close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వచ్చేస్తోంది... ‘స్మార్ట్‌’ వైద్యం!

కుర్చీలోనుంచి కదలకుండా షాపింగ్‌ చేస్తాం. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండా బిల్లులు కట్టేస్తాం. వంటగదిలో పనిచేసుకుంటూనే అమెరికాలో ఉన్న అమ్మాయిని చూస్తూ కబుర్లు చెబుతాం. ఇన్ని చేయగలిగిన మనం కాస్త గుండెదడగా అన్పిస్తే మాత్రం డాక్టరనీ పరీక్షలనీ కంగారుగా ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీస్తాం. ఇకపై ఆ పరుగులూ అక్కర్లేదట. ఇంట్లోనే మన ఆరోగ్యాన్ని మనమే పరీక్షించుకుని, ఆ రిపోర్టుల్ని నేరుగా ఆన్‌లైన్లో డాక్టరుకి పంపి, ఆయన సూచించిన మందులు వేసుకుని హాయిగా మన పనులు మనం చేసుకునేలా ‘స్మార్ట్‌ వైద్యం’ అందుబాటులోకి వస్తుందంటున్నారు పరిశోధకులు.

ఆదివారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు రాంబాబు. భార్య ఊరెళ్లింది. అందుకని భోజనానికి హోటల్‌ దాకా నడిచి వెళ్లడానికి బద్ధకించాడు. ఫోన్‌ తీసుకుని హోం డెలివరీకి ఆర్డర్‌ పెట్టాడు. అటు పక్కనుంచి ఆధార్‌ నంబర్‌ అడిగారు. ఆహారానికీ ఆధార్‌కీ లింక్‌ చేయమని ఎప్పుడు చెప్పారబ్బా... అనుకుంటూనే నంబర్‌ ఇచ్చాడు. కాసేపటికి సమాధానం వచ్చింది- ‘సారీ రాంబాబు గారూ...
ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డుల ప్రకారం మీకు షుగర్‌, బీపీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్డరిచ్చిన పదార్థాలన్నీ ఇవ్వడం కుదరదు. ఇవాళ లేచాక మీరు పట్టుమని పది కెలొరీలు కూడా ఖర్చు చేయలేదు కనుక ఈపూట మీకు రెండు పుల్కాలూ కూరా, ఒక కప్పు పెరుగు మాత్రమే ఇవ్వగలం...’ ఆ సమాధానం చూసి బిత్తరపోయాడు రాంబాబు.
ఆధార్‌తో మన ఆరోగ్యానికి సంబంధించిన రికార్డుల్ని అనుసంధానిస్తే ఎలా ఉంటుందో సరదాగా చెప్పే ఈ వాట్సాప్‌ జోక్‌ నిజం కాకపోయినా అబద్ధం మాత్రం కాదు. రాంబాబు లాగే మనలో చాలామంది ఇలాంటి సమాధానాలతో బిత్తరపోయే రోజు ఎంతో దూరం లేదట. వైద్య, ఆరోగ్యరంగం రాబోయే రోజుల్లో పెనుమార్పులను చూడబోతోందనీ కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లాంటివి ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్లనున్నాయనీ చెబుతున్నారు నిపుణులు.
ఒంట్లో నలతగా ఉన్నా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా... కొన్నాళ్లు ఇంటి వైద్యం చేసుకోవటం మనకి అలవాటే. లేదంటే మెడికల్‌ షాపుకి వెళ్లి ఓ మాత్ర తీసుకుని వేసుకుంటాం. వారం రోజులైనా గుణం కన్పించకపోతే అప్పుడు పరిగెడతాం ఏదో ఒక ఆస్పత్రికి. ‘పేరుకి హెల్త్‌కేర్‌ కానీ నిజానికి మనది సిక్‌ కేర్‌ సిస్టమ్‌’ అంటున్నారు నిపుణులు. నిజమేగా మరి. అనారోగ్యం వస్తేనే- అదీ భరించడం ఇక మన వల్ల కాదనుకున్నప్పుడే వైద్యం కోసం చూస్తాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం మొదలై దేశదేశాలా వేళ్లూనుకున్న ఆస్పత్రి వ్యవస్థని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నాం. వైద్య పరీక్షల్లో, చికిత్సల్లో, మందుల తయారీలో ఎంతో అభివృద్ధి చోటుచేసుకుంది కానీ ఆ అభివృద్ధిని మనిషి దగ్గరకు చేర్చే విధానంలో మాత్రం ఏ మార్పూ రాలేదు. ఆరోజుల్లో  ఏ జబ్బు అంటువ్యాధో ఏది కాదో తెలియదు కాబట్టి జబ్బుపడిన వ్యక్తిని ఇంటికి దూరంగా ఆస్పత్రిలో ఉంచేవారు. అయితే ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ఇంకా ఈ విధానాన్నే అనుసరించడం సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మానవాళిని ఇప్పుడు పట్టిపీడిస్తోంది- జీవనశైలి సంబంధిత జబ్బులే. వైద్యం కోసం మనం పెడుతున్న ఖర్చులో 80శాతం వీటి చికిత్సకే పోతోంది. మనకు ఏమాత్రం తెలియకుండా మొదలై హఠాత్తుగా బయటపడి, ఇక ఆ తర్వాత జీవితకాలం వదలకుండా వేధించే వీటికి అంత డబ్బు పెడుతూ దినదినగండంగా బతికే బదులు ‘హెల్త్‌కేర్‌’పైన దృష్టిపెట్టి ముందు జాగ్రత్తపడమని చెబుతున్నారు పరిశోధకులు.

