close
ఆపరేషన్‌ హ్యాపీనెస్‌!

- షేక్‌ అహమద్‌ బాష

ద్మవిభూషణ్‌ సిరాజుద్దీన్‌ షాద్‌ మీర్పురి, కాశ్మీర్లో ఒక ప్రఖ్యాత కవి, రచయిత. షాద్‌ అతని బిరుదు, షాద్‌ అంటే ఆనందం. అతను పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న ఆజాద్‌ కాశ్మీర్‌లోని మీర్పూర్‌లో పుట్టాడు కనుక పేరు చివర అతని జన్మస్థలం పేరు ఉంటుంది. అతను ఉర్దూ, పార్సీలలో ఎన్నో కవితలూ కథలూ రాశాడు. అతనికి భారత్‌ అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ అతని తల్లిదండ్రులనుంచే వచ్చింది. రెండు దేశాలూ విడిపోయినప్పుడు, వారు మీర్పూర్‌ నుంచి పారిపోయి భారత్‌ వచ్చేశారు. సిరాజ్‌ విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలోనే జరిగింది. అతని తండ్రి, కుమారుడిని పాకిస్తానుకు వీలయినంత దూరంగా పెంచే ప్రయత్నంలో హైదరాబాదులోనే స్థిరపడ్డారు. రెండు దేశాల ఎల్లలు స్థిరీకరించిన తర్వాత వారు కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌ చేరారు. కానీ అక్కడకు వెళ్ళే ముందు తెలంగాణలో పలువురు తెలుగు మిత్రులను సంపాదించుకున్నారు. ఉర్దూ తెలిసిన మిత్రుల ద్వారా తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగుపైన కూడా పట్టు సాధించి సాహితీ మిత్రుల వహ్వాలను సంపాదించాడు సిరాజ్‌. అతను వివాహం చేసుకోలేదు, ఎవరన్నా అడిగితే సాహిత్యమే తన అర్ధాంగి అని నవ్వేసేవాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా అతను గుల్మార్గ్‌లోనే ఉండేవాడు. పాత మిత్రులను కలుసుకునేందుకు అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చి వెళ్ళేవాడు.

అతని కవితల్లో, కథల్లో పాకిస్తాన్‌పైన విరుచుకుపడటమే కాకుండా, భారత్‌లోని మానవత్వాన్నీ స్నేహతత్వాన్నీ స్వాతంత్య్రాన్నీ తన కవితలూ కథల ద్వారా కీర్తించేవాడు. ఆ క్రమంలో అతనికి కాశ్మీర్‌లోనే అనేకమంది శత్రువులు తయారయ్యారు. ఈమధ్యనే అతన్ని భారత ప్రభుత్వం సాహిత్య అకాడమీ పురస్కారంతో సత్కరించింది. అతను రాసిన ‘మానవత్వానికి శత్రువు’ అనే సంపుటి అతన్ని సాహిత్య ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా, భారత విద్రోహుల్లో మంట రగిలించింది. పాకిస్తానుకు వ్యతిరేకంగా రాతలను ఆపాలని అనేక హెచ్చరికలు వచ్చినా అతను వాటిని పట్టించుకోలేదు.

ఒకరోజు తెల్లవారుజామున వచ్చిన పనిమనిషికి సిరాజ్‌ ఇల్లు తలుపు తెరిచి కనబడింది. ఇంట్లో అతను లేడు. దాంతో అతని ఆచూకీ కోసం ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలను చేపట్టింది. పోలీసులను మోహరించింది, కానీ ఫలితం శూన్యం. ప్రభుత్వ చేతగానితనంపై పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. ప్రభుత్వానికి దిక్కుతోచక ఒక ఎస్‌.ఐ.టి. - అంటే ప్రత్యేకమైన పరిశోధనా బృందాన్ని వేసింది. ఆ టీమ్‌కు అధిపతి డా.యుగంధర్‌, ఐపీఎస్‌. అతను తెలుగులో పీహెచ్‌డీ చేసి ఐపీఎస్‌లో దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించినవాడు. దిల్లీలో హోమ్‌ మంత్రిత్వ శాఖలో ఎస్‌.ఐ.బి.లో పనిచేస్తాడు. అతనికి చాకుల్లాంటి ఐదుగురు ఇన్‌స్పెక్టర్లను సహాయంగా ఇచ్చారు. యుగంధర్‌ సాహసానికీ తెలివికీ మారుపేరు. ఎలాంటి కేసయినా చాకచక్యంతో, తక్కువ మానవ నష్టంతో సాధించేవాడు. అతను తన జట్టు సభ్యులతో గుల్మార్గ్‌లో దిగేశాడు.

