close
ఢాం...

- జి.యస్‌.లక్ష్మి

‘‘ఏంటీ! మా నాన్నగారిని రమ్మనాలా?’’ భోజనం చేస్తున్న రాజేష్‌ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. పక్కనే కూర్చుని, అతనికి వడ్డిస్తూ తను కూడా భోంచేస్తున్న వరూధిని, తినడం మానేసి మొహం విచారంగా పెట్టింది.
‘‘అవునండీ. మీ పేరెంట్స్‌నీ మా పేరెంట్స్‌నీ కూడా పిలవమన్నారు. ఫైనల్స్‌ కదా! ఎవరు గెలిచినా వాళ్ల పేరెంట్స్‌తో కలిపి బహుమతి ఇస్తారుట’’ చల్లగా అసలు విషయం చెప్పింది వరూధిని.

‘‘ఇంపాజిబుల్‌. మా నాన్నగారు రారు. అసలు నేనిలా ఈ ప్రోగ్రామ్‌ చేశానని తెలిస్తేనే ఆయనకి వచ్చే కోపం తల్చుకుంటే నాకు గుండె ఆగినంత పనవుతోంది. ఆయన టీవీ చూడరన్న ధైర్యంతో ఓకె అన్నాను కానీ, నువ్విలా పేరెంట్స్‌ని కూడా పిలుస్తారంటే అసలు నేను దీనికి ఒప్పుకునేవాడినే కాదు’’ కచ్చితంగా చెప్పేసి, అన్నం ముందునుంచి లేచిపోయాడు రాజేష్‌. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్న అతనికి అసలు తను ఎందుకు ఇందులో ఇరుక్కున్నాడా అనిపించింది.

రాజేష్‌కి పెళ్ళయి ఏడాది దాటింది. ఇప్పుడిప్పుడే ఒకరికొకరు అలవాటుపడుతున్నారు దంపతులిద్దరూ. ఆ సమయంలో వరూధిని ఫ్రెండ్‌ సరోజ ఫోన్‌ చేసి, ‘ఆహా’ టీవీలో భార్యాభర్తలకు ఒక షో పెడుతున్నారనీ, తనూ తన భర్తా పేర్లు రిజిస్టర్‌ చేయించుకున్నామనీ చెప్పి, వరూధినీ వాళ్లని కూడా చేయించుకోమని కోరింది. అంతే, అది విని వరూధిని రాజేష్‌ వెనకాల పడింది. రాజేష్‌ని తండ్రి రంగనాథం చాలా క్రమశిక్షణతో పెంచాడు. అందుకే వేరే ధోరణులేమీ లేకుండా అన్ని పరీక్షలూ మంచి మార్కులతో పాసై, చక్కటి ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం చూసి తను అల్లారుముద్దుగా పెంచుకున్న వరూధినిని ఇచ్చి పెళ్ళిచేశాడు సదాశివం. రెండు కుటుంబాలూ సంప్రదాయబద్ధమైనవే. అందుకే ఇప్పటివరకూ కుటుంబాల మధ్య కానీ, రాజేష్‌ వరూధినిల మధ్య కానీ ఏమంత గొడవలేం రాలేదు.

కానీ, ఇదిగో... సరోజ ఈ టీవీ షో మాట చెప్పడంతో మొదలైంది భార్యాభర్తల మధ్య గొడవ. ‘సరదాగా షోలో పాల్గొందామంటుంది’ వరూధిని. ‘అక్కర్లేదు, మనలాంటి కుటుంబాలు ఇలాంటివాటికి వెళ్ళరు’ అంటాడు రాజేష్‌. ‘చక్కగా అందరిముందూ ఆదర్శదంపతులుగా బహుమతి అందుకుందాం’ అంటుంది వరూధిని. ‘మన దాంపత్యానికి ఇంకొకళ్ళ సర్టిఫికెట్‌ ఎందుకూ’ అంటాడు రాజేష్‌. ఈ విషయమై దంపతుల మధ్య అలకలు కోపాలయ్యాయి, కోపాలు ఆవేశాలయ్యాయి, ఆవేశాలు ప్రళయాలయ్యాయి.