ఆస్పత్రి కాదు, కేర్‌ హబ్‌!
కుటుంబసభ్యుల్లో ఒకరికి ఒంట్లో బాగోలేదు. ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారు రకరకాల టెస్టులు చేశారు. ఆ పరీక్షల రిపోర్టులన్నీ వచ్చేదాకా రోగిని ఐసీయూలో ఉంచారు. రిపోర్టులు వచ్చాక వ్యాధిని నిర్ధారించి చికిత్స మొదలెట్టారు. నిజానికి అప్పటికి శరీరంలో జబ్బు మొదలై ఎన్నాళ్లయ్యుంటుందో చెప్పలేం. ఇక ఆ చికిత్స ఎలా సాగుతుందంటే... పేషెంట్‌ అందులో నిమిత్తమాత్రుడు మాత్రమే. ఒక బొమ్మలా ఆస్పత్రి గది నాలుగుగోడల మధ్యా నర్సులిచ్చిన మందులు మింగుతూ ‘చికిత్సకు అతని శరీరం ఎలా స్పందిస్తోందీ...’ అంటూ డాక్టర్లూ నర్సులూ మాట్లాడుకునే మాటలు వింటూ ఒకలాంటి నిర్లిప్తతలోకి జారుకుంటాడు. నాకేమైంది, కోలుకుంటానా, తిరిగి సాధారణజీవితం గడపగలనా- అన్న ఆలోచనలో పడతాడు. దానికి తోడు చికిత్సకు అయ్యే ఖర్చూ కుటుంబసభ్యుల ఆందోళనా అన్నీ కలిసి మానసికంగానూ కుంగదీస్తాయి. అంటే జబ్బు నయమవుతుందేమో కానీ పేషెంటు డీలాపడిపోతాడు. ఈ పరిస్థితి మారబోతోందనీ ఆస్పత్రుల స్థానంలో ‘కేర్‌ హబ్‌’లు వస్తాయనీ అంటున్నారు పరిశోధకులు.
ఈ కేర్‌హబ్‌లలో సమస్యని జబ్బు కోణంనుంచీ కాక పేషెంట్‌ కోణం నుంచీ చూస్తారు. అసలు జబ్బే రాకుండా ఎవరికి వారు జాగ్రత్త వహించేలా చూస్తారు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిలో ఏ తేడా ఉన్నా దానికి కారణాలేంటో, ఏం చేస్తే మెరుగవుతుందో అతనికే చెబుతారు. అతడు క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆ సూచనల్ని అనుసరించాలి. అంటే ఏదైనా సమస్యగా మారే ప్రమాదం ఉందనుకున్నపుడు ముందుగానే జాగ్రత్తపడి దాన్ని నివారిస్తారన్నమాట. ఒక్కో కేర్‌ హబ్‌ సిబ్బందీ తమ పరిధిలో ఉండే ప్రజల ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పర్యవేక్షిస్తూ ఉంటారు. పొగ, మద్యం, మాదకద్రవ్యాలు లాంటి వాటికి ఎవరైనా బానిసలైతే స్మార్ట్‌ టెక్నాలజీ సహాయంతో వారిచేత ఆ అలవాట్లను మాన్పిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు రోజూ సరిచూసుకోవాల్సిన బీపీ, షుగర్‌, కెలొరీలూ, వ్యాయామం- లాంటివన్నీ వాళ్లు అక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ కేర్‌హబ్‌లో నమోదవుతాయి. అదెలా అంటే- డిజిటల్‌ హెల్త్‌ టెక్నాలజీతో ఇవన్నీ సాధ్యమేనట.

