close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అహం

- సర్వజిత్‌

‘‘బాగున్నావా?’’ ఎదురుపడిన మనిషిని చూసి తడబడి, క్షణం ఆలోచించి, ఏకవచనంలో సంబోధించాలా బహువచనంలోనా అని లిప్తకాలం సందేహించి, చివరికి ఏకవచనంలోనే అడిగాడు సాకేత్‌ అనుకోకుండా తారసపడిన ఆమెనుద్దేశించి.
క్షణంసేపు ఆమె కూడా అలానే అయింది. తత్తరపాటూ ఉలికిపాటూ ఏదో చెప్పలేని కంగారూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి క్షణకాలం. చిత్తరువులా నిలబడిపోయింది. ఒక్కసారిగా వడగాడ్పు వీచినట్లు ముఖంనిండా చెమట పట్టేసింది. జేబు రుమాలుతోనూ పమిటచెంగుతోనూ ముఖం తుడుచుకుంది.
ఆమెనే చూస్తున్నాడు సాకేత్‌ సమాధానంకోసం అన్నట్లు. అభావంగా ఉంది అతడి ముఖం. మరెవరికీ తెలియనీ కనిపించనీ ఒక నిర్వేదపు తెర లిప్తకాలం అతడి ముఖంలో ద్యోతకమై అంతలోనే మాయమైనట్లు ఆమెకు అనిపించింది.
అతడి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో ఆమెకు వెంటనే స్ఫురించలేదు.
అప్రయత్నంగానే అస్పష్టంగా తలూపింది.
సాకేత్‌కి అర్థంకాలేదు.
‘‘ఎక్కడుంటున్నావు?’’ తన మొదటి ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూడకుండా మరో ప్రశ్న వేశాడు... అదీ సభ్యత కోసమే అన్నట్లు.
అతడి ప్రశ్నకు నవ్వుకుంది. అయితే నవ్వును బయటికి రానీయలేదు. ‘‘విశాఖలో’’ చెప్పిందామె.
సింహాచలస్వామిని దర్శించుకున్నాక, గుడి బయటికి వచ్చి, ఓసారి వెనక్కి తిరిగి నమస్కరిద్దామనుకుంటున్న సాకేత్‌కి ఆమె గుడిలోంచి వస్తూ ఎదురుపడింది. ఇద్దరూ మెట్లు దిగి కిందకొచ్చారు. అతడు ప్రసాదం కొనడానికి వెళుతూ ఆమెకేసి చూశాడు ‘నీకూ కావాలా?’ అన్నట్లు. తనని తెమ్మంటుందేమో అనుకున్నాడు. కానీ, అతడితో ఆమె కూడా వచ్చింది- ప్రసాదం కొనుక్కునేందుకు.
‘‘మీరు ఎక్కడుంటున్నారు?’’ ప్రసాదం కొనుక్కుని బయటికి వచ్చాక అడిగిందామె. అతడు సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఆమే అంది ‘‘మీరూ ఇక్కడే ఉంటున్నారా?’’ అని. ఆ ప్రశ్నకి సాకేత్‌ ఆమెకేసి చూశాడు. ఆమె దృష్టి నడిచే దారిమీదనే ఉన్నా, అతడు చెప్పే సమాధానం కోసమే ఎదురుచూస్తున్నట్లు అనిపించిందతనికి.
‘‘లేదు, హైదరాబాదులోనే’’ చెప్పాడు. తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ నడుచుకుంటూ వస్తుంటే, అక్కడో హోటల్‌ కనిపించగానే సాకేత్‌ ‘‘కాఫీ?’’ అని, హోటల్లోకి దారి తీశాడు. మౌనంగా అతడిని అనుసరించిందామె.
ఆరోజు శనివారం కావడంతో ఓమోస్తరు రద్దీగానే ఉంది ఆవరణ. హోటల్లో పిట్టగోడ వారగా ఉన్న చిన్నటేబుల్‌కి అటూఇటూ కుర్చీలున్నచోట కూర్చున్నారిద్దరూ. ఇద్దరిమధ్యా మాటల్లేవు. ఆమె చేతి గోళ్లు చూసుకుంటోంది. ఆమె గమనించకుండా ఆమెనే చూస్తున్నాడు సాకేత్‌.
