close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న నన్ను జైల్లో పెట్టించారు! ....

ఆయన తండ్రి మాజీ ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు కూడా. అంత ఉన్నత కుటుంబంలో పెరిగిన రాహుల్‌ లూథర్‌ మాత్రం మద్యానికీ మాదక ద్రవ్యాలకూ బానిసైముప్పైఏళ్లపాటుచీకటి జీవితం గడిపాడు. అటు తల్లితండ్రుల్నీ ఇటు భార్యాపిల్లల్నీ నరకయాతన పెట్టాడు. కానీ గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారినట్లు మత్తు నుంచి బయటకొచ్చి ‘హోప్‌ ట్రస్ట్‌’ పేరుతో డీ-అడిక్షన్‌ సెంటర్‌ని స్థాపించినరాహుల్‌ తన జీవితంలోని ఆ చీకటి అధ్యాయాన్ని మనతో పంచుకుంటున్నాడిలా...

చిన్నప్పటి నుంచీ నాకు కాస్త రచనా వ్యాసంగంలో ప్రవేశం ఉంది. పదో క్లాసప్పుడే ‘షహీన్‌’ అనే పేరుతో పత్రిక నడిపాను. మా నాన్న నరేంద్ర లూథర్‌ నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారి. దాంతో నా ఫ్రెండ్స్‌ అందరూ- ఉన్నతాధికారులూ రాజకీయనాయకులూ పెద్ద బిజినెస్‌మెన్‌ల పిల్లలే. వాళ్లమధ్య క్రియేటివిటీ ఉన్నవాడిగా వచ్చిన గుర్తింపు నాకు ఎక్కడాలేని కిక్‌ ఇచ్చేది. ఇంటర్‌లోకి వచ్చాక గౌతమ బుద్ధుడి పరిత్యాగంపైన ఇంగ్లిషులో నాటకం రాస్తే... అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు! బహుశా, ఆ పొగడ్తలన్నీ నా తలకెక్కాయేమో... ‘నేను అందరికంటే అధికుణ్ణ’నే అహం వచ్చేసింది. ఎవ్వరు ఏం చెప్పినా వినేవాణ్ణి కాదు. అప్పుడే తొలిసారి ఓ పార్టీలో మద్యం రుచిచూశాను. వ్యక్తిగతంగానూ, ఇంట్లోనూ తీవ్రమైన క్రమశిక్షణ పాటించే నాన్న తాగి వచ్చిన నన్ను చూసి కోపంతో మండిపడ్డారు. నేనేమో ‘అరె! చిన్నదానికి ఇంత రాద్ధాంతం చేస్తాడేంటీ! నేనేమన్నా దానికి బానిసవుతానా? ఇష్టమైనప్పుడు తాగి, వద్దనుకున్నప్పుడు మానుకోగల సత్తా నాకుంది’ అనుకునేవాణ్ణి. ఇంటర్‌ తర్వాత దిల్లీ వర్సిటీలో డిగ్రీలో చేరాను. అప్పట్లో ప్రబలంగా ఉన్న ‘హిప్పీ సంస్కృతి’కి ఆకర్షితుణ్ణయ్యాను. అప్పుడే మొదటిసారిగా డ్రగ్స్‌ రుచిచూశాను. డిగ్రీ చివరి సంవత్సరానికే నేను పూర్తిగా దాని చేతుల్లోకి వెళ్లిపోయాను. డిగ్రీ అయ్యాక ఓ యాడ్‌ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా చేరాను. మద్యం, మాదకద్రవ్యం లేనిదే యాడ్‌రంగం లేదనే పరిస్థితి అప్పట్లో. సో... ఆ ఉద్యోగం నన్ను మరింతగా మత్తుకూపంలోకి లాగేసింది. నాన్న నా స్థితి చూసి... నన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చేశారు. అయినా, ఎంత వరకు నన్ను కాచుక్కూర్చుంటారు? ఆయన అటు ఆఫీసుకు వెళ్లగానే సికింద్రాబాద్‌ క్లబ్‌కి వెళ్లిపోయి పీకల్దాకా తాగేవాణ్ణి. ఏ ఉద్యోగంలో చేరినా, నా తాగుబోతుతనాన్ని భరించలేక నెలతిరక్కుండానే తీసేస్తుండేవారు.

