close
మీ బొమ్మలిస్తారా...ఈ పిల్లలు ఆడుకుంటారు!

చిన్న పిల్లలు అనగానే చేతిలో బొమ్మతో అమాయకపు మొహంతో గుర్తొస్తారు. ఆటలూ, బొమ్మలే వాళ్ల ప్రపంచం అన్నట్టు ఉంటుంది. కానీ తినడానికే సరిగ్గాలేని నిరుపేద కుటుంబాల్లో, ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే మారుమూల పల్లెటూళ్లలో ఉన్న పిల్లలకు రకరకాల బొమ్మలతో ఆడుకోవడం ఓ కలే. అలాంటి చిన్నారుల కోసం బొమ్మల్ని సేకరించి ఇస్తూ వాళ్ల మోముల్లో చిరునవ్వులు నింపుతున్నాయి ఈ రెండు సంస్థలూ!

న్ని బొమ్మలున్నా, ఓ కొత్త బొమ్మ కనిపించగానే అదే కావాలని గోల చేస్తారు చిన్న పిల్లలు. పడుకున్నా సరే ఏదో ఒక బొమ్మ పక్కన ఉండాల్సిందే. రైలు బోగీలను అతికించడం, లెగోలతో బిల్డింగులు కట్టడం, టెడ్డీలూ బార్బీలకు కబుర్లు చెప్పడంలాంటివన్నీ చేస్తుంటారు. నిజానికి పిల్లలందరికీ బొమ్మలతో ఇలాగే ఆడుకోవాలనిపిస్తుంది. కానీ కనిపించిన బొమ్మల్లా కాకపోయినా నచ్చిన నాలుగు బొమ్మల్ని కొనిచ