గుల్మార్గ్‌లో వంద భవనాలకన్నా తక్కువే ఉంటాయి. అక్కడ నివసించేవారు చాలా తక్కువ. ఉన్న కొన్ని ఇళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులవి. అందులో రాష్ట్ర హోంమంత్రిది కూడా ఒకటి. మిగిలిన భవనాలు పర్యటకశాఖ వారివీ హోటళ్ళూ. గుల్మార్గ్‌ స్కేటింగ్‌కి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పర్యటక ప్రదేశం. అక్కడ ఏమాత్రం శాంతికి భంగం కలిగించినా, అది ప్రపంచం దృష్టిని ఆకర్షించి భారత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదముంది. అందుకే ఈ ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా సున్నితంగా ముగించాలని యుగంధర్‌కు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. తమ పరిశోధనకు ‘ఆపరేషన్‌ హ్యాపీనెస్‌’ అని యుగంధర్‌ నామకరణం చేసుకున్నాడు. గుల్మార్గ్‌లోని శివుడి మందిరం పక్కనే ఉన్న ‘హోటల్‌ వెల్కం’లో దిగారు. గుల్మార్గ్‌లో లభించే డైసీస్‌, ఫర్‌-గెట్‌-మి-నాట్‌, బటర్‌ కప్స్‌ లాంటి కొన్ని అరుదైన పుష్పాలపై పరిశోధన జరిపే ఒక బొటానికల్‌ బృందంగా తమని పరిచయం చేసుకున్నారు. అందుకు అవసరమైన నకిలీ పరిచయ పత్రాలు ముందే దిల్లీ యూనివర్సిటీ నుంచి తయారు చేయించుకుని అక్కడే ఉన్న భారత రక్షణ, పోలీసు అధికారులకు కూడా సమర్పించారు. ఎవరికీ వీరు ఒక రహస్య పరిశోధక బృందం అనే అనుమానం రాకుండా అన్నీ సిద్ధం చేసుకున్నారు. పోలీసు హెయిర్‌ కటింగ్‌ కాకుండా జుట్టు పెంచి కాలేజీ కుర్రాళ్ళలా తయారయ్యారు. యుగంధర్‌ ప్రొఫెసర్‌ యుగంధర్‌ అయ్యాడు. అతని సహచరులు రిసెర్చ్‌ స్కాలర్స్‌ అయ్యారు. వారు గుల్మార్గ్‌ చేరుకునేటప్పటికే ఆగస్టు చివరివారం, అంటే వేసవికాలం ముగుస్తోందనీ వర్షాలూ మంచూ కురిసే కాలం దగ్గరకు వచ్చేసిందనీ అర్థం. సిరాజ్‌ గుల్మార్గ్‌ దాటలేదని వారికి వచ్చిన సమాచారం. ఎందుకంటే చుట్టూ ఉన్న రక్షణ వలయం నుంచి తప్పించుకుని అతన్ని తీసుకెళ్ళడం సాధ్యంకాదు. అంటే, అక్కడే ఏదో ఒక ఇంట్లో అతన్ని దాచిపెట్టి ఉండాలని యుగంధర్‌ నిశ్చయానికి వచ్చాడు.

