close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అబ్బాయిలూ జాగ్రత్త!

ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండే అబ్బాయిలు కూడా పిజ్జా, బర్గర్‌, చిప్స్‌... వంటివి తింటే వాళ్లలో సంతాన సాఫల్యత తగ్గుతుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్స్‌తోబాటు ప్రాసెస్‌డ్‌ ఫుడ్సూ శీతలపానీయాలూ తీసుకునేవాళ్లలోనూ ఈ శుక్రకణాల శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్లు... వంటివి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదట. ఇందుకోసం వీళ్లు 19 సంవత్సరాల్లోపు మూడు వేల మంది అబ్బాయిల్ని ఎంపిక చేసి, నాలుగు వర్గాలుగా విభజించి మొదటి వర్గానికి యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్నీ; మిగిలిన విభాగాల వాళ్లకి వరసగా యాంటీ ఆక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ వచ్చి, చివరి వర్గంలోని వాళ్లకి ఏమాత్రం యాంటీ ఆక్సిడెంట్లు లేని ఫాస్ట్‌ఫుడ్స్‌ ఓ రెండు నెలలపాటు ఇచ్చారట. చివరగా పరిశీలిస్తే- అన్ని విభాగాల కన్నా ఫాస్ట్‌ ఫుడ్స్‌ తిన్నవాళ్లలో శుక్రకణాల శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. వీళ్లలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడే సెర్టోలి కణాలు దెబ్బతినడమే కారణమనీ కాబట్టి అబ్బాయిలు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.


 

ఏ వయసులోనైనా..!

వ్యాయామానికి వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు మొదలుపెట్టి చేసినా మంచిదే. క్యాన్సర్లు, మధుమేహం... వంటి వ్యాధులను నియంత్రించడంతోబాటు ఆయుష్షునీ పెంచుతుంది అంటున్నారు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం 40 - 79 ఏళ్ల మధ్యలోని 20 వేలమందిని ఎంపికచేసి గత ఇరవై ఏళ్ల నుంచీ వాళ్ల జీవనశైలిని పరిశీలించగా- అందులో వ్యాయామం చేయని వాళ్లతో పోలిస్తే; వ్యాయామం చేసేవాళ్లలో హృద్రోగాలు, పక్షవాతం, క్యాన్సర్లు, మధుమేహం, ఆస్తమా వంటివన్నీ తక్కువగా ఉన్నట్లూ ముఖ్యంగా ఏ వయసులో మొదలుపెట్టినా వ్యాయామం చేసే వాళ్లలో ఆయుష్షు పెరిగినట్లూ గుర్తించారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోలేదు. ఇప్పుడే ప్రారంభించండి!


 

పిల్లలు మల్టీటాస్కింగ్‌ చేయాలంటే..!

తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? తమ పిల్లలు అన్ని రంగాల్లోనూ రాణించాలనీ ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా అధిగమించగలగాలనే కదా. వాళ్లు అలా తయారవ్వాలంటే- కుటుంబంలో సమాజంలో వాళ్ల పాత్ర గురించి చిన్నప్పటి నుంచీ తెలియజెప్పాలి అంటున్నారు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక నిపుణులు. అంటే- అన్న, తమ్ముడు, పక్కింటి అబ్బాయి, స్నేహితుడు, కొడుకు, శిష్యుడు, మనవడు... ఇలా ఓ మనిషి తన జీవితంలో ఎన్ని రకాల పాత్రల్లో కనిపిస్తాడో అవన్నీ చిన్నప్పటినుంచీ వాళ్లకి తెలిసేలా చేయాలి. ఉదాహరణకు తమ్ముడికి ఏదైనా పజిల్‌ అర్థం కాకపోతేనో లేదా కిందపడిపోతేనో అన్నగా ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత నీదే అని చెప్పాలి. ఇదేమాదిరిగా జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ ఆడామగా అన్న తేడా లేకుండా పిల్లలని బాధ్యులుగా చేయడం వల్ల వాళ్లలో మల్టీ టాస్కింగ్‌, సృజనాత్మకత... వంటివి పెరుగుతాయి. పెరిగి పెద్దయ్యాక వాళ్లకేదీ సమస్యగా అనిపించదు సరికదా, సమాజం పట్ల సానుకూల దృక్పథం అలవడుతుంది. పైగా చదువు, సంగీతం, ఆటలు... ఇలా ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు అని చెబుతున్నారు పరిశోధకులు.


 

నిద్రతో గుండె పదిలం!

నిద్రలేమి గుండెజబ్బుకీ దారితీస్తుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోకి చెందిన పరిశోధకులు. ఎందుకంటే చాలామంది ఐదారుగంటల నిద్ర కూడా సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఏడెనిమిది గంటల నిద్ర అవసరం అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరుగంటలే నిద్రపోయేవాళ్ల రక్తనాళాల్లో కొవ్వు కణజాలం పేరుకుని గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని గుర్తించారు. అంతేకాదు, ప్రొటీన్ల తయారీలో కీలకపాత్ర వహించే ఆర్‌ఎన్‌ఏ శాతం తగ్గిపోవడంతో రక్తప్రవాహంలో అనేక అడ్డంకులు ఏర్పడి హృద్రోగ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే నిద్రకి మించిన మందు లేదు అంటున్నారు సంబంధిత పరిశోధకులు.


 

వానల్లో మిరియాలు!

నాలుగు వర్షాలు పడితే చాలు...చాలామందికి దగ్గూ జలుబూ తుమ్ములూ మొదలైపోతాయి. అందుకే ఈ కాలంలో మిరియాల్ని కషాయం రూపంలో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిల్లో అనారోగ్యాన్ని నివారించే అనేక ఔషధగుణాలతోబాటు విటమిన్లూ ఖనిజాలూ కూడా పుష్కలంగానే ఉంటాయి. మిరియాల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు దగ్గూ జలుబుల్నే కాదు, సైనస్‌ సమస్యల్నీ ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ తగ్గిస్తాయి. మిరియాల్లోని విటమిన్‌-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిల్లోని పైపరీన్‌ అనే పదార్థం, ప్రొటీన్లు జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికీ దోహదపడతాయివి. హానికర పదార్థాలు బయటకు వెళ్లేందుకూ సాయపడతాయి. మిరియాల్లోని ఎ, సి విటమిన్లూ ఫ్లేవొనాయిడ్లూ కెరోటిన్లూ ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయని ఆధునిక పరిశోధనల్లోనూ స్పష్టమైంది. డిప్రెషన్‌నీ మిరియాలు తగ్గిస్తాయి. అందుకే కషాయంగా తీసుకోలేకున్నా టీ, సూప్‌.... ఎందులోనైనా మిరియాల పొడిని చల్లుకోవడంవల్ల వర్షాకాలంలో వచ్చే సమస్యల్ని నిరోధించుకోవచ్చు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు