close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు ‘కెమెరా’ పట్టాడు!

వాళ్లు... టీనేజర్లు కారు. సెలెబ్రిటీలు అంతకన్నా కారు. చదివింది మామూలు డిగ్రీ. కొందరైతే ఇంకా తక్కువే. అయితేనేం... మనసులోని ఆలోచనకి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ తోడయింది. వ్యవసాయంలో, పశుపోషణలో తమ అనుభవాల్ని తోటివారితో పంచుకోవాలన్న వారి ఉత్సాహమే యూట్యూబ్‌ ఛానల్స్‌కి పెట్టుబడి అయింది. లక్షల్లో వ్యూస్‌నీ సబ్‌స్క్రైబర్స్‌నీ తెచ్చిపెట్టింది. అటు అభిమానుల్నీ ఇటు ఆదాయాన్నీ కూడా అందిస్తోంది!

నిండా ముప్పయ్యేళ్లు లేని నందకిశోర్‌ మొన్నీ మధ్యే నైజీరియా వెళ్లొచ్చాడు. పర్యటకుడిగా కాదు, అతిథిగా ఆహ్వానం అందుకుని మరీ వెళ్లాడు. పది రోజులు అక్కడ ఉండి, వారి పంటల్ని పరిశీలించి, తనకు తెలిసిన సలహాలూ సూచనలూ ఇచ్చి వచ్చాడు. నందకిశోర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త కాదు, ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసి తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటున్న చిన్న రైతు. అలాంటిది అతనికి విదేశం నుంచి ఆహ్వానం ఎలా లభించిందన్నదే అసలు కథ. మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో ఉండే నందకిశోర్‌నీ అక్కడెక్కడో ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని రైతునీ కలిపింది ఓ యూట్యూబ్‌ ఛానల్‌. దాని పేరు ‘దేశీ ఖేతీ’. రైతుగా తన పొలంలో తాను చేస్తున్న పనుల్నీ, అనుసరిస్తున్న కొత్త విధానాల్నీ వీడియోలుగా తీసి ఆ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేయడం నందకిశోర్‌కి ఇష్టమైన హాబీ. అలా ఓసారి ‘బొప్పాయి బాగా పండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపైన వీడియో పెట్టాడు. అది ముంబయిలోని ఓ వ్యాపారవేత్త చూసి నైజీరియాలో బొప్పాయి తోటలు సాగుచేస్తున్న తన కొడుక్కి పంపించాడు. అతడు వీడియోలో ఉన్న నందకిశోర్‌ ఫోన్‌ నంబరుకి ఫోన్‌ చేసి తన పొలంలో బొప్పాయి బాగా పండడం లేదనీ, కాయలు చిన్నగా ఉంటున్నాయనీ చెప్పాడు. అక్కడి మట్టి వివరాలు తెలుసుకున్న నందకిశోర్‌ బొప్పాయి మొక్కలకు నీరు ఎలా పెట్టాలో, ఇతరత్రా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాడు.

ఆ సూచనలు పాటించిన నైజీరియా రైతు తర్వాత మంచి దిగుబడి సాధించిన సంతోషంతో నందకిశోర్‌ని తమ దేశం ఆహ్వానించాడు. ‘దేశీ ఖేతీ’ అనే హిందీ యూట్యూబ్‌ ఛానల్‌ని నందకిశోర్‌ ప్రారంభించి రెండేళ్లు కూడా కాలేదు. లక్షన్నర మంది సబ్‌స్క్రైబర్లతో, లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. చిన్నప్పటి నుంచీ టెక్నాలజీ అన్నా గ్యాడ్జెట్స్‌ అన్నా ఇష్టపడే నందకిశోర్‌ ఆ ఆసక్తితోనే మంచి ఫోను కొనుక్కున్నాడు. చదువు మానేసి రైతుగా స్థిరపడాలనుకున్నప్పుడు టెలివిజన్‌ ఛానళ్లలో వస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. వాటిల్లో తెలుసుకున్న కొత్త విషయాలను పొలంలో ఆచరణలో పెట్టేవాడు. అలా ఓసారి పొలంలో ఉన్నప్పుడు యూట్యూబ్‌ చూస్తుంటే తేనెటీగల పెంపకం కార్యక్రమం కన్పించింది. ఆసక్తితో నేర్చుకుని తానూ తేనెటీగల్ని పెంచడం మొదలెట్టాడు. అయితే యూట్యూబ్‌ వీడియోల్లో చెప్పే విషయాలు పల్లెటూళ్లలో ఉండే చిన్న రైతులకు అంతగా ఆసక్తి కలిగించేలా లేవని గమనించాడు ఆ యువకుడు. రైతులకు కావలసినట్లుగా తనలాంటి రైతులే బాగా చెప్పగలరన్న ఆలోచన రాగానే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాడు. రకరకాల పంటలు విత్తడం దగ్గర్నుంచీ దిగుబడిని మార్కెట్‌కి చేరవేసేవరకూ వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేసేవాడు. చాలాకాలం ఫోను సాయంతోనే పనిచేసిన నందకిశోర్‌ ఈ మధ్యే మంచి వీడియో కెమెరా కొనుక్కున్నాడు.

కాదేదీ అనర్హం
కాలక్షేపానికి సినిమాలో, వీడియోలో చూసుకునే సామాజిక మాధ్యమంగా యూట్యూబ్‌కి ఉన్న పేరును తిరగరాస్తున్నారు నందకిశోర్‌లాంటి యువ రైతులు. వీరెవరూ సాంకేతిక నిపుణులు కారు, పెద్ద చదువులు చదివినవారూ కాదు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలాన్ని సాగు చేసుకుంటూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల విలువ తెలిసి వాటి ద్వారా తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటున్నారు. పంటలు పండించడం ఒక్కటే కాదు, పాడి పశువుల పోషణా మేకలూ కోళ్ల పెంపకమూ, వ్యవసాయంలో వాడుతున్న రకరకాల పనిముట్లూ వాటి పనితీరూ, అవి ఎక్కడ దొరుకుతాయీ, సేంద్రియ ఎరువుల వాడకమూ, పండిన పంటనుంచి అధిక లాభం పొందడం ఎలా... ఇలా ఎన్నో అంశాలను వీళ్లు వీడియోలు తీసి యూట్యూబ్‌ ఛానల్స్‌లో పెడుతున్నారు. రైతులు తమ అవసరాలకనుగుణంగా సొంతంగా తయారుచేసుకునే పరికరాలని పరిచయం చేయడమూ, వేర్వేరు విషయాల్లో ప్రత్యేకతలు సాధించిన తోటి రైతుల కథల్ని చిత్రీకరించి స్ఫూర్తినిచ్చేలా చెప్పడమూ ఈ వీడియోల్లో కన్పిస్తుంది. సినీ నటుల ఇంటర్వ్యూలూ, వెబ్‌సిరీస్‌లూ చూసినట్లే యూట్యూబ్‌ ప్రేక్షకులు వీటినీ చూసి ఆదరిస్తున్నారనడానికి ఆయా ఛానల్స్‌ సాధిస్తున్న వ్యూసే నిదర్శనం. దర్శన్‌సింగ్‌ అనే పంజాబీ రైతు నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఫామింగ్‌ లీడర్‌’కి ఏకంగా 18 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

నలుగురికీ ఉపయోగపడేలా...
టీవీల్లో వ్యవసాయం గురించి వివరంగా చెప్పే ప్రత్యేక కార్యక్రమాలున్నా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఎందుకు వీరిని ఇంతగా ఆకట్టుకుంటున్నాయంటే- టీవీ చూడాలంటే సరిగ్గా ఆ కార్యక్రమం వచ్చే టైమ్‌కి ఇంట్లో ఉండాలి. వాళ్లు ప్రసారం చేసిన కార్యక్రమాన్నే చూడాలి తప్ప రైతుకు కావలసిన పంటల గురించిన సమాచారం వెతుక్కుని చూసే అవకాశం ఉండదు. అదే స్మార్ట్‌ఫోన్‌ అయితే చేతిలోనే ఉంటుంది కాబట్టి పొలంలో పనులు పర్యవేక్షిస్తూనే గట్టుమీద కూర్చుని కావలసిన ప్రోగ్రామ్‌ చూసుకోవచ్చు. అంతకన్నా సౌలభ్యం ఇంకేం కావాలి- అంటాడు సంతోష్‌ జాదవ్‌. నిజానికి సంతోష్‌కి కూడా స్వయంగా అనుభవంలోకి వచ్చేదాకా యూట్యూబ్‌ ఛానల్‌కి అంత ప్రజాదరణ ఉంటుందని తెలియలేదట. మహారాష్ట్రలోని సాంగ్లికి చెందిన సంతోష్‌ ఏడాది క్రితమే సరదాగా తన పొలం పనులను వీడియోలు తీసి ‘ఇండియన్‌ ఫార్మర్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టడం మొదలెట్టాడు. సంతోష్‌ మంచి మాటకారి. క్లిష్టమైన సాంకేతిక అంశాల గురించి అందరికీ అర్థమయ్యేలా తేలిక మాటల్లో చెప్పగలగడంతో ఆ వీడియోలకు క్రమంగా మంచి వ్యూస్‌ వచ్చాయి. వర్షం పడితే కూరగాయల మొక్కలు ఏపుగా ఎదగడం, మిగిలిన కాలాల్లో నీరు పెట్టినా అంతగా ఎదగకపోవడం గమనించిన సంతోష్‌ అలా కావలసినప్పుడల్లా వర్షం రాదు కాబట్టి అందుకు స్వయంగా ఒక పైపుని తయారుచేసుకున్నాడు. అక్కడక్కడా రంధ్రాలు పెట్టిన పైప్‌తో నీరు పెడితే మొక్కలమీద సన్నని జల్లులు పడి అవి తాజాగా నవనవలాడటం మొదలెట్టాయి. నీరూ వృథా అవలేదు. తక్కువ ఖర్చుతో రెండు పనులూ అయ్యేలా ఉన్న ఆ పైపు గురించి వీడియో తీసి పెడితే ఐదు లక్షల మందికి పైగా చూశారు. మరిన్ని వివరాలు అడుగుతూ వందల్లో కామెంట్లు వచ్చాయి. అప్పుడు తెలిసిందట సంతోష్‌కి యూట్యూబ్‌ విలువ. ఇక అప్పటినుంచీ తోటి రైతులకు ఉపయోగపడుతుందనిపించిన ప్రతి విషయాన్నీ వీడియోలుగా తీసి పెట్టడమే కాకుండా ఎవరైనా ఏదైనా సందేహం వ్యక్తం చేస్తే దానికీ మరో వీడియో రూపంలోనే సమాధానం ఇస్తున్నాడు. వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలూ రుణాలూ సబ్సిడీలూ తదితర సమాచారంతో పాటు రకరకాల ట్రాక్టర్ల పనితీరుని కూడా సంతోష్‌ వీడియోల్లో సమీక్షిస్తుంటాడు.

పశువుల మేతకు హైడ్రోపోనిక్స్‌
అరుణ, ప్రభాకర్‌ దంపతులిద్దరూ ఇంజినీర్లే. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి తట్టుకోలేక మానేసి డైరీ ఫారం పెట్టుకున్నారు. పెట్టడమైతే పెట్టారు కానీ నిజానికి అప్పటివరకూ వారికి వ్యవసాయమూ పాడి పరిశ్రమల గురించి ఏమీ తెలియదు. నగరానికి దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చని స్నేహితుల సలహాతో అందులోకి దిగారు. నెమ్మదిగా సమస్యలు అనుభవంలోకి రావడం మొదలెట్టాయి. పశువులకు కావలసిన ఎండుగడ్డి, పచ్చిగడ్డిలను సరఫరా చేయడానికి చుట్టుపక్కల గ్రామాల రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఎండుగడ్డితో సమస్య లేదు కానీ, ఎప్పటికప్పుడు కోసి తేవాల్సిన పచ్చిగడ్డి ఏనాడూ వేళకు అందేది కాదు. ఒక్కోసారి అసలు వచ్చేది కాదు. పోనీ పండించుకుందామా అంటే అందుకు కావలసినంత పొలం వారికి లేదు.
ఆ సమయంలో అశ్విన్‌ సావంత్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వారిని ఆదుకుంది. మట్టి లేకుండా నీటిలో సాగుచేసే విధానమైన హైడ్రోపోనిక్స్‌ని పశువుల మేత తయారీకి ఎంత బాగా వాడుకోవచ్చో చెప్పే వీడియోలు ఆ ఛానల్‌లో ఉన్నాయి. అది చూసి వారికి ప్రాణం లేచొచ్చింది. వెంటనే హైడ్రోపోనిక్స్‌ సాగు ఏర్పాట్లు చేసుకుని సొంతంగా గడ్డిని పెంచుకోవటం మొదలెట్టారు. మొక్కజొన్న, గోధుమ, బార్లీ, ఓట్స్‌, ఉలవలు...ఇలా పలు రకాల ధాన్యాలను నాటి అవి మొలకెత్తి జానెడు పెరగగానే పశువులకు మేతగా వాడతారు. స్థలమూ నీరూ కూడా తక్కువగా ఉపయోగించుకునే ఈ విధానం వల్ల సమయమూ డబ్బూ కలిసి రావటమే కాక, ఎలాంటి ఆందోళనా లేకుండా పశువులకు వేళకి మంచి మేత వేయగలుగుతున్నారు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాల ఆనవాళ్లు లేని సేంద్రియ గడ్డి పెట్టడం వల్ల పాల దిగుబడీ పెరిగి ఆర్థికంగానూ లాభసాటిగా ఉంది. హైడ్రోపోనిక్స్‌ విధానాన్ని సరైన అవగాహన లేకుండా ప్రారంభించి చాలా మంది నష్టపోవటం చూసిన అశ్విన్‌ సావంత్‌ దాన్ని సరిగ్గా వాడుకుని ఎన్ని రకాలుగా లబ్ధి పొందవచ్చో పలు వీడియోలు రూపొందించి తన ‘సైంటిఫిక్‌ హైడ్రోపోనిక్స్‌’ ఛానల్‌లో పెడుతుంటాడు. పలువురు రైతులు అడిగే సందేహాలకు సమాధానాలు ఇస్తుంటాడు.

ఎన్నో పాఠాలు
అవును, యూట్యూబ్‌లో వ్యవసాయం ఒక్కటే కాదు, ఏదైనా నేర్చుకోవచ్చు. మేలుజాతి పాడి పశువులు ఎక్కడ దొరుకుతాయి, ఏ జాతి పశువులు ఎంత ధర పలుకుతాయి, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, పాల దిగుబడి పెరగాలంటే ఎలాంటి మేత వేయాలి, ట్రాక్టర్‌తో ఎలాంటి పనులు చేయవచ్చు... ఇవన్నీ దర్శన్‌సింగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఫామింగ్‌ లీడర్‌’లో కన్పించే వీడియోలు. చేయాల్సినవే కాదు, చేయకూడని పనులేమిటో కూడా వివరిస్తాడు దర్శన్‌సింగ్‌. వివిధ పరికరాలను కొనేటప్పుడు చూడాల్సిన నాణ్యతాప్రమాణాలను తెలియజేస్తాడు. అతడిది పంజాబ్‌ అయినా దేశంలో ఎక్కడైనా సరే రైతులు కొత్తగా ఏమన్నా చేస్తున్నారని తెలిస్తే అక్కడికి వెళ్లిపోయి వీడియోలు తీసి ఛానల్‌లో పెడుతుంటాడు. ఆ వీడియోలు చూసి స్ఫూర్తిపొంది వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నవారికి దర్శన్‌ సింగ్‌ చెప్పే సలహా- వ్యవసాయం అనేది వీడియోలాగా పది నిమిషాల్లో అయిపోయే పని కాదు, చాలా ఓపిక కావాలి, అది ఉంటేనే ధైర్యంగా రైతు అవతారం ఎత్తమని చెబుతుంటాడు. 200 వీడియోల దాకా తన స్మార్ట్‌ఫోన్‌తోనే తీసిన దర్శన్‌ సింగ్‌ సబ్‌స్క్రైబర్లు పది లక్షలు దాటాక మంచి కెమెరా కొనుక్కున్నాడు. ఇప్పటికి దాదాపు 500 వీడియోలు చేసిన ఈ 27 ఏళ్ల యువకుడు వ్యవసాయంనేర్చుకోవాలనుకునే యువకుల కోసం త్వరలోనే ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించబోతున్నాడు. అదంతా తన సొంత సంపాదనతోనే సుమా!

