close
గాజు బొమ్మలకు అమ్మ!

ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్ఫెక్టా(ఓఐ) అనేది ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధి. శరీరంలో ఎముకలు పెళుసుబారి ఏ కాస్త ఒత్తిడి తగిలినా విరిగిపోతుంటాయి. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధితో పోరాడుతున్న వారిని గాజుబొమ్మలకంటే భద్రంగా చూసుకోవాలి. కుటుంబసభ్యులు సైతం నిర్లక్ష్యం చేసిన అలాంటి వారికి అమ్మగా మారిన లతా నాయర్‌ వారికి చికిత్సలు చేయిస్తూ ఉపాధి చూపుతోంది. ప్రతినెలా పింఛను ఇస్తూ వారి చిన్ని చిన్ని కోరికల్నీ నెరవేరుస్తోంది.

త నెలలో చక్రాలకుర్చీ, ఆక్సిజన్‌ సిలిండర్‌తో వెళ్లి మరీ సివిల్స్‌ పరీక్ష రాసింది కేరళలోని కొట్టాయంకు చెందిన లతీషా అన్సారీ. ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్ఫెక్టాతో బాధపడుతున్న లతీషా నడవలేదూ, శ్వాస తీసుకోలేదు. అఖరికి గట్టిగా దగ్గినా, తుమ్మినా ఆమె శరీరంలో ఎముకలు విరిగే ప్రమాదముంది. అలాంటి పరిస్థితుల్లోనూ లతీషా పరీక్ష రాసిందంటే దాని వెనక లతా నాయర్‌ కృషి ఎంతో. అమృతవర్షిణి స్వచ్ఛంద సంస్థ ద్వారా అలాంటి వారి బాగోగులు చూసుకుంటూ వారి కలల్ని నెరవేరుస్తున్నలత స్వస్థలం తిరువనంతపురం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లత కేరళ స్టేట్‌ ఫిషరీస్‌ బోర్డులో పనిచేసేది. పందొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో భర్తనీ, ఒక్కగానొక్క కూతుర్నీ పోగొట్టుకుంది లత. దాంతో ఒంటరిదై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. బంధువుల సాయంతో డిప్రెషన్‌ నుంచి బయటపడిన ఆమెకు ఆస్టియోజెనెసిస్‌తో బాధపడే బీనూ దేవస్య గురించి తెలిసింది. ఆ వ్యాధి పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యనీ, ఎముకలు పెళుసుబారి ఏ కాస్త ఒత్తిడి పడినా విరిగిపోతాయనీ, ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకోవడం అసాధ్యమనీ తెలిసి బాధపడింది. దాంతో పేద కుటుంబానికి చెందిన బీనూ కోసం విరాళాలు సేకరించి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించింది. దాంతో అప్పటివరకూ మంచానికే పరిమితమైన ఆ అబ్బాయి కూర్చునే స్థాయికి వచ్చాడు. అలా బీనూకి కొంతైనా మేలు జరగడంతో అలాంటి సమస్యలతో బాధపడేవారికి చేతనైన సాయం అందించాలనుకున్న లత 2009లో అమృతవర్షిణి పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.

అన్నింట్లో అండగా...
15వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఆస్టియోజెనెసిస్‌ గురించి గ్రామీణప్రాంతాల్లో చాలామందికి అవగాహనలేక వైద్యం చేయించకుండా రోగుల్ని నాలుగ్గోడలకే పరిమితం చేయడం కళ్లారా చూసింది లత. దాంతో బాధితులకూ, వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ చేస్తూ వారి ఆసక్తులను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. స్కూళ్లూ, కాలేజీలూ ఒప్పుకోకపోతే పోరాడి మరీ ఆస్టియోజెనెసిస్‌ బాధితులకు అడ్మిషన్లు ఇప్పించింది. ఇంటర్‌, డిగ్రీ వరకూ చదువుకున్న వారికి ఉద్యోగాలూ ఇప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరమ్మాయిలు కూడా లత సాయం తీసుకున్నవారిలో ఉన్నారు. చిత్తూరుకు చెందిన శిరీష బాగా చదువుకుని బెంగళూరులోని ఓ బ్యాంకులో అనలిస్టుగా పనిచేేస్తోంది. ఆమె గతేడాది కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తమ ఉద్యోగిని అవార్డునూ అందుకుందంటే అదంతా లత చలవే. అలానే ఎవరైనా సొంతంగా వ్యాపారాలు పెట్టుకుంటానంటే బ్యాంకులో ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పిస్తోంది. లత సాయంతో దాదాపు యాభై మంది కిరాణా దుకాణాలూ, మిల్క్‌బూత్‌లూ, పౌల్ట్రీలూ వంటివి పెట్టుకుని తమ కాళ్లమీద తాము బతుకుతున్నారు. అంతేకాదు, దాదాపు వెయ్యి ఫ్రాక్చర్లైనా ఆపరేషన్లు చేయించుకుంటూ ఉన్నత చదువులు చదువుకున్న లతీషా, ధన్యా వంటి వారు కొందరు మోటివేషనల్‌ స్పీకర్లుగా పలువురిలో స్ఫూర్తి నింపుతున్నారు. అలాంటి వారి నవ్వుల్లోనే భర్తనీ, కూతుర్నీ చూసుకుంటున్న లత పేద కుటుంబాలకు చెందిన రోగులకు ప్రతినెలా పింఛనూ, మందుల ఖర్చులూ గత పదేళ్లుగా అందిస్తోంది. ఇదంతా చేస్తున్న లత ఆర్థికంగా, మానసికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా రోగుల సమస్యల్ని పక్కన పెట్టలేదు. ఉద్యోగం చేస్తూనే స్నేహితులూ, దాతలూ, సెలబ్రిటీల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేది. 2014లో రిటైర్‌ అయ్యాక వచ్చిన డబ్బుతో తిరువనంతపురంలోనే ఓ పాలియేటివ్‌కేర్‌ కేంద్రాన్ని నిర్మించింది. తల్లిదండ్రులూ, ఇతర కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసిన వంద మంది ఆస్టియోజెనెసిస్‌ బాధితులకి ఆశ్రయం కల్పించి అమ్మలా చూసుకుంటోంది. ఆసక్తి ఉన్నవారికి జ్యువెలరీ, కొవ్వొత్తులూ, గొడుగులూ, సబ్బులూ, షాంపూలూ వంటివాటి తయారీ, పెయింటింగ్‌ నేర్పిస్తోంది. అలా రోగులు తయారుచేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోంది. వచ్చిన డబ్బును వారి పేరిటే బ్యాంకుల్లో వేస్తోంది. తన పింఛను డబ్బునంతా సేవకే ఉపయోగించే లతను పాలియేటివ్‌ కేర్‌లో ఆశ్రయం పొందుతున్నవారంతా ‘లతమ్మా...’ అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. వారిలోనే తన కూతుర్ని చూసుకుని మురిసిపోతుందామె.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.