close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒడిసి పట్టు... ప్రతి బొట్టు!

మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోకూడదన్నది పాత మాట. ఖాళీగా ఉన్న బిందెలూ బకెట్లూ తెచ్చి వాన నీటిని పట్టుకోమన్నది నేటి మాట. అవును మరి, చెరువులు ఎండిపోయాయి. నదులు ఆనవాళ్లు కోల్పోయాయి. భూగర్భ జలాలు ఆవిరైపోయాయి. మరిక మబ్బుల్నేగా నమ్ముకోవాలి! అందుకే ఇప్పుడు పల్లెల్లోని రైతులే కాదు, పట్నాల్లోని ఉద్యోగులూ ఆకాశంకేసి ఆశగా చూస్తున్నారు... వాన మబ్బుల జాడ కోసం. పంటలకైనా ప్రాజెక్టులకైనా తాగడానికైనా వాడుకోడానికైనా... ఇప్పుడు మబ్బుల్లో నీరే మనకి దిక్కు. మరి ఇలా వచ్చి అలా పోయే ఆ వాన నీటిని ఎన్నని పట్టుకోగలం? ఎన్నాళ్లు సరిపోతాయవి... అంటే, ఎన్నాళ్లు కాదు ఎన్నేళ్లైనా సరిపోతాయంటున్నారు వాన నీటిని ఒడిసిపట్టడంలో అనుభవజ్ఞులైన వీరంతా..!

వాడే ప్రతి చుక్కా వాన నీరే కావాలి!
- కల్పనా రమేశ్‌

మెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన మేము మొదట శ్రీనగర్‌ కాలనీలో ఉండేవాళ్లం. ఒకరోజు బిల్డర్‌ హడావుడిగా ఒక అడుగులోతు ఇంకుడుగుంత తవ్వించడం చూశా. ఎనిమిదడుగులుండాల్సిన గుంతని డబ్బు ఖర్చు పెట్టకుండా అధికారుల కళ్లు కప్పడానికి అలా తవ్వించారని అర్థమైంది. కొన్ని వేల రూపాయల ఖర్చుకి బిల్డరు వెనకాడితే దాని ఫలితంగా అపార్ట్‌మెంట్‌లో వాళ్లందరూ నెల నెలా వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొనుక్కోవాల్సివచ్చింది. ఎవరికి వారు ఇలా చేయడం వల్లే మంచి చట్టాలు కూడా పనికిరాకుండా పోతున్నాయి కదా అనుకున్నా. మరో పక్క ఆ ట్యాంకర్లో ఎక్కడి నుంచి ఎలాంటి నీరు తెస్తున్నారోనన్న భయం వేధించేది నన్ను. దాంతో ఆ ఇల్లు ఖాళీ చేసి గచ్చీబౌలి ప్రాంతానికి వెళ్లాం. అక్కడా అదే పరిస్థితి. ఇలా కాదనుకుని రోలింగ్‌ హిల్స్‌ కాలనీలోని సొంతింటికి మారిపోయాం. కొన్నాళ్లకి అక్కడా నీటి కరువొచ్చింది. ఇది తాత్కాలిక సమస్యా కాదు, ఒక్కరు జాగ్రత్త పడితే తీరే సమస్యా కాదు. శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సిందేనని చుట్టుపక్కల వారందరితో మాట్లాడి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్‌ వెల్స్‌ తవ్వించుకుందామని చెప్పాం. ఇంకుడుగుంతల వల్ల భూమి పైపొరల్లోకి నీరు ఇంకితే, ఇంజెక్షన్‌ వెల్స్‌ వల్ల చాలా లోపలి పొరల్లోకి వెళ్తాయి. హైదరాబాదు పీఠభూమి ప్రాంతం కనుక నీరు బాగా లోపలికి ఇంకేలా చూడాలి. అలా చేయడం వల్ల లాభమేంటో వివరించి చెబితే కాలనీ అంతా స్పందించి ముందుకొచ్చారు. అయితే వీటిని తవ్వి వదిలేయకుండా ఏటా శుభ్రం చేయించాలి. ఇది జరిగి ఏడేళ్లయింది. ఇన్నేళ్లలో మా కాలనీకి నీటి ట్యాంకర్ల అవసరమే రాలేదు. అంతటితో ఊరుకోలేదు మేము. మా ఇంటిపైన పడే వాననీరంతా పైపుల ద్వారా 30వేల లీటర్ల సామర్థ్యం కల ట్యాంకులోకి చేరే ఏర్పాటు చేశాం. అది కాకుండా వంటింట్లో ఉపయోగించే నీరంతా శుద్ధిచేసేందుకు ప్రత్యేకంగా మరో ట్యాంకు కట్టాం. అది నిండాక నీరు మొక్కలకు వెళ్లే ఏర్పాటు చేయడంతో ఎక్కడా చుక్క నీరు వృథా కావటం లేదు. పైగా ఇంటికి కావలసిన కూరగాయలూ ఆకుకూరలూ పండ్లూ... అన్నీ మా ఆవరణలోనే పండించుకుంటున్నాం. ఈ మధ్య మా అమ్మాయి పెళ్లి చేశాం. ఇంట్లో నెల రోజుల పాటు అతిథులున్నారు. అయినా నీటికి ఇబ్బంది కలగలేదంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మమ్మల్ని చూసి చాలామంది ఇంటి మీద వాన నీటిని సేకరించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాడే ప్రతి నీటి చుక్కా వాన నీరే కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంటే చాలు, నీటి కరువు రాదన్నది నా అభిప్రాయం. అందుకే మా అవసరం తీరిందని ఊరుకోకుండా వాన నీటి సంరక్షణ గురించి వర్కుషాపులు నిర్వహిస్తూనే ఉన్నాం. మా పరిధిని మరింత విస్తృతపరిచి చెరువులూ దిగుడుబావుల పునరుద్ధరణకూ కృషిచేస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతోంది. ఆ నీటిని ఒడిసిపట్టుకోడానికి తగినన్ని చెరువుల అవసరం చాలా ఉంది. 

