close
మమ్మేలు మాలక్ష్మి..!

సృష్టిలో సకల ఐశ్వర్యాలకూ సుఖసంపదలకూ అధిదేవతగా లక్ష్మీదేవిని కొలుస్తారు. ఆమె కరుణా కటాక్షాల కోసం ఎన్నో నోములూ వ్రతాలు చేస్తారు. అలాంటి లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకున్న క్షేత్రం కొల్హాపూర్‌. కాశీ క్షేత్రం తర్వాత అంతటి ప్రశస్తి కలిగిన ఆలయం ఇదేనంటూ సాక్షాత్తూ ఆ కైలాసనాథుడే వరమివ్వడం విశేషం. శ్రావణమాసంలో ఆ సిరులతల్లిని మనమూ దర్శించుకుందాం.

ష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి దేవాలయం. మహారాష్ట్రవాసులు అమ్మవారిని ప్రేమగా అంబాబాయి అని పిలుస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ఎన్నో విశిష్టతలకు నిలయం. కొల్లా అంటే లోయ అనీ, పూర్‌ అంటే పట్టణమనీ అర్థం. లోయప్రాంతంలో అభివృద్ధి చెందిన పట్టణం కాబట్టి దీనికి కొల్హాపూర్‌ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. అంతేకాదు ఈ క్షేత్రంలో వెలసిన అమ్మవారిని శ్రావణ శుక్రవారం నాడు దర్శించుకుంటే అంతులేని ఐశ్వర్యం, సుఖమయమైన జీవితం లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే మిగిలిన రోజుల్లో కంటే శ్రావణమాసంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

స్థలపురాణం
అగస్త్యుడు పరమ శివభక్తుడు. ఏటా కాశీకి వెళ్లి విశ్వనాథుణ్ని దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యం కారణంగా సుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని చేరుకోవడం కష్టమవడంతో శివుడి గురించి తపస్సు చేశాడు. బోళా శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న శివయ్యను కళ్లారా దర్శించుకోవడానికి వెళ్లలేకపోతున్నాననీ కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి ఆరాధిస్తాననీ వేడుకున్నాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం కలిగిన నగరం కొల్హాపురమనీ, ఆ క్షేత్రంలో కొలువై పూజలందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని దర్శిస్తే కాశీ వచ్చి విశ్వనాథుణ్ని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందనీ వరమిస్తాడు ఆ పరమశివుడు.

అభివృద్ధి ఇలా...
పురాణాల్లోనూ ప్రస్తావించిన ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో చాళుక్య రాజైన కరన్‌దేవ్‌ పునర్నిర్మించాడని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత ఎనిమిదో శతాబ్దంలో యాదవ వంశీయులు ఈ క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రంలోనే శివుడూ విష్ణుమూర్తి మొదలైన దేవీదేవతలకి ఉపాలయాలనూ నిర్మించారు. హేమండ్‌ పతి అనే సనాతన భారతీయ నిర్మాణశైలిలో ఈ ఆలయాన్ని దీర్చిదిద్దారు. రోజూ సూర్యకిరణాలు అమ్మవారిని తాకేవిధంగా ఆలయ ప్రాకారాలను కట్టడం విశేషం. అత్యంత పవిత్రమైన అమ్మవారి విగ్రహాన్ని సూర్యగ్రహణం రోజున దర్శించుకుంటే విశేష ఫలితం ఉంటుదని భక్తుల విశ్వాసం.

మూడడుగుల రూపం
గర్భగుడిలోకి ప్రవేశించగానే మూడడుగుల నల్లరాతితో చెక్కిన మహాలక్ష్మి విగ్రహం దర్శనమిస్తుంది. మొత్తం నాలుగు చేతులతో భక్తులను అనుగ్రహించే అమ్మవారికి కింది కుడిచేతిలో మాతుంగ ఫలం, పై కుడిచేతిలో గద, పై ఎడమచేతిలో ఖేతకమనే రక్షణ కవచం, కింది ఎడమ చేతిలో పానపాత్ర ఉంటాయి. గర్భగుడిలోని గోడమీద శ్రీయంత్రం చెక్కి ఉంటుంది. అమ్మవారి విగ్రహం వెనక రాతితో చెక్కిన సింహం కనిపిస్తుంది. ఆలయానికి కొంచెం దూరంలో మణికర్ణికా కుండం అనే కొలను ఉంటుంది. ఇందులో స్నానం చేసి ఒడ్డున ఉన్న విశ్వేశ్వర మహాదేవ్‌ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.
కొల్హాపూర్‌లో కొలువైన లక్ష్మీదేవికి రోజుకు అయిదుసార్లు అర్చన జరుగుతుంది. ఉదయం అయిదుగంటలకు శ్రీమహాలక్ష్మికి సుప్రభాత సేవ చేస్తారు. ఆ తర్వాత ఎనిమిది గంటలకు షోడశోపచారాలతో అమ్మవారిని అర్చిస్తారు. మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో పూజతోపాటు షెజ్‌ హారతి కూడా ఇస్తారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక అభిషేకాలూ అర్చనలూ కుంకుమ పూజలూ నిర్వహిస్తారు.

చేరుకోవచ్చు
కొల్హాపూర్‌లో కొలువైన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కొల్హాపూర్‌ విమానాశ్రయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ప్రయివేటు వాహనాల్లో చేరుకోవచ్చు. రైలుమార్గంలో వచ్చే భక్తులు... రుఖడీ రైల్వేస్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు. దేశం నలుమూలల నుంచీ బస్సు సదుపాయం కూడా ఉంది.

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.