ఇక వరూధినిని సమాధానపరచలేక అసలు ఆ షోలో ఏముంటుందని అడిగాడతను.

‘‘ఆ ఏముంటుందండీ? మీ గురించి నన్నూ, నా గురించి మిమ్మల్నీ ప్రశ్నలడుగుతారు. అంతే...’’ అంది వరూధిని.

కాస్త మెత్తబడ్డాడతను. ‘ఇంట్లో ఈ ప్రళయాలు భరించేకన్నా ప్రశ్నలే కదా, సమాధానాలిస్తే పోయె’ అనుకున్నాడు. అందుకే సరేనన్నాడు.
కానీ, దిగితే కానీ అందులో లోతు తెలీలేదతనికి. షోకి వెళ్ళేముందే అతనిచేత వాళ్ళిద్దరి పుట్టినరోజులూ పెళ్ళిరోజులూ ఇద్దరి ఇష్టాలూ మొదటిసారి వెళ్ళిన ప్రదేశం... ఇలాంటి వాటన్నింటికీ జవాబులు బట్టీ పట్టించేసింది వరూధిని. పైగా అక్కడ లవ్‌ మ్యారేజా, అరేంజ్‌డ్‌ మ్యారేజా అని అడిగినప్పుడు ‘లవ్‌ కమ్‌ అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌’ అని చెప్పమంది.

‘‘అదేంటీ. మనది సంప్రదాయం, జాతకాలూ అన్నీ చూసుకుని పెద్దలు చేసిన పెళ్ళి కదా’’ అని రాజేష్‌ అంటే, ‘‘అబ్బే, అలా చెప్తే మార్కులు వెయ్యరండీ, ప్రేమపెళ్ళికి పడ్ద మార్కులు పెద్దలు చేసిన పెళ్ళికి పడవు’’ అంటూ అతనికే తెలీని రహస్యాన్ని విప్పింది.

సరే, ఇద్దరూ షోకి వెళ్ళారు. మొట్టమొదట ఓ పదిమంది దంపతులు ఉన్నారు. అందరిలో చిన్న వయసు వాళ్లను ఉంచి మధ్యవయసు వాళ్లని మొదటి విడతలోనే తీసేశారు జడ్జీలు. ఇక మిగిలింది ఆరుగురు. అప్పుడు మొదలైంది రాజేష్‌కి అసలైన బాధ.

వరూధినినీ అతన్నీ విడివిడిగా నిలబెట్టారు. ఒకరికి తెలీకుండా ఒకరిని ప్రశ్నలడిగారు.

‘మీ ఆవిడకి ఏది ఇష్టం’ అంటే చాలా కరెక్ట్‌గా చెబుతున్నాననుకుంటూ ‘సమోసాలు’ అన్నాడు. కానీ అది తప్పట. వరూధిని తనకి ‘మల్లెపూలు ఇష్టం’ అని చెప్పిందట. ‘అదేంటీ, వరూధిని ఎప్పుడూ సమోసాలు తెమ్మనేది, సినిమాలకి తీసుకెళ్ళమనేది. అంతేకానీ, మల్లెపూల మాట ఎప్పుడూ రాలేదే’ అనుకున్నాడతను. ‘ఖర్మ, ఈ మనిషికి ఎంత ట్రైనింగ్‌ ఇచ్చినా ఇంతే’ వరూధిని విసుక్కుంది.

మళ్ళీ రాజేష్‌కి ఏమిష్టమని వరూధినిని అడిగారు. ‘చల్లటి సాయంకాలం తనతో గడపడం’ అని వరూధిని సిగ్గుసిగ్గుగా చెపితే, రాజేష్‌ సిన్సియర్‌గా ‘బుక్స్‌ చదవడం’ అన్నాడు. ‘రాతకొద్దీ దొరికాడురా బాబూ కోతిమొగుడూ’ అనుకుని లెంపలేసుకుంది.
రెండో రౌండ్‌లో ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని చెప్పగానే నిర్వాహకులు మహా ఆనందపడిపోయి దాన్ని గురించి బోలెడు ప్రశ్నలు అడిగారు.