నాన్నే నా విలన్‌!
అప్పట్లో నాన్న నాకో విలన్‌గానే కనిపించేవాడు. ఓసారి ఉద్యోగ విషయమై విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఎప్పట్లాగే మద్యం మత్తులోనే బయల్దేరాను. నాన్న వద్దన్నారు. నేను విన్లేదు. కానీ, నేను విజయవాడ హోటల్‌కి వెళ్లగానే అక్కడి పోలీసులొచ్చి నన్ను తీసుకెళ్లారు. మరోసారి, ఇంట్లోనే నన్ను అరెస్టు చేయించారు. ‘ఏ చట్టం ప్రకారం నన్ను అరెస్టు చేస్తున్నారో చెప్పండి...’ అంటూ నేను తిరగబడితే బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసులు నన్నలా లాక్కెళుతున్నా చూస్తూనే ఉన్న నాన్నపైన విపరీతమైన కోపంతో రగిలిపోయేవాణ్ణి. మరోసారి, తాగిన మత్తులో బైక్‌ నడుపుతూ అడ్డొచ్చిన పోలీసు కానిస్టేబుల్‌తో గొడవకి దిగితే నన్ను రెండు రోజులు జైల్లో పెట్టారు. కనీసం నన్ను విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు నాన్న! నన్ను ఎలాగైనా ఈ మత్తులో నుంచి బయటపడేయాలని బెంగళూరు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌(నిమ్హాన్స్‌)లో చేర్చారు.మూడునెలలపాటు మద్యం ముట్టలేదు. అందుక్కారణం అక్కడి చికిత్స కాదు... రాజేశ్వరి! వాళ్ల అమ్మానాన్నలిద్దరూ దిల్లీ కేంద్రప్రభుత్వ శాఖలో ఉద్యోగులు. తను నిమ్హాన్స్‌లో సైకియాట్రీ ట్రెయినీగా ఉండేది. అక్కడి పరిచయం... ప్రేమగా మారింది. అక్కడి నుంచి బయటకొచ్చాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పాను. ‘నువ్వు తాగుడు నుంచి పూర్తిగా బయటపడ్డావని గ్యారంటీ లేదు. కనీసం ఓ మూడేళ్లు ఆగి... అప్పటికీ నువ్వు బాగుంటే అలాగే చేద్దాం!’ అన్నారు. నేను వినకపోవడంతో దిల్లీలోని రాజేశ్వరివాళ్లింటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నలతో ఈ పెళ్లి ప్రతిపాదన వద్దని చెప్పారు. రాజేశ్వరి విన్లేదు. సినిమాల్లో హీరోయిన్‌లా ‘పెళ్లయ్యాక నేను మారుస్తా’ అందట. అలా మా పెళ్లయింది, దిల్లీలో కాపురం పెట్టాం. కానీ... నాన్న భయపడ్డట్టే నేను మళ్లీ తాగుడు మొదలుపెట్టాను. అడ్డుచెప్పిన రాజేశ్వరిని నోటికొచ్చినట్లు తిట్టేవాణ్ని... కొట్టేవాణ్ణి కూడా. అలా ఉండగానే మాకు పాప పుట్టింది. ఆ సంతోషాన్నీ తాగుడుతోనే నింపాను! నాకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో రాజేశ్వరి ఉద్యోగానికి వెళ్లడం మొదలుపెట్టింది. అయినా... అద్దె చెల్లించడానికి కూడా సతమతమయ్యేది. ఒకదశలో రాజేశ్వరి కష్టం చూడలేక నాన్న మా కుటుంబాన్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. రాజేశ్వరికి అపోలో ఆసుపత్రిలో నర్సింగ్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ ఏడాదే నాన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్‌ అయ్యారు. సమయమంతా మా పాపతోనే గడిపేవారు. నిజానికి నాన్నే కాదు, అమ్మా రాజేశ్వరీ అందరూ పాప ఆనందం కోసమే బతుకుతున్నట్టు ఉండేవారు... ఒక్క నేను తప్ప. తాగొచ్చి పాప ఎదురుగానే రాజేశ్వరిపైన పెద్దగా కేకలు వేస్తుండేవాణ్ణి. నా అరుపులకి పాప భయపడిపోయి బిక్కుబిక్కుమంటూ వెళ్లి మా అమ్మానాన్నల గది ముందు దీనంగా నిల్చునేది!

విడాకులు...
ఇక నన్ను భరించలేక నాన్నో తీవ్రమైన నిర్ణయానికొచ్చారు... నా నుంచి రాజేశ్వరికి విడాకులు ఇప్పించాలనుకున్నారు! మొదట్లో తను ఒప్పుకోలేదుకానీ... పాప భవిష్యత్తు కోసం విడిపోక తప్పదనే నిర్ణయానికొచ్చింది. ఓ రోజు నేను తాగుతున్న మందు సీసా ఖాళీ కావడంతో... ఇంకోటి తెచ్చుకుందామని ఆ మత్తులోనే బైకుపైన హై స్పీడ్‌తో వెళ్లాను. ఓ కారుని ఢీకొట్టి పడిపోవడంతో నా ఎడమ కాలి తొడ నుజ్జునుజ్జుయింది. ఆ విషయం మానాన్నకి ఆయన ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి చెబితే ‘వాడు అలా చస్తేనే మంచిది’ అన్నారట. అలా అన్నా... ఎంతైనా తండ్రి కదా... ఆసుపత్రిలో చేర్చి నేను కోలుకునేదాకా కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజేశ్వరీ, పాపా, అమ్మా, నాన్నా అందరూ... నా చుట్టూ చేరి నవ్వించే ప్రయత్నం చేసేవారు. నేను మాత్రం వాళ్లపైన కస్సుబుస్సులాడుతూనే ఉండేవాణ్ణి. నా స్నేహితులు అతిరహస్యంగా నేనున్న గది కిటికీ దగ్గరకి గంజాయి చేరవేస్తుండేవారు! ఆ పరిస్థితుల్లోనే నాకు విడాకుల నోటీసు వచ్చింది. దాన్ని చూసిన రోజు నేను రాక్షసుణ్నే అయ్యాను. అందర్నీ చెడామడా తిట్టి ఇంట్లోనే ఉండిపోయాను. కోర్టుకి వెళ్లలేదు. దాంతో జడ్జి విడాకులు ఇచ్చేశారు! ఎనిమిదేళ్ల మా సంసారం అలా ముగింపుకి వచ్చింది. ‘జీవితంలో నిన్నెప్పుడూ క్షమించను నాన్నా’ అనుకున్నాను ఆరోజు.

ఓ మార్పు...
అప్పుడే మా మేనత్త బెంగళూరులోని‘ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌’ గురించి నాన్నకి వివరించి అక్కడికి పంపించమని చెప్పింది. నాన్న మా పనిమినిషికి టిక్కెట్టు ఇచ్చి, నన్ను బస్సెక్కించి రమ్మని పంపించారు. బస్సెక్కించి అతనలా వెళ్లగానే బస్సు దిగి, నా టిక్కెట్టు అమ్మేసి ఓ లాడ్జికెళ్ళి తాగి తాగి పడిపోయాను. నా తాగుడు బిల్లు కోసం లాడ్జివాళ్ళు నాన్నకు ఫోను చేస్తే ఆయనే వచ్చారు. మర్నాడు నాన్నే నాతో బస్సుదాకా వచ్చి, అది బయల్దేరేదాకా ఉండి వెళ్ళిపోయారు. మా బంధువులొకరు నన్ను రిసీవ్‌ చేసుకుని ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌లో చేర్పించారు. నా జీవితంలో వెలుగువైపు అది తొలిఅడుగు. ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ ఓ ఆశ్రమంలా ప్రశాంతంగా అనిపించింది. ‘వ్యసనాన్ని మానేయడం నాకు చిటికెలో పని... అన్న అతివిశ్వాసమే మిమ్మల్ని మళ్లీమళ్లీ తాగేలా చేస్తుంది. ముందు అదో వ్యాధి అని గుర్తించండి. బయటివాళ్ల సహకారం తప్పదని తెలుసుకోండి!’ ఇది అక్కడ నాకు నేర్పిన తొలి పాఠం. తాగుడుకి దూరమవుతున్న కొద్దీ నా పాపే గుర్తొచ్చేది. మామూలుగా అవ్వాలనే తపన పెరిగింది. నెలరోజులపాటు అక్కడే అన్నిపనులు చేస్తూ మద్యం ముట్టకుండానే ఉన్నాను. అక్కడ- మన తాగుడువల్ల ఎన్నో బాధల్ని అనుభవించిన మన కుటుంబసభ్యులతో మాట్లాడిస్తారు. అలా, అమ్మానాన్నా వచ్చి నా ముందు నేను చేసిన ఘోరాలన్నీ ఏకరవుపెట్టారు. ఆ తర్వాతి వంతు రాజేశ్వరిదీ, నా పాపదీ! ఆ ఇద్దరూ... వస్తారా?! వచ్చారు. తాగినప్పుడు నేనేం చేసేవాణ్నో వాళ్లు చెబుతుంటే తలదించుకుని ఉండిపోయాను. ఓ దశలో ఉద్వేగం ఆపుకోలేక రాజేశ్వరి చేతులు గట్టిగా పట్టుకున్నాను! ఎంతో ప్రేమగా నా చేతిని నిమిరింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన గుండెలోని ప్రేమ ఎక్కడికి పోతుంది?!

కొత్త చిగుళ్లు...
చివరి రోజు మాకోసం వీడ్కోలు కార్యక్రమం జరిగినప్పుడు నాన్నొచ్చారు. అక్కడ సభాముఖంగా మాట్లాడుతూ నాపైన ఆయన పెట్టుకున్న ఆశల్నీ, నా కోసం పడ్డ బాధల్నీ ఏకరవు పెడుతూ భోరున ఏడ్చేశారు! ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న... ఓ రాష్ట్రానికి సీఎస్‌గా సేవలందించిన స్థాయి వ్యక్తి... అంతమంది ముందు అలా ఏడ్వడం నన్ను బాగా కలచివేసింది. మొన్నమొన్నటిదాకా నేను విలన్‌గా చూసిన ఆ మనిషే ఇప్పుడు నన్ను ఆ నరకం నుంచి బయటకు తెచ్చిన దేవుడిలా అనిపించాడు! కానీ రీహాబ్‌ సెంటర్‌కి వెళ్లి వచ్చినంత మాత్రాన ఏదో మంత్రం వేసినట్టు అంతా మారిపోదు. నా కోపావేశాలు తగ్గి మామూలు మనిషిని కావడానికి మరో రెండేళ్లు పట్టింది. ఈలోపు నేనూ రాజేశ్వరీ మళ్లీ పెళ్లి చేసుకున్నాం. మాకో బాబు పుట్టాడు. అప్పటిదాకా రాజేశ్వరి వివిధ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే ఉంది. నా కెరీర్‌లోనేమో ముప్పైఏళ్లు వృధా అయిపోయాయి. నాతోపాటు చదువుకున్న ఇతర ఐఏఎస్‌ అధికారుల పిల్లలందరూ వీఐపీలుగా మారిపోతే... నేనేమో ఇలా మిగిలాను! అప్పుడే నాకు బెంగళూరులో చికిత్స అందించిన డీ-అడిక్షన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రంలాంటిదాన్ని ఇక్కడా ఏర్పాటుచేయొచ్చనే ఆలోచనొచ్చింది. మరి డబ్బు? నేనూ, రాజేశ్వరీ నాన్నని రెండు లక్షలు అడిగాం. నా మీద నమ్మకంలేకున్నా రాజేశ్వరి కోసం ‘అప్పుగానే సుమా’ అంటూ ఇచ్చారు. దాంతో 2002లో మా ‘హోప్‌ ట్రస్టు’ని ఏర్పాటుచేశాం. మా ఇద్దరి స్నేహశీలత, మేం పాటించే ఉన్నత ప్రమాణాల కారణంగా అది బాగా పాపులర్‌ అయింది. ఏడాది తిరిగేసరికల్లా నాన్న డబ్బులు తిరిగి చెల్లించేశాం! అప్పుడప్పుడే ఇంగ్లిషులో హైదరాబాద్‌కి సంబంధించిన చరిత్ర రచనలు ప్రారంభించిన ఆయనకి ఓ ల్యాప్‌టాప్‌ కొనిచ్చాం. కొడుకుగా నన్ను చూసి ఆయన గర్వపడ్డ తొలి సందర్భం బహుశా అదే కావొచ్చు!

ది బెస్ట్‌... ట్రస్ట్‌!
హోప్‌ ట్రస్టు ఐదేళ్లలోనే దేశంలోని ఐదు అత్యుత్తమ డీ-అడిక్షన్‌ సెంటర్‌లలో ఒకటిగా గుర్తింపు అందుకుంది. అమెరికా, కెనడా, ఐరోపాల నుంచి ఎన్నారైలతోపాటు విదేశీయులూ ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ పదిహేనేళ్లలో మా సంస్థని ఔట్‌ పేషెంట్స్‌ కోసం సైకియాట్రి చికిత్స కేంద్రంగానూ తీర్చిదిద్దాం. దీనిద్వారా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రభుత్వ బడుల్ని దత్తత తీసుకుని టీనేజీ పిల్లలందరికీ ఉచితంగా కౌన్సెలింగ్‌, చికిత్సలూ చేస్తున్నాం.  మా కౌన్సెలింగ్‌కి 80 శాతం మంది యువకులే వస్తుంటారు. నేను చికిత్స ప్రారంభించగానే నిస్పృహతో ‘సార్‌...! మమ్మల్ని మీరు అర్థం చేసుకోలేరు. మా బాధలు మీకు తెలియవు..!’ అంటూ మొదలుపెడతారు. ‘బాబూ! మీరు నాలా కాదు... నాతో పోలిస్తే చాలా మంచివాళ్లు. నేను ఎలా ఉండేవాణ్ణో తెలుసా...?’ అంటూ నా కథ చెప్పడం ప్రారంభిస్తా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.