close
నాన్నకు ప్రేమతో... మొఘల్‌!

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ టి-సిరీస్‌ అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో పదికోట్ల మందికిపైగా సబ్‌స్క్రైబర్స్‌తో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత గిన్నిస్‌కీ ఎక్కింది. టీనేజీలోనే టి-సిరీస్‌ బాధ్యతలు భుజానికెత్తుకున్న భూషణ్‌ కుమార్‌ సవాళ్లను అధిగమించి... తండ్రి ఆశలే తన శ్వాసగా బతికాడు. ‘సాహో’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ మాటల్లోనే ఆ విశేషాలన్నీ...

మా నాన్న గుల్షన్‌ కుమార్‌ తన రెక్కల కష్టంతో ఒక్కో ఇటుకా పేరుస్తూ కట్టిందే టి-సిరీస్‌ సామ్రాజ్యం. ఆయన పెద్దగా చదువుకోలేదు. సంగీతం మీదున్న ప్రేమతోనే టి-సిరీస్‌ సంస్థను స్థాపించారు. తక్కువ కాలంలోనే సంగీతంతోపాటు సినీ నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. నాన్న చిన్నతనంలోనే తాతయ్య పంజాబ్‌ నుంచి దిల్లీ వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో తాతయ్యది పండ్ల రసాల దుకాణం. ఆర్థిక స్థోమతలేక నాన్నని చదివించకపోవడంతో తాతయ్యతో కలిసి పండ్ల రసాలు అమ్మేవారు. అలాగని నాన్న ఆ దుకాణానికే పరిమితమవ్వాలనుకోలేదు. ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచన ఉండేది. ఒకసారి బంధువులొకరు ఆడియో క్యాసెట్ల దుకాణాన్ని తక్కువ ధరకి అమ్ముతుంటే కొన్నారు. అప్పట్లో క్యాసెట్లకు డిమాండ్‌ ఎక్కువ. వాటిని అమ్మడంతోపాటు పాటల్ని రీరికార్డ్‌ చేసేవారు. క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ‘సూపర్‌ క్యాసెట్స్‌’ పేరుతో సొంతంగా ఆడియో క్యాసెట్ల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. సినిమా పాటల హక్కుల్ని కొనడం, సొంతంగా క్యాసెట్లు మార్కెట్‌లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. నిర్మాతగానూ మారి సినిమా రంగంలో అడుగుపెట్టారు. 1990లో ఆయన తీసిన ‘ఆషికీ’ సినిమా, పాటలూ పెద్ద హిట్‌ అయ్యాయి. ఏడేళ్ల పాటు నెలకి లక్ష చొప్పున క్యాసెట్లు అమ్మారు. దర్శక నిర్మాతలకీ నాన్నమీద గురి పెరగడంతో అనతికాలంలోనే టి-సిరీస్‌ భారతదేశంలోనే టాప్‌ మ్యూజిక్‌ లేబుల్‌గా ఎదిగింది. ఇప్పటికీ నేను ఆ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నా. నిజంగా అది ఎంతో సవాలుతో కూడుకున్నది. నాన్న చిన్నతనం నుంచీ నన్ను కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచారు. ఆయనలాగే నాకూ సంగీతమంటే ఇష్టం ఉన్నా ఆ రంగంలోకి రావాలని మాత్రం అనుకోలేదు. ఎంబీఏ చదివి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా. నాన్న ఎన్నిసార్లు తనతోపాటు రికార్డింగ్‌ థియేటర్లకీ, ఆఫీసులకూ రమ్మన్నా వెళ్లేవాణ్ని కాదు. దాంతో నాన్నకి కోపం వచ్చేది. తరచూ అమ్మతో ‘సంగీతమే నా జీవితం. నేను లేకపోయినా సంస్థ బతికే ఉండాలి. భూషణ్‌ నా మాటవినేలా లేడు’ అని చెప్పి బాధపడుతుండేవారు. ఆయన అలానే మాట్లాడతారులే అని లైట్‌ తీసుకునేవాణ్ని.