‘మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు, చూడగానే ఒకరికొకరికి ఏమనిపించిందీ, సైగలు ఎలా చేసుకునేవారూ, కోడ్‌ లాంగ్వేజ్‌ ఏం పెట్టుకున్నారు’ లాంటి ప్రశ్నలకి రాజేష్‌కి ఏం చెప్పాలో తెలీలేదు. ‘పెళ్ళిచూపుల్లో కలుసుకున్నామనీ, సైగలంటే నమస్కారం పెట్టుకున్నామనీ, కోడ్‌ లాంగ్వేజ్‌ అంటూ ఏమీ లేదనీ’ చెప్పిన రాజేష్‌ సమాధానాలకి నెత్తి కొట్టుకుంది వరూధిని. అతని తరఫున కూడా అన్నింటికీ ఆమే జవాబిచ్చింది. మొదటిసారి ఫ్రెండ్‌ పెళ్ళిలో ఒకరి నొకరు చూసుకున్నట్టూ, చూసుకోగానే ఎన్నాళ్లనుంచో వెతుకుతున్న ఆత్మబంధువు ఎదురైనట్టూ, అందుకే ఫ్లయింగ్‌కిస్‌తో ఒకరినొకరు గుర్తుంచుకున్నట్టూ వరూధిని చెప్పిన సమాధానాలకి రాజేష్‌ నోటమాట రాలేదు.

మూడో రౌండ్‌ మరీ దారుణం. అసలు అక్కడికక్కడ ఆ షో వదిలేసి వచ్చేద్దామన్నంత ఆవేశం వచ్చింది రాజేష్‌కి. అదేమిటంటే భార్యాభర్తలు తమకి ఒకరిమీద ఇంకొకరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకోవడమన్నమాట.

అదెలాగంటే భార్య కాలికి భర్త పారాణి దిద్దాలి. అది ఎంత అందంగా దిద్దితే అన్ని మార్కులన్నమాట. భార్య కాళ్ళు పట్టుకోవడమా... అందులోనూ పబ్లిక్‌గా కెమెరా షూట్‌ చేస్తుంటే! ‘ఏబ్రాసి వెధవా, పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటావుట్రా...’ అంటూ ఎదురుగా తండ్రి నిలబడి గట్టిగా అరిచినట్టనిపించింది రాజేష్‌కి. కానీ ఒకసారి దూకాక అంత తేలికగా బైట పడలేరుకదా, ఏవో కొన్ని రూల్సంటూ ఏడుస్తాయి కదాని, ఇక కొనసాగక తప్పలేదతనికి. అసలు అతనికి బ్రష్‌ పట్టుకోవడమే రాదు. ఇక అందంగా పారాణి ఎలా దిద్దగలడు. ఇక తప్పక మొహం మరోవైపు తిప్పుకుని ఆ గండం గట్టెక్కించాడు. కానీ అతను మొహం అలా మరోవైపు తిప్పుకోవడం కూడా ఏదో సామెత చెప్పినట్టు అతనికి ప్లస్‌ పాయింటే అయింది. అటువైపున్న అద్దంలో వరూధిని కన్పిస్తుండడం వల్ల, తను చేస్తున్న పనివైపుకాక భార్యవైపు ప్రేమగా చూస్తూ దిద్దటం వలన అతనికి భార్యమీద ఎంత ప్రేమ ఉందోననుకుని జడ్జీలు ఇతనికే ఎక్కువ మార్కులు వేసేశారు.

