రలేమి, స్థూలకాయం లాంటి సమస్యలకు ఈ ఒత్తిడి కారణమవుతోందనీ యాష్లే అధ్యయనంలో తేలిందట.

అలా కొనుక్కునే స్తోమత లేకపోతే?
ఆ స్తోమత లేకపోయినా టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మనం చేయాల్సిందల్లా జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవటమే. మనమంతా జీవితాన్ని వందమీటర్ల పరుగుపందెంలా చూస్తున్నాం. తక్కువ దూరమే కదా అనుకుంటాం కానీ తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందుకోవడానికి తీవ్రమైన ఒత్తిడి భరించాల్సి వస్తుందని మర్చిపోతున్నాం. అలా కాకుండా జీవితాన్ని లాంగ్‌ డిస్టాన్స్‌ మారథాన్‌లా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి ఆలోచించుకోడానికీ, సరైన ప్రణాళికలు వేసుకోడానికీ లక్ష్యం దిశగా చేసే ప్రయాణాన్ని ఆస్వాదించడానికీ సమయం ఉంటుంది. ఇలా జీవితాన్ని చూసే దృష్టికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ తోడైతే
‘టైమ్‌ లేదు’ అన్న మాట మన నోటి వెంట రానే రాదు. సంపాదనా ఆర్థిక హోదాల గొడవలోపడి మర్చిపోతున్న ఆనందాన్ని ఈ టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇస్తుంది.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేయాలి?
ఏ పని అయినా దాన్ని చేయాల్సిన టైమ్‌లో ఏకాగ్రతతో పూర్తిచేయడమే- టైమ్‌ మేనేజ్‌మెంట్‌. అది తెలియక చాలామంది అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. ముకుతాడు వేసి కోడెగిత్తని అదుపులోకి తెచ్చుకున్నట్లే కొన్ని చిట్కాలతో టైమ్‌నీ మన అదుపులో ఉంచుకోవచ్చు.
* మన ముందున్న పనుల్ని ఈ రోజు, ఈ వారం, ఈ నెలలో చేయాల్సిన పనులుగా విభజించుకోవాలి. ముందుగా ఇవాళ్టి పనుల మీద దృష్టి పెట్టాలి. అలా ఏరోజు పనులు ఆరోజే అయిపోతే ఆటోమేటిగ్గా ఒత్తిడీ తగ్గుతుంది, తీరిక సమయమూ మిగులుతుంది.
* అన్ని పనులూ ఒకరే చేయాలనుకోవడమూ, అందరి పనుల్నీ నెత్తినేసుకోవడమూ అలవాటైతే ముందు దాన్ని వదిలించుకోవాలి.
* ధ్యానం, వ్యాయామం, ఆహారం, నిద్ర... ఈ నాలుగింటికీ తగినంత సమయం కేటాయించగలిగితే చాలు - మానసిక, శారీరక ఆరోగ్యాలు చక్కబడతాయి. పనిలో సామర్థ్యం పెరుగుతుంది. ధ్యానం అలవాటు లేకపోతే సంగీతం వినడం, తోటపని, పూజ... అలా ఎవరికి ఇష్టమైన పని వారు చేసుకోవచ్చు.
* పొద్దున్నే ఆరింటికి లేచి రాత్రి పదింటికి పడుకుంటారనుకుందాం. వృత్తికీ, కుటుంబానికీ, వ్యక్తిగత ఆనందానికీ... ఇలా మీ ప్రాథమ్యాలను రాసుకుని ఆ 16 గంటల్లో దేనికెంత కేటాయించదలచుకున్నారో నిర్ణయించుకుని ఫాలో అయిపోవడం మరో పద్ధతి. అది ఎంతవరకూ సరిగ్గా ఉందో వారానికోసారి పరిశీలించుకోవాలి.
* చేతిలో స్మార్ట్‌ఫోనూ, ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కంప్యూటరూ ఒకసారి ఆన్‌ చేశామంటే పని కాగానే కట్టెయ్యం. ఒకదాని వెంట ఒకటి ఏవేవో బ్రౌజింగ్‌ చేస్తూ గంటలు గడిపేస్తాం. అందుకని వాటితో పని ప్రారంభించే ముందు అలారం పెట్టుకుని కచ్చితంగా కేటాయించుకున్న సమయంలోనే ఆ పని పూర్తిచేసి వాటిని కట్టేయాలి. ఈ అలవాటు చేసుకుంటే చాలా టైమ్‌ కలిసివస్తుంది.
* పనులను వాయిదా వేస్తే అప్పటికి రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ దానివల్ల రెండు రకాల నష్టం. పని పేరుకుపోతుంది. మరో పక్క ఆ పని చేయాలీ చేయాలీ అంటూ మనసు మీద ఒత్తిడీ పెరిగిపోతుంది. దీని వల్ల చేసే పనుల్నీ సమర్థంగా చేయలేం. అందుకని వాయిదా వేసే అలవాటుని వదిలించుకోవాలి.
* సమయాన్ని పగటికలలు కనడానికి కాకుండా కన్న కలలను సాకారం చేసుకోడానికి వాడుకోవాలి.
ఇలా కాస్త జాగ్రత్తగా సమయాన్ని మన అదుపులోకి తెచ్చుకుంటే చాలు... కరువూ ఒత్తిడీ పరారవుతాయి. ఆనందించడానికి బోలెడంత సమయం మన ముందుంటుంది.