పందొమ్మిదేళ్లకే బాధ్యతలు...
నేను ఇంటర్‌ అయ్యాక బీకామ్‌లో చేరా. అప్పటి వరకూ చాలా స్ట్రిక్టుగా ఉన్న నాన్న డిగ్రీకి వచ్చాక స్వేచ్ఛ ఇచ్చారు. అడిగినంత పాకెట్‌ మనీ ఇచ్చేవారు. నేనెప్పుడూ స్నేహితులూ, సరదాలంటూ తిరిగేవాణ్ని. ఇంట్లో ఏదీ పట్టించుకునేవాణ్ని కాదు. మొదటి ఏడాది ఎంతో జోవియల్‌గా సాగిపోయింది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌కి వచ్చాక ఒకరోజు మధ్యాహ్నం క్యాంటీన్లో కూర్చుని స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నా. ఆ సమయంలో ‘మీ నాన్న చనిపోయారంటా. కాలేజీకి ఫోన్‌ వచ్చింది’ అని అటెండర్‌ చెప్పాడు. ఆ మాటలకి షాక్‌ అయ్యా. ఇంటికి ఎలా వెళ్లానో కూడా తెలియదు. నాన్న అంతిమ కార్యక్రమాలన్నీ అయ్యేవరకూ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇంట్లో, ఆఫీసులో పరిస్థితులన్నీ మారిపోయాయి. మా సంస్థ షేర్లు పడిపోయాయి. ఇకమీదట జీతాలు సరిగా రావేమో అని చాలామంది ఉద్యోగులు మానేశారు. అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చెల్లి చిన్నది. కళ్లు తెరిచినా మూసినా ‘సంగీతమే నా జీవితం’ అనే నాన్న మాటలే చెవిలో మార్మోగేవి. నాకప్పుడు పందొమ్మిదేళ్లు. బాధ్యతలు తెలియకుండా పెరిగా. ఏం చేయాలో తెలియక లోలోపల అంతర్మథనం. చివరికి నేనే టి-సిరీస్‌ బాధ్యతలు మీదేసుకోవడం కరెక్ట్‌ అనిపించింది. అప్పటికి డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నా. కాలేజీకి వెళ్లకుండా పరీక్షలు రాయడానికి అనుమతి తీసుకున్నా. చదువును పక్కన పెట్టేసి సంస్థ గురించే ఆలోచించడం మొదలుపెట్టా. ఎందుకంటే ఆ సమయంలో నా ముందున్న లక్ష్యం నాన్నలా సంస్థని నంబర్‌ వన్‌ స్థానంలో నిలపడం, అమ్మని మామూలు మనిషిని చేయడం. అయితే అప్పటి వరకూ నేను టి-సిరీస్‌ ఆఫీసుకు వెళ్లింది చాలా తక్కువ. దాంతో నాకు ఏదో కొత్త చోటుకి వెళ్లినట్టు ఉండేది. పైగా అడ్మినిస్ట్రేషన్‌ గురించి ఏమీ తెలియదు. జీతాలూ, లాభాలూ నష్టాలూ, ఎక్సైజ్‌ డ్యూటీ, ట్యాక్సేషన్‌ వంటివి అన్నీ నాన్నే చూసుకునేవారు. ఒక్కసారిగా అవన్నీ నేర్చుకుందామంటే బుర్రకెక్కేవి కాదు. చాలా కష్టపడేవాడిని. మరోవైపు నా స్నేహితులంతా సరదాలూ, షికార్లంటూ తిరుగుతుండేవారు. వాళ్లని చూసినప్పుడల్లా ఈ వయసులో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చిందని బాధగా అనిపించేది.