నీటి కనెక్షన్‌ కూడా లేదు
- ఏఆర్‌ శివకుమార్‌

చెప్పడం కాదు, చేసి చూపించడం ముఖ్యమని నమ్ముతాను నేను. కర్ణాటక రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలో వాననీటి సంరక్షణ విభాగంలో కీలక అధికారిగా నా పని వాన నీటి విలువను అందరికీ చెప్పడమే. అయితే అదేదో ముందు నేనే చేసి చూపిద్దామనుకున్నాను. 1994లో సొంతిల్లు కట్టుకున్నాను. ఇంట్లోకి గాలీ వెలుతురూ పుష్కలంగా రావడం మాత్రమే కాదు నీరు కూడా ప్రకృతి సిద్ధంగా లభించినదై ఉండాలని ఇల్లు కట్టేటప్పుడే నిర్ణయించుకున్నాం. అందుకే నల్లా కనెక్షన్‌ తీసుకోలేదు. ఇల్లు కట్టడం కూడా నిల్వ చేసిన వాననీటితోనే కట్టాం. ఇంటికి కింద ఒకటి, పై కప్పు మీద ఒకటి నీటి ట్యాంకులు ఉన్నాయి. భవనం మీద కురిసిన నీరంతా పైపుల ద్వారా కింది ట్యాంకులోకి వెళ్లిపోతుంది. అది నిండిపోతే మిగిలిన నీరు భూమిలోకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. భూమిలోనే ఒకదానికొకటి కాస్త దూరంలో వరసగా నాలుగు డ్రమ్ములు పెట్టి అన్నిటినీ అనుసంధానించాం. వాటికి అడుగున రంధ్రాలుంటాయి. అంటే ఒక్కో డ్రమ్ములోకీ నీరు చేరుతూ అందులోనుంచీ నెమ్మదిగా భూమిలోకి ఇంకే ఏర్పాటన్నమాట. కింది ట్యాంకులోని నీరు ఫిల్టర్‌ అయ్యి పదివేల లీటర్ల సామర్థ్యం ఉన్న మరో పెద్ద అండర్‌గ్రౌండ్‌ ట్యాంక్‌లోకి వెళ్తుంది. అందులోనుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లోకి వెళ్లేందుకు మోటర్‌ పెట్టాం. కింద ట్యాంకులన్నీ అండర్‌గ్రౌండ్‌ కాబట్టి వాటి పైన స్థలాన్ని కార్‌పార్కింగ్‌కి వాడుకుంటాం. ఎక్కడా స్థలం వృథా కాలేదు. డబ్బు వృథా కాలేదు.
ఇరవయ్యేళ్లుగా మాకు తాగడానికీ అన్ని అవసరాలకీ ఈ నీరే సరిపోతోంది. వాన నీటిని మించిన శుభ్రమైన తాగునీరు మరేదీ లేదు. నీటి కనెక్షనే లేనప్పుడు ఇంక బిల్లు కట్టే పనేముంది? బెంగళూరు నగరంలో ఏటా సగటున వంద సెంటీమీటర్ల వాన పడుతుంది. 2,400 చదరపు అడుగుల నివాస స్థలం పైకప్పు మీద రెండు లక్షలా ముప్పై వేల లీటర్ల నీటిని సేకరించవచ్చు. గత మూడు దశాబ్దాల్లో కనీసం ఎనిమిదేళ్లు వానల్లేక నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. మాకు మాత్రం ఎలాంటి సమస్యా రాలేదు. పెరిగిపోతున్న నివాస సముదాయాలూ కార్యాలయ భవనాలతో నగరం విపరీతంగా విస్తరిస్తోంది. మరో పక్క నీరు ఇంకేందుకు అంగుళం కూడా నేల కనపడటం లేదు. కనీసం ఎవరికి వారు ఇంట్లోనైనా వాననీటిని సంరక్షించుకుంటే నగరానికి అవసరమైన నీటిలో సగం నీటి అవసరం తీరిపోతుంది. ఇప్పటికైనా అందరూ ఆ దిశగా కృషిచేయాలన్నదే నా ఆశ.

