close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహా‘ప్రసాదం’..!

అది ఆ దేవుడి మహాత్మ్యమో అక్కడ వండే విధానమో తెలియదుగానీ కొన్ని ప్రసాదాలు అమృతంతో సమానం. ఆ రుచి కేవలం ఆ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం. అందుకే ఆ ఆలయం పేరుతో ప్రసాదం అనగానే భక్తులే కాదు, నాస్తికులు సైతం వద్దనకుండా తింటారు. అలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అద్భుత రుచికరమైన ప్రసాదాల్లో కొన్ని...

తిరుమల లడ్డూ!
ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల లడ్డూనే. ఆ పేరు వినగానే ఆ శ్రీనివాసుడి సుందరరూపంతోబాటు అమృతతుల్యమైన లడ్డూ రుచి నోరూరిస్తుంటుంది. సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ లడ్డూని తింటే ఆ వెంకటాచలపతిని దర్శించినట్లే భావిస్తారు భక్తులు. అందుకే వెళ్లిన వాళ్లంతా పోటీపడి లడ్డూలు తెచ్చి పంచుతారు. పూర్వం రాళ్లూరప్పలూ దాటుకుంటూ కొండమీదకి నడిచి వెళ్లిన భక్తులు శ్రీవారి ప్రసాదం తినగానే శ్రమంతా మరిచిపోయేవారట. ప్రస్తుతం అక్కడ రోజూ దాదాపు రెండు లక్షల లడ్డూలు తయారుచేస్తున్నారు. లడ్డూ తయారీకి అవసరమైనవన్నీ కొచ్చిలోని మార్కెట్‌లో కొని ఆలయంలోని ప్రత్యేక వంటశాల(పోటు)లో వండుతారు. మొదట్లో అరకిలో పరిమాణంలో లడ్డూ తయారుచేసేవారట. ధర అణా. ప్రస్తుత లడ్డూ పరిమాణం వంద గ్రాముల్ని మించదు.

సత్యదేవుడి ప్రసాదం!
ప్రసాదానికి మారుపేరే అన్నవరం సత్యనారాయణస్వామి గోధుమరవ్వ ప్రసాదం. ఆ మహాత్మ్యం ఆ సత్యదేవుడిలో ఉందో ప్రసాదంలో ఉందో తెలియదుకానీ ఎవరు వ్రతానికి పిల్చినా వెళ్లి కథ విని ప్రసాదం అందుకునిగానీ ఇంటికి వెళ్లరు భక్తులు. అందులోనూ అన్నవరం ప్రసాదం అంటే అడిగి మరీ తింటారు. గోధుమరవ్వ, నెయ్యి, బెల్లంతో తయారుచేసి విస్తరాకుల్లో అందించే దీని రుచి ఎక్కడా దొరకదు మరి.

అయ్యప్ప అరవణ
అయ్యప్పస్వామి దగ్గరకు వెళ్లిన గురుస్వాముల్ని మాకో రెండు ప్రసాదం డబ్బాల్ని తీసుకొస్తారా అనడిగే భక్తులు కోకొల్లలు. లేహ్యంలా ఉండే అయ్యప్ప అరవణ రుచి అలాంటిది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా మళ్లీ చెయ్యి చాపుతుంటారు. బియ్యం, నెయ్యి, బెల్లంతో చేసే ఈ ప్రసాదం వెనక చాలా పెద్ద కథే ఉంది. బాలుడుగా ఉన్న అయ్యప్పను పందళం రాజా చీరప్పంచిరలో ఉన్న కలరి(యుద్ధశాల)లో చేర్పించాడట. దాని నిర్వాహకుడైన ఫణిక్కర్‌ కుమార్తె మణికంఠుడిని ప్రేమించిందట. అయితే అయ్యప్ప ఆ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదట. దాంతో ఎలాగయినా అతని దృష్టిలో పడాలని అతనికోసం రోజూ భోజనం తీసుకొచ్చేదట. ఈలోగా ఆమె రజస్వల కావడంతో ఆ అమ్మాయికి ఇంట్లోవాళ్లు బియ్యం, బెల్లం కలిపి రుమాతికంజి అనే పాయసాన్ని చేసి పెట్టారట. అది ఆమె మణికంఠుడికి తీసుకురాగా, అది నచ్చి రోజూ అదే తెమ్మనేవాడట. అలా ఆ పాయసమే అయ్యప్ప ప్రసాదంగా మారింది. స్వామిగా మారిన అయ్యప్ప, ఆ అమ్మాయి ప్రేమనుఒప్పుకోలేదుగానీ శబరిమల సమీపంలోని సారంకుతిలో మాలికాపురాతమ్మ దేవతగా స్థానమిచ్చాడని చెబుతారు. ఆ ప్రసాదానికున్న డిమాండ్‌ దృష్టిలో పెట్టుకునే పోస్టులో పంపే ఏర్పాటూ చేశారు నిర్వాహకులు.

పంచామృతం!
పళని... పేరు వినగానే దండాయుధపాణి రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఆపై అమృతంతో సమానమైన పంచామృతమే గుర్తుకొస్తుంది. అరటిపండ్లు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాట్టుసక్కరై(ఒక రకమైన బెల్లం), పటికబెల్లంతో చేసే ఈ పంచామృతానికి సాటి లేదు అంటారు దండాయుధపాణి భక్తులు. ఇందులోని ఈ ప్రత్యేక రుచికి విరుపాచ్చి అరటిపండ్లే కారణమంటారు ఆలయ నిర్వాహకులు. పంచామృతం కోసమే ఈ పండ్లను పళని కొండలమీదే పండిస్తారు. చాలా కొద్దిగా మాత్రమే నీటిని పెట్టి పండించే ఈ కాయలు చాలా చిన్నగా ఉంటాయి. కొండదిగువన ఉన్న ఫ్యాక్టరీలో రోజంతా పంచామృతం తయారవుతూనే ఉంటుంది. ఒకప్పుడు చేత్తోనే దీన్ని కలిపేవారు. అయితే రోజురోజుకీ దీనికి డిమాండ్‌ పెరగడంతో ఇటీవల ఆటోమేటిక్‌ మెషీన్లలో తయారుచేసి అమ్ముతున్నారు. నిజానికి దీన్నో  పోషకభరితమైన ఫ్రూట్‌జామ్‌గా చెప్పవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టకుండానే మూడు నెలలపాటు నిల్వ ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత.

