close
టీ... పూలతోటీ..!

పెరట్లో మందారాలు పూసినా వాకిట్లో గులాబీలు విరిసినా పందిట్లో మల్లెపూలు పరిమళించినా డాబామీద సన్నజాజులు గుబాళించినా ఆ పూల అందానికీ వాసనకీ పరవశించిపోతారు. వీలయితే నాలుగుపూలు కోసి దేవుడికి పెట్టడమో లేదా మహిళలయితే తలలో తురుముకోవడమో చేస్తుంటారు. ఆరోగ్యపిపాసులు మాత్రం ఆ పూరేకుల్ని సలాడ్లలో చల్లుకుని తింటుంటారు. కానీ ఈమధ్య పూలు పూస్తే చాలు, వాటిని ఎండబెట్టి డబ్బాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఎందుకంటే పూలని తినడమే కాదు, టీ రూపంలోనూ తాగేస్తోంది నేటి తరం.

స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుమ అల్మరాలో అందంగా అమర్చిన ఎండుపూల  సీసాల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకివన్నీ అనడిగితే... ‘మూడ్‌ని బట్టి నాకిష్టమైన పరిమళాన్ని తాగుతుంటా’ అని చెప్పిన స్నేహితురాలిని చూసి కాస్త షాకయినా, ఓ కప్పులో తనకీ ఇచ్చిన మందారపూల టీ తాగి రిఫ్రెష్‌ అయి, ఎక్కడ కొన్నావంటూ ఆరా తీసింది. అవునుమరి, మొన్నటివరకూ  తేయాకుని రకరకాల పద్ధతుల్లో ఎండబెట్టి చేసే బ్లాక్‌, వైట్‌, గ్రీన్‌, ఊలాంగ్‌టీలు మాత్రమే తెలుసు. తరవాత వాటికి తులసి, పుదీనా, అల్లం, శొంఠి, చెక్క, లవంగాలు, యాలకులు... వంటి రకరకాల ఔషధభరితమైన ఆకుల్నీ సుగంధద్రవ్యాల్నీ జోడించి తాగడమూ మొదలైంది. కొత్తగా ఇప్పుడు టీలో రంగురంగుల పూలు విరుస్తూ ఈతరాన్ని ఆకర్షిస్తున్నాయి.

ఎందుకీ పూల టీలు!
పూల టీలను తాగడం ప్రాచీనకాలం నుంచీ వాడుకలో ఉంది. అయితే అప్పట్లో వాటిని టీ పేరుతో పిలిచేవారు కాదు అంతే. ఔషధగుణాలు కలిగి ఉన్న మొక్కల ఆకుల్నీ పువ్వుల్నీ వేళ్లనీ బెరడునీ గింజల్నీ మరిగించిన కషాయాల రూపంలో తాగడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల్ని నివారించుకునేవారు. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవాళ్లకి పడుకునేముందు కాచిన నీళ్లలో కాసిని ఛమేలీ పూలను వేసి తీసి తాగమని సూచించేవారు ఆయుర్వేద వైద్యులు. క్రమేణా అవన్నీ పోయి తేయాకుతో వచ్చిన టీని- అది కూడా పాలతో కలిపి తాగడం ప్రారంభించారు. కానీ అదే ఎంతకాలమని తాగుతారు... అందుకే పాతే కొత్త అన్నట్లు మళ్లీ ఆనాటి ఆహారపుటలవాట్లనే నేటి ఆధునిక వైద్యులూ తవ్వి తీస్తున్నారు. అదీగాక కాస్త జలుబు చేసినా దగ్గు వచ్చినా చల్లగా ఉన్నా వేడివేడి టీ తాగితే బాగుణ్ణు అనిపిస్తుంటుంది. కానీ పాలు కలిపిన టీని ఎక్కువసార్లు తాగడంవల్ల క్యాలరీలూ పెరుగుతాయి. అందుకే ఇప్పుడు పాలు కలిపిన టీలని ఒకటి రెండుసార్లకి పరిమితం చేసి రకరకాల పూలనీ ఆకుల్నీ మరిగించిన నీళ్లనే ఎక్కువసార్లు తాగడానికి ఇష్టపడుతున్నారు. ‘వీటివల్ల ఎలాంటి హానీ ఉండదు సరికదా... అందులోని ఔషధగుణాలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. పైగా పూలతో చేసిన టీలు మంచి పరిమళాన్నీ వెదజల్లుతుంటాయి కాబట్టి మనసుకి హాయిగానూ ఆహ్లాదంగానూ అనిపిస్తుంది’ అంటున్నారు పూల తేనీటి ప్రియులు. హెర్బల్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ లేదా ఔషధ కషాయాలు లేదా టీసేన్స్‌గా పిలిచే ఈ టీలలో కెఫీన్‌ ఉండదు కాబట్టి పిల్లలకీ మంచిదేనట.

ఎలా చేస్తారు?
గ్రీన్‌, బ్లాక్‌ టీ చేసిన పద్ధతిలోనే వీటినీ తయారుచేస్తారు. మరిగించిన నీటిలో రెండుమూడు పూలు లేదా కాసిని పూరేకులు వేసిన తరవాత రెండు మూడు నిమిషాల్లోనే వాటిని తీసేయాలి. అప్పుడే ఆ టీ ఘాటు లేకుండా మంచి వాసనతో రుచిగా ఉంటుంది. చల్లగా తాగాలనుకునేవాళ్లు వీటిల్లో ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు. కాస్త తియ్యగా ఉండాలనుకుంటే తేనె కలుపుకోవచ్చు. ఘాటుగా ఉండాలనుకుంటే అల్లం, శొంఠి, పుదీనా, చెక్క... ఇలా ఇష్టమైన మసాలాదినుసుల్నీ జోడించవచ్చు. అయితే ఒక్కో పువ్వూ ఒక్కో రుచిని కలిగి ఉండటమే కాదు, అందులోని ఔషధగుణాలూ వేర్వేరుగానే ఉంటాయి. అందుకే వేటికవి విడివిడిగానే కాకుండా తినే అన్ని రకాల పూరేకుల్నీ కలిపిన మిక్స్‌డ్‌ ఫ్లేవర్లూ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో కొందరు ఇతరత్రా ఔషధ దినుసుల్నీ జత చేస్తున్నారు. దాదాపుగా ఈ ఫ్లోరల్‌ హెర్బల్‌ టీలన్నీ కూడా దగ్గూ జలుబుల్నీ జీర్ణసమస్యల్నీ తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ముఖంమీద వచ్చే ముడతల్ని తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఒత్తిడి, ఆందోళనలతోబాటు బీపీనీ తగ్గిస్తాయి. ఇటీవల చైనాలో జరిపిన అనేక పరిశోధనల్లో పూల టీలు పేగు, పొట్ట క్యాన్సర్లని కూడా నిరోధిస్తాయని తేలిందట. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా హృద్రోగాల్నీ నివారిస్తాయనీ జీవక్రియని పెంచడం ద్వారా ఊబకాయాన్ని తగ్గిస్తాయనీ కూడా చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు.