‘తన్నీర్‌’ తంటా మాకు లేదంటా...
- హర్ష కోడా

రేళ్ల క్రితం చెన్నైలో అపార్ట్‌మెంట్‌ కొనుక్కున్నాం. అయితే మా ఇల్లున్న ఓల్డ్‌ మహాబలిపురం రోడ్డు వైపు ఇంకా ప్రభుత్వ నీటి సరఫరా సదుపాయం లేదు. దాంతో నాలుగు బ్లాకులున్న మా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌కి రోజుకు ఐదు వేల రూపాయలు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చేది. వేసవిలో అయితే ఎనిమిది వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నెలకు లక్షన్నర నీటికోసం ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు కదా. అందుకే వాన నీటి మీద దృష్టి పెట్టాం. ముందుగా మా అపార్ట్‌మెంట్‌ టెర్రెస్‌ పైన పడే నీటిని వాడుకుందామనుకున్నాం. నిపుణుల్ని సంప్రదిస్తే డాబా పైన ఓ గంటపాటు వర్షం కురిస్తే ప్రతి చదరపుటడుక్కీ లీటరు నీళ్లు పట్టుకోవచ్చని లెక్కగట్టారు. మా ఆవరణలో ఉన్న నాలుగు అపార్ట్‌మెంట్‌ భవనాలకీ కలిపి 25వేల చదరపుటడుగుల డాబా ఉంది. అంటే 25వేల లీటర్ల నీళ్లు వస్తాయి. అది ఒకరోజు మేం కొనుక్కుంటున్న నీటిలో సగం. అదే మూడుగంటలు వాన కురిస్తే దాదాపు రెండు రోజులకు సరిపోతాయి.

ఈ లెక్కలన్నీ అయ్యాక అవసరమైన పైపులూ, నీటిని శుద్ధి చేయడానికి కావలసిన సరంజామా ఏర్పాటుకు రెండున్నర లక్షల ఖర్చు తేలింది. నెల నెలా నీటికోసం లక్షన్నర రూపాయలు ఖర్చుపెడుతున్నప్పుడు ఒకసారి పెట్టే పెట్టుబడి కాబట్టి అదేమంత ఇబ్బందనిపించలేదు. అందరూ అంగీకరించడంతో గబగబా ఏర్పాట్లు పూర్తిచేసి వానల కోసం ఎదురుచూశాం. మావి అక్టోబరు వానలు కదా. అయితే గత ఏడాది సగటు కన్నా తక్కువ వాన కురిసింది. దాంతో 10లక్షల లీటర్ల నీటిని మాత్రం సేకరించగలిగాం. దాదాపు నెల రోజులు ట్యాంకర్ల అవసరం రాలేదు. లక్షన్నర ఆదా చేసినట్లే కదా. అది మా అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచింది. ఆ తర్వాత మురికినీటిని శుద్ధిచేయడం ద్వారా మరో 15 వేల లీటర్లను ఆదా చేయగలిగాం. అలా రోజూ తెప్పించే ట్యాంకర్ల నీరు 45 వేల లీటర్ల నుంచి 30వేల లీటర్లకు తగ్గింది. మొన్న వేసవిలో కురిసిన చెదురుమదురు వానలకీ కాస్త నీటిని వెనకేసుకోవడంతో నగరమంతా నీటికి ఇబ్బందిపడుతున్నా మాకు అంత సమస్య కాలేదు. ఇప్పుడు మమ్మల్ని చూసి చుట్టుపక్కల ఉన్న వంద అపార్ట్‌మెంట్‌ భవనాల వారు వాననీటిని ఒడిసి పట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. అందరూ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి నన్ను సమన్వయకర్తగా ఎన్నుకున్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో అందరం కలిసి చర్చించుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది సాధారణ వర్షం పడితే చాలు, వచ్చే ఏడాది మా ప్రాంతానికి ఎలాంటి నీటి ఎద్దడీ ఉండదని నాదీ హామీ.