ప్రతిరోజూ బృందంలోని ఆరుగురూ తమ బ్యాగుల్లో నోటుబుక్కులతో తెల్లవారే బయలుదేరుతారు. అక్కడే ఉన్న ఇళ్ళపక్కన పూసే పుష్పాలను పరిశీలించే నెపంతో అక్కడి పరిసరాలను గమనిస్తారు. మొక్కల ఫొటోలు తీసుకుని, నోట్స్‌ తయారు చేసుకున్నట్లు నటిస్తారు. కానీ వారి గాలింపు అంతా సిరాజ్‌ ఆనవాలు కోసమే. రెండు రోజుల పరిశోధనలో వారికి ఎటువంటి ఆనవాలూ దొరకలేదు. మూడోరోజు యుగంధర్‌ దృష్టిని భోజనం తర్వాత చేయి తుడుచుకునే ఒక కాగితపు ‘న్యాప్కిన్‌’ ఆకర్షించింది.

ఆ న్యాప్కిన్‌పైన ఉన్న కొన్ని తెలుగు అక్షరాలే అతన్ని ఆకర్షించాయి. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా దాన్ని తీసి తన సంచిలో వేసుకున్నాడు. అలాంటి కాగితాలు ఇంకా ఏవైనా దొరుకుతాయోమో చూడమని తన సహాయకులకు చెప్పాడు. పూలు సేకరిస్తున్నట్లు నటిస్తూ అక్కడే ఉన్న మరికొన్ని కాగితాలను సేకరించి సంచుల్లో వేసుకుని, మెల్లగా తమ గదులకు చేరుకున్నారందరూ. కాసేపటి తర్వాత అందరూ యుగంధర్‌ గదిలో సమావేశం అయ్యారు. వారికి దొరికిన న్యాప్కిన్‌లను ఒక్కొక్కరూ బయటకు తీసి యుగంధర్‌కు ఇచ్చారు. ఆ కాగితాలపైన తెలుగులో అస్పష్టమైన రాత కనబడుతోంది. అందులోని అక్షరాలు- టొమాటో కెచప్‌ ప్యాకెట్‌ను సూదితో గుచ్చితే వచ్చే సన్నటి ధారతో రాసి ఉన్నాయి. ప్రతి కాగితానికీ ఒక నంబర్‌ వేసి ఉంది. అక్కడ తెలుగు తెలిసినవాడు యుగంధర్‌ ఒక్కడే. మిగతా అందరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారు.

ముందుగా ఒకటో నంబరు ఉన్న కాగితాన్ని అక్షరాలు పోకుండా జాగ్రత్తగా ముడతలు చదునుచేసి చదివాడు యుగంధర్‌. అది ఒక కవితలా కనబడింది.

‘గోడలను మట్టీ ఇటుకలతో కడతారు, కానీ ఈ గోడలను కళ్ళూ చెవులతో కట్టారు, అందులో మనసు పెట్టడం మరిచారు, దుర్భేద్యమైన ఈ అమానుషత్వపు గోడలు నేను దాటగలనా!’

ఆ వాక్యాల అర్థాన్ని యుగంధర్‌ అందరికీ వివరించాడు. రెండో కాగితం బాగా ముడతలతో మరీ క్షీణస్థితిలో ఉంది. యుగంధర్‌ చాలా జాగ్రత్తగా విప్పాడు.

‘మనిషి జీవితంలో సగం వెలుగు సగం చీకటి, కానీ నా జీవితంలో వెలుగు కేవలం ఒక గంటే మిగతాదంతా చీకటే కానీ  ఆ చీకటి నా హృదయాన్ని తాకలేదు.’ఇక చివరి కాగితంలో ఇలా ఉంది... ‘ఆహా ఈ రోజు యెంత అదృష్టం, చంద్రుని చల్లటి వెలుగు నా మనసును ఒక గంటసేపు వెలుగుతో నింపేసింది ఈ సంపూర్ణ చంద్రోదయం
నా ఈ జీవితంలో చివరిదా!’
ఇక, ఆ వాక్యాలపై చర్చ ప్రారంభమయింది. యుగంధర్‌ దాని అర్థాన్ని అందరికీ వివరించాడు. అవి తప్పకుండా సిరాజ్‌ సందేశమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే, గుల్మార్గ్‌లో తెలుగు వచ్చినవారు ఎవరూ ఉండరు. అదీకాక, ఆ వాక్యాల అర్థాన్నిబట్టి అవి ఒక బందీ అయిన వ్యక్తి రాసినట్లు తెలుస్తోంది. అతను ఉన్న గదిని కొంతమంది కాపలా కాస్తున్నట్లూ అందులో వెలుగు పగలూ రాత్రీ కేవలం ఒక్క గంట మాత్రమే ప్రసరిస్తున్నట్లూ అర్థమవుతోంది. ‘కానీ  ఆ చీకటి నా హృదయాన్ని తాకలేదు’ అన్న వాక్యం సిరాజ్‌ ధైర్యానికి ప్రతీకగా నిలిచింది.