తెలుగులో ఇప్పుడిప్పుడే...
మారుతున్న కాలంతోపాటు వ్యవసాయమూ మారాలంటాడు కడపకు చెందిన అన్వర్‌. రసాయనశాస్త్రంలో బీఎస్సీ చదివిన అన్వర్‌ ఇష్టంగా తండ్రితో కలిసి వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. అయితే సాధ్యమైనంతవరకూ ఆధునిక విధానాలను వాడి దైవాధీనంగా ఉన్న వ్యవసాయాన్ని లాభసాటి పరిశ్రమగా మార్చాలన్నది అతడి ఉద్దేశం. అందుకే సాగుకు పనికొచ్చే రకరకాల కొత్త పరికరాలను పరిచయం చేస్తున్నాడు ‘హైటెక్‌ ఫామింగ్‌’ అనే తన తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌లో. ఆర్నెల్ల క్రితమే ప్రారంభించిన ఈ ఛానల్‌ కోసం అనుభవజ్ఞులైన రైతులతో, సాంకేతిక నిపుణులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి వీడియోలను రూపొందిస్తున్నాడట అన్వర్‌. తెలుగులో యూట్యూబ్‌ ఛానల్స్‌ చాలానే ఉన్నాయి కానీ నమ్మదగిన సమాచారాన్ని ఇచ్చేవి లేవంటాడు అన్వర్‌. హిందీలో ఉన్నట్లుగా పాడి, పంటల్ని గురించి తెలిపే మంచి ఛానల్స్‌ తెలుగులోనూ రావాల్సిన అవసరం ఉందంటాడు.

ఆ బాధ్యత యూట్యూబ్‌ది!
పొలం ఆస్తి కాబట్టి వారసత్వంగా తండ్రినుంచి కొడుక్కి వస్తుంది. అంతమాత్రాన వ్యవసాయం చేయడమూ వస్తుందనుకుంటే పొరపాటే. దాన్ని కష్టపడి నేర్చుకోవాల్సిందే. ఈరోజుల్లో చదువుల కారణంగా పొలానికి దూరంగా ఉన్నవారు ఏకంగా ఇరవై ఏళ్లు దాటాక తొలిసారి పొలం మొహం చూస్తున్నారు. పెద్దవారిలో రైతుబిడ్డలకు వ్యవసాయం పుట్టుకతో వస్తుందని నమ్మేవారు కొందరైతే, పనిచేస్తూ నేర్చుకుంటాడులే అనుకునేవారు మరికొందరు. ఈ నేపథ్యంలో యువతకు సేద్యంలో శిక్షణ ఇచ్చే బాధ్యతను చేపడుతున్నాయి ఇలాంటి యూట్యూబ్‌ ఛానల్స్‌. గీతాంజలిది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌. ఎం.ఎ. చదివినా అమ్మానాన్నలకోసం పల్లెలోనే ఉండాలనుకుంది. సొంత పొలం లేని ఆమె ఇంట్లోనే పుట్టగొడుగులు పెంచడం ద్వారా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. కానీ ఊళ్లోనూ చుట్టుపక్కలా అందులో శిక్షణ ఇచ్చేవాళ్లెవరూ ఆమెకు కనపడలేదు. ఇంటర్నెట్‌ ఆ లోటు తీర్చింది. యూట్యూబ్‌లో చూసి సొంతంగా పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన గీతాంజలి ఇప్పుడు గ్రామంలో మరికొంతమంది మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. ఆమే కాదు, యువ రైతులు ఎందరికో ఇప్పుడు యూట్యూబ్‌ వ్యవసాయ రంగానికి సంబంధించిన గొప్ప సమాచార నిధిలా ఉపయోగపడుతోంది. ఒకే పంటని వేర్వేరు ప్రాంతాల్లో ఎలా పండిస్తున్నారో పోల్చి చూసుకునే వెసులుబాటూ దీని వల్ల కలుగుతోంది. పాడీ పంటా దేశమంతటా తరతరాలుగా రైతులు చేస్తున్నవే. అయినా ఆచరణలో చాలా తేడా ఉంటుంది. వాతావరణమూ అందుబాటులో ఉండే మేతా పాడిపశువుల పోషణని ప్రభావితం చేస్తే, నీటి లభ్యతా నేలతీరులను బట్టి పంటల సాగువిధానం మారిపోతుంటుంది. రాష్ట్రాలవారీగా జిల్లాలవారీగా కన్పించే ఆ వైవిధ్యాన్ని సరిగ్గా పట్టుకుంటున్నాయి ఈ యూట్యూబ్‌ ఛానళ్లు. ఎక్కడికక్కడ రైతు తన స్వానుభవంతో వివరించి చెబుతున్న విషయాలు కావడంతో తోటి రైతులు నమ్ముతున్నారు. అందుకే, ఏ సందేహం వచ్చినా ఫోన్‌ తీసి యూట్యూబ్‌ ఛానల్‌లో సమాధానం వెతుక్కుంటున్నారు. దొరక్కపోయినా పర్వాలేదు, కామెంట్ల కింద ఒక వాక్యం రాస్తే చాలు కొద్ది రోజుల్లో మరో వీడియోలో సమాధానం దొరికిపోతుంది. ఆ నమ్మకాన్ని వారికిస్తున్నాయి ఈ పక్కా లోకల్‌ రైతు ఛానళ్లు!