ఆమె కాస్త ఒళ్లు చేసిందో చిక్కిందో అతడికి అర్థం కావడంలేదు. ముఖంలో మాత్రం ఇదివరకటి మెరుపు లేదనుకున్నాడు. మెడలో బంగారు గొలుసూ ముత్యాల హారమూ ఉన్నాయి. కుడిచేతి ఉంగరం వేలుకి... అదే... పుష్యరాగం రాయి పొదిగిన ఉంగరం ఉంది. ఆ చేతికే నల్లబెల్టుతో గోల్డుకలర్‌ వాచీ ఉంది. ఇంతలో వెయిటర్‌ వచ్చాడు. ‘‘అల్లం, పచ్చిమిర్చీ బాగా వేసి పెసరట్లు రెండు’’ చెప్పాడు సాకేత్‌.
ఆ మాటకి చురుక్కున చూసిందామె తలెత్తి అతడివైపు. అంత కారంకారంగా పెసరట్టు తిని, ఆ వెంటనే వేడివేడిగా టీ తాగడం ఆమెకిష్టం. సాకేత్‌ అభావంగా ఉన్నాడు. క్షణంసేపు అతడిని అలానే చూసిందామె.
అతడి ముఖంలోనూ ఇదివరకటి మెరుపు కనిపించలేదామెకు. మనిషి నలిగినట్లున్నాడు. ఇందాకటినుంచీ ఆమె సరిగా గమనించలేదు.
ఇప్పుడతడిని అలా చూసేసరికి అప్రయత్నంగా ఆమె మనసు చివుక్కుమంది. కనుకొలకులు చెమ్మగిల్లినట్లు కూడా అనిపించింది. ముఖం తుడుచుకుంటున్నట్లుగా కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంది.
అదేం గమనించలేదతడు. హోటల్‌ అంతా కలయ చూస్తున్నాడు. ఆమె కనిపించడమే అతడికో హఠాత్‌ పరిణామం. పైగా తను పిలవగానే ఏ బెట్టూ చేయకుండా ఇలా కాఫీకి రావడం మరో ఆశ్చర్యకర పరిణామం!
ఆర్డర్‌ చేసిన పెసరట్లు వచ్చాయి. కారంగా, వేడిగా తింటుంటే సాకేత్‌కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రెండుసార్లు కళ్ళు తుడుచుకున్నాడు. అతడి అవస్థ చూసి ఆమెకు నవ్వొచ్చింది. కానీ, నవ్వుని పైకి రానివ్వలేదు. అదయ్యాక బాగా వేడిగా ఉండాలని చాయ్‌ చెప్పాడు సాకేత్‌. చాయ్‌ తాగుతున్పప్పుడూ నోరు మండి మళ్ళీ అతడికి కన్నీళ్ళొచ్చాయి. ఈసారి ఆమె నవ్వు దాచుకోలేకపోయింది. అతడికి కనిపించకుండా కర్చీఫ్‌ను అడ్డం పెట్టుకుంది.
టీ తాగాక కౌంటర్‌ దగ్గరకొచ్చి ఆమె బిల్లు చెల్లించబోతుంటే వారించి అతడే చెల్లించాడు. హోటల్‌ నుంచి ఇద్దరూ బయటికొచ్చారు. వచ్చాక ‘బై’ చెప్పి వెళ్ళిపోవాలా- అని ఇద్దరూ లోలోపల తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. వాళ్ళకి ఏభై గజాల దూరంలో బస్సులు ఆగి ఉన్నాయి. అటుకేసి చూశాడు సాకేత్‌. ఆమె మాత్రం అతడినే చూస్తోంది. ఇద్దరిలో ఏం చెయ్యాలో తోచని సందిగ్ధం - ఏం మాట్లాడాలో కూడా తెలీని పరిస్థితి!
‘‘మీరు సిటీకి ఎప్పుడొచ్చారు?’’ ఆ పరిస్థితిని భరించలేక, మౌనాన్ని తట్టుకోలేక అన్నట్లు అడిగిందామె.
‘‘మొన్న నైట్‌ వచ్చాను- నిన్న మార్నింగ్‌ రిలెటివ్స్‌ ఇంట్లో పెళ్ళికి. నిన్నంతా ఆ హడావిడి సరిపోయింది’’ చెప్పాడు ఆమె వైపు తిరిగి.
