close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ దీవులు కదులుతుంటాయి!

‘అందమైన ప్రకృతి వింతల్నీ అరుదైన జీవవైవిధ్యాన్నీ అద్భుతమైన కట్టడాల్నీ అపురూపమైన సంస్కృతీసంప్రదాయాల్నీ ఒకేసారి చూడాలంటే ఈశాన్య భారతావనిలోని మణిపూర్‌ రాష్ట్రానికి వెళ్లాల్సిందే’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మత్స్యరాజ హరగోపాల్‌.

ముందుగా మేం కోల్‌కతాకి చేరుకుని అక్కడి నుంచి రెండున్నర గంటలపాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి హరేకృష్ణ సంస్థ అంతర్జాతీయ కేంద్రమైన మాయాపూర్‌కి చేరుకున్నాం. ఇస్కాన్‌ వాళ్లు ఇక్కడ భవ్య మందిరాన్ని కట్టించారు. గంగానదీ తీరంలో కట్టిన దీన్నే చంద్రోదయ మందిరం అనీ అంటారు. దీని అందం చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇందులోనే రాధామాధవ మందిరం, నరసింహదేవస్వామి మందిరం, మహాప్రభు వస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి. ఆలయాల్లోని సుందర మూర్తుల విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శ్రీ ప్రభుపాద వ్యాసపూజ, గౌరీపూర్ణిమ, నరసింహజయంతి, జన్మాష్టమి, శ్రీరాధాష్టమి... ఇలా ఈ అయిదు పర్వదినాల్లో ముఖ్య సేవలూ విగ్రహాలంకరణ వంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. మేం వెళ్లినప్పుడు నరసింహ జయంతి జరగడం వల్ల అన్ని కార్యక్రమాలనూ చూడగలిగాంవిగ్రహమూర్తులను ఫలపుష్పాదులతో అద్భుతంగా అలంకరించారు. ఆరోజు దేశవిదేశీ భక్తులు చాలామంది వచ్చారు. నరసింహస్వామి పుష్పాభిషేకాన్ని చూసి దగ్గర్లోనే ఉన్న ప్రభుపాద పుష్ప సమాధి మందిరాన్నీ దర్శించుకున్నాం.

నవ ద్వీపం!
మాయాపూర్‌లో సందర్శకుల కోసం వసతి గృహాలు, భోజనశాల వంటి అన్ని రకాల సౌకర్యాలనీ ఏర్పాటుచేశారు. గోశాలనూ, గురుకులాన్నీ కూడా నిర్వహిస్తున్నారు. తరవాత గంగానదీ తీరానికి అటువైపున ఉన్న నవద్వీపంలోని మందిరాలను చూడ్డానికి పడవలో వెళ్లాం. హరేకృష్ణ ఉద్యమానికి మూలపురుషుడైన శ్రీ కృష్ణ చైతన్య స్వామి పుట్టింది ఈ ద్వీపంలోనే. భక్తులు ఆయన్ని కృష్ణావతారంగానే భావిస్తారు. ఆయనే మొట్టమొదటగా హరేకృష్ణ పాటల ద్వారా కృష్ణసారాన్ని జనాలకి బోధించడం ప్రారంభించారు. ఈ ద్వీపంలో గోపాద, బలభద్ర, జగన్నాథ, కాళికాదేవి, జల మందిరాల పేరుతో చాలా ఆలయాలు ఉన్నాయి. అవన్నీ దర్శించుకుని తిరిగి మాయాపూర్‌కి చేరుకున్నాం.