అతను అక్కడ ఎవరికీ తెలియని తెలుగులో రాయడానికి కారణం- అది ఇతరులకు అర్థం కాకూడదనీ, తనను ఎవరైనా కాపాడతారన్న నమ్మకం ఉన్నందువలా్ల!

ఇక తర్వాతి రోజు ఆ ప్రాంతంలోనే వారి పరిశోధన జరిగింది. ఆ రోజు కేవలం ఒక్క కాగితమే దొరికింది. యుగంధర్‌ జాగ్రత్తగా విడదీసి చదివాడు.

‘నా చుట్టూ కళ్ళున్న గోడలు - రోజులో ఐదుసార్లు మూసుకుంటాయి, వారంలో ఒక్కసారి అవి కొంతసేపు మాయమై నా చెరను మరీ ఒంటరి చేస్తాయి.’ ఆ మాటలు యుగంధర్‌కు అర్థంకాలేదు. కానీ, అతని టీమ్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ సయీం సాలోచనగా చెప్పాడు. ‘‘సర్‌, కళ్ళు రోజులో అయిదుసార్లు మూసుకుంటాయి అంటే- అక్కడ కాపలా ఉన్నవారు ముస్లిమ్స్‌ అయి ఉండి, వారు రోజులో అయిదుసార్లు నమాజు చదువుతున్నప్పుడు ఈయన మీద దృష్టి పెట్టకపోవచ్చు. ఇక వారంలో ఒకసారి వారందరూ మాయమయ్యారు అంటే... ప్రతి శుక్రవారం మధ్యాహ్నపు నమాజు తప్పనిసరిగా మసీదులోనే, సమూహంగా ఇతరులతో కలిసి చదవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ నమాజు ఇంట్లో చదవకూడదు. అందుకే వారందరూ అతన్ని ఒంటరిగా వదిలేసి వెళుతుంటారు అనుకుంటాను.’’

యుగంధర్‌ సంతోషంతో సయీం వీపుపైన చరిచాడు. ‘‘కరెక్ట్‌, నీ తెలివి అమోఘం. చూశారా, మన దేశ రక్షణకు ప్రతి ఒక్కరి అవసరం ఉంది. హిందువు కావచ్చూ లేదా ముస్లిం కావచ్చు. ఇదే మన దేశ సౌభాగ్యం.’’

మరి సిరాజ్‌ ఏ ఇంట్లో బందీ అయ్యాడో ఎలా కనుక్కోవాలి? ఆ చుట్టుపక్కల దాదాపు ఇరవై ఇళ్ళు దూరం దూరంగా ఉంటాయి. ఒకవేళ పోలీసుల సహాయంతో శోధించాలంటే అందరికీ తెలిసి రచ్చ జరగవచ్చు లేదా సిరాజ్‌ కాపలాదారులు అతన్ని చంపేయవచ్చు. సిరాజ్‌ను ఎలాంటి పరిస్థితిలోనైనా రక్షించాలని పైనుంచి ఆదేశాలు. పైగా యుగంధర్‌కు కూడా సిరాజ్‌ అంటే ప్రత్యేక అభిమానం. అతని తెలుగు కవితలంటే ఇష్టం. ఒక ఆపరేషన్‌ విజయవంతం అవ్వాలంటే శిష్ట రక్షణ,
దుష్ట శిక్షణ జరగాలనేది అతని అభిప్రాయం అయినా, ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా అతను అది తన వైఫల్యంగానే భావిస్తాడు.