‘ఇక్కడున్న బంధువులెవరు?!’ ఓ ప్రశ్నా, క్షణంసేపు ఆలోచనా ఆమెను కదిలించాయి. ‘బస్సు ఎక్కి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవడమేనా?!’ అనుకున్నారిద్దరూ.
హైదరాబాద్‌ వెళ్ళడానికి అతడి ట్రైన్‌ రాత్రి తొమ్మిదిన్నరకి. అప్పుడు సమయం ఉదయం పదిగంటలు కావస్తోంది.
‘ఇంకాసేపటిలో ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతాం’- ఆ ఆలోచన రాగానే ఇద్దరి మనసులూ భారమయ్యాయి. ‘‘కైలాసగిరి ఇక్కడికెంత దూరం?’’ చటుక్కున అడిగాడు సాకేత్‌.
చెప్పిందామె. వాళ్ళకెదురుగా ఉన్న బస్సు కైలాసగిరికి వెళ్లేదే. ‘బై’ అనాలో, వెళుతున్నా అనాలో తెలీక, ఆమెవైపు ఒకసారి చూసి బస్సు ఎక్కాడు సాకేత్‌.
ఆమె తలవంచుకుంది. కొద్దిక్షణాలు నిర్వికారంగా నిల్చుండిపోయింది. బస్సులో కిటికీ పక్కసీట్లో కూర్చున్న సాకేత్‌ ఆమెనే చూస్తున్నాడు. డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాక హారన్‌ కొట్టాడు- బస్సు బయలుదేరుతున్నట్లు సంకేతంగా. ఆమె చటుక్కున బస్సు ఎక్కింది. సాకేత్‌ ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే సంబరపడిపోయాడు. తన పక్కన కూర్చున్న అతడిని లేపి, మరోచోటుకి వెళ్ళమందామా అనుకుంటుంటే, ఆమె అటువైపు ఆడవాళ్ళ సీట్లో కూర్చుంది. అంతలోనే సర్దుకుని- ‘ఆమె ఉండేది ఈ రూట్లోనేమో?!’ అనుకున్నాడు సాకేత్‌. అలా అనుకున్నాక ఇందాకటి సంబరం కాస్తా నీరుకారిపోయినట్లనిపించింది. మరో అయిదు నిమిషాలకు బస్సు బయల్దేరింది.
ఇంతలో కండక్టర్‌ టిక్కెట్లు ఇస్తూ వచ్చాడు. టిక్కెట్లు ఆమె తీసుకుంది. ‘తీసుకున్నాను’ అన్నట్లు టిక్కెట్లు సాకేత్‌కి చూపించింది. ‘హోటల్‌ బిల్లు తను ఇచ్చాడు. బస్సు టిక్కెట్లు ఆమె తీసుకుంది. చెల్లుకు చెల్లు అన్నమాట’ అని నవ్వుకున్నాడు. ఆమెకేసి చూశాడు. ఎటో చూస్తోంది. పైగా బస్సు నిండిపోవడంతో సరిగా కనిపించడం లేదు.
బస్సు అక్కడక్కడా ఆగుతోంది... ఎక్కే జనం దిగే జనంతో సందడిగా ఉంది. సాకేత్‌కి అదేమీ పట్టడంలేదు. ఆలోచనలు... మళ్లీ అంతలోనే బుర్ర ఖాళీగా అయిపోతోంది. మధ్యమధ్యలో ఆమెను చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు నాలుగైదుసార్లు ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
ఆమెలోనూ ఆలోచనా ప్రవాహం రేగుతూనే ఉంది. సమాధానం దొరకని ప్రశ్నలూ కొన్నిటికి అస్పష్ట సమాధానాలతో ఆలోచనలూసాగుతున్నాయి. తల తిప్పినప్పుడు ఇద్దరి చూపులూ కలుసుకుంటే ఏదో తెలియని తత్తరపాటుకి గురవుతోందామె.
బస్సు ప్రయాణం ఎంతసేపయిందో కూడా సాకేత్‌కి తెలియలేదు. కండక్టర్‌ ‘కైలాసగిరి స్టాప్‌’ అని అరవడంతో లేచి బస్సు దిగాడు. తన వెనకే ఆమె కూడా బస్సు దిగడంతో ఆశ్చర్యంగా ముఖంపెట్టి అడిగాడు- ‘‘ఇక్కడికి దగ్గర్లోనే ఉంటున్నావా?’’ అని.
