close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జాతరమ్మ జాతర... మహంకాళి జాతర!

ఆషాఢం వచ్చిందంటే భాగ్యనగరానికి బోనాల శోభ వచ్చేస్తుంది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా ప్రతి ఒక్కరూ అత్యంత భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనం అందుకుని మా పిల్లాజెల్లల్నీ పాడిపంటల్నీ చల్లగా చూడమంటూ వేడుకుంటారు. పోతురాజుల నృత్యాలూ శివశక్తుల పూనకాలూ ఈ ఉత్సవానికి మరింత శోభను అద్దుతాయి.

క్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ప్రకృతితో మమేకం చేస్తూ జరిపే వేడుకే బోనాలు. ఆషాఢమాసంలోని తొలి ఆదివారం నుంచే ఈ వేడుకలు మొదలవుతాయి. గోల్కొండ జగదాంబికా దేవాలయం, హరిబౌలి అక్కన్న మాదన్న, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ, పాతబస్తీ లాల్‌దర్వాజా... ఇలా ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయం బోనాల పండగకు వేదికగా నిలుస్తుంది. అయితే వీటన్నింటిలో సికింద్రాబాద్‌లో కొలువైన ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు పదిహేను రోజుల ముందు ఎదుర్కోళ్లతో మొదలయ్యే ఈ జాతర రంగం, అమ్మవారిని సాగనంపడంతో ముగుస్తుంది.

స్థలపురాణం
1813వ సంవత్సరంనాటి మాట... సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మిలటరీ టవర్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలోనే స్థానికంగా కలరా సోకి వందల మంది మరణించారట. అప్పుడు అప్పయ్య ఉజ్జయినీ అమ్మవారిని దర్శించి తమ ప్రాంతవాసులను వ్యాధి నుంచి రక్షించమనీ అదే జరిగితే సికింద్రాబాద్‌లోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపిస్తాననీ మొక్కుకున్నాడు. ఆ ప్రకారమే 1815లో అప్పయ్య తిరిగి వచ్చాక చెక్కతో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తయారుచేయించి, చిన్న గుడిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో పూర్వం నుంచీ ఇక్కడ ఉన్న బావికి మరమ్మత్తులు చేస్తుండగా మాణిక్యాలమ్మ విగ్రహం ఒకటి బయటపడింది. ఆ విగ్రహాన్ని మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే పెట్టి పూజించడం ప్రారంభించాడు అప్పయ్య. కాలక్రమంలో సురిటి అప్పయ్యే కట్టె విగ్రహాల స్థానంలో అమ్మవారి లోహ ప్రతిమలను తయారుచేయించి, వాటికి పునఃప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుంచీ ఆ వంశస్థులే అమ్మవారికి జాతర నిర్వహించేవారు. ఆ తర్వాత 1953 నుంచీ దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఉత్సవం ఇలా...
ఆషాఢమాసంలోని మొదటి ఆదివారం అమ్మవారికి ఎదురెళ్లి బాజాభజంత్రీలతో పుట్టింటికి తీసుకొచ్చే ఎదుర్కోళ్లతో ఈ వేడుక మొదలవుతుంది. దీన్నే ఘటోత్సవం అని కూడా అంటారు. మూడో ఆదివారం మహంకాళికి బోనం సమర్పించే వరకూ అమ్మవారు ఘటంమీద అన్ని వీధులూ ఊరేగుతుంది. అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పూ అన్నాన్నే బోనం అంటారు. అయితే ఈ బోనాన్ని ఎవరు ఏయే పదార్థాలతో తయారుచేస్తామని మొక్కుకుంటారో ఆ విధంగానే తయారుచేస్తారు. అలా సిద్ధం చేసిన వాటన్నింటినీ ఒక పాత్రలో పెట్టి, దానిమీద దీపం ఉంచి, తలమీద పెట్టుకుని ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. బోనంతోపాటు కొందరు సాకను కూడా అమ్మవారికి అర్పిస్తారు. సాక అంటే చెట్టుకొమ్మ. పసుపునీరు నింపిన కుండలో వేప కొమ్మను ఉంచి ఆలయానికి తీసుకొచ్చి మాతంగేశ్వరిని అర్చిస్తారు. ఈ ఊరేగింపులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి పోతురాజుల నృత్యాలూ శివశక్తుల ఆటపాటలూ. ఒంటికి పసుపు రాసుకుని చిత్రవిచిత్రమైన అలంకారాలతో ముస్తాబయ్యే పోతురాజులు తప్పెట వాద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, చేతిలోని కొరడాను ఝుళిపిస్తూ అలరిస్తారు. బోనాలు జరిగిన మరుసటి రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ముఖమండపంలోని శ్రీమాతంగేళ్వరి దేవాలయంలో జోగినిగా మారిన స్త్రీ, అమ్మవారి విగ్రహం వంకే చూస్తూ అమ్మవారి కళను ఆవహింపజేసుకుని భవిష్యత్తులో జరిగే పరిణామాలను చెబుతుంది. ఈమెనే మాతంగి అని అంటారు. ఈ క్రతువు పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుమీద ఉంచి, మంగళవాద్యాలతో పురవీధుల్లో ఊరేగించుకుంటూ మెట్టుగూడ ప్రాంతానికి సాగనంపుతారు. దీంతో బోనాల సంబరం ముగుస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.