‘డిజిటల్‌ హెల్త్‌’ అంటే...
ఆస్పత్రి వరకూ వెళ్లనక్కరలేకుండా బీపీ ఎలా ఉందో, బ్లడ్‌ షుగర్‌ ఎంతుందో మనమే తెలుసుకోవచ్చు. దానికి పెద్ద పరీక్షలూ అక్కర్లేదు. చేతికో, వేలికో పెట్టుకునే ఓ చిన్న పరికరం చాలు. ఎవరి ఆరోగ్యాన్ని వారే పర్యవేక్షించుకుంటూ ఉండేందుకు తోడ్పడే ఇలాంటి పరికరాలెన్నో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ‘వేరబుల్‌’(ఒంటిమీద ధరించే), ‘పోర్టబుల్‌’ (వెంట తీసుకెళ్లడానికి వీలయ్యే) టెక్నాలజీ అందుకు తోడ్పడుతోంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగానే అక్కడ నమోదు చేసే మన ‘వైటల్‌ సైన్స్‌’ అంటే బరువూ, బీపీ, టెంపరేచరూ, పల్స్‌రేటూ లాంటివన్నిటినీ ఇంట్లోనే ఈ పరికరాలతో మనమే చూసుకోవచ్చు. వాటిల్లో నమోదైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌ ఆప్స్‌ రకరకాల కోణాల్లో విశ్లేషిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ సెన్సార్స్‌, క్లౌడ్‌ స్టోరేజ్‌, డేటా ఎనలిటిక్స్‌ లాంటివి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేక ఏమైనా తేడా వుందా అన్నది స్వయంగా ఆ వ్యక్తికీ తెలిసిపోతుంది, అతడి ఆప్‌ని అనుసంధానించిన దగ్గర్లోని కేర్‌ హబ్‌ సిబ్బందికీ తెలుస్తుంది. దాంతో ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే తక్షణం స్పందించి చికిత్స ఇవ్వచ్చు. తేడా తొలిదశలోనే తెలిసిపోతుంది కాబట్టి సమస్యగా మారకముందే నివారించడం తేలికవుతుంది. అలా ఈ కేర్‌హబ్‌లు 24 గంటలూ ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటాయన్నమాట.

స్పెషలిస్టులూ ఉంటారు...
సినిమా టికెట్టో బస్‌ టికెట్టో తీసుకునేటప్పుడు ఏయే సీట్లు ఖాళీగా ఉన్నాయో కంప్యూటర్‌ తెర మీద చూసి మనకు నచ్చిన సీటు బుక్‌ చేసుకుంటాం. అదే పద్ధతిని వైద్యానికీ వాడొచ్చు. కేర్‌ హబ్‌లలో అన్ని రకాల స్పెషలిస్టులూ ఉండకపోయినా స్పెషలిస్టు వైద్యం పొందవచ్చు. ఉదాహరణకు ఎవరికైనా గుండె కొట్టుకునే విధానంలో తేడా కన్పిస్తే సాధారణ వైద్యుడే(ఫిజీషియన్‌) తన దగ్గర ఉన్న టాబ్లెట్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌తో ఆ రోగి గుండె కొట్టుకుంటున్న విధానాన్ని వీడియో తీసి కార్డియాలజిస్టుకి పంపిస్తాడు. దాన్ని ఆయన అప్పటికప్పుడు చూస్తాడు. అప్పటికే కేర్‌హబ్‌ ద్వారా ఆన్‌లైన్లో ఆ రోగికి సంబంధించిన ఇతర వివరాలన్నీ అందుతాయి కాబట్టి అన్నిటినీ సమీక్షించుకుని వెంటనే చేయాల్సిన చికిత్సని ఆయన ఫిజీషియన్‌కి సూచిస్తాడు. నిమిషాల్లో పని అయిపోతుంది. స్మార్ట్‌ పరికరాలూ కేర్‌హబ్‌ల ద్వారా అనుసంధానం కావడం వల్ల స్పెషలిస్టు వైద్యులు ఒక్కరే కాకుండా వేర్వేరు విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆ సమాచారాన్ని చూసి చర్చించి విశ్లేషించేందుకూ అవకాశం ఉంటుంది. దాంతో సమస్యని ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చు. ఈ డిజిటల్‌ హెల్త్‌ విధానంతో మారుమూల గ్రామీణ ప్రాంతాలకూ స్పెషలిస్టు వైద్యాన్ని అందించవచ్చు.

