close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వస్తున్నారు... ‘చెత్త’ మేనేజర్లు!

దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ గుప్తాల కుటుంబం తమ వారసుల పెళ్లిళ్లని సొంతూరైన ఉత్తరాఖండ్‌లోని ఓలిలో ఇటీవల నిర్వహించింది. ఆ విధంగా తమ మూలాల్ని గుర్తుచేసుకున్నా, సుందరమైన పట్టణాన్ని చెత్తకుప్పలా మార్చివెళ్లారు. అయిదు రోజుల్లో రూ.200 కోట్లు ఖర్చుపెట్టి ఊరికి నాలుగువేల క్వింటాళ్ల చెత్తను కానుకగా ఇచ్చారు. ఆ పెళ్లిలో ‘వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ సంస్థకు చోటిచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ‘అలాంటి సంస్థలూ ఉంటాయా..?’ అంటే, ఉంటాయి. ఇవి అవే!

 

నీళ్లున్నాయి... బాటిళ్లు లేవు!

ముంబయిలోనే అతిపెద్దదైన దేవనార్‌ డంప్‌యార్డ్‌లో మూడేళ్ల కిందట మంటలు చెలరేగి పొగ కమ్ముకోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకోవడానికీ ఇబ్బందిపడ్డారు. అప్పుడే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురించి ఆలోచించారు దివ్యా రవిచంద్రన్‌. ఇంట్లోని వ్యర్థాల్ని ఆహార పదార్థాల చెత్త, పునరుత్పాదక చెత్త, డంపింగ్‌ యార్డ్‌కు చేరాల్సిన చెత్త... ఇలా విభజించేవారు. ఆహార వ్యర్థాలను ఇంట్లోనే కంపోస్ట్‌గా మార్చారు. పునరుత్పాదక చెత్తను వాటిని సేకరించే సంస్థలకూ, ఏమీ చేయలేని చెత్తను మున్సిపాలిటీకీ అప్పగించారు. ఈ విషయంలో స్నేహితులూ, కుటుంబ సభ్యులకు సలహాలిచ్చి వారిలోనూ మార్పు తెచ్చారామె. తర్వాత కార్పొరేట్‌ ఉద్యోగం విడిచిపెట్టి ‘స్క్రాప్‌’ సంస్థను ప్రారంభించారు. కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలకూ తమ సేవల్ని విస్తరించారు. ఆపైన వేడుకల్లోనూ తమ అవసరం ఉందని గమనించారు. అలా మొదటిసారి 2017లో పుణెలో జరిగిన ‘ఎన్‌హెచ్‌ సెవెన్‌’ అనే యువ ఉత్సవానికి పనిచేశారు. ఏటా జరిగే ఈ ఉత్సవానికి దాదాపు యాభైవేల మంది యువతీయువకులు హాజరవుతారు. అక్కడ నీళ్ల బాటిళ్లకు బదులుగా కుళాయిల్ని ఏర్పాటుచేయడం, ప్లాస్టిక్‌ ప్లేట్లకు బదులుగా పర్యావరణహితమైన ప్లేట్లూ, స్పూన్లూ వాడటం, ఆహార వ్యర్థాలకూ, ఘన వ్యర్థాలకూ వేర్వేరు డస్ట్‌బిన్లు పెట్టడం, ఫ్లెక్సీలను నిషేధించడం... వంటి మార్పులు తెచ్చారు. ఈ మార్పులతో డిసెంబరులో జరిగిన ఉత్సవంలోనే 12 వేల ప్లాస్టిక్‌ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించారు. 11 టన్నుల చెత్తలో 86 శాతం వాటిని రీసైకిల్‌ చేయగలిగారు. ముంబయిలో జరిగే యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌కీ వీరు పనిచేస్తున్నారు. పెళ్లిళ్లూ, పార్టీల నిర్వహణలోనూ భాగమవుతూ వ్యర్థాల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

కిలో ఎరువు రూ.120

‘మనకు చెత్తను వేరుచేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడమే పెద్ద తలనొప్పి’ అంటారు ‘వేస్ట్‌ వెంచర్స్‌ ఇండియా’ సహ వ్యవస్థాపకులు రోషన్‌ మిరండా, మాతంగి స్వామినాథన్‌, రాబ్‌ వైటింగ్‌. ముగ్గురూ కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి పర్యావరణానికి మేలు చేసే సంస్థను పెట్టాలనుకుని 2012లో దిల్లీలో కొన్నాళ్లు ఈ రంగంలో సేవలు అందించారు. 2016లో హైదరాబాద్‌కు వచ్చి సేవలు అందించడం మొదలుపెట్టారు. ఈ సంస్థ ఇళ్లూ, కార్పొరేట్‌ సంస్థల నుంచి రీసైకిల్‌ చేయగలిగే చెత్తను సేకరిస్తుంది. హైదరాబాద్‌లో 23 వేల ఇళ్లూ, 1500 చెత్తను సేకరించే వ్యక్తులూ, 20 వరకూ కార్పొరేట్‌ కంపెనీలతో పనిచేస్తోంది. ఇళ్లల్లో వేడుకలూ, ఆఫీసుల్లో పెద్ద సమావేశాలూ జరిగినపుడు వ్యర్థాల నిర్వహణలో ఖాతాదారులకు సాయపడుతుందీ సంస్థ. ఏదైనా హౌసింగ్‌ సొసైటీ, కార్పొరేట్‌ సంస్థ వీళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాక అక్కడ డస్ట్‌బిన్లను ఏర్పాటుచేస్తారు. ఆహార వ్యర్థాలూ ఘన వ్యర్థాలను(పేపర్‌, ప్లాస్టిక్‌, ఈ వేస్ట్‌) వేర్వేరుగా సేకరిస్తారు. ఆహార వ్యర్థాలతో సేంద్రియ ఎరువుని తయారుచేస్తారు. ఘన వ్యర్థాలను రీసైకిల్‌చేసి అమ్ముతారు. ప్రతి నెలా 16 కోట్ల టన్నుల చెత్తను రీసైకిల్‌ చేస్తున్నారు. వీరు తయారుచేసే సేంద్రియ ఎరువు ఖరీదు కిలో 120 రూపాయలు.

 

ఆకుపచ్చ దళం...

బెంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నగర పాలక సంస్థకే పాఠాలు నేర్పుతోంది ‘హసిరుదళ’ (ఆకుపచ్చ దళం). నళినీ, శేఖర్‌ దంపతులు దీని వ్యవస్థాపకులు. ‘వ్యర్థాల నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయాల్సిన పని. లేదంటే అవి డంపింగ్‌ యార్డుల్లో, నదుల్లో, చెరువుల్లో చేరతాయి. ఆ విధంగా కాలుష్యం పెరుగుతుంది’ అంటారు నళిని. ఈ సంస్థలో పదివేల మంది వరకూ వ్యర్థాల్ని సేకరించే వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ నెలవారీ జీతాన్ని అందిస్తూ వ్యర్థాల్ని సేకరించడాన్ని ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చింది హసిరుదళ. నగరంలోని 280 అపార్ట్‌మెంట్లలోని 45వేల ఇళ్లనుంచి వీళ్లు చెత్తను సేకరిస్తున్నారు. ‘ఇంట్లో వ్యర్థాల్ని ఎలా తగ్గించాలీ, ఎలా వేరుచేయాలీ’ లాంటి అంశాలమీద కుటుంబ సభ్యులతోపాటు పనివాళ్లకీ శిక్షణ ఇస్తుందీ సంస్థ. ఇళ్లనుంచి తడి, పొడి చెత్తల్ని వేర్వేరు ట్రక్కుల్లో తీసుకువెళ్తారు. వీరికి ప్లాస్టిక్‌ రీసైకిల్‌ యూనిట్‌ కూడా ఉంది. పెళ్లిళ్లూ, ఉత్సవాలూ, సభలూ, సమావేశాల్లోనూ వ్యర్థాల నిర్వహణ సేవలు అందిస్తోంది. ‘పర్యావరణహితమైన పెళ్లి’ అనే కాన్సెప్ట్‌ని బెంగళూరుకి పరిచయం చేసిందీ సంస్థ. మారథాన్లూ, ఐపీఎల్‌ మ్యాచ్‌లూ, బర్త్‌డే పార్టీలూ, ఆలయాల్లో ఉత్సవాలూ... ఇలా ఇప్పటివరకూ వందకుపైగా జీరో వేస్ట్‌ వేడుకల్ని నిర్వహించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.