close
అనగనగా ఏడుగురు అమ్మాయిలు..!

రాజభవనంలాంటి ఇల్లు... అందులో రాకుమార్తెల్లాంటి ఏడుగురు అమ్మాయిలు. నవ్వులూ ఆట పాటలూ గిల్లికజ్జాలూ ప్రేమానురాగాలూ... వారి మధ్య అన్నీ ఎక్కువే. అలా అని ఆ అమ్మాయిలు అక్కా చెల్లెళ్లు కాదు, ప్రాణ స్నేహితులు. రిటైరయ్యాక కూడా వారందరూ కలసే ఉండాలని కోరి కట్టుకున్న పొదరిల్లే విలాసవంతమైన ఆ ఇల్లు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ అపూర్వ స్నేహితుల కథేంటో చూద్దామా.

గాంగ్‌జౌ... చైనాలోని గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని ఓ పల్లె. చుట్టూ ఎత్తైన కొండలూ పచ్చటి పొలాలూ. ఆ ఊరి చివర నాలుగంతస్తుల్లో ఓ అద్దాల మేడ. ఇంట్లోని ఏ వైపు కిటికీల్లో నుంచి చూసినా కనుచూపు మేర పచ్చటి పంట పొలాలే కనిపిస్తాయి. అంతేకాదు, ఇంటి వెనకభాగం నుంచి నేరుగా పొలంలోకి ఓ కర్రల వంతెన కూడా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే రాజకుమార్తెల్లాంటి ఏడుగురు అమ్మాయిలు దానిమీద నడుచుకుంటూ పొలం మధ్యలో ఉన్న మంచె మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతుంటే చూడ్డానికి ఆ ఊరి వారికి రెండు కళ్లూ చాలవట. ఇంతకీ ఈ అమ్మాయిలు ఎవరంటారా... ఒకప్పుడు సహోద్యోగులు. చిన్న వయసులోనే చదువుకుంటూ ఓ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ పరిచయం కాస్తా విడదీయరాని స్నేహంగా మారింది. అలా పదేళ్ల కిందట ఓరోజు ‘మనం ఎప్పటికీ ఇలాగే కలసి ఉండాలి. ముఖ్యంగా రిటైరయ్యాక అందరం ఒకే ఇంట్లో ఉండాలి’ అనుకున్నారు. కొన్నిరోజులకు... ‘ముసలివాళ్లం అయ్యేవరకూ ఎందుకూ... మనకోసం ఓ కలల సౌధాన్ని కట్టుకుని ఇప్పట్నుంచే కలిసుందాం’ అని నిర్ణయించుకుని డబ్బుని పోగు చెయ్యడం మొదలుపెట్టారు. అలా గతేడాది రూ.నాలుగు కోట్లకు పైగా ఖర్చుపెట్టి గాంగ్‌జౌ గ్రామంలో ఇంద్రభవనమంటి ఇంటిని కట్టేసుకున్నారు.

ఇంద్రభవనమే...
నాలుగంతస్తుల్లో, 7,535 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లోని కింది అంతస్తులో అందరూ కలసి ఉండడానికి వీలయ్యేలా ఏర్పాట్లుంటాయి. అక్కడున్న పెద్ద వంటగదిలో ఏడుగురూ కలసి వంట చేసుకుంటారు. డైనింగ్‌ హాల్లో వారివారి కుటుంబాలతో సహా కూర్చుని తింటారు. అవును, ఈ అమ్మాయిలందరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. పై అంతస్తుల్లో ప్రతి కుటుంబానికీ విడిగా పడకగదులుంటాయి. వీటితోపాటు స్విమ్మింగ్‌పూల్‌, అత్యాధునికంగా నిర్మించిన స్నానాల గదులు, భారత్‌, మొరాకో నుంచి తెప్పించిన ఫర్నిచర్‌... ఆ ఇంటిని మరింత విలాసవంతంగా మార్చేశాయి. ‘పదీ పదిహేనేళ్లలో మా పిల్లలు పెద్దవాళ్లయి ఉద్యోగాల కోసం దూరంగా వెళ్లిపోతారు. అప్పుడు ఒంటరితనం దరిచేరనీయకుండా ఇప్పట్నుంచే మేమందరం కలసి ఉంటున్నాం. అంతేకాదు, వంటచేయడం, కూరగాయలు పండించడం, సంప్రదాయ చైనా ఔషధాల తయారీ... ఇలా మాలో ఒక్కొక్కరం ఒక్కో పనిలో నిష్ణాతులం కావాలని ముందే నిర్ణయించుకున్నాం. దీనివల్ల మేం ఒకరిమీద ఒకరం ఆధారపడి ఉంటాం. కాబట్టి చిన్న చిన్న గొడవలైనా వెంటనే కలసిపోతామన్నది మా నమ్మకం’ అంటుంది ఏడుగురు స్నేహితుల్లో ఒకరైన జిన్‌ డు. ఏ రక్త సంబంధం లేని ఏడుగురు స్నేహితులు... అదీ ముప్ఫై ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఒకే ఇంట్లో కుటుంబాలతో సహా కలసి ఉండాలనుకోవడం, ఉండడం ఎవరూ ఎక్కడా చూసుండరు. అందుకే, వీరి కథ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.



ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.