close
అబ్బ... ఏం పేర్లు పెట్టారండీ...!

చాలామంది తమ అభిమాన నటులూ నాయకుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. కానీ కొందరు తాము ఇష్టపడే సెలబ్రిటీల పేర్లను వేటికి పెట్టారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

 

పండైన గౌరవం

కే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లను కాయించి పద్మశ్రీ అందుకున్న కలీముల్లా కొత్తగా సృష్టించిన ఓ రకం మామిడి పండ్లకు అమిత్‌షా పేరు పెట్టాడు. కోల్‌కతాకు చెందిన హుస్నే ఆరా, లఖ్‌నవూలో ఫేమస్‌ అయిన దశేరి రకాన్ని కలిపి అంటుకడితే వచ్చింది అమిత్‌ షా మామిడి పండు రకం. కలీముల్లా ఇలా మామిడి రకాలకు పేర్లు పెట్టడం ఇదేం కొత్తకాదు. అబ్దుల్‌కలాం, మోదీ, అఖిలేశ్‌ యాదవ్‌, సోనియాగాంధీ, సచిన్‌ తెందూల్కర్‌ వంటివాళ్ల పేర్లనూ గతంలో కొన్ని రకాలకు పెట్టేశాడు.

 

షూటింగ్‌ జరిగే... పేరు మారే

ప్రకృతి అందాలకు నెలవైన సిక్కిం రాష్ట్రంలో ఓ జలపాతం పేరు వింటే మనకి చిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎత్తైన ఆ జలపాతం పేరు ‘అమితాబ్‌ బచ్చన్‌ వాటర్‌ ఫాల్స్‌’. నార్త్‌ సిక్కిం జిల్లాలోని లాచుంగ్‌ ప్రాంతంలో ఉన్న ఆ జలపాతం అసలు పేరు భీవ్మా. బిగ్‌బీ నటించిన ‘ఆంఖే’ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని భీవ్మా వాటర్‌ఫాల్స్‌ వద్ద యాభైరోజుల పాటు షూట్‌ చేశారు. అప్పట్నుంచీ స్థానిక డ్రైవర్లూ పర్యటకులూ ఆ జలపాతాన్ని అమితాబ్‌ బచ్చన్‌ వాటర్‌ ఫాల్స్‌గా పిలవడం మొదలుపెట్టారు. అలానే సింగపూర్‌లోని ఓ ఆర్కిడ్‌జాతి మొక్కకూ బిగ్‌బీ పేరు పెట్టారు.

 

తులిప్‌ని తలదన్నే అందమని

నెదర్లాండ్స్‌లోని హోలండ్‌ తులిప్‌ పువ్వులకు కేరాఫ్‌ అడ్రస్‌. హరివిల్లు విరిసినట్టుండే తులిప్‌ పూల వనాలను చూడ్డానికి ఎంతోమంది వెళుతుంటారు. మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యా రాయ్‌ని అందానికి చిరునామా భావించిన నెదర్లాండ్స్‌ పర్యటక అధికారులు అక్కడ నర్సరీల్లో కొత్తగా సృష్టించిన ఓ డచ్‌జాతి తులిప్‌ రకానికి ఆమె పేరు పెట్టారు. ఆ పేరును రిజిస్టర్‌ కూడా చేయించి సర్టిఫికెట్‌ను ఐష్‌కి అందించారు.

 

వీధి వీధినా అభిమానులే

ఆర్‌ రహమాన్‌కు మనదేశంలోనే కాదు ఖండాంతరాల్లోనూ వీరాభిమానులున్నారు. ఆ అభిమానంతోనే రహమాన్‌ పేరును ఓ వీధికీ పెట్టేశారు. కెనడాలోని మార్ఖమ్‌ నగరంలో ఉందా వీధి. సంప్రదాయ కళలూ, సంగీతం, థియేటర్‌ ఆర్ట్స్‌కి ప్రాధాన్యమిచ్చే కెనడా వాసులు ఆయా రంగాల్లో ప్రముఖులైన వారిమీద ఉన్న గౌరవభావంతో వీధులకూ, ప్రాంతాలకూ అలా పేర్లు పెట్టేస్తుంటారు. అవధుల్లేని సంగీత ప్రపంచంలో రహమాన్‌ పాటలు కెనడా వాసుల్ని రంజింపజేయడంతో అలా గౌరవించుకున్నారు.

 

దోశకు దీపిక పేరు

దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ఈ మధ్య టెక్సాస్‌లోని ఆస్టిన్‌కి హనీమూన్‌కి వెళ్లారు. అక్కడ ‘దోశలాబ్‌’ రెస్ట్టరంట్‌కి వెళ్లిన రణ్‌వీర్‌ మెనూ కార్డు చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఓ దోశ పేరు ‘దీపిక పదుకొణె’ అని రాసుంది. ఇంతలో రణ్‌వీర్‌ జంటను గుర్తుపట్టిన హోటల్‌ యజమాని తను దీపికకు వీరాభిమానిననీ, ఆమెపైన గౌరవంతోనే తమ హోటల్లో ప్రత్యేకంగా చేసే దోశకి ఆ పేరు పెట్టాననీ చెప్పాడు. అప్పుడే దీపిక, రణ్‌వీర్‌లు ఆ మెనూను ట్విటర్‌లో పెట్టి అందరితోనూ ఆ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.