మరి ఆడవాళ్ళు మొగుడి మీద ప్రేమ ఎలా చూపిస్తారో చెప్పడానికి నిర్వాహకులు పెట్టిన పోటీ చూస్తే రాజేష్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఆ పోటీలో వాళ్ళు వరూధినికి ఇచ్చిన టాస్క్‌ ఏమిటంటే- రాజేష్‌కి షేవ్‌ చెయ్యడం. దీని గురించి రాజేష్‌ నిర్వాహకులతో పెద్ద గొడవే పడ్డాడు. ‘ఆడవాళ్ళు మొగుడి గడ్డం గీస్తేనే అతని మీద ప్రేమ ఉన్నట్టా, లేకపోతే లేనట్టా. ఇప్పుడు అలా చెయ్యని వాళ్లందరికీ మొగుడిమీద ప్రేమ లేనట్టేనా’ అని నిలదీసి అడిగాడు. కానీ వాళ్ళు ఎవరూ పెట్టనంత కొత్తగా ఈ పోటీపెట్టి, బ్రహ్మాండమైన టీఆర్పీ రేటు కొట్టెయ్యాలనే ఉద్దేశ్యంలో ఉన్నవాళ్ళు కనక ఇతని మాటలను ఖాతరు చెయ్యలేదు.

వరూధిని కూడా ఆ రౌండ్‌లో ఇష్టం లేకుండానే పాల్గొంది. ఎంత నీట్‌గా, కోతలు లేకుండా మొగుడి గడ్డం గీస్తే అన్ని మార్కులన్నమాట. వరూధినికి ఒక్కసారి తన తండ్రి గుర్తొచ్చాడు. ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకుందుకు కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కూతురు గడ్డం గీస్తోందని తెలిస్తే ఇంకేమైనా ఉందా! ‘అప్రాచ్యపు పనులు చేస్తావుటే...’ అంటున్నట్టున్న తండ్రి రూపం కంటి ముందుకు వచ్చింది. ‘హూ! ఏం చేస్తుందీ... రోట్లో తలదూర్చి రోకటిపోటుకి వెరవనేలా’ అనుకుంటూ చేతకాని ఆ పనిని తప్పదనుకుంటూ చేసింది. భార్య ఎక్కడ తనకి గాట్లు పెట్టేస్తుందోననుకుంటూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నాడు రాజేష్‌. వీళ్ళ ప్రత్యర్థికన్నా రాజేష్‌కే తక్కువ గాట్లు పడటం వల్ల అందులోనూ వీళ్ళకే ఎక్కువ మార్కులొచ్చాయి.

మొత్తానికి ఎలాగైతేనేం ఫైనల్స్‌కి వచ్చారు. ఇప్పుడు నిర్వాహకులు పేరెంట్స్‌ని తీసుకు రమ్మంటున్నారు. ఇద్దరికీ ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకు కూర్చున్నారు.

‘‘ఓ పని చేస్తే...’’ వెలిగిపోతున్న మొహంతో అంది వరూధిని. ‘ఏమిటన్నట్లు’ ఆశగా చూశాడు రాజేష్‌. ‘‘సినిమాల్లోలాగా మనిద్దరం నటించడానికి వేరే అమ్మానాన్నల్ని తెచ్చుకుంటే. షూటింగ్‌ అయిపోగానే వెళ్ళిపోతారు.’’

తల గోడకేసి కొట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చేసింది రాజేష్‌కి. ‘ఇప్పటికే జరిగినదాన్ని తిప్పుకోలేక బాధపడుతుంటే మళ్ళీ ఇంకో నాటకమాడాలా! ఛీ’ అనిపించింది.

‘‘ఓ పని చేద్దాం’’ ఏదో ఆలోచన తోచినట్టు నెమ్మదిగా అన్నాడు రాజేష్‌. ఆత్రంగా ముందుకు వంగింది వరూధిని.

‘‘ఆ షో నిర్వాహకుల్నే ఏదో విధంగా బతిమాలుకుందాం. ఈ షోలో మనల్ని తీసెయ్యమని చెబుదాం. ఎంత డబ్బైనా ఇస్తామని చెబుదాం. కావాలంటే కాళ్ళయినా పట్టుకుందాం’’ అన్నాడు ఏదో ఆశతో. ‘‘హూ.. ఆ పని ఎప్పుడో చేశానండీ. పొద్దున్నే సరోజని సాయం తీసుకెళ్ళి అడిగొచ్చాను. కానీ వాళ్ళిప్పటికే పది ఎపిసోడ్ల పైన తీసేశారు కదా... బోల్డు డబ్బులయ్యాయి. అదీకాక వాళ్ళు అప్పుడే ఈ షో అనౌన్స్‌మెంట్‌ కూడా చేసేస్తున్నారు’’ అంది.