విశ్వ కేంద్రం!
మర్నాడు అక్కడినుంచి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకి చేరుకుని మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గది కాంగ్లా. ఒకప్పుడు మణిపూర్‌ రాజ్యానికి ఇదే రాజధాని. రాజుల నివాస స్థలం. అప్పట్లో తరచూ బర్మా చేసిన దాడుల కారణంగా కాంగ్లా చాలావరకూ శిథిలమైంది. అయినప్పటికీ మిగిలి ఉన్న ఆనాటి కోటల్నీ ఆలయాల్నీ ప్రభుత్వం చక్కగా సంరక్షించడం చెప్పుకోదగ్గ విషయం. నాటి కోటనే మ్యూజియంగా మలిచి రాజులు వాడిన వస్తువులన్నింటినీ భద్రపరిచారు. నిజానికి కాంగ్లా ప్రాంతాన్ని విశ్వానికే కేంద్రమని స్థానికులు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించి, పరిరక్షిస్తుంటారు. వైష్ణవ, భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ మందిరాల్లో నియమనిష్ఠలతో ప్రతిరోజూ పూజా హారతులు క్రమం తప్పకుండా జరిపించడం విశేషం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న శ్రీ గోవింద్‌జీ ఆలయ ద్వారానికి ముందున్న వరండా ఆరుబయట నిర్మించినట్లుగా ఉంటుంది. ఎత్తైన స్తంభాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా నాటి పురాతన గ్రీకు కట్టడాలని పోలి ఉండటం విశేషం. ఈ మందిరంలో రాధాకృష్ణులతోబాటు బలరాముడు, జగన్నాథస్వామి కూడా మనకు దర్శనమిస్తారు. సంప్రదాయ మణిపురి రాసలీల నృత్యానికి ఈ ఆలయం పెట్టింది పేరు. ఏప్రిల్‌, అక్టోబరు, నవంబరు నెలల్లో పౌర్ణమి రోజున ఇక్కడ జరిగే మణిపురి నృత్య ప్రదర్శనల్ని చూడ్డానికి వేలాది మంది సందర్శకులు వస్తుంటారట.

మహిళల మార్కెట్టు!
అక్కడి నుంచి మహిళలు నిర్వహించే ఇమా కెయితల్‌ మార్కెట్టుకు వెళ్లాం. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. దుస్తులూ మసాలాదినుసులూ పండ్లూ కూరగాయలూ మణిపురికే ప్రత్యేకమైన హస్తకళాకృతులన్నీ అక్కడ ఉన్నాయి. మార్కెట్టులోదుకాణదారులంతా మహిళలే కావడం విశేషం. పైగా చాలావరకూ దుకాణాలు ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ ఆస్తిలా సంక్రమిస్తుంటాయి. ప్రపంచంలో కేవలం స్త్రీలు నడిపే మార్కెట్‌ ఇదొక్కటే. 500 ఏళ్ల నుంచీ నడుస్తోన్న ఈ మార్కెట్టులో దాదాపు ఐదు వేలమంది మహిళలు వ్యాపారం చేస్తుంటారు. అప్పట్లో స్థానిక మెయీటెయీ తెగ ప్రజలను యుద్ధం కోసం దూర ప్రాంతాలకు పంపించేవారట. దాంతో మహిళలు గ్రామాల్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చేది. అందులో భాగంగా వాళ్లు పండించినవీ తయారుచేసినవీ వాళ్లే మార్కెట్టుకి తరలించి అమ్మేవారట. ఆ విధంగా ఈ మార్కెట్టు పుట్టి ఉండొచ్చు అని చెబుతారు. ఆ తరవాత బ్రిటిషర్ల పాలనలో అక్కడ పండించిన బియ్యాన్ని బ్రిటిష్‌ సైన్యానికి తరలించేందుకు ప్రయత్నించారట. అప్పుడు కూడా స్థానిక మహిళలు భారీ ఉద్యమాన్నే చేపట్టి బ్రిటిషర్లను ఎదిరించి నిలిచారు. దీనికే నుపి లాన్‌(మహిళల యుద్ధం) అని పేరు. ఈ విషయాన్ని సూచించే విగ్రహాలు ఆ మార్కెట్టు దగ్గర మనకి కనిపిస్తాయి. ఈ మార్కెట్టులోని భవనాలని విదేశీయులకి అమ్మడానికి ప్రయత్నించినప్పుడు కూడా మణిపురి మహిళలు ప్రాణాలకు తెగించి కాపాడుకున్నారట. వార్తాపత్రికలు లేని సమయంలో వార్తలు తెలుసుకోవడానికి స్థానికులు ఈ మార్కెట్టుకే వచ్చేవారట. అందుకే దీన్ని వాళ్లు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ మార్కెట్స్‌’గానూ పిలుచుకుంటారు.