టెస్టులూ మారిపోతాయి!
వైద్యరంగంలో నిరంతరం సాగుతున్న పరిశోధన ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే రోగుల్ని పరీక్షించే, చికిత్స చేసే విధానాలూ మారాలి. అదీ జరగబోతోంది. ఇప్పటివరకూ రక్త, మూత్ర పరీక్షలను జ్వరాల నిర్ధారణలాంటి కొన్నిటికే వాడుతున్నారు. ఇకముందు గుండెజబ్బులు వచ్చే ప్రమాదముందా అన్నది తెలుసుకోడానికీ ఈ పరీక్షలే ఉపయోగపడవచ్చు. ఇక, కొన్ని రకాల క్యాన్సర్లు అయితే సమయం మించి పోయేదాకా బయటపడవు. వాటి లక్షణాలు ఏమాత్రం కనిపించకుండా ఉండి చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.
ఒక్క రక్తపరీక్షతో అలాంటి క్యాన్సర్లను కనిపెట్టగలిగితే క్యాన్సర్‌ మహమ్మారి తోకముడిచి పారిపోదూ! అందుకే రక్తంలో క్యాన్సర్‌ చిహ్నాలు పసిగట్టగలిగే వీలుందేమోనన్న దిశగా చాలా లోతుగా పరిశోధనలు సాగుతున్నాయి.
అలాగే ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ - అంటే ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ లాంటివి కూడా మారిపోతున్నాయి. గుండెకు సంబంధించిన రక్తనాళం పూడుకుపోయిన సంగతి మాత్రమే ఇప్పుడున్న విధానంలో మనం చూడగలుగుతున్నాం. కొత్తగా అభివృద్ధి చేస్తున్న విధానంలో పూడిక స్వభావమూ, తొలగించడానికి ఏం చేయాలీ- అన్నది కూడా తెలిసిపోతుంది. మన ఊహకందని రీతిలో శరీరం లోపలికి తొంగిచూసి పలు భాగాల పనితీరును అప్పటికప్పుడు మరింత స్పష్టంగా చూపే ఇమేజింగ్‌ విధానాలు వస్తున్నాయి.

నానో... మందులు!
జలుబు, జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ సమస్యలకే కాదు, బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దాదాపుగా అందరికీ ఒకేలాంటి మందులు ఉంటాయి. తయారుచేసే కంపెనీని బట్టి పేరూ, సమస్య తీవ్రతను బట్టి మోతాదూ మారవచ్చు. కానీ మందులో ఉండే పదార్థాల్లో మార్పుండదు. ఇక ముందు అలా కాదు. నానో సైన్స్‌... వైద్య చికిత్సావిధానంలో కొత్త ద్వారాలు తెరుస్తోంది. పర్సనలైజ్డ్‌ మందులు త్వరలోనే రానున్నాయి. డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది కాబట్టి పలుకోణాల్లో దాన్ని విశ్లేషించి ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా చికిత్సావిధానాన్ని రూపొందిస్తారు. ఈ మధ్య కాలంలో కాలుష్యం తదితర కారణాల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆస్తమానే పెద్ద సమస్య అనుకుంటే ఇప్పుడు ఊబకాయం సర్వసాధారణమైపోయి దాని ప్రభావమూ ఊపిరితిత్తుల మీద పడుతోంది. ఇక, ఊపిరితిత్తులతో పాటు ఇతర క్యాన్సర్లు తరచుగా విన్పించే మాటలవుతున్నాయి. వాటి చికిత్సలో రేడియో, కీమోథెరపీల స్థానంలో నానో థెరపీలకు రంగం సిద్ధమవుతోంది. వీటి వల్ల నేరుగా క్యాన్సర్‌ కణాలనే లక్ష్యంగా చేసుకుని చికిత్స జరుగుతుంది. పక్కనున్న ఒక్క కణం కూడా దెబ్బతినదు కాబట్టి సైడ్‌ ఎఫెక్టుల బాధే ఉండదు. ట్యూమర్లను కూడా మరింత నైపుణ్యంతో తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కొన్ని యాంటి బయోటిక్స్‌కి సూక్ష్మజీవులు అలవాటుపడిపోవడంతో అవి ఏమాత్రం పనిచేయని పరిస్థితి వస్తోంది. నానో యాంటి బయోటిక్స్‌తో ఆ సమస్యని పరిష్కరించబోతున్నారు. మొత్తమ్మీద ఈ నానోటెక్నాలజీ వైద్య రంగంలో మరో విప్లవం తేనుంది.