ముందుకెడితే నుయ్యి వెనక్కెడితే గొయ్యిలా అయింది వాళ్ల పరిస్థితి. అడకత్తెరలో చిక్కుకుపోయారిద్దరూ. అప్పుడే సరోజ ఫోన్‌ చేసింది వరూధినికి. ‘‘ఎందుకే పేరెంట్స్‌ని పిలవడానికి మీరంత కంగారుపడుతున్నారూ. పొద్దున్న టీవీ స్టేషన్‌ నుంచి వచ్చాక నేను మీ అమ్మగారికి ఫోన్‌ చేశాను. చూచాయగా విషయం చెప్పగానే ఆవిడ ఎగిరి గంతేసినంత పని చేశారు. ‘అంటే మేం కూడా టీవీలో కనిపిస్తామా సరోజా’ అంటూ అడిగారు నన్ను. అందుకని మీరేం భయపడకుండా వాళ్లని రమ్మని చెప్పండి’’ అంది.

‘‘నిజంగానా!’’ అని అడిగిన వరూధినితో ‘‘ఈ రోజుల్లో టీవీలో చూపిస్తాం రమ్మంటే వద్దనే వాళ్ళుంటార్టే  నీ పిచ్చి కానీ...’’ అంటూ చనువుగా కేకలు కూడా వేసింది.హమ్మయ్య అనుకున్న వరూధిని ఆ శుభవార్త రాజేష్‌ చెవిన వేసింది. ‘‘మీ అమ్మగారు వస్తానన్నా మీ నాన్నగారు రావాలిగా...’’ అన్నాడు. ‘‘ఆ బాధ్యత మా అమ్మకే వదిలేద్దాం. మీరూ అంతే. విషయం మీ అమ్మగారికి చెప్పండి. ఆవిడే చూసుకుంటారు మీ నాన్నగారి సంగతి’’ అంది. మొత్తానికి తల్లులిద్దరూ పిల్లలమీద ఉన్న ప్రేమ అనే బలహీనతని ఆధారం చేసుకుని తండ్రులిద్దరినీ టీవీ షోకి తీసుకొచ్చారు. రాజేష్‌ నిర్వాహకుల దగ్గరికి పర్సనల్‌గా వెళ్ళి, ముందు చేసిన ఎపిసోడ్స్‌ పెద్దలకి చూపించొద్దని బతిమాలుకున్నాడు. వాళ్ళు దయతో అంగీకరించారు. కానీ ఎంత బతిమాలినా ఫైనల్‌ ఎపిసోడ్‌లో ఏ పోటీ పెడతారో మటుకు చెప్పలేదు.

ఆ రోజు రానే వచ్చింది. తల్లులిద్దరూ పెద్ద జరీలున్న కంచి పట్టుచీరలు కట్టుకునీ ఘనంగా కనిపించే నగలు పెట్టుకునీ ముడుల చుట్టూ పూలమాలలు చుట్టుకునీ నిండుగా ముస్తాబయ్యారు. తండ్రులిద్దరూ తెలుగుతనం ఉట్టిపడేట్టు పంచెకట్టుతో, సిల్కు లాల్చీలతో, పైన జరీ కండువాలతో తయారయ్యారు.

రాజేష్‌ మామూలు జీన్స్‌, టీ షర్ట్‌ వేసుకున్నాడు. వరూధిని డిజైనర్‌ శారీ కట్టుకుంది. ఇద్దరూ పైకి సింపుల్‌గా డ్రెస్‌ అయినా లోపల వాళ్లకి గుండెల్లో గుభేలుమంటోంది. అంతా కలిసి స్టూడియోకి చేరుకున్నారు. పోటీ పడేవాళ్ళతోపాటు వాళ్ళ పేరెంట్స్‌ని కూడా సెట్‌ మీదకి పిలిచారు. ఎంతో సంబరపడుతూ వచ్చారందరూ. పరిచయాలు అయ్యాక యాంకర్‌ ప్రకటన చేశాడు. ‘ఇప్పటి వరకూ భార్యాభర్తలు చక్కగా పోటీపడి ఇక్కడిదాకా వచ్చారు. వారికి అభినందనలు. ఇంకిప్పుడు ఈ పోటీదారుల్ని ఇంత బాగా పెంచిన అమ్మానాన్నలకి ముందుగా ఓ పోటీ పెడుతున్నాం’ అన్నమాట వినగానే రాజేష్‌ గుండె జారిపోయింది. తండ్రి రంగనాథం వైపు చూశాడు. అప్పటికే ఆయన భృకుటి ముడిపడిపోయింది.

‘‘ఇప్పుడు ఇక్కడకొచ్చిన ఈ పెద్ద జంటలకి పోటీ ఏమిటంటే- భర్తలు ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ...’ అనే పాట పాడుతూ భార్య చుట్టూ తిరుగుతూ, ఇదిగో ఈ బుట్టలోని పువ్వుల్ని ఒక్కొక్కటీ భార్య మీద వెయ్యాలి. ఆ భార్యలు ‘పతియే కదా ప్రత్యక్ష దైవం’ అని పాడుతూ ఆ పూలు కింద పడకుండా పట్టుకుని ఈ బుట్టలో వెయ్యాలి. ఎవరు ఎక్కువ పూలు వేస్తే వాళ్ళే విన్నర్‌.’’

అంతే. ఒక్కసారిగా అక్కడ పెద్ద బాంబ్‌ పేలింది. గొప్ప విస్ఫోటనం అయింది. అది రాజేష్‌ తండ్రి రంగనాథం గొంతు. దడ తగ్గి చూసుకునేసరికి ఎవరికీ అర్థం కాని తిట్లతో రంగనాథం కండువా నడుముకి బిగించుకుంటూ, ‘‘నీ షో నిప్పుల్లో కాల్చా. చుట్టూ తిరుగుతూ పెళ్ళాం మీద పూలెయ్యాల్రా... ఎవడిచ్చాడ్రా నీకీ ఐడియా... వాడి బుధ్ధి సంత కెళ్ళా... ఒద్దికగా సంసారం చేసుకుంటూ మనవల్నెత్తవలసిన వయసులో ఉన్నవాళ్ళు తిప్పుకుంటూ స్టేజిమీద పాటలు పాడాల్రా! నీ తెలివి తుంగలో తొక్కా! ఎవడ్రా ఈ షో చేస్తున్నదీ? రమ్మను, నా ముందుకా వెధవని’’ అంటూ నరసింహావతారం ఎత్తిన ఆయన ముందు నిలబడలేక సెట్‌లో అందరూ తలో దిక్కూ పారిపోతుంటే ఇది భలే బాగుందనుకుంటూ కెమెరావాళ్ళు అదంతా షూట్‌ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ స్తంభం మూల దాక్కున్న రాజేష్‌, వరూధినీ నోటమాట రాక ఆ స్తంభాన్నే గట్టిగా పట్టేసుకున్నారు. ఎవరికి వారు చెల్లాచెదురై పారిపోతున్న ఆ దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనుకుంటూ కెమెరామెన్‌లు మరో రెండు యాంగిల్స్‌ నుంచి కూడా షూట్‌ చేసేస్తున్నారు. ఆ సెట్‌ అంతా ఫ్లాష్‌లైట్ల వెలుతురుతోనూ రంగనాథం తిట్లతోనూ నిండిపోయి, మండిపోయింది. మరిక ఆ షో టీఆర్పీ రేటింగ్‌ ఏమయిందో దేవుడికే తెలియాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.