close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కష్టాలు తీర్చే కలెక్టర్లు!

వారంతా కలెక్టర్లు... వృత్తి ధర్మంగా ప్రజలకోసమే పనిచేస్తున్నారు. ఎవరూ పట్టించుకోని సమస్యలుంటే వాటిని తమ భుజానికెత్తుకుని సొంత ఖర్చులతో తీరుస్తున్నారు. సామాన్యులకు అండగా ఉంటున్నారు.

వైద్యుల కొరత తీర్చి...

రాయ్‌గఢ్‌ జిల్లాలోని కర్జత్‌... కొండలూ, లోయలూ, జలపాతాలతో పర్యటకుల మనసుదోచుకునే చూడచక్కని ప్రదేశం. అయితే అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో రోగులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ పరిస్థితి తెలిసిన జిల్లా కలెక్టర్‌ విజయ్‌ సూర్యవన్షీ ఒక్క ఆలోచనతో రోగుల సమస్యని తీర్చేశాడు. అందుకోసం వైద్యులకో ఆఫర్‌ ఇచ్చాడు విజయ్‌. వసతులెన్నింటికో దూరంగా ఉన్న కర్జత్‌లోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లకు ఆ ప్రాంతంలో బసనూ, ఇతర ఏర్పాట్లనూ ప్రభుత్వమే చూస్తుందనీ, ఎవరైనా వైద్య శిబిరాలు పెడితే తానే మందులు ఉచితంగా అందిస్తాననీ ప్రకటించాడు. అలానే హోటళ్లూ, రిస్టార్టులతో సంప్రదింపులు జరిపి సేవ చేసిన వారికి బస ఏర్పాట్లు చేసి సహకరించమని కోరాడు. వారూ ఒప్పుకోవడంతో విజయ్‌ ఆలోచన ఫలించింది. పలు ఎన్జీవోలు కూడా స్పందించి వైద్యులతో మాట్లాడి అక్కడ వారాంతాల్లోనే కాక కొన్నాళ్లు గ్రామాల్లోనే ఉండి స్థానికులకు వైద్యం చేసేలా ఏర్పాట్లు చేశాయి. క్రమంగా కర్జత్‌ వాసులకు వైద్య సేవలు చేరువయ్యాయి. అలానే రాయ్‌గఢ్‌ జిల్లాలో వైద్య సేవలకు నోచుకోని మరో వెయ్యి గ్రామాల్లోనూ తరచూ వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయిస్తున్నాడు విజయ్‌.

మూఢవిశ్వాసాలు తరుముతూ...

ధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో మూఢ విశ్వాసాలు ఎక్కువ. పోషకాహార లోపమున్న చిన్నారులకు ఇనుపరాడ్లను కాల్చి పొట్ట మీద వాతలు పెడుతుంటారు. అలాచేస్తే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం. కానీ అలా వాతలు పెట్టిన చిన్నారులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడి ఎంతగానో బాధపడటం కళ్లారా చూసిన ఆ జిల్లా కలెక్టర్‌ స్వరోచిష్‌ సోమవన్షీ ఆపరేషన్‌ ‘సంజీవని’కి శ్రీకారం చుట్టాడు.  మూఢవిశ్వాసాలను నమ్మొద్దని గ్రామాల్లో ప్రచారం చేస్తూ... వాతల బారిన పడిన చిన్నారులకోసం న్యూట్రిషన్‌ రిహాబిలిటేషన్‌ కేంద్రాలను(ఎన్‌ఆర్‌సీ) ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నాడు. వాతలతో ఒళ్లంతా తూట్లుపొడిచినట్టు కనిపిస్తున్న చిన్నారులు ఆ మంటా, నొపీ్ప తట్టుకోలేక రోజుల తరబడి ఏడవడం గమనించిన సోమవన్షీ తన ఆఫీసులోని ఏసీలను తీయించి ఎన్‌ఆర్‌సీ కేంద్రాల్లో పెట్టించాడు. ఇంకాస్త డబ్బు ఇచ్చి పిల్లలకి మెరుగైన మందులు తెప్పిస్తున్నాడు. అలా వందల మంది చిన్నారులకు సాంత్వన అందిస్తున్న సోమవన్షీకి చేదోడువాదోడుగా ఉండాలని కలెక్టరేట్‌ స్టాఫ్‌ తమ వారం రోజుల జీతాన్ని అతనికి అందించారు. ఆ  మొత్తాన్ని ఎన్‌ఆర్‌సీలో చిన్నారుల వైద్యానికి ఖర్చుపెట్టడంతోపాటు వారికి పోషకాహారం అందించడానికి వినియోగిస్తున్నాడు సోమవన్షీ. అలానే ఆ జిల్లాలోని పలు గిరిజన గ్రామాలకు దగ్గర్లోని పట్టణాలను కలుపుతూ తన సొంత ఖర్చులతో వాలంటీర్ల సాయంతో రోడ్లూ వేయిస్తున్నాడు. 

అంగన్‌వాడీలకు కొత్త ఊపిరి!

జార్ఖండ్‌లోని వెనకబడిన జిల్లా ఛాత్ర. ఆ జిల్లాలోని అంగన్‌వాడీ భవనాలు పాడవడం, పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వంటి రకరకాల సమస్యల్ని గుర్తించాడు కలెక్టర్‌ జితేందర్‌ కుమార్‌ సింగ్‌. ఆ భవనాలను బాగు చేసి గ్రామీణ చిన్నారులకు మేలు చేయాలనుకున్నాడు. కానీ ప్రభుత్వం అంగన్‌వాడీ భవనాల రీమోడలింగ్‌కి అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఏడాదిపాటు ఎదురుచూసిన జితేందర్‌ జిల్లాలో పాడుబడినట్టైన నలభై అంగన్‌వాడీలను తన సొంత ఖర్చులతో బాగు చేయించాలనుకున్నాడు. ఆ బృహత్కార్యానికి ‘ఆపరేషన్‌ అంగన్‌’ అని పేరు పెట్టుకున్నాడు. నలభై భవనాలను బాగు చేసి ఆకర్షణీయమైన రంగులు వేయించి పిల్లలకి ఆటవస్తువులూ, పుస్తకాలూ, ఫర్నిచర్‌ వంటివన్నీ అమర్చి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాడు. ఒక్కో అంగన్‌వాడీ భవనానికి యాభైవేల వరకూ ఖర్చుపెట్టాడు. అందుకు దాతలూ సాయమందించడంతో జితేందర్‌ పని చాలా తేలికైంది. ఒకప్పుడు వెలవెలబోయిన ఆ అంగన్‌వాడీలు ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయంటే అది జితేందర్‌ చలవే.

4 ఆగస్టు 2019


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు