close
దుబాయ్‌ టవరు చూడర బాబూ..!

’అక్కడ... భూమ్మీద సముద్రాన్నీ సముద్రంలో భూమినీ నిర్మించేస్తారు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచేస్తారు. ఎత్తైన కట్టడాలతో ఆకాశాన్నీ అందుకుంటారు. నీటిలోని జంతుప్రదర్శనశాలలతో సాగర లోతుల్నీ చూస్తారు. మొత్తంగా ఎడారి జీవితాన్ని చందమామ కథలుగా చెప్పుకోగలిగేలా చేయగలిగిన ఆ అద్భుత ప్రాంతమే దుబాయ్‌... విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం...’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన గుంటుక చక్రవర్తి.
కుటుంబసభ్యులం 13 మందిమి కలిసి దుబాయ్‌ చూడ్డానికని అబుదాబిలో ఉంటోన్న అన్నయ్య దగ్గరకు వెళ్లాం. హైదరాబాద్‌లో విమానం ఎక్కి షార్జాలో దిగి, కార్లలో రెండున్నర గంటలు ప్రయాణించి అబుదాబి
చేరుకున్నాం. ముందుగా రెండు గంటలపాటు మదినత్‌ సెంటర్‌లో షాపింగ్‌ చేశాక, అబుదాబిలోనే విలాసవంతమైన కార్నిచ్‌ బీచ్‌కి వెళ్లాం. అది సహజంగా ఏర్పడిన బీచ్‌ కాదు. సముద్రాన్ని కొంత దూరం మళ్లించిన నీటిపాయల వల్ల ఏర్పడిన బీచ్‌ అది. తెల్లని ఇసుకనీ నీలి సముద్రాన్నీ చూస్తుంటే అక్కడినుంచి రావాలనిపించలేదు.

అద్భుతం ఆ మసీదు నిర్మాణం!
అబుదాబి... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజదాని. పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుందీ నగరం. రాజధాని కావడంతో అధికార కార్యాలయాలు ఎక్కువ. అన్నీ అద్దాల మేడలే. ఆకాశహార్మ్యాలే. ఎతిహాద్‌ టవర్స్‌, పైనాపిల్‌ బిల్డింగ్స్‌...వంటి ఆర్కిటెక్చర్‌ అద్భుతాలెన్నో కనిపిస్తాయి. గ్రాండ్‌ మాస్క్‌ చూడ్డానికి బయలుదేరాం. యూఏఈ జాతిపిత షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహయాన్‌ కలే ఈ మసీదు. ప్రపంచాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. పదేళ్లపాటు మూడువేల మంది ఈ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారు. ఇందులోని ప్రార్థనా మందిరంలో ఉన్న కార్పెట్‌, షాండ్లియర్స్‌ ఈ మసీదుకి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ప్రార్థనా మందిరం గోడమీద అల్లా 99 పేర్లు కనిపిస్తాయి. వందో పేరు అల్లాకే కనిపిస్తుందట.

రెండోరోజు దుబాయ్‌ నగరానికి ముఖద్వారంలా కనిపించే అట్లాంటిస్‌ హోటల్‌కి వెళ్లాం. యాత్రికులను చేతులు చాచి ‘రండి మా ఆతిథ్యం స్వీకరించండి’ అని పిలుస్తున్నట్లుగా ఉంటుంది దాని నిర్మాణం. అది చూశాక మెట్రోలో ఖర్జూర చెట్టు ఆకారంలో నిర్మించిన పామ్‌ జుమేరా బీచ్‌కి వెళ్లాం. ఇది విలాసవంతమైన బీచ్‌ విల్లాలకు పెట్టింది పేరు.

దుబాయ్‌లో ప్రధాన పర్యటక ప్రాంతమైన అల్‌ అరబ్‌ హోటల్‌ దగ్గర ఉన్న బీచ్‌కు వెళ్లాం. ఎడారిదేశం... మిట్టమధ్యాహ్నం... ఎండలో ప్రయాణం... భానుడి ప్రతాపానికి తిరుగేముంటుంది. ఎండాకాలం మొదలవ్వనే లేదు. థర్మామీటర్‌ నలభై డిగ్రీలు దాటిపోయింది. దుబాయ్‌లో ఏసీ లేకుండా బతకలేం. అందుకే అక్కడి ప్రభుత్వం ఇంటి బయట ఉండే సెక్యూరిటీ గార్డుకు కూడా ఏసీ సౌకర్యం కల్పించాలనే నిబంధన పెట్టింది. కొత్త ప్రాంతాన్ని చూస్తున్న ఆనందంలో ఆ ఎండ వేడిమిని మేం కాసేపు మరిచిపోయాం. తెరచాపను పోలిన బుర్జ్‌ అల్‌ అరబ్‌ హోటల్‌ని చూస్తూ వాళ్ల నిర్మాణచాతుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. ముప్ఫై అంతస్తులకు పైగా ఉన్న భవనాలు దాదాపు వెయ్యికి పైగా దుబాయ్‌లో ఉన్నాయి. ఆర్కిటెక్చర్‌ అద్భుతాల్లో దుబాయ్‌ని మించిన నగరం లేదు.

స్వర్ణ సీమలో..!
బంగారానికీ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికీ నిలయమైన దుబాయ్‌ గురించి తెలుసుకోవాలంటే దుబాయ్‌ క్రీక్‌కు వెళ్లాల్సిందే. ఆసియా దేశాల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ఇక్కడినుంచి ఆఫ్రికాకు ఎగుమతి అవుతుంటాయి. దెయిరా, బుర్‌ దుబాయ్‌ ప్రాంతాలను వేరుచేస్తూ దుబాయ్‌ జలసంధి ఉంటుంది. జలసంధిని దాటి మేం దుబాయ్‌ మార్కెట్‌కి వెళ్లాం. సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్ముతున్నారక్కడ. మనతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువ. అందుకే ఆభరణ
ప్రియులకి ఇది నిజంగా స్వర్గసీమే. అక్కడి నుంచి దుబాయ్‌ మ్యూజియానికి వెళ్లాం. అరబ్బుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వాళ్లు ఎదిగినతీరు అన్నీ అందులో సచిత్రంగా వర్ణించారు. తరవాత దుబాయ్‌ క్రీక్‌లో రోలెక్స్‌ టవర్స్‌ చూసి అబుదాబికి చేరుకున్నాం. మెరీనా మాల్‌లోని జెయింట్‌ వీల్‌ ఎక్కి అబుదాబి నగర అందాలను వీక్షించాం.

ఎడారి సఫారీ!
ఆ మర్నాడు అబుదాబి నుంచి దుబాయ్‌కి చేరుకుని, ప్రపంచంలోనే పెద్ద విమానాశ్రయంలో ఒకటైన దుబాయ్‌ ఎయిర్‌పోర్టు చూడ్డానికి మెట్రోలో బయల్దేరాం. అక్కడి మెట్రో నేరుగా విమానాశ్రయంలోకి వెళుతుంది. దుబాయ్‌ రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తున్నాయి. అక్కడ టోల్‌ వసూలు కూడా అత్యాధునిక పద్ధతిలో ఉంది. దుబాయ్‌ సిటీలో మూడు టోల్‌గేట్స్‌ ఉన్నాయి. అయితే అక్కడ ఏ కారు కూడా ఆగదు. కారు పై ఉన్న స్టిక్కర్‌ స్కానింగ్‌తోనే అకౌంట్లోంచి నగదు చెల్లింపు జరిగిపోతుంటుంది. ఎంత వేగంతో వెళ్లినా స్కాన్‌ చేసేలా టోల్‌గేట్‌ కెమెరాలు ఉంటాయి. ఒక్కసారి టోల్‌గేట్‌ దాటితే నాలుగు దిర్హమ్స్‌ వసూలు చేస్తారు.

తరవాత కార్లలో షార్జాకు బయలుదేరాం. దుబాయ్‌, షార్జా జంట నగరాలు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లను ట్యాంక్‌బండ్‌ వేరుచేస్తున్నట్లుగానే అక్కడి ఫ్లై ఓవర్‌ రెండు నగరాలనూ వేరు చేస్తుంది. షార్జాలోని నోవాపార్కు హోటల్‌లో చెక్‌ ఇన్‌ చేసి డెజర్ట్‌ సఫారీకి బయల్దేరాం. షార్జా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డెజర్ట్‌ సఫారీ సెంటర్‌ ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఈ సఫారీ ప్యాకేజీ సాగుతుంది. ముందుగా స్టార్టింగ్‌ పాయింట్‌కు చేరుకున్నాం. సాయంకాలం కావడంతో గాలికి ఇసుక అలలు అలలుగా కదులుతోంది. ల్యాండ్‌ క్రూయిజ్‌ కార్లలో మా సఫారీ మొదలైంది. ఓ పక్క అప్పటివరకూ నిప్పులు కక్కి చల్లగా జారుకుంటున్న సూరీడు... దూరంగా ఎడారి ఓడల బారులు... ఇసుకతిన్నెలపై లాండ్‌క్రూయిజ్‌ కార్లో మేం... అంత ఇసుకలోనూ కారు వేగం తగ్గడం లేదు. నిజానికి ఇసుకలో కారు ప్రయాణం సాధ్యపడదు. కానీ ల్యాండ్‌ క్రూయిజ్‌ కార్లు డెజర్ట్‌ సఫారీకి అనువైనవి. ఎంత వేగంతో వెళ్లినా ఇసుకలో కూరుకుపోవు. అప్పుడే కొండలూ అంతలోనే లోయలూ... అనుకున్నదానికన్నా ఎంతో బాగుంది ప్రయాణం. అలా ఇరవై నిమిషాలపాటు కారులో తిరిగి క్యాంపు వద్దకు చేరుకున్నాం. అక్కడ కాసేపు ఒంటెలు ఎక్కి తిరిగాం. ఇసుకతిన్నెల మధ్యలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది. అక్కడ అద్దెబట్టలతో ఫాల్కన్‌ పక్షిని చేతబట్టి దుబాయ్‌ సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చాం. క్యాంపులో కొన్ని నృత్యాలు, సాహసక్రీడలు ప్రదర్శించారు. ఫైర్‌ షో చూసి ఒళ్లు గగుర్పొడిస్తే, బెల్లీ నృత్యం ఒళ్లు పులకరించేలా చేసింది.

