close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘పియర్స్‌’తో ఆరోగ్యంగా..!

కొన్ని పండ్లు ఏడాదిపొడవునా దొరుకుతాయి. కొన్ని మాత్రం ఆ కాలానికే పరిమితం. అలాంటివాటిల్లో ఒకటి పియర్స్‌. విదేశాల్లో పండే రకంతోబాటు మనదగ్గర పండే దేశవాళీ రకం పియర్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. యాంటీఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉండే వీటిని తినడం ఎంతో మంచిది అంటున్నారు పోషకనిపుణులు. ముఖ్యంగా పియర్స్‌ పండ్లలో సమృద్ధిగా ఉండే పీచు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృద్రోగాలూ మధుమేహం... వంటి వ్యాధులను తగ్గిస్తుంది. పెద్దపేగు గోడలు దెబ్బతినడం వల్ల వచ్చే మంటనీ తగ్గిస్తుంది. జీర్ణక్రియని పెంచుతుంది. శరీరంలోని టాక్సిన్లని బయటకు పంపేలా చేస్తుంది. చర్మం దెబ్బతినకుండా ముడతలు పడకుండా కాపాడటంతో బాటు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి, కె, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు హానికారకాలైన ఫ్రీ రాడికల్స్‌ శాతాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్లనీ నిరోధిస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి అలర్జీలూ ఉండవు కాబట్టి పసిపిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇందులోని కాల్షియం ఆస్టియోపొరోసిస్‌ని నిరోధిస్తుంది. ఈ పండ్లలో ఫోలిక్‌ ఆమ్లశాతం కూడా ఎక్కువే కాబట్టి గర్భిణీలూ వీటిని రోజూ తీసుకుంటే మంచిదట. పిత్తాశయ సమస్యలతో బాధపడేవాళ్లకీ పియర్స్‌ మంచిదే. జ్వరంతో బాధపడేవాళ్లు ఈ పండ్లను తినడంవల్ల జ్వర తీవ్రత వెంటనే తగ్గుతుందట. 


నిద్రకు ముందు చేద్దాం స్నానం!

ఈమధ్య చాలామందిని ఇబ్బంది పెడుతోన్న సమస్య నిద్రలేమి. అందుకే నిద్రపట్టడానికి కొందరు గోరువెచ్చని పాలు తాగితే, మరికొందరు లైట్లు తీసేసి చీకటిగా చేయడం, పెరుగన్నం తినడం వంటి చిట్కాల్ని పాటిస్తుంటారు. వీటన్నింటికన్నా- పడుకునేముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల తరవాత శరీర ఉష్ణోగ్రత కొంతవరకూ తగ్గి బాగా నిద్ర వచ్చేలా చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం వీళ్లు అనేకమందిని అధ్యయనం చేయగా- నిద్రపోవడానికి ఒకటి రెండు గంటల ముందు స్నానం చేసేవాళ్లు బాగా నిద్రపోయినట్లు గుర్తించారట. ఎందుకంటే- స్నానం వల్ల శరీర ఉష్ణోగ్రత కొంత తగ్గడంతోబాటు రక్తప్రసరణ వేగం పెరుగుతుందట. దానివల్ల గాఢ నిద్ర వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 


కంప్యూటర్‌ వాడండి!

మధ్య వయసులో కంప్యూటర్‌ని ఎక్కువగా వాడేవాళ్లకి భవిష్యత్తులో మతిమరుపు, ఆల్జీమర్స్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ పేర్కొంటోంది. వయసు పెరిగేకొద్దీ మతిమరపు రావడంతో బాటు ఆలోచనాశక్తి కూడా తగ్గడం సహజం. అయితే కంప్యూటర్‌ వాడటంతోబాటు సామాజికంగా చురుకుగా ఉండేవాళ్లలో ఈ సమస్యలు వచ్చే అవకాశం తక్కువని సదరు నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, వీటితోబాటు వ్యాయామం కూడా చేయగలిగితే మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని తేలిందట. ఇందుకోసం వీళ్లు రెండువేలమందిని పరిశీలనకు తీసుకుని- వాళ్లలో అరవై దాటిన వాళ్ల జీవనశైలిని గమనిస్తూ ఏడాదికోసారి వాళ్ల మెదడు పనితీరునీ ముఖ్యంగా జ్ఞాపకశక్తినీ పరీక్షించారట. అందులో- సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కంప్యూటర్‌ని వాడుతూ కొంత వ్యాయామం కూడా చేసేవాళ్లలో ఆలోచనాశక్తీ, జ్ఞాపకశక్తీ మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.


తల్లిదండ్రులూ... ఇలా చేయండి!

పిల్లలు పెద్దవాళ్లుగా మారే కీలక దశే కౌమారం. ఆ దశలో తల్లిదండ్రులు జాగ్రత్తగా గైడ్‌ చేయాలేగానీ నియంత్రించాలని చూడకూడదు అంటున్నారు మిషిగాన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. పిల్లల పెరుగుదలకి స్వేచ్ఛ చాలా అవసరం. కానీ ఆ విషయాన్ని పెద్దవాళ్లు గుర్తించరు. తమ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకి రకరకాల ఆంక్షలు పెడుతుంటారు. కానీ అది సరికాదు.  పిల్లలకీ తల్లిదండ్రులకీ మధ్య ఉండే వయసు తారతమ్యం కారణంగా ఇద్దరిమధ్యా అవగాహన లోపించడం సహజం. అలా జరగకుండా ఉండాలంటే వాళ్లతో సన్నిహితంగా మెలుగుతూ స్నేహితుల్లా సలహాలిస్తుంటే తల్లిదండ్రులు చెప్పేదాన్ని పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకుంటూ పెరుగుతారు. ముఖ్యంగా వాళ్లకి పూర్తి స్వేచ్ఛనిస్తూనే దగ్గరగా వాళ్ల పనుల్ని గమనిస్తుండాలి. వాళ్లు స్వయంగా చేసుకోలేనప్పుడు మాత్రమే తల్లిదండ్రులు జోక్యం చేసుకోవాలి అంటున్నారు.

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.