ఆ ప్రశ్నకు పెదవులు విడీవిడనట్లు నవ్వి ‘‘కాదు, చాలా దూరంలో. సింహాచలానికి మూడు కిలోమీటర్ల ఇవతల’’ చెప్పిందామె.
‘‘మరి ఇక్కడికి?!’’
‘‘నేను కైలాసగిరి చూసి చాలా రోజులయింది’’ అన్నదామె.
ఇద్దరూ నడుచుకుంటూ కొండమీదికొచ్చారు. పైకి వచ్చాక వెనక్కి తిరిగిచూశాడు సాకేత్‌.
కెరటాల హొయలులో, బంగాళాఖాతం కాస్త వంపు తిరిగి బీచ్‌తో కనిపిస్తోంది. అందమైన దృశ్యం... కాసేపు అలా చూస్తూండిపోయాడు. తర్వాత చాలా గంభీరంగా ఆకర్షణీయంగా ఉన్న పెద్ద శివపార్వతుల విగ్రహాలను చూసి కూడా అలా చూస్తూండిపోయాడు కాసేపు. అతడికేసి తదేకంగా చూసిందామె. ‘మార్పులేదు. ఆ కళాత్మక హృదయం, సున్నితత్వం అలానే ఉన్నాయి’ అనుకుంది. ఆ క్షణం మనసులో సన్నటి ముల్లు గుచ్చుకున్నట్లనిపించిందామెకు. ఓ పావుగంట ఆ కొండ చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి విశాఖనగరం అందంగా హుందాగా కనిపిస్తోంది. తర్వాత ఓ చెట్టు కింద సిమెంటు బెంచీ మీద కూర్చున్నారిద్దరూ. ఆమెను చాలా విషయాలు అడగాలనుందతనికి. అతను ఏదైనా అడిగితే బాగుంటుందనుకుంటోందామె.
‘‘నువ్వు... ఎన్నాళ్లయింది ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయి?’’ అతడు క్షణం ఆగి అడిగాడు.
‘‘అవలేదు, చేయించుకున్నాను. ఎనిమిది నెలలయింది’’ అతడినే చూస్తూ చెప్పిందామె.
‘అంటే, దాదాపుగా పది నెలలుగా ఎడబాటు’ మనసులో లెక్కగట్టుకున్నాడు సాకేత్‌. అతడికి చాలా మాట్లాడాలనుంది. ఎలా మొదలుపెట్టాలో ఏ విషయం అడగాలో నిర్ధారించుకోలేక తర్జనభర్జన పడుతున్నాడు.

‘గుడిలో కనిపించినంత మాత్రాన తనతో హోటల్‌కి రావడం, తను కైలాసగిరి ఎంతదూరం అని అడిగితే తనతో ఇక్కడికి రావడం... తనంటే ఇష్టం లేకపోతే ఎందుకొస్తుంది!? ‘హలో’ అంటే ‘హలో’ అని పలకరించి వెళ్లిపోవచ్చుగా! తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటోందా? అంత మాట్లాడాలనుకుంటే సెల్‌ఫోన్లున్నాయి కదా! ఫోన్లో అయితే మనిషి ఎదురుగా లేకపోతే ఏమైనా, ఎన్నయినా మాట్లాడవచ్చు. మొహమాటాల వంటి బెరుకు ఉండదుగా...’ అతడి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
అతడి అవస్థ ఆమె గ్రహించింది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు... చెప్పలేకపోతున్నాడనుకుంది. అతడి ఆలోచనలకు బ్రేకు వేస్తున్నట్లు అడిగిందామె ‘‘అంతా బాగున్నారా?’’ అని.
‘‘ఆ... బాగున్నారు. అమ్మకీ మధ్య బీపీ కంట్రోల్‌ అవడంలేదు’’ నిర్వికారంగా చెప్పాడు.
అతడి తల్లి అయినదానికీ కానిదానికీ ఊరికే హడావుడి పడిపోతుందని ఆమెకు తెలుసు. దానికితోడు నోటి దురుసు కూడా ఉంది.
అవతలివారు ఏమనుకుంటారోనని చూడకుండా గబుక్కున మాట అనేస్తుంది. ఆ మాటే అందామని నోటిదాకా వచ్చిందామెకు. కానీ అనలేదు. మౌనంగా ఉండిపోయింది.