ఇక వారిమధ్య మేధోమథనం జరిగి, ఒక వ్యూహ్యాన్ని రచించారు. ఆరోజు శనివారం. అంటే, శుక్రవారం కోసం మరో అయిదు రోజులు వేచి ఉండాలి. ఈ అయిదు రోజుల్లో సిరాజ్‌ బందీగా ఉన్న ఇంటిని కనుక్కోవాలి.

సయీం చెప్పాడు, ‘‘సర్‌, ఇక్కడ ప్రతి ఇంటి సీలింగులో, పైన ఒక గాజు వెంటిలేటర్‌ ఉంటుంది. చలికాలంలో తలుపులూ కిటికీలూ అన్నీ మూసేస్తారు కనుక, పైనుంచి వెలుగు వచ్చేందుకు ఆ అమరిక ఉంటుంది. సిరాజ్‌ కేవలం ఒక గంట వెలుగు అని చెప్పారు. అంటే, అది తప్పకుండా సీలింగ్‌ వెంటిలేటరే. ఈ ఇళ్ళ చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయి కనుక బహుశా సూర్యుడు మధ్యాహ్నం నిట్టనిలువున ఉన్నపుడే ఆ వెలుతురు గదిలోకి తొంగి చూస్తుందనుకుంటాను.’’

‘‘అంటే, ఈ ఐదు రోజుల్లో మనం ఆ ఇంటిని కనుక్కోవాలి. మనం సరిగ్గా మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి, పన్నెండున్నర గంటల వరకు ఆ ఇంటి వెంటిలేటర్‌ను మూయగలిగితే, దాని గురించి సిరాజ్‌ మనకో సందేశం ఇవ్వగలిగితే, మనం విజయం సాధించవచ్చు. అది సాధించేందుకు మనం ఏం చేయాలో చర్చిద్దాం’’ అన్నాడు యుగంధర్‌.

ఇదంతా వింటున్న ఇన్‌స్పెక్టర్‌ ఆంటోని చెప్పాడు ‘‘సర్‌, మన దగ్గర డ్రోన్‌ ఉంది, మనం ఈ చెట్లపైకి ఎక్కి ప్రతి ఇంటి వెంటిలేటర్‌పైన డ్రోన్‌ను ల్యాండింగ్‌ చేయిస్తే, ఆ గదిలో వెలుగు పడక చీకటిని సృష్టించవచ్చు. కానీ, మనం రోజుకొక్క ఇంటినే ఎంచుకోవాలి. అంటే, ఈ అయిదు రోజుల్లో అయిదు ఇళ్ళు మాత్రమే పరిశోధించగలం. ఈ అయిదు రోజుల్లో మనం కనుక్కోలేకపొతే, మరో వారం వేచిఉండాలి.’’

ఇన్‌స్పెక్టర్‌ వర్మ చెప్పాడు ‘‘సర్‌, ఈమధ్య పత్రికల్లో ఈ రాష్ట్ర హోమ్‌ మంత్రిమీద, అతను పాకిస్తాన్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని అనేక ఆరోపణలు వస్తున్నాయి. కనుక మనం ముందుగా అతని ఇంటిమీదే ఈ ప్రయోగం చేద్దాం. అతను ఎప్పుడూ శ్రీనగర్‌లోనే ఉంటూ ఇక్కడకు అప్పుడప్పుడూ వస్తుంటాడు. మన డ్రోన్‌ ఎక్కువ శబ్దం చేయకుండా స్పాంజి తొడుగు వేద్దాం. అది వేస్తే ఇంట్లో ఉన్నవారికి శబ్దం వినపడదు.’’

‘‘వెరీగుడ్‌. ఆంటోనీ, వర్మా... మీ ఆలోచనలు బాగున్నాయి, వాటినే అమలుచేద్దాం’’ చెప్పాడు యుగంధర్‌.