*   *  *  *  *

పేదరికంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు పడుతూ పెరిగిన ఓ వ్యక్తి స్వయంకృషితో పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. నిజాయతీగా వ్యాపారం చేసి చాలా సంపద కూడబెట్టాడు.
పిల్లలకు సకల సదుపాయాలూ ఇవ్వడమే కాక విలువలనూ నేర్పాడు. అతడంటే అందరికీ గౌరవమే. అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిల్లలకు చెప్పేవారు.
అలా అతడు నిండుజీవితం గడిపి వృద్ధాప్యంతో చివరి రోజుల్లో తృప్తిగా కన్నుమూయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులంతా అతడి చుట్టూ చేరారు.
‘మీరు మాకు ఎన్నో ఇచ్చారు. అయినా మీనుంచీ ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఉంది మాకు. దయచేసి జీవితంలో మీరు నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఏదో చెప్పండి’ అన్నారు వాళ్లు.
‘చెబుతాను, అయితే నా దగ్గర అంత సమయం లేదు. ఎవరైనా నాకు కాస్త సమయం ఇవ్వగలిగితే వారికి నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను’ అన్నాడు వృద్ధుడు.
అందరూ తెల్లమొహం వేశారు.
సమయం ఇవ్వడం ఎలా సాధ్యం అనుకున్నారు. ‘నా ఆస్తి అంతా ఇచ్చినా నాకు కాస్త సమయం ఇవ్వలేరు కదా మీరు. మీకే కాదు, అది ఎవరికీ సాధ్యం కాదు.
అందుకే సమయం విలువ తెలుసుకోండి. ఒక్క క్షణం కూడా వృథా చేయకండి’ అని ఆత్మీయులకు మరో విలువైన పాఠం చెప్పి కళ్లు మూశాడాయన.

ఎంత వేస్టో!

వారమంతా ఊపిరాడకుండా పనిచేసినా చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడి పని అక్కడే ఉన్నట్లనిపిస్తుంది. పనిచేసిన టైమ్‌ అంతా ఏమైపోయిందో అర్థం కాదు. మన దగ్గర అలాంటి అధ్యయనాలు ఇంకా జరగడం లేదు కానీ అమెరికాలోని ఓ సంస్థ కొన్ని కార్యాలయాల్లో సర్వే చేయించగా పనిగంటల్లో 30 శాతం సమయం వృథా అవుతున్నట్లు తేలింది. ఆఫీసులో అయినా ఇంట్లో అయినా చిన్న చిన్న విషయాలే మనకు తెలియకుండానే మన టైమ్‌ని తినేస్తాయి. హ్యూ కల్వర్‌ అనే రచయిత చాలామంది అలవాట్లను పరిశీలించి మనం సగటున ఎంత టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నామో చూడండంటూ ఓ లిస్టు రాశాడు. అవేంటంటే...
* ఏం తినాలా అని నిర్ణయించుకోడానికి 35 నిమిషాలు
* ఏ దుస్తులు వేసుకోవాలా అని తేల్చుకోడానికి 16 నిమిషాలు
* వ్యాయామం చేయాలా వద్దా, నడకకి వెళ్లాలా వద్దా అని ఆలోచించుకోడానికి 10 నిమిషాలు
* సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోడానికి గంటకి పది నిమిషాలు
* టీవీ చూస్తూ 2-4 గంటలు
* అవసరం లేని వెబ్‌సైట్లు చూస్తూ గంటన్నర
* మిత్రులతో, బంధువులతో ఫోనులో మాట్లాడటమూ, చాటింగూ ఓ గంటన్నర.
* ఆఫీసు మీటింగుల్లో ఓ అరగంట.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.