‘‘ఆమె తత్వం నీకు తెలియంది కాదు. నోటిదురుసు మనిషి’’ స్వగతంలా అన్నాడు సాకేత్‌. ఆ మాటకి చురుక్కున అతడి ముఖంలోకి చూసిందామె. ఆమె చూపులు తనను నిలదీస్తున్నట్లూ ప్రశ్నిస్తున్నట్లూ అనిపించి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. కాసేపు అటూఇటూ చూశాడు. ఆమె అతడినే గమనిస్తోంది. కొద్దిక్షణాలు ఇద్దరిమధ్యా మౌనం.
‘‘నువ్వు అక్కడే ఉంటావనుకున్నాను’’ గొణిగినట్లు అన్నాడు.
‘‘హైదరాబాదులో ఉండి ఏం చెయ్యాలి... నా గురించి పట్టించుకునేవారు లేనప్పుడు? అక్కడున్న రెండునెలల్లో ఒక్కసారైనా... నన్ను చూడ్డానికి మీరొచ్చారా? వస్తారని ఎదురుచూశాను. మీరు వచ్చి ఉంటే జీవితం మరోలా ఉండేదేమో’’ అన్నదామె స్థిరంగా.
సాకేత్‌ ఏమీ మాట్లాడలేదు. ఆమె అన్న మాటల్లో నిజం ఉంది. కానీ ఆనాడు తనని అహం ఆవహించింది. వెర్రి అహం...
వైరుధ్యాలకీ వైషమ్యాలకీ తప్ప ఎందుకూ పనికిరాని అహం!
‘‘నేను ఆవేశపడ్డాను... కాదనను. కానీ, రాముడు మంచి బాలుడు అనుకున్న మీరేం చేశారు?’’ అడిగిందామె. ఆ ప్రశ్నకి అతడి దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయాడు.
‘‘సమస్యని భూతద్దంలోంచి చూస్తున్నానని అన్నారు మీరు. కానీ సమస్యని సమస్యగా ఏనాడైనా చూశారా? అనలైజ్‌ చేసుకున్నారా?’’ ఆమె సౌమ్యంగానే అడిగినా అతనికి నిలదీస్తున్నట్లే అనిపించింది.
బెంచీమీద వెనక్కి వాలి కూర్చున్నాడు.
కళ్లు మూసుకోవాలనుకున్నాడు. మూసుకోలేకపోయాడు. ‘ఆమె అడిగినటు-్ల అనలైజ్‌ చేసుకోలేకపోయాడా తను? నాణానికి రెండోవైపు చూడలేకపోయాడా, ఎందుకు జరిగిందలా? చికాకుపడటం ఒక్కోసారి వివేకాన్ని చంపేస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణా?’ బుర్రలో
ప్రశ్నలే తప్ప ఆమె అడిగిన దానికి సమాధానం దొరకడం లేదు.
‘‘మీ అమ్మ రాచిరంపాన పెట్టే అత్తగారు కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. కానీ, చిన్న విషయానికి పెద్ద రభస చేసి రాద్ధాంతం సృష్టిస్తుంది. సిటీ వాతావరణంలో ఎలా ఉండాలో ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అర్థంకాదు. ఆ ధోరణితో ఎన్ని సమస్యలు వస్తున్నాయో... మూడు నెలల్లో ఇద్దరు పనిమనుషుల్ని మార్చాల్సి వచ్చిందంటే ఆమె ఎంతగా చికాకు పెడుతుందో... మీకు అర్థంకాదు. ఇంట్లో అందరూ మౌనంగా కూర్చుంటే ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్లు మీరు అనుకుంటారు. కానీ, అది ప్రశాంతత కాదు. ఓ రకమైన నరకం. సరదాగా కబుర్లు చెప్పుకోవడంలోనే ప్రశాంతత ఉంది.’’
ఆమె మాట్లాడటం ఆపింది. అతడు అలానే బెంచీ వెనక్కి వాలి కూర్చున్నాడు- ఆమె చెబుతున్నది వింటూ ఎటో చూస్తూ. ‘తాను మాట్లాడుతున్నది వింటున్నాడా’ అన్నట్లు అతడికేసి చూసిందామె. వింటున్నాడని అతడి ముఖంలో మారుతున్న హావభావాలే ఆమెకు తెలిపాయి.