ఆ మరుసటిరోజు ఆ ఇళ్ళకు కాస్త దూరంగా ఉన్న ‘లీన్మార్గ్‌’ చెట్లను ఎంచుకున్నారు. ముందుగా హోమ్‌మంత్రి ఇంటిని ఎంచుకోలేదు. కారణం, ఇతర ఇళ్ళ మీద ప్రయోగం ఫలిస్తే ఆ తర్వాత ఆయన ఇంటిమీద ప్రయోగాన్ని విజయవంతంగా చేయవచ్చు. మర్నాడు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఎవరూ చూడకుండా ఒక పెద్ద చెట్టు ఎక్కి, బైనాక్యులర్స్‌ ఉపయోగించి ఒక ఇంటి వెంటిలేటర్‌పైన డ్రోన్ను దించారు. అది చాలా తక్కువ శబ్దం చేస్తున్నందున ఎవరికీ అనుమానం రాలేదు. మరుసటిరోజు వాళ్లకెలాటి సందేశం దొరకలేదు. రెండోరోజూ డ్రోన్‌తో తమ ప్రయోగాన్ని అమలుచేశారు. ఫలితం లేదు. వారిలో ఒక విధమైన ఒత్తిడి బయలుదేరింది. మూడోరోజు హోమ్‌మంత్రి ఇంటిమీదకే ప్రయోగించారు. ఆ మరుసటిరోజు వారికో కాగితం దొరికింది. దాన్ని తీసుకుని అందరూ గదిలో చేరారు. యుగంధర్‌ ఆ వాక్యాలను బిగ్గరగా చదివాడు.

‘ఇది నా అదృష్టమా, ఆశ్చర్యంగా ఉంది, అంత తొందరగా సుదర్శన చక్రం సూర్యుడిని కప్పేసిందా జయద్రథుని చివరి క్షణాలు దాపురించాయా ఎవరా కృష్ణుడు, ఎవరా అర్జునుడు?’ కాసేపు ఆలోచించిన మీదట యుగంధర్‌ నవ్వసాగాడు. సంతోషంతో బొటనవేలు ఎత్తి విజయసూచకంగా అందరికీ చూపించాడు. కురుక్షేత్రం యుద్ధంలో పద్నాలుగోరోజు దుర్యోధనుడి సోదరి దుస్సల భర్త జయద్రథుణ్ణి కాపాడేందుకు కౌరవులు అతన్ని సైన్యం మధ్య దాచి ఉంచితే, కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని పంపి సూర్యుడిని కాసేపు మూసి కృతిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడం; ఆ రోజుకు యుద్ధం ముగిసిందనుకుని జయద్రథుడు పక్కకు రాగా అతన్ని అర్జునుడు చంపడం... తన సహచరులకు వివరించాడు. ఆ గది నవ్వులతో నిండిపోయింది.

వారికి తమ లక్ష్యం తెలిసింది. ఇక శుక్రవారం కోసం ఎదురు చూశారు. సయీం చెప్పాడు, ‘‘శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటలవరకు నమాజు ఉంటుంది. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న మసీదుకు పోయేందుకు పదిహేను నిమిషాలు, వచ్చేందుకు పదిహేను నిమిషాలు, అంటే ఒంటి గంటా పదిహేను నిమిషాల నుంచి రెండుగంటలా పదిహేను నిమిషాల లోపల ఆపరేషన్‌ పూర్తి కావాలి.’’

యుగంధర్‌ చెప్పాడు ‘‘ఇస్లాం సూత్రాల పుణ్యాన వారి నమాజు ప్రపంచంలో ఎక్కడైనా ఒకే సమయంలో జరుగుతుంది కనుకే మన ప్లాన్‌ను విజయవంతం చెయ్యగలం. ఆ పద్ధతిని కనుగొన్న వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.’’