ఆర్నెల్లకు సరిపడా నీళ్లున్నాయి
- వి.కె.రవిరాజా

క్షిణాదిన నీటి కరువు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చెన్నై నగరమే. మొన్నటికి మొన్న వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి మా నగరాన్ని పత్రికల్లో పతాకశీర్షికలకు ఎక్కేలా చేసింది. కానీ ఆ సమయంలోనూ మా ఇంట్లో మరో ఆర్నెల్లకు సరిపడా నీళ్లున్నాయంటే నమ్ముతారా? అవును, నేనూ నా భార్యా ఇద్దరు పిల్లలూ- నలుగురం ఉండే మా కుటుంబానికి గత ఏడాది వర్షాలప్పుడు సేకరించిన నీరే సరిపోతోంది వాడుకోవడానికి. నేను పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాను కానీ, వాన నీటిని సేకరించాలన్న ఆలోచన ఐదేళ్ల క్రితమే వచ్చింది. ఆలోచన రాగానే హడావుడిగా ఏదో ఒకటి చేయలేదు. నా కాంపౌండ్‌లో పడిన ఒక్క వాన చుక్క కూడా బయటకు పోవడానికి వీల్లేదన్న గట్టి నిర్ణయం తీసుకుని అందుకు తగినట్లుగా ప్రణాళికలు వేసుకున్నా. మొత్తం నాలుగు రకాల సంరక్షణ విధానాలను చేపట్టాను. డాబా పైన ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ని రెండు విభాగాలు చేశాను. ఒక భాగంలో నల్లా నీటిని నింపుతాం. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ పైకప్పు వైశాల్యం 72చదరపు అడుగులు. దాన్ని ఏటవాలుగా కట్టడంతో దానిమీద పడే వాన నీరంతా రెండో ట్యాంకులోకి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడే వడకట్టే ఏర్పాటు చేశాను. ఈ ట్యాంక్‌ నుంచి వంటగది సింకుకి కనెక్షన్‌ ఇచ్చాను. కొన్ని నెలల పాటు ఈ నీరే వంటకీ తాగడానికీ సరిపోతోంది. వర్షాలు లేని సమయంలో ట్యాంకుల మీద దుమ్మూ ధూళీ పడకుండా పూర్తిగా కప్పేస్తాను. నీళ్లు శుభ్రంగా ఉంటాయి. ఇక మామూలుగా ఇంటి పైకప్పు మీద పడే నీరంతా అండర్‌గ్రౌండ్‌ ట్యాంక్‌లోకి వెళ్తుంది. సాధారణ వాడకానికి ఆ నీరు సరిపోతుంది. అలా రెండు రకాల సేకరణ అయిపోయాక మూడోది బోర్‌వెల్‌ పక్కన తవ్విన పెద్ద ఇంకుడు గుంత. దాన్ని ఏటా క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుండడంతో బాగా పనిచేస్తోంది. ఇక నాలుగో పద్ధతి- ఆవరణ అంతా అక్కడక్కడా లోతుగా చిన్న చిన్న రంధ్రాలు చేసి కంకరరాళ్లతో నింపాం. ఇవీ చిన్న ఇంకుడుగుంతల్లాగే పనిచేస్తాయి. వాకిట్లో నడిచే ప్రాంతంలో నాపరాయి వేసినా సిమెంట్‌తో వాటిని బిగించలేదు. దాంతో వాటి మధ్య కూడా నేల ఉండి నీటిని పీల్చుకుంటుంది. ఇలా... మా ఇంటిపై పడిన ఒక్క వాన చుక్క కూడా డ్రెయిన్లలోకి వెళ్లకుండా ఒడిసిపడుతున్నాం. కాబట్టే నీటి కరువు మాకెప్పటికీ రాదని గుండెల మీద చెయ్యేసుకుని చెబుతా.