‘‘ఒక్కమాట అడుగుతాను నిజం చెప్పండి... ఇంట్లో ఎవరికి వారు బిగుసుకుపోయి కూర్చోవడమే కానీ సరదాగా అందరూ కలసి కబుర్లు చెప్పుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఏం అడిగినా మీ అమ్మ వెటకారంగా మాట్లాడ్డమేగానీ ఏనాడైనా చక్కగా సమాధానం చెప్పిందా? పాతికేళ్లు ఒక ఇంట్లో పెరిగిన మనిషి పెళ్ళయ్యాక వేరే ఇంటికి వచ్చి, ఆ ఇంటి అలవాట్లూ పద్ధతులూ తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆవిడకి తెలియదా? ఆవిడా అలా కోడలిగా వచ్చినదేగదా? పైగా అప్పటి తరానికీ ఇప్పటి తరానికీ చాలా తేడా కూడా ఉంది కదా. ఆ చిన్న విషయాన్ని కూడా ఆవిడ అర్థంచేసుకోలేదా? పొద్దున తొమ్మిదింటికి వెళ్లినదాన్ని రాత్రి ఏడింటికి వచ్చి, అప్పటికీ పోనీలే పెద్దావిడ ఏదో చెప్పిందనీ నా అలసటని పక్కకునెట్టి ఆవిడ చెప్పినట్లు వంటా వార్పూ చేస్తున్నా... ఇంకా ఆవిడకి ఏదో వెలితి! మడీ తడీ అంటూ ఆవిడ ఎంత టార్చర్‌ పెట్టినా మీకోసం అనుకుని భరించాను. నిజానికి ఆ మడీ తడీ మా ఇంట్లో లేవు- రోజూ కాసేపు పూజ చేసుకోవడం తప్ప! రానురానూ ప్రతి చిన్న విషయాన్నీ వేలెత్తి చూపించాలనుకునే ఆమె తత్త్వం నాకు భరించరానిదిగా అనిపించేది సాకేత్‌. నిజానికి ఇంట్లో జరిగే విషయాల్లో కొన్నే మీకు తెలుసు... తెలియనివి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏకరవు పెట్టనులే’’ ఆమె మాట్లాడటం ఆపి అతడి ముఖంలోకి చూసింది. సాకేత్‌ వింటున్నాడని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ నోరు విప్పింది.
‘‘మీరు ఓపెన్‌గా చెప్పండి సాకేత్‌... ఈ బిజీ లైఫ్‌లో హ్యాపీగా బతకాలంటే అనివార్యంగా కొన్ని పద్ధతులు మార్చుకోవాలా అక్కర్లేదా? జీవితాన్ని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలా వద్దా? ఈ విషయాలు మీకు తెలీవని కాదు. చాలా సందర్బాల్లో మీకు చెప్పాను కూడా. కానీ మీరు వినలేదు. అమ్మ మాటని కాదనలేని, ఆమె చెప్పిందే వేదం అని నమ్మే చాలామంది కొడుకుల్లో మీరూ ఒకరు కావడం వల్లనో లేదా ఈగో డామినేట్‌ చేయడం వల్లనో చాలా విషయాలు మీరు పట్టించుకోలేదు. ఫలితం మీకు నేనూ... నాకు మీరూ దూరమయ్యాం’’ అని అతడి ముఖంకేసి చూసిందామె.
అవునన్నట్లు అతడు తల పంకించాడు.
కొద్దిసేపు అతడినే చూస్తూ ఉండిపోయిందామె మౌనంగా. అతడేమైనా మాట్లాడతాడేమోనని అనుకుంది. ఏం మాట్లాడాలో తెలీని డోలాయమాన పరిస్థితిలో ఉన్నాడతడు.
‘‘మీ నాన్నగారుంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో! భర్తలేని ఒంటరితనం కొంతమంది మహిళల్లో ఒకరకమైన పర్వర్షన్‌ తెస్తుందని ఎవరో చెప్పగా విన్నాను. అలా అనుకునే మీ అమ్మకు సంబంధించి చాలా విషయాల్లో సరిపెట్టుకోవడానికి ప్రయత్నించాను. నా బ్యాడ్‌లక్‌... అది సరిపోలేదు’’ దీర్ఘంగా నిట్టూర్చి సిమెంటు బెంచీ వెనక్కి వాలిపోయి కళ్లు మూసుకుంది. అతడు తల తిప్పి ఆమెకేసి చూశాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అతడికి తోచలేదు. కానీ అతడి గుండెలోతుల్లో అలజడి. ఆమె చెప్పిన విషయాలేమీ కాదనలేడు. తన తల్లి చాలా సందర్భాల్లో మూర్ఖంగానే ప్రవర్తించింది. కానీ తాను ఆవిడని ఏమీ అనలేకపోయాడు. అంటే ఆవిడ ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమోనన్న భయం... బంధువులేమంటారోనన్న బెరుకు!