శుక్రవారం రానే వచ్చింది. ఆరుగురూ సిద్ధమై, పదకొండు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఒక్క యుగంధర్‌ వద్ద మాత్రమే గన్‌ ఉంది. మిగిలినవారి ఆయుధాలను అతను తీసుకుని రావద్దన్నాడు. కుర్రాళ్ళు- ఏ కాస్త ఆవేశమొచ్చినా కాల్పులు ప్రారంభిస్తారని అతని భయం. వారికి కూడా తమ నాయకుడిపైన పూర్తి విశ్వాసముంది. వారు ఆ ఇంటి దగ్గర తచ్చాడుతూ పూలు ఏరుకోసాగారు. గతవారం రోజులుగా వీరిని చూస్తున్నందున కాపలావారికి ఎలాంటి అనుమానం రాలేదు. ఒంటిగంటా పదినిమిషాలకు హోమ్‌మంత్రి ఇంటినుంచి అయిదుగురు - ఇంటికి తాళం వేసి మసీదుకు బయలుదేరారు. యుగంధర్‌ సైగతో సయీం కూడా వారితోపాటు మసీదుకు బయలుదేరాడు. వారు వెళ్ళిన పది నిమిషాలకు వర్మ ఆ కాంపౌండ్‌ దూకి లోనికి వెళ్ళాడు. మారు తాళంతో తలుపు తీసేందుకు అతనికి రెండు నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టలేదు. అతను లోనికెళ్ళి ఒక్కో గది తలుపు తీసి చూశాడు. మధ్యలో ఉన్న ఒక గదిలో సిరాజ్‌ మగతగా పడుకుని ఉన్నాడు. వర్మ తన సెల్‌ఫోన్లో ఒక మిస్డ్‌ కాల్‌ ఇచ్చాడు. అది చూస్తూనే ఆంటోని ప్రహరీ తలుపు తాళాన్ని మారు తాళంతో తీసి లోనికి వెళ్ళాడు. మరో ఇన్‌స్పెక్టర్‌ తమ వాహనంతో సిద్ధంగా ఉన్నాడు. యుగంధర్‌ లోనికెళ్ళి సిరాజ్‌తో ‘‘కృష్ణుడు వచ్చాడు’’ అని మెల్లగా చెప్పాడు. ఆ మాటతో సిరాజ్‌ ఉలిక్కిపడి నవ్వుతూ లేచి కూర్చున్నాడు. అతన్ని వాహనంలో ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టి, ఆ ఇంటికి తిరిగి తాళాలు వేసి బయలుదేరారు. ఈలోగా సయీంకు తిరిగి రమ్మని సందేశం పెట్టారు. వారు సయీంను దారిలోనే తమతో ఎక్కించుకుని వేగంగా శ్రీనగర్‌ వైపు బయలుదేరారు. కొద్దిదూరం పోగానే వారిచ్చిన సందేశంతో ఒక హెలికాప్టర్‌ ఎగురుతూ వచ్చి రోడ్డు పక్కన దిగింది. ఒక్క సయీం తప్ప మిగిలిన అందరూ అందులో ఎక్కి దిల్లీ వచ్చేశారు. ఈ మధ్య సమయంలో కాశ్మీర్‌ పోలీసులు ఆ ఇంటిలోని అయిదుగురిని నమాజు నుంచి వస్తూనే అరెస్ట్‌ చేశారు.

ఈ విషయం తెలియగానే కాశ్మీర్‌ హోమ్‌ మంత్రి, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు పారిపోయాడు. సయీం వాహనాన్ని శ్రీనగర్‌లో అప్పగించి, విమానంలో దిల్లీ వచ్చేశాడు. ఎంతో కష్టమనుకున్న ఆపరేషన్‌ను యుగంధర్‌ జట్టు తెలివీ సమయస్ఫూర్తితో ఎంతో సులువుగా, ఒక్క రక్తపుబొట్టు కూడా చిందకుండా పూర్తిచేసింది.

ఆ మరుసటిరోజు కేంద్ర హోమ్‌ మంత్రి పత్రికా సమావేశం ఏర్పాటుచేసి జరిగిన విషయాన్నీ, పాకిస్తాన్‌ కుయుక్తులనూ ప్రపంచానికి తెలిపి, సిరాజుద్దీన్‌ను పోలీసు రక్షణతో హైదరాబాద్‌ పంపుతున్నామని వెల్లడించారు. చివరిగా యుగంధర్‌ జట్టును ప్రశంసిస్తూ ‘ఇకమీదట పోలీసులు తెలివీ ధైర్యాలతో బాటు, కాస్త సాహిత్య పిపాస కూడా కలిగి ఉండా’లని చెబుతుంటే అక్కడ నవ్వులు విరిశాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.