అలా...సెలెబ్రిటీ అయిపోయాడు!

ర్‌విలాస్‌ సింగ్‌కి యూట్యూబ్‌ గురించి తెలియదు. అతడికి తెలిసిందల్లా ముర్రా జాతి గేదెల్ని కన్నబిడ్డల్లా పోషించడమే. అతని దగ్గర పెరిగిన గేదెలు ఆరోగ్యంగా ఉండడంతో చాలామంది కొనుక్కోవడానికి వచ్చేవారు. అలా బ్రీడర్‌గా మారిన హర్‌విలాస్‌ తన పశువుల కొట్టాన్ని ఎంతో శుభ్రంగా, గేదెలకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాడు. సాధారణంగా అందరూ పశువులకు పూటకోసారి నీళ్లు పెడతారు. ఆయన మాత్రం వాటికి ఇరవైనాలుగ్గంటలూ గడ్డీ నీరూ కూడా అందుబాటులో ఉండేలా ఒక్కో గేదె ఎదురుగా ఒక పక్క గడ్డీ, మరో పక్క నీటి తొట్టె ఉండేలా ప్రత్యేకంగా గాడిని కట్టించాడు. ఆ నీరు కూడా ఎప్పటికప్పుడు తాజాగా వచ్చేలా ఏర్పాటుచేశాడు. కరెంటు లైట్లూ, గోబర్‌ గ్యాస్‌ ప్లాంటూ లాంటి మరికొన్ని హంగులూ ఆ కొట్టంలో ఉన్నాయి. అతని గురించి విన్న యూట్యూబర్‌ దర్శన్‌సింగ్‌ ప్రత్యేకంగా హర్‌విలాస్‌ పశువుల కొట్టం గురించి ఒక వీడియో తీసి తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఫామింగ్‌ లీడర్‌’లో పెట్టాడు. అంతే, ఆ వీడియోను యాభై లక్షల మంది చూశారు. చూసి ఊరుకోలేదు... ఆ పశువుల కొట్టాన్ని చూడడానికి క్యూకట్టడం మొదలెట్టారు. అలా అంబాలాకి చెందిన హర్‌విలాస్‌ తన ప్రమేయమేమీ లేకుండానే ఇప్పుడో సెలెబ్రిటీ అయిపోయాడు. తన పనులతోపాటు అదనంగా పాడి రైతులకు పాఠాలూ చెబుతున్నాడు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.