చక్కెర వ్యాధికి చెక్‌
మధుమేహం ఈరోజుల్లో పెను సమస్యగా మారుతున్నందున దీనికి సంబంధించి కూడా పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహంతో బాధపడుతున్నవారి కోసం కృత్రిమ క్లోమగ్రంథి తయారీలో ఉంది. దీన్ని శరీరానికి బయట అమర్చుకుంటే రోగికి ఇన్సులిన్‌ అవసరమైనప్పుడు ఆటోమేటిగ్గా ఒక పంపు ద్వారా దాన్ని శరీరంలోకి విడుదల చేస్తుంది. ప్రస్తుతం అరుదుగా దొరికే అవయవదానం తప్ప పాంక్రియాస్‌కి మరో ప్రత్యామ్నాయం లేదు. కృత్రిమ క్లోమగ్రంథితో ఆ కొరత తీరుతుంది. జీవనశైలి సంబంధిత టైప్‌-2 మధుమేహ బాధితుల కోసం తక్కువ కెలొరీలతో బరువును నియంత్రించే డైట్‌ ప్లాన్‌ ఒకటి సిద్ధమవుతోంది.
వైద్య సాంకేతిక రంగాల్లోని ఇటువంటి ఎన్నెన్నో పరిశోధనలు ఆరోగ్య రంగంలో అనూహ్య ప్రగతికి బాటవేస్తున్నాయి.
ఈ అభివృద్ధిని ఆరోగ్య రంగం అవకాశంగా మార్చుకుంటే... లోతుగా జరుగుతున్న పరిశోధనలకు వేగంగా విస్తరిస్తున్న కమ్యూనికేషన్ల వ్యవస్థ తోడయితే... ఆస్పత్రుల నుంచి కేర్‌ హబ్‌ల దిశగా అడుగులు వేస్తున్న ‘స్మార్ట్‌ వైద్యం’ అందరికీ అందుబాటులోకి వస్తే... అంతకన్నా కావలసిందేముంది!

మనదేశంలో ఆరోగ్య సంఖ్య!

ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకోడానికి వీలుగా ప్రజల వైద్య ఆరోగ్య వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు మన దేశంలో కూడా ఒక విస్తృతమైన ప్రణాళికను రూపొందించబోతున్నారు. డిజిటల్‌ హెల్త్‌ బ్లూ ప్రింట్‌గా పేర్కొనే ఈ పథకం అమల్లోకి వస్తే ఆధార్‌ లాగే ప్రతి వ్యక్తికీ ఓ ఆరోగ్య సంఖ్య వస్తుంది. దాని ఆధారంగా దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆన్‌లైన్లో ఉన్న ఆరోగ్య రికార్డుల్ని ఉపయోగించుకుని చికిత్స పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా లక్షన్నర హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లనూ ఏర్పాటుచేయనున్నారు. వీటిల్లో ఎప్పటికప్పుడు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు జరిపి అవసరమైనవారిని తదుపరి చికిత్సకు పంపుతారు. దీని వల్ల పొంచి ఉన్న దీర్ఘకాల వ్యాధుల్ని ముందుగానే కనిపెట్టవచ్చు.

ఎన్నెన్నో... హెల్త్‌ గ్యాడ్జెట్లు!