తేలియాడే దీవులు!
మర్నాడు ఇంఫాల్‌ నదీ తీరంలోని మహాబలి అడవుల్లో ఉన్న అతి పురాతనమైన శ్రీ హనుమాన్‌ ఠాకూర్‌ మందిరానికి వెళ్లాం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం మనిషి ఆకారంలోనే ఉంటుంది. జాంబవంతుడి విగ్రహం కూడా ఉండటం విశేషం. తరవాత అక్కడికి 50 కి.మీ. దూరంలోని లోక్‌తక్‌ సరస్సుకి చేరుకున్నాం. మొయిరంగ్‌ జిల్లాలో ఉన్న ఈ స్వచ్ఛమైన మంచినీటి సరస్సుని ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యద్భుత పర్యటక స్థలంగా చెప్పవచ్చు. ఈ సరస్సు నిండుగా తేలియాడే దీవులు ఉంటాయి. వీటినే ఫుమదీలు అంటారు. నీళ్లలో పెరిగే ఒక రకమైన గడ్డీ, కుళ్లిపోయిన మొక్కలూ, కొంత మట్టీ కలిసి దీవుల్లా ఏర్పడి నీటిమీద తేలుతుంటాయి. అందుకే దీనికి ఫ్లోటింగ్‌ లేక్‌ అనీ పేరు. ఈ ఫుమదీలతోనే సరస్సు తీరంలో ఏర్పడిన కెయీబుల్‌ లంజావో జాతీయ పార్కు దీనికి అదనపు ఆకర్షణ. తేలియాడే జాతీయ పార్కు ప్రపంచంలో ఇదొక్కటే. మణిపూర్‌ రాష్ట్ర జంతువైన సంగై అనే ఒక రకం జింక కేవలం ఈ పార్కులోనే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పార్కులో రెండు వందలకు పైగా సంగైలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్కులోని చిన్న కాలువల గుండా పడవలో వెళ్లి ఆ జంతువుల్ని చూశాం. స్థానిక జాలరులు ఈ సరస్సుకి సమీపంలోగానీ ఫుమదీలమీదగానీ నివాసం ఏర్పరచుకుని జీవిస్తుంటారు.

సరస్సు చుట్టుపక్కల వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరస్సులో బోటింగ్‌ చేస్తూ చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలని చూస్తూ మైమరచిపోయాం. సందర్శకులకోసం ఈ తేలియాడే దీవులమీదే కెఫెటేరియాలనీ ఏర్పాటుచేశారు.అక్కడినుంచి ఖొంఘమ్‌పాట్‌ ఆర్కిడేరియంలో దాదాపు 120 జాతుల పూలమొక్కల్ని చూశాం. తరవాత ఇంఫాల్‌కి తిరిగివస్తూ నేతాజీ ఏర్పాటుచేసిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ జెండా తొలిసారిగా ఎగిరిన ప్రదేశమైన మొయిరంగ్‌కి వెళ్లాం. అక్కడ ఉన్న మ్యూజియంలో నేతాజీ పార్టీకి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవచ్చు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ విగ్రహాన్నీ స్థూపాన్నీ ఏర్పాటుచేశారు. అక్కడినుంచి జపనీస్‌ వార్‌ మెమోరియల్‌కి వెళ్లి అక్కడ కొంతసేపు గడిపాం.

సాయంత్రానికి ఇంఫాల్‌కు చేరుకుని ఆ రాత్రి అక్కడ మణిపురీ నృత్య ప్రదర్శనని చూశాం. భారతీయ నృత్యరీతుల్లో మణిపురిదో ప్రత్యేక శైలి. ఇంఫాల్‌లోని ఒక్కో గ్రామవాసులు ఒక్కో రోజు ఒక్కో మందిరంలో నృత్య ప్రదర్శనను ఎంతో భక్తిగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు వైష్ణవ సంప్రదాయానికి నిలయమైన మణిపుర రాజ్యం నేటికీ ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తోంది.

బాణాసుర రాజ్యం!
మర్నాడు ఇంఫాల్‌ నుంచి షిల్లాంగ్‌ చేరుకుని ప్రకృతి రమణీయతకీ ప్రశాంతతకీ నిలయమైన మేఘాలయలో రెండు రోజులు గడిపి అసోంలోని తేజ్‌పూర్‌కి చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మపుత్రా నదీతీరంలోని అతి పురాతన గణపతి ఆలయానికి వెళ్లాం. ఇక్కడ తప్పక చూడదగ్గ మరో ప్రదేశం మహాభైరవ మందిరం. చిన్నకొండపైన వెలిసిన ఈ శివాలయం పౌరాణికంగానూ చారిత్రకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం బాణాసురుడు, తేజపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడనీ ఆయనే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శైవాన్ని వ్యాప్తి చేశాడనీ చెబుతారు. పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం- క్రీ.శ 8-10 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన సాలస్తంభ వంశీయులు ఈ మందిరాన్ని నిర్మించినట్లు తెలిసింది. క్రీ.శ. 1897లో భూకంపం వల్ల ఈ మందిరం కొంత ధ్వంసమైనట్లూ తరవాత నాగసాధువులు పునర్నిర్మించినట్లూ చెబుతారు. అవన్నీ చూసి చరిత్రలోకి వెళ్లి వచ్చిన అనుభూతితో తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.