ఎత్తైన నిర్మాణం!
ఆ మర్నాడు ప్రపంచంలోకెల్లా ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాని చూడ్డానికి వెళ్లాం. అది ఎక్కడానికి ఒక్కొక్కరికీ 141 దిర్హమ్స్‌ అంటే మన కరెన్సీలో 2800 రూపాయలు చెల్లించాలి. ఇందులోనూ రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. దుబాయ్‌ మాల్‌లో ఉండే అక్వేరియం అండర్‌ వాటర్‌ జూతో కలిపిన ప్యాకేజీ కోసమయితే 216 దిర్హమ్స్‌ కట్టాలి. దుబాయ్‌ డౌన్‌టౌన్‌ అభివృద్ధిలో భాగంగా ఈ బుర్జ్‌ ఖలీఫాను నిర్మించారు. 160 అంతస్తుల ఈ భవనంలో పర్యటకులను 125 అంతస్తుల వరకూ అనుమతిస్తారు. కేవలం ఒక్క నిమిషంలోనే లిఫ్ట్‌ మనల్ని ఆ ఎత్తుకు తీసుకెళ్తుంది. ఎత్తైన స్విమ్మింగ్‌పూల్‌, మసీదు, ఎత్తైన నైట్‌ క్లబ్‌... ఇలా పదికి పైగా రికార్డులు బుర్జ్‌ ఖలీఫాకు ఉన్నాయి. తరవాత దుబాయ్‌ మాల్‌లోని అక్వేరియం చూడ్డానికి వెళ్లాం. రెండంతస్తుల ఆ అక్వేరియంలో 4,800 జాతులకు పైగా జలచరాలు ఉన్నాయి. ఆ మర్నాడు దుబాయ్‌ పార్కులు చూసేందుకు ఉదయాన్నే బయలుదేరాం. అబుదాబి నుంచి దుబాయ్‌కు వెళ్లే షేక్‌ జాయెద్‌ రహదారి పక్కన ఈ పార్కులు ఉన్నాయి. మోషన్‌ గేట్‌, లెగో ల్యాండ్‌, బాలీవుడ్‌ పార్కు మూడింటినీ కలిపి దుబాయ్‌ పార్కులు అంటారు. బాలీవుడ్‌ పార్కు అంతా హిందీ సినిమాలోకం. సల్మాన్‌, అమితాబ్‌ డూప్‌ల నృత్యాలు ఆకట్టుకుంటాయి.  షోలే థీమ్‌తో సాగే వీడియో గేమ్‌ రైడ్‌లో గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌ను మనం కాల్చే కొద్దీ పాయింట్లు వస్తుంటాయి. లగాన్‌ రైడ్‌లో మనల్ని క్రికెట్‌ బంతిని చేసి ఓ ఆటాడుకుంటాడు అమీర్‌ఖాన్‌. ఇక క్రిష్‌ రైడ్‌లో మనం కష్టాల్లో పడుతున్నకొద్దీ క్రిష్‌ వచ్చి కాపాడుతుంటాడు. ఆశ్చర్యం... అంతకు మించిన ఆనందంతో దుబాయ్‌ పార్కులను ఎంజాయ్‌ చేసి ఆ మర్నాడు షార్జాకు చేరుకుని డ్యూటీ ఫ్రీలో షాపింగ్‌ చేసి హైదరాబాద్‌కి తిరిగివచ్చాం.

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.