close
ఆలోచన అదుర్స్‌!

సమస్య ఉందంటే... అక్కడ పరిష్కారానికి ఓ అవకాశం ఉందని అర్థం. వినూత్నంగా ఆలోచించిన కొందరు వ్యక్తులు తాము చూసిన సమస్యలకు చూపిన పరిష్కారాలే ఈ అంకుర సంస్థలు!

సైకిల్‌కి ఇన్సూరెన్స్‌ చేస్తారు!

మీ బ్యాగ్‌కి ఇన్సూరెన్స్‌ చేశారా, పోనీ సైకిల్‌కీ, జిమ్‌ గాయాలకీ... ‘అసలేం మాట్లాడుతున్నారు’... అనుకుంటున్నారా, అయితే మీరు టఫీ ఇన్సూరెన్స్‌ గురించి వినలేదన్నమాట. చాలా సంస్థలు జీవిత బీమా, ఆరోగ్య బీమా మీదే దృష్టిపెడతాయి. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న టఫీ వీటికి భిన్నంగా ప్రతి చిన్న విభాగమూ, వస్తువుమీదా బీమా సదుపాయాన్ని అందిస్తోంది. కుర్రాళ్లకు క్యాన్సర్‌, హృద్రోగంకంటే కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ల ముప్పే ఎక్కువ. అందుకే ప్రత్యేకించి విడివిడిగా జ్వరాలకీ బీమా సదుపాయం కల్పిస్తోంది టఫీ. ‘దేశంలో ఏటా 1.63 కోట్ల సైకిళ్లు అమ్ముడవుతాయి. అలాగే సైకిల్‌ దొంగతనాలు మనదేశంలో చాలా ఎక్కువ’ అని చెబుతారు సంస్థ వ్యవస్థాపకులు రోహన్‌ కుమార్‌, నిశాంత్‌ జైన్‌. దేశవ్యాప్తంగా 160 నగరాల్లో సైకిల్‌ డీలర్లద్వారా సేవల్ని అందిస్తోంది. సైకిల్‌ పోయినా, లేదంటే విడి భాగాలు విరిగినా బీమా చెల్లుతుంది. కాలేజీకీ ఆఫీసుకీ వెళ్లే దారిలో ప్రమాదాలు జరిగినా, జిమ్‌లో వ్యాయామం చేస్తున్నపుడు గాయాలైనా బీమా సదుపాయం కల్పిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 70వేల పాలసీలు అమ్మితే, పది శాతం క్లెయిములు వచ్చాయట. రూ.10 కోట్ల వరకూ వివిధ సంస్థలు టఫీలో పెట్టుబడులు పెట్టాయి. త్వరలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లకీ, కళ్లద్దాలకీ కూడా ఇన్సూరెన్స్‌ ఇస్తారట.

ఈ బైకు రూటే వేరు!

మిత్‌ గుప్తా ‘ఇన్‌మొబి’ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. 40 ఏళ్లకే రిటైరవ్వాలనుకున్నాడు. కానీ ఆ వయసు వచ్చేసరికి అతని ఆలోచనలు పర్యావరణ కాలుష్యంవైపు మళ్లాయి. ఆ సమస్యని పరిష్కరించడానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆలోచన నచ్చి ఆర్‌.కె.మిశ్రా, నవీన్‌ దాచూరి, హేమంత్‌ గుప్తా అతడికి తోడయ్యారు. రెండేళ్ల కిందట బెంగళూరు కేంద్రంగా ‘యులూ’ సంస్థను ప్రారంభించి పెట్రోల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా వాహనాల్ని తెచ్చారు. వీటిని అద్దెకు ఇస్తూ అందరూ వినియోగించేలా చేస్తున్నారు. ‘మూవ్‌’ పేరుతో సైకిల్‌నీ, ‘మిరాకిల్‌’ పేరుతో బ్యాటరీతో నడిచే సింగిల్‌ సీటర్‌ మైక్రో టూవీలర్‌నీ తెచ్చింది యులూ. మిరాకిల్‌కు ఛార్జింగ్‌ అవసరం లేకుండా బ్యాటరీల్ని అమర్చారు. ఈ వాహనాల్ని ప్రత్యేక జోన్లలో నడిపిస్తున్నారు. బ్యాటరీ అయిపోతుందనిపించగానే దగ్గర్లో ఉండే యులూ కేంద్రంలో కొత్తవి తీసుకోవచ్చు. బెంగళూరులో మెట్రో రైల్‌, ఉబర్‌తో కలిసి పనిచేస్తూ రైలూ, కారూ దిగిన ప్రయాణికులు వీటిపైన తమ గమ్యస్థానం చేరేలా సాయపడుతోంది. బెంగళూరుతోపాటు పుణె, ముంబయి, భువనేశ్వర్‌లలో ఎనిమిది వేల సైకిళ్లూ, వెయ్యి ద్విచక్ర వాహనాలతో సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల మంది ‘యులూ’ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. త్వరలో బ్యాటరీతో నడిచే సైకిల్‌నీ, ఎలక్ట్రిక్‌ వాహనాల్నీ తెచ్చి మరిన్ని నగరాలకు విస్తరించాలనేది వీరి ప్రణాళిక.

ఉచిత భోజనం కావాలా?

ఫ్రీ ఫేమస్‌ ఫుడ్‌ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు ఉచిత భోజనం లభిస్తుంది. ‘అదేంటి, భోజనానికి హోటల్‌కి కాకుండా వెబ్‌సైట్‌కి వెళ్లమంటున్నారు’ అనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నాం... ఈ వెబ్‌సైట్లో దొరికే కూపన్లను తీసుకుని వెళ్తే హోటల్లో ఉచిత భోజనం దొరుకుతుంది. ఎలా అంటే, ఈ వెబ్‌సైట్‌ నిర్వాహకులు వివిధ హోటళ్లతో మాట్లాడి వారి నుంచి ఫ్రీ కూపన్లను తీసుకుంటారు. వాటిని తమ వెబ్‌సైట్‌లో పెడతారు. ఈ వెబ్‌సైట్లోకి ఎవరైనా వెళ్లి తమ వివరాల్ని నమోదుచేసుకుంటే అక్కడ కూపన్లు కనిపిస్తాయి. వాటిపైన ఏ నగరం, ఏ హోటల్‌ అన్న వివరాలతోపాటు మనకు వడ్డించే వంటకం పేరు కూడా రాసి ఉంటుంది.  పైసా ఖర్చులేకుండా అక్కడకు వెళ్లి తినొచ్చు. కాకపోతే ఒక షరతు... తిరిగి వచ్చాక ఆ హోటల్‌లో తిండి ఎలా ఉందో మాత్రం వెబ్‌సైట్లో చెప్పాలి, రేటింగ్‌ ఇవ్వాలి. తమిళనాడుకు చెందిన పి.ఉమాశంకరన్‌ దీని వ్యవస్థాపకుడు. 2015లో సింగపూర్‌లో ఉన్నపుడు మొదట ఈ కంపెనీ పెట్టాడు. అక్కడ విజయవంతమైంది. తర్వాత సేవల్ని భారత్‌కీ విస్తరించాడు. దీనిలో ఒక రోజుకి ప్రస్తుతం 50 వరకూ ఉచిత కూపన్లు ఉంచుతున్నారు. ఎవరైనా వెళ్లిన హోటల్‌కే మళ్లీ నెలరోజుల వరకూ వెళ్లకూడదన్నది నిబంధన. ప్రస్తుతం తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్‌ సహా తొమ్మిది నగరాల్లో ఈ కూపన్లతో ఉచిత భోజనం చేయొచ్చు. త్వరలో హైదరాబాద్‌, బెంగళూరులకు ఈ కంపెనీ సేవలు రానున్నాయి. హోటల్‌కి వచ్చేవాళ్లు ఒక్కరే రారుగా... స్నేహితులూ కుటుంబాలతో వస్తే హోటల్‌కీ మంచిదేగా... అలాగే, ఒకసారి రుచి నచ్చితే మళ్లీ మళ్లీ వస్తారుగా అనేది హోటళ్ల ఆలోచన!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.