close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ స్కూళ్లు ఎంతో ప్రత్యేకం!

స్కూల్‌ అనగానే క్లాస్‌ రూమూ, సిలబస్‌, పాఠాలూ, పరీక్షలూ ఉంటాయి. కానీ ఈ స్కూళ్లలో అలాంటివేం ఉండవు. బెత్తం పట్టుకున్న టీచర్లే కనిపించరు. అవసరం, వైవిధ్యాల కలబోతగా తీర్చిదిద్దిన ఈ స్కూళ్లు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే...

అమ్మాయిలకే ఈ సాగుబడి

ఖ్‌నవూకి చెందిన అనీశ్‌నాథ్‌, ఆశ్రితలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వ్యవసాయమంటే ఆసక్తి ఉండటంతో ఉన్నావ్‌ జిల్లాలోని పశ్చిమ్‌గావ్‌లో కొంత స్థలం కొని సాగు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతుల సమస్యలెన్నింటినో ప్రత్యక్షంగా చూశారు. దాంతో కృషి విజ్ఞాన కేంద్రం సాయంతో వారికి సలహాలూ, సూచనలూ ఇప్పించడం మొదలుపెట్టారు. కానీ వాటిని రైతులు సరిగా అర్థం చేసుకునేవారు కాదు. ఇవన్నీ గమనించాక కనీసం అన్నదాతల పిల్లలకైనా వ్యవసాయ పాఠాలు నేర్పించడం మంచిదనుకున్నారు. ఆడపిల్లలకి చదువూ, సాగూ నేర్పిస్తే కుటుంబమంతటికీ ఆ నైపుణ్యాలు పనికొస్తాయని భావించారు. అలా మూడేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ‘ది గుడ్‌ హార్వెస్ట్‌’ పేరుతో వ్యవసాయ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు అనీశ్‌నాథ్‌ దంపతులు. మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణా, విత్తనబ్యాంకూ, పశువులూ, పక్షుల పెంపకం వంటి అంశాల్లో అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్నారు. కాయగూరలూ, పండ్ల మొక్కలూ, తృణధాన్యాలూ, బ్రకోలీ, ఊదారంగు క్యాబేజీ వంటి ఎన్నో రకాల్ని పిల్లలచేతే సాగు చేయిస్తున్నారు. ఇలా వ్యవసాయంలో మెలకువలతోపాటు ప్రత్యేకంగా ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ కోర్సులూ నేర్పిస్తున్నారు.

దివ్యాంగులకు డ్రైవింగ్‌!

జైపుర్‌కి చెందిన అనితా శర్మ పోలియో బాధితురాలు. ఐఐఎమ్‌ ఇండోర్‌ నుంచి ‘డిజెబిలిటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ అనే అంశంలో పీహెచ్‌డీ చేసింది. ప్రస్తుతం ఐఐఎమ్‌ అమృత్‌సర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఆమె క్యాంపస్‌కి వెళ్లాలంటే ఎవరో ఒకరి మీద ఆధారపడక తప్పదు. దాంతో డ్రైవింగ్‌ నేర్చుకుని కారులో వెళదామనుకుంది. కానీ పోలియో వల్ల నడవలేని అనితకి ఎవరూ డ్రైవింగ్‌ నేర్పించడానికి ముందుకు రాలేదు. దాదాపు రెండు వేల స్కూళ్లని సంప్రదించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె కారు కొనుక్కుని డ్రైవింగ్‌లో కాళ్ళు చేసే పనిని కూడా చేతులతోనే చేయగలిగేలా మార్పులు చేయించుకుంది. తెలిసినవారి సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకుని లైసెన్స్‌ తెచ్చుకుంది. అది చూసిన కొందరు దివ్యాంగులు అనితని శిక్షణ ఇవ్వమని అడగడం మొదలుపెట్టారు. ఆమె వద్ద డ్రైవింగ్‌ నేర్చుకున్నవారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కారుల్లో దూసుకుపోవడం చూసిన అనిత అమృత్‌సర్‌లో రెండేళ్ల క్రితం ‘ఆన్‌ మై ఓన్‌’ పేరుతో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించింది. దివ్యాంగులకు డ్రైవింగ్‌ నేర్పించడంతోపాటు అధికారుల చొరవతో లైసెన్సు, రాయితీ ధరలతో కూడిన ఇంధనమూ ఇప్పిస్తోంది.

ఆదివాసీలకే ఈ బడి!

మిళనాడులోని మారుమూల గ్రామానికి చెందిన శివరాజ్‌ బాగా చదువుకున్నాడు. చిన్నతనం నుంచీ సేవంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయ్యాక వసతులకు నోచుకోని గిరిజన గ్రామాల బాట పట్టాడు. ఈ క్రమంలో అడవిబిడ్డలు చదువులకు దూరమవడంతోపాటు తమ వృత్తుల్నీ పక్కనపెట్టేసి వలస వెళ్లడం గమనించిన శివరాజ్‌ వారి జీవితాల్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట కృష్ణగిరి జిల్లాలో ఓ లైబ్రరీ ఏర్పాటు చేశాడు. పిన్నల నుంచీ పెద్దల వరకూ చదవడం, రాయడం నేర్పించాడు. ఆ తరవాత చదువుతోపాటు ఇతర కళలూ, వృత్తులూ నేర్పించాలని రెండేళ్ల క్రితం సింగరిపెట్టై గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో కుక్కూ పేరుతో స్కూల్‌ తెరిచాడు. ఈ స్కూల్‌లో చదువూ, ఆటలతోపాటు సంగీతం, పెయింటింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, సేంద్రియ వ్యవసాయం, థియేటర్‌ ఆర్ట్స్‌ వంటివెన్నో నేర్పించడం మొదలుపెట్టాడు. సినిమా, సోషల్‌మీడియా, సైన్సు విషయాలు, కొత్త పుస్తకాలూ, రాజకీయాలు... ఇలా ఎన్నో అంశాలపై ప్రముఖుల ఆధ్వర్యంలో చర్చలు పెట్టి చిన్నారుల్ని మాట్లాడిస్తారు. రైతులూ, సంగీత నిపుణులూ, పెయింటర్లూ, జర్నలిస్టులూ, సినిమా దర్శకులూ, రచయితలూ... ఇలా ఆయా అంశాల్లో నిపుణులైన వారే పాఠాలు చెబుతారు. కుక్కూ ఫారెస్ట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తయ్యేసరికి పిల్లలు సొంతంగా వ్యవసాయం చేస్తారు. మట్టిఇళ్లూ నిర్మిస్తారు. గిరిపుత్రులకు చదువుతోపాటు జీవననైపుణ్యాలనూ నేర్పిస్తున్న శివరాజ్‌ సేవలకు ఎందరో దాతలు స్పందించి ఆర్థికంగా సాయపడుతున్నారు. మరికొందరు వారాంతాల్లో కుక్కూ స్కూలుకొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.