ఆ మాటే అన్నాడు ఆమెతో.
‘‘నువ్వు చెప్పినవన్నీ నిజమే గాయత్రీ! కాదనను... కానీ ఆవిడను అదుపు చేయడానికి నేనేమన్నా ప్రయత్నిస్తే... పరిస్థితి మరింత ఛండాలంగా తయారవుతుందనీ...’’
‘‘తనను మీరు ఏమీ అనలేరన్న ధీమా కూడా మీ అమ్మలో బాగా ఉంది సాకేత్‌’’ అని అతడి ముఖంలోకి చూసిందామె.
అవునన్నట్లు తలూపాడు సాకేత్‌.
‘‘మీ మేనత్తగారు ఓసారి చెప్పారు... మీ అమ్మ ఇలాగే మీ నాన్నగారిని కూడా వేదించుకు తినేదట కదా!’’ అడిగింది గాయత్రి. అతడు సమాధానం చెప్పలేదు. చెప్పలేకపోయాడు.
‘‘కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు సుఖపడరు, ఎదుటివారిని సుఖపడనివ్వరు’’ ఆమె అన్నమాటకి అతడు ఏ విధంగానూ ప్రతిస్పందించలేదు. మౌనంగా ఉండిపోయాడు అర్ధాంగీకారం అన్నట్లు.

‘‘నేను ఆ రోజుల్లో మడులూ తడులూ ఆచారాలూ అంటూ కష్టపడ్డాను కాబట్టి... వీళ్లూ కష్టపడాలి అనే ఒక రకమైన శాడిస్టిక్‌ నేచర్‌ అది. ఆ రకమైన మానియా గురించి కూడా నేను పట్టించుకోలేదు సాకేత్‌, సరిపెట్టుకున్నాను. కానీ గుండెకు బలమైన గాయం చేసే మాటలన్నప్పుడు మాత్రం నేనింక భరించలేకపోయాను. మీ అమ్మ అంత దారుణంగా... అసభ్యంగా... మాట్లాడుతుందని నేనెప్పుడూ అనుకోలేదు’’ ఆ మాటకి చురుక్కున ఆమెకేసి చూశాడు సాకేత్‌.
‘‘యస్‌ సాకేత్‌!’’
‘‘ఏంటా మాటలు?’’ తటపటాయిస్తూనే అడిగాడు, ఎందుకంటే తల్లి విషయం తనకి బాగా తెలుసుగనక. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కణతలు నొక్కుకుని కళ్లు మూసుకుంది.
‘‘పెళ్ళయి ఏడాదిన్నరయింది. ఓ పిల్లా పీచూ లేదు. అసలు వాడితో కాపురం చేస్తున్నావా? అందం తరిగిపోతుందని దూరం పెడుతున్నావా? అన్నదో రోజు. ఏం చెప్పను నేను? అసలు ఏం చెప్పాలి నేను!’’ నిర్వికారంగా అన్నదామె.
‘‘మొగుడి పక్కలో పడుకుంటున్నావ్‌...
నల్లపూసల దండ వేసుకోవాలని తెలీదా? అని అడిగిందో రోజు. నేను షాకయ్యాను.
ఈ రోజుల్లో జాబ్‌ చేసే వాళ్ళల్లో చాలామంది మెడలో ఎక్కువ నగా నట్రా వేసుకోవడంలేదు. సింపుల్‌గా సూత్రం గొలుసు తప్ప. ఒకదానికొకటి సంబంధం లేకుండా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు. ఆమె రెట్టించింది. దాంతో ఆరోజు మాటామాటా పెరిగింది.