* సి-విటమిన్‌ పుష్కలంగా ఉండే మందారపూల టీలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. అందుకే ఇది గొంతులోనూ ఊపిరితిత్తుల్లోనూ పేరుకున్న కఫాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచే ఈ టీ నిద్రలేమినీ చర్మవ్యాధుల్నీ బీపీనీ శరీర ఉష్ణోగ్రతనీ అధిక బరువునీ తగ్గిస్తుంది. కాలేయ పనితీరునీ మెరుగుపరుస్తుంది. గర్భసంచి కండరాలు వ్యాకోచించడానికీ బీపీ తగ్గడానికీ మందారపూలు దోహదపడతాయని పరిశోధనల్లోనూ తేలింది. ఈ టీ శరీరంలోని టాక్సిన్లని బయటకు పంపించడంతోబాటు ఆయుష్షునీ పెంచుతుందట.
* ఆహారం త్వరగా జీర్ణమవుతుందన్న కారణంతో భోజనం చేశాక చామంతిపూల టీని తాగుతుంటారు జపనీయులు. ఇది వైరల్‌ ఇన్ఫెక్షన్లనీ గొంతునొప్పినీ కళ్ల చుట్టూ ఉండే వలయాలనీ కూడా తగ్గిస్తుంది.
* వాడామల్లి లేదా బొగడ బంతిపూలల్లో సమృద్ధిగా ఉండే విటమిన్‌-ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కంటి కండరాల క్షీణతని తగ్గిస్తుంది. ఇంకా మధుమేహానికీ ప్రొస్టేట్‌ క్యాన్సర్ల నివారణకీ ప్రత్యుత్పత్తి సమస్యలకీ, శ్వాసకోశ సమస్యలకీ మంచిదే.
* గులాబీల్లో ఎక్కువగా ఉండే సి-విటమిన్‌, మాలిక్‌, సిట్రిక్‌ ఆమ్లాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించడంతోబాటు చల్లదనాన్నీ అందిస్తాయి.
* కాలేయ సమస్యలతో బాధపడేవాళ్లకి మల్లెల టీ ఎంతో మంచిది అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది దాహాన్నీ తీరుస్తుందట.
* లావెండర్‌ బాగా నిద్రపట్టేలా చేయడంతోబాటు తలనొప్పినీ తగ్గిస్తుందట.
* ఛమేలీ నిద్రతోబాటు దీర్ఘకాలిక ఒత్తిడినీ కండరాల నొప్పుల్నీ జీర్ణ సమస్యల్నీ నెలసరి నొప్పుల్నీ తగ్గిస్తుంది. శరీరంలోని వేడినీ ఊపిరితిత్తుల్లోని తేమనీ తొలగించడంతోబాటు ఒత్తిడి లేకుండా చేస్తుంది లిల్లీపూల టీ. ఇంకా దగ్గు, ఆస్తమాలనీ కూడా తగ్గిస్తుంది.
* వర్షాల్లో వచ్చే దగ్గూ జలుబూ ఫ్లూ జ్వరాల్ని నియంత్రించాలంటే నిమ్మ పూల టీ ఎంతో మేలు. రక్తశుద్ధితోబాటు ఇన్ఫెక్షన్లను అడ్డుకోవాలంటే బంతిపూలకి మించిన ఔషధం లేనేలేదట... ఇలా చెప్పాలంటే ఎన్నో పూలూ మరెన్నో ఔషధగుణాలూ... కాబట్టి నచ్చిన పరిమళాన్ని మనసారా ఆస్వాదించేద్దాం.

 

 

పువై విరిసిన తేనీరు!

ఎండిన పూలతోనే కాదు, టీమగ్గు లేదా కప్పులోనే పూలు విరిసేలా చేసి టీ తాగడం చైనా, జపాన్‌ వాసుల సంప్రదాయం. ఇందుకోసం చామంతి, మల్లె, లిల్లీ, కార్నేషన్‌, బొగడబంతి, మందారపూల పూమొగ్గల్ని తీసుకుని వాటి చుట్టూ గ్రీన్‌ టీ ఆకుల్ని చుట్టి ఎండబెడతారు. అలా ఎండబెట్టే ప్రక్రియలో కూడా తమదైన సృజనను కనబరుస్తుంటారు. కొన్నింటిలో ఒక పూమొగ్గనే పెడితే, మరికొన్నింటిలో ఒకదానిమీద ఒకటి పూలమొగ్గల్ని గుదిగుచ్చి అమర్చి చుడుతుంటారు. దాంతో వాటిని నీటిలో వేయగానే చుట్టూ ఉన్న ఆకులన్నీ కిందకి వచ్చి అందులోని పూలన్నీ ఒకదానిమీద ఒకటి నిలబడినట్లుగా విచ్చుకుని, చూసేవాళ్లకీ తాగేవాళ్లకీ కూడా కనువిందు చేస్తుంటాయి. పైగా విరిసే పూల టీల్లో అటు పువ్వులూ ఇటు తేయాకుల్లోని ఔషధాలన్నీ కలగలిసి గమ్మత్తైన రుచిని అందిస్తాయి. ఈ టీ పూబంతిల్ని అందమైన రేపర్లలో చుట్టి మరీ విక్రయిస్తుంటారు. బాగున్నాయి కదూ. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.