రకరకాల మెడికల్‌ గ్యాడ్జెట్స్‌ ఇప్పుడు ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్స్‌ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. ఇవన్నీ ఒంటి మీద ధరించేందుకు వీలుగానూ, బ్యాగులో వెంట పట్టుకెళ్లడానికి వీలయ్యేంత చిన్నగానూ ఉంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉన్న, త్వరలోనే రానున్న కొన్ని పరికరాల వివరాలు...
ఇంట్లోనే ఈసీజీ: కార్డియాబ్యాండ్‌, బీపీఎంకోర్‌ లాంటివి ఉంటే ఇంట్లోనే ఈసీజీ తీసుకోవచ్చు. చేతికి పెట్టుకుని బటన్‌ నొక్కితే చాలు 30 సెకన్లలో ఈసీజీ వస్తుంది. దాన్ని నేరుగా డాక్టర్‌కి పంపించి సలహా తీసుకోవచ్చు.
వేలుపెడితే బీపీ: స్టాప్లర్‌లా ఉండే ‘సెన్సోస్కాన్‌’లో వేలు పెడితే చాలు, బీపీ ఎంత ఉందో చెప్పేస్తుంది.
ఒక్కటే...17 వివరాలు: ఉంగరంలా ఉండే ‘సెన్సోరింగ్‌’ని వేలికి పెట్టుకుంటే ఈసీజీ, బీపీ లాంటి 17 రకాల వివరాల్ని నమోదు చేస్తుంది.
ఏ పదార్థం పడదో: అరచెయ్యి సైజులో ఉండే ‘ఫుడ్‌మార్బుల్‌ ఏర్‌’ అనే పరికరం శ్వాసను పరీక్షించి అజీర్తి సమస్యలకు కారణమయ్యే ఆహారపదార్థాలేమిటో చెబుతుంది.
మూడిటికీ ఒకే పరీక్ష: ‘టెస్ట్‌ కార్డ్‌’లో మూడురకాల కార్డులుంటాయి. వాటితో మూత్రాన్ని పరీక్షించి గర్భనిర్ధారణ చేయొచ్చు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుసుకోవచ్చు, షుగర్‌ స్థాయులు చూసుకోవచ్చు.
కరిగేది కొవ్వా, కార్బోహైడ్రేట్లా: ‘లుమెన్‌’ అనే పరికరంతో శ్వాసను విశ్లేషించి మనం కొవ్వును కరిగిస్తున్నామో, కార్బోహైడ్రేట్లను కరిగిస్తున్నామో తెలుసుకోవచ్చు.
నడిస్తే ఆయాసం రాకుండా: ‘బ్రీతింగ్‌ ట్రెయినర్‌ మాస్క్‌’ని ముక్కుకు పెట్టుకుంటే నడిచేటప్పుడు ఆయాసం రాకుండా ఉంటుంది.
నొప్పి పరార్‌: ‘క్వెల్‌ 2.0’ పట్టీని నొప్పిగా ఉన్న కాలికో చేతికో కట్టుకుంటే చాలు. ఏ మాత్రా వేసుకోకుండానే నొప్పి తగ్గిపోతుంది.
ఒత్తిడి మటుమాయం: ‘బ్రెయిన్‌ సెన్సింగ్‌ హెడ్‌బ్యాండ్‌’ని తలకు పెట్టుకుంటే ఒత్తిళ్లతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.
నీటికీ, నిద్రకీ: హైడ్రేషన్‌ మానిటర్‌ని వాచీలా చేతికి పెట్టుకుంటే నీళ్లు చాలినన్ని తాగుతున్నామో లేదో చెప్పేస్తుంది. అలాగే నాణ్యమైన నిద్ర పోతున్నామో లేదో చెప్పడానికి స్లీప్‌ ట్రాకింగ్‌ పరికరాలూ ఉన్నాయి.
అలర్జీకి మంత్రదండం: దుమ్మూధూళీ అంటే ఎలర్జీ ఉన్నవారు ట్రావెల్‌ వ్యాండ్‌ని వెంట ఉంచుకోవచ్చు. కూర్చునే సీటుమీద ఓసారి దాన్ని తిప్పితే చాలు సూక్ష్మక్రిములు నాశనమైపోతాయి.

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.