వాన నీరే సరిపోతోంది!
- డా. బాలకృష్ణన్‌ నాయర్‌

ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజిస్టుగా పనిచేసి రిటైరయ్యాను. నాకు పని లేకపోవడమూ ఇంట్లో నీటి సమస్య మొదలవడమూ ఒకేసారి జరిగాయి. మేం ఉండేది కోళికోడ్‌ నగరానికి మధ్యలో. దాంతో అంతకు ముందు నగరంలోని ఇతర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్నా మాకు సరఫరాలో అంతరాయం ఉండేది కాదు. అలాంటిది పదేళ్ల క్రితం సమస్య మాదాకా వచ్చింది. పిల్లలంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండి డబ్బులిచ్చి ట్యాంకరు తెప్పించుకుందాంలే అని చెప్పివెళ్లిపోయేవారు. నాకేమో మనసొప్పేది కాదు. ప్రత్యామ్నాయం ఏమిటా అని ఆలోచించేవాణ్ని. అప్పుడు - వాన నీరు చాలా శుభ్రంగా ఉంటుందనీ తాగడానికి మంచిదనీ ఎవరో చెప్పారు. మాకు వర్షాలు బాగానే కురుస్తాయి. ఉచితంగా వచ్చే వాన నీటిని వదిలేసి డబ్బు పెట్టి కొనుక్కోవడం ఎందుకనిపించింది. ఖాళీగా ఉన్నాను కదా అని నా ప్రయత్నాలు నేను మొదలెట్టాను. మాది రెండంతస్తుల ఇల్లు. మొదటి అంతస్తులో సగం ఖాళీగా ఉంటుంది. ఈ రెండు పైకప్పుల మీద పడే నీరంతా ట్యాంకుల్లోకి చేరేలా పైపులు పెట్టించాను. ఏ అంతస్తుకి ఆ అంతస్తులో ఈ ఏర్పాటు చేయడంతో ఎక్కువగా మోటారు వాడాల్సిన అవసరమూ రావటంలేదు. పై అంతస్తు పైకప్పు మీద పడిన నీరు మొదటి అంతస్తులో పెట్టిన ట్యాంకులోకి వచ్చేది. ఆ ట్యాంకుని పూర్తిగా నేలమీద కాకుండా కిటికీల పైన ఉండే షేడ్‌ల ఎత్తులో పెట్టాం. దాని నుంచి వంటగదిలోకీ బాత్రూముల్లోకీ కనెక్షన్‌ పెట్టాం. దాంతో నీటిని పంప్‌ చేయాల్సిన అవసరం లేకుండా వాడుకుంటున్నాం. అలాగే మొదటి అంతస్తులో పడిన వాన నీరు గ్రౌండ్‌ ఫ్లోర్‌ కిటికీలపైన పెట్టిన ట్యాంకులోకి వస్తుంది. అక్కడ కూడా అలాగే పైపులతో కనెక్షన్లు ఇచ్చేసరికి మాకు నీటి కరువు తీరిపోయింది. పైగా మున్సిపల్‌ నీటిని కింద సంపులోకి పట్టుకుని అందులోనుంచి మోటరుతో ఓవర్‌హెడ్‌ట్యాంకులోకి ఎక్కించే పని తప్పింది. ట్యాంకులు శుభ్రంగా ఉండేలా, వాన నీరు ఫిల్టర్‌ అయి వచ్చేలానూ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇంకే ఖర్చూ ఉండదు. ఇప్పుడు చాలామంది మా ఇంటికి వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో నా సలహాతో వాన నీటి సేకరణ ట్యాంకులు ఏర్పాటు చేశారు. అలా వాన నీటిని ఒడిసిపట్టే విధానానికి ప్రచారం కల్పిస్తూ నా విశ్రాంత జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నా.

చూశారుగా..! అదీ సంగతి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకుండా వీరంతా ఎవరికి వారు వాన నీటిని ఒడిసిపట్టి జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో ఇతరులకూ సలహాలిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? డాబా పైకప్పు ఎన్ని చదరపు అడుగులుందో... ఎన్ని నీళ్లు పట్టుకోవచ్చో... లెక్కలు వేసేయండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.