అన్నీ నేర్చుకుని...
‘ఈ కుర్రాడు టి- సిరీస్‌ని చూసుకోగలడా... తండ్రి పేరును గాల్లో కలిపేసినట్టే’ అని మా బంధువుల్లోనే చాలామంది విమర్శించారు. బయటకొస్తే నిర్మాతలు కొందరు ముఖం చాటేశారు. పాటల రైట్స్‌ కొందామంటే ‘మీ సంస్థకి ఇక భవిష్యత్తేముంది’ అంటూ చాలామంది ముఖాన్నే అనేవారు. ఎలాగైనా నాన్నలా నేనూ మార్కెట్‌లో విశ్వసనీయత తెచ్చుకోవాలనిపించింది. కానీ ఆ వయసులో ఈ సవాళ్లను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాణ్ని. ఆ బాధను తట్టుకోలేక రాత్రిళ్లు ఇంటికి వెళ్లకుండా ఆఫీసులో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. క్రమంగా పట్టుబట్టి సంస్థలో ప్రతి విభాగంపైనా పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేశా. మరోవైపు డిగ్రీ తప్పాననో, చదువు మధ్యలో వదిలేశాననో పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా. వారమంతా ఆఫీసుకు సమయం కేటాయించి వారాంతం చదివేవాణ్ని. అందుకోసం ప్రయివేటుగా ఫ్యాకల్టీని నియమించుకున్నా. ఎన్ని సమస్యలున్నా, మనసు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా బలవంతంగా చదువు మీద దృష్టి పెట్టేవాణ్ని. పరీక్షల సమయంలో నిద్ర కూడా పోయేవాణ్ని కాదు. అలా కాలేజీకి వెళ్లకుండా డిగ్రీ చదివిన నేను ఫస్ట్‌క్లాస్‌లో  పాసయ్యా. నా కష్టం చూసి మా బాబాయి ఉద్యోగం మానేసి సంస్థలో చేరారు. నాన్న మీద గౌరవంతో కొందరు సీనియర్‌ ఉద్యోగులు వాళ్ల పిల్లల్నీ చేర్పించారు. నా బలం కొద్దిగా పెరిగినట్టైంది. అయితే 1997లో నేను సంస్థ బాధ్యతలు తీసుకునే నాటికి ఆడియో క్యాసెట్ల హవా కాస్త తగ్గింది. సీడీలూ, వీసీడీలూ అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న కాలం, దూసుకుపోతున్న టెక్నాలజీ దృష్ట్యా నేనూ అప్‌డేట్‌ అవ్వడం అవసరమనిపించింది. వీడియోలతో వీసీడీలూ, సీడీలు అందించడం మొదలుపెట్టా. మరోవైపు నేనూ సినిమా నిర్మాణ రంగంవైపు వచ్చా. మంచి కథలు ఎంచుకుని సినిమాలు తీసేవాణ్ని. నా సినిమాల్లో ఆషికీ2 గురించి తప్పక చెప్పుకోవాలి. నాన్న కెరీర్‌లో ఆషికీ పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి కారణమైంది. అందుకే నేనూ సెంటిమెంట్‌గా భావించి ఆషికీ2 తీశా. ఆ సినిమాకి నేనే ఊహించనంత స్పందన వచ్చింది. పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ సినిమా చూశాక ‘నాన్నే నీలో కనిపిస్తున్నాడు రా’ అని అమ్మ కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలకి ఎంతో సంతోషమనిపించింది. అలానే మా ప్రొడక్షన్‌ మార్కెట్‌ కూడా పైపైకి వెళ్లింది. నేనూ ఆ విజయాలతో అక్కడే ఆగిపోలేదు. ఆ తర్వాత 2005లో తొలిసారి యూట్యూబ్‌ ప్రారంభమైంది. విదేశాల్లో దానికి ఆదరణ బాగుంది. అది గమనించి నేను ఆ మరుసటి ఏడాదే టి-సిరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు శ్రీకారం చుట్టా. తరచూ కాకపోయినా ఎప్పుడో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసేవాళ్లం. 2010 నుంచి మాత్రం సీరియస్‌గా తీసుకుని పాటలూ, సినిమా ట్రైలర్లూ, వేడుకలూ అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాం. మూడేళ్లలో పది లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌కు చేరుకుంది మా ఛానల్‌. క్రమంగా ప్రపంచంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న స్వీడన్‌ ఛానల్‌ ప్యూడిపికి పోటీగా మారింది టి-సిరీస్‌.

29 సబ్‌ ఛానళ్లతో
ఒక్కసారిగా మనదేశంలో చౌకగా స్మార్ట్‌ఫోన్లూ, ఆఫర్లతో డేటా అందుబాటులోకి రావడంతో పల్లెలూ స్మార్ట్‌గా మారిపోయాయి. దాంతో యూట్యూబ్‌లో మా ఛానల్‌ జోరునీ పెంచాం. హిందీ, ఇంగ్లిష్‌తోపాటూ తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ, కన్నడ, గుజరాతీ, భోజ్‌పురి వంటి భాషలతో ప్రాంతీయ వీక్షకులకూ చేరువయ్యాం. సినిమా పాటలూ, డైలాగులూ, ట్రైలర్లూ, వేడుకలూ ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయడం ఆరంభించాం. కొన్నిసార్లు లైవ్‌ కూడా ఇస్తున్నాం. వీటితోపాటు సూపర్‌ హిట్‌ అయిన పాత పాటల వీడియోలూ, ఆదరణ ఉన్నవాటిని రీమిక్స్‌ చేసి ఆల్బమ్స్‌ చేయడం వంటివీ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఎంతోమంది ఔత్సాహిక గాయకుల్ని బాలీవుడ్‌కి పరిచయం చేశాం. అలా వచ్చిన వారే మిథున్‌, హిమేష్‌రేషమియా, ఫకిర్‌ వంటి గాయకులు. ఇక, ఛానళ్ల విషయానికొస్తే వినోదమేకాదు ఫిట్‌నెస్‌, పిల్లల రైమ్స్‌, భక్తి గీతాల వీడియోలూ ఉంచుతున్నాం.

టి-సిరీస్‌ ఛానల్‌లో మొత్తం 29 సబ్‌ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. స్థానిక భాషల్లో అన్ని వయసుల వారికీ కావల్సిన వీడియోలు అప్‌లోడ్‌ చేయడంతో గ్రామస్థాయిలోనూ వీక్షకాదరణ పొందగలిగాం. అంతేకాదు, మా ఛానల్‌ను ఆదరించేవారిలో 40 శాతం మంది విదేశీయులే. అలా ఈ ఏడాది మార్చి 29 నాటికి సబ్‌స్క్రైబర్లు పదికోట్ల మందికి చేరుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత వీక్షణలు ఉన్న తొలి యూట్యూబ్‌ ఛానల్‌గా నిలిచింది. మొన్నీమధ్యనే యూట్యూబ్‌ మా ఛానల్‌ గురించి  ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించి మాకు అభినందనలు తెలిపింది. ఇప్పుడు నాన్న బతికుంటే ఎంతో సంతోషించే వారనిపిస్తుంది. కష్టపడి ఎదిగిన నాన్న జీవితాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఆయన జీవిత కథ ఆధారంగా అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘మొఘల్‌’ పేరుతో సినిమా తీస్తున్నా. నాన్నకు ప్రేమతో అంకితమిస్తున్న ఈ చిత్రం విడుదలకోసం ఎంతో ఆసక్తిగా ఆరాటంగా ఎదురు చూస్తున్నా.

ప్రస్తుతం భారతీయ మ్యూజిక్‌ మార్కెట్‌లో టి-సిరీస్‌ వాటా 60 శాతం కంటే ఎక్కువే. ఇండియాలో 2500 మంది డీలర్లతో అతి పెద్ద మ్యూజిక్‌ పంపిణీ నెట్‌ వర్క్‌గా నిలిచింది టి-సిరీస్‌. అంతర్జాతీయంగా మా సంస్థ వార్షికాదాయం ఇరవై తొమ్మిది కోట్లరూపాయల పైమాటే. ఆరు ఖండాల్లోని, 24 దేశాల్లో మా లేబుల్‌కీ, ఛానల్‌కీ డిమాండ్‌ ఉందని చెప్పడం నాకెంతో గర్వంగా అనిపిస్తుంటుంది.

 

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ నాది!

మాది ప్రేమ వివాహం. నాభార్య దివ్యా ఖోస్లా నటి. నా కజిన్‌ ద్వారా పరిచయం అయింది. చూడగానే ప్రేమలో పడిపోయా. వెంటనే తనకి ప్రపోజ్‌ చేసినా పట్టించుకోలేదు. కొన్నాళ్లకి మా చెల్లి పెళ్లికి తనని కుటుంబంతో సహా ఆహ్వానించా. అప్పటికే దివ్య తల్లిదండ్రులకు నా గురించి తెలుసు. వాళ్లకి నేనూ, నా కుటుంబం నచ్చడంతో నా ప్రేమను అంగీకరించి పెళ్లికి పచ్చజెండా ఊపింది. అలా 2005లో వైష్ణోదేవి గుడిలో మా పెళ్లైంది. మాకో బాబు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.