సందర్భంలేని ఎక్కడెక్కడి విషయాలో తవ్వి తీసింది. మన పెళ్ళిలో తనకి మారు వడ్డించలేదనీ... ఏవేవో చెప్పి నానా యాగీ చేసింది. ‘నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టంలేదు... వెళ్లిపోతాను’ అంటూ మీ అమ్మ రాద్ధాంతం చేసి పెట్టె పట్టుకుని బయల్దేరుతుంటే... ఇక ఆవేశం పట్టలేక నేనే వెళ్లిపోతానన్నాను. సూట్‌కేస్‌ తీసుకుని నేనే వెళ్లిపోయాను. ప్రేక్షకుడిలా చూస్తుండిపోయారు మీరు. మా ఫ్రెండు ఇంటికి వెళ్లాను. మర్నాడు... ఆ మర్నాడు... మరో రెండు రోజులకైనా మీరు వస్తారని చూశాను. మీరు రాలేదు. వారం పోయాక మీరు ఆఫీసుకి ఫోన్‌ చేశారు. నాకు మాట్లాడాలనిపించలేదు. రోజులు గడిచాయి... దూరం పెరిగింది’’ కళ్లు తుడుచుకుంది గాయత్రి.
‘‘సారీ గాయత్రీ, అప్పుడు నేను చాలా తప్పు చేశాను. నువ్వు వెళ్లకుండా అడ్డుకోవలసింది. రెండురోజులాగితే ఆవేశం తగ్గి, నువ్వే వస్తావనుకున్నానేగానీ ఇంతగా దూరం పెరిగిపోతుందని ఊహించలేదు. మూడో రోజుకే అమ్మకి ఆవేశం తగ్గింది. అయిదారు రోజులుపోయాక అంది- ‘అది ఎక్కడుందో వెళ్లి తీసుకు రారా’ అని. అప్పుడే మీ ఆఫీసుకి ఫోన్‌ చేశాను. నువ్వు మాట్లాడలేదు. నీకు ఇంకా కోపం తగ్గలేదనుకున్నాను. కానీ ఇందాకా నువ్వు అన్నావే... ఈగో... అదే నన్ను మూర్ఖుడిని చేసింది. నువ్వు అన్నట్లు నేనెప్పుడూ ఏం జరుగుతుందో అనలైజ్‌ చేసుకోలేకపోయాను. ఈగో... ద బ్యాడ్‌ ఈగో’’ గుండెల్లోంచి తన్నుకొచ్చిన బాధతో అన్నాడు సాకేత్‌. ఆమె తలూపింది.
‘‘నువ్వు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నావని నాకు తెలుసు. మీ ఫ్రెండు భాగ్యంగారు చెప్పారు. నిజానికి ఇక్కడ నాకు ఏ ఫంక్షనూ లేదు. నీ కోసమే వచ్చాను నిన్న రాత్రి. ఈ ఉదయం సింహాచలస్వామి దర్శనం చేసుకుని మీ ఆఫీసుకు వద్దామనుకుంటున్నాను. అదృష్టం... నువ్వే కనిపించావ్‌.’’
‘‘ఇన్నాళ్ళకు అనిపించిందా నన్ను చూడాలని’’ అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది గాయత్రి.
‘‘అలా అనుకోవద్దు గాయత్రీ! కొన్నాళ్లు అమ్మ బింకంగానే ఉంది. తర్వాత్తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. మనిషి ఒక రకంగా కుంగిపోయింది. ‘మీ కాపురంలో చిచ్చు పెట్టాన్రా... మీ ఇద్దర్నీ విడదీశాను... ఎక్కడుందో దాన్ని తీసుకురారా. ఇక దాన్నేమనను’ అంటూ ఈమధ్య ఒకటే పోరు పెడుతోంది. ఏడుస్తోంది. ఆమె నుంచి నేను ఆశిస్తున్నది కూడా అదే గాయత్రీ. మనిషిలో పశ్చాత్తాపం రావాలి’’ అని ఆమెకేసి చూశాడు సాకేత్‌. గాయత్రి తల పంకించింది. అప్రయత్నంగానే ఆమె పెదవులమీద చిన్న దరహాసరేఖ మెదిలింది.
‘‘వచ్చెయ్‌ గాయత్రీ... ఇక నీకు ఏ కష్టం రానివ్వను, ప్రామిస్‌’’ అన్నాడు ఆమె చేతులు అందుకుని లాలనగా సాకేత్‌. ఆమె కళ్లనుండి నీళ్లు జలజలా రాలాయి. ఆర్తిగా అతడిని అల్లుకుపోయింది.

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.