పార్థసారథి పులిహోర
చెన్నై ట్రిప్లికేన్‌, పార్థసారథి ఆలయం పేరు చెప్పగానే అక్కడి పులిహోర, పొంగలి గుర్తుకొస్తాయి భక్తులకు. ప్రతిరోజూ ఇక్కడి కృష్ణభగవానుడికి ప్రసాదంగా వీటినే చేస్తారట. అదే ఉచితంగా భక్తులకూ పంచుతారు. బెల్లం, యాలకులు, బియ్యం. పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పుతో చేసే ఈ పొంగలి రుచి మరెక్కడా ఉండదట. బెల్లాన్ని విడిగా తీగపాకం రానిచ్చి చేసే ఈ పొంగలిని అందరిలా పాత్రలో కాకుండా రాచిప్పలో చేస్తారు. ఇక చింతపండు పులిహోరలో ఎండుమిర్చికి బదులు పూర్తిగా మిరియాలు మాత్రమే వాడటంతో దీనికో ప్రత్యేకమైన రుచి వస్తుందట. ‘అసలే భీష్మ, ద్రోణుల బాణాలు తగిలి గాయాలతో ఉన్న పార్థసారథికి అవి ఇంకా మండుతాయన్న కారణంతో మిర్చి వేసి ప్రసాదం పెట్టం’ అన్నది నిర్వాహకుల వివరణ. ఈ రెండూ ఇంకా కావాలనుకున్నవాళ్లు రెండు రోజుల ముందే బుక్‌ చేసుకుని వెళ్లాల్సిందే. అప్పటికప్పుడు అంటే అస్సలు దొరికే ప్రశ్నే లేదట.

గురుద్వారా లంగర్‌
స్వర్ణదేవాలయాన్ని సందర్శించినవారంతా అక్కడున్న లంగర్‌ హాల్లోకి తప్పక వెళతారు. గురు కా లంగర్‌గా పిలిచే ఈ హాల్లో ప్రతిరోజూ లక్షమందికి ప్రసాదం పెడతారు. గురుపురాబ్‌, దీపావళి సమాయాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఒక్క చపాతీలకోసమే పదివేల కిలోల గోధుమపిండి వాడతారట. ఇంట్లో ఎన్ని రకాలున్నా సందర్శకులు లంగర్‌ రుచి చూడకుండా వెనుతిరగరు. దీంతోబాటు కడా ప్రసాద్‌(గోధుమ హల్వా), ఖీర్‌, టీ కూడా ఇస్తారు. గోధుమహల్వా అయితే భక్తులకు పంచేందుకు సుమారు 2500 కిలోలకు పైనే తయారుచేస్తారట. అది ఒకసారి తిన్నాక మారు అడగని భక్తులు ఉండరు మరి.

కిట్టయ్య చక్కిలం
ఉడిపి శ్రీకృష్ణుణ్ని తలచుకోగానే రకరకాల లడ్డూలూ మురుకులూ నోరూరిస్తాయి. జన్మాష్టమికయితే ప్రసాదాలను చాలా పెద్ద మొత్తంలో చేస్తారు. మినప్పిండి, బియ్యప్పిండితో చేసే చక్కిలాల రుచే రుచి అంటారు భక్తులు. ఇక రవ్వ, బూందీ, నువ్వులు, మరమరాలతో ఐదు రకాల లడ్డూలు తయారుచేసి వాటిని ఆ రోజున చుట్టుపక్కలున్న వందలాది పాఠశాలల్లో పంచుతారట.

కాళీఘాట్‌ పలావ్‌
పలావ్‌ తింటే కోల్‌కతాలోని ఆలయంలోనే తినాలి అంటారు కాళికామాత భక్తులు. అక్కడ మంగళ, శని, ఆదివారాల్లో వంద కిలోల బియ్యంతో పలావ్‌ చేస్తారు. మిగిలిన రోజుల్లో సుమారు 70 కిలోల వరకూ వండుతారట. దీంతోపాటు ఐదు రకాల వేపుళ్ల కూరలు, పప్పు, మటన్‌, చేప, చట్నీ, పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాక భక్తులకు వడ్డిస్తారు. ఈ ప్రసాదం రుచికోసమే ఆలయాన్ని సందర్శించేవాళ్లూ ఉంటారట. ఇంకా రోజూ కిచిడీని వండి పేదలకు పంచుతారు. అదీ అంతే రుచిగా ఉంటుందట.

ఇక, పూరీ క్షేత్రంలోని అన్నభోగాన్ని మించిన మహాప్రసాదం మరేదీ లేదు. రుచిలో దానికదే సాటి అంటారు భక్తులు. అలాగే మదురై అళగర్‌ కోవెల దోశ, స్కందగిరి వినాయకుని పొంగలి... ఇలా వేటి రుచి వాటిదే. అందుకే ఆయా ఆలయాల్ని సందర్శించినవాళ్లు ఆ ప్రసాదాల్ని తినకుండా వెనుతిరగరు. ఎందుకంటే అవి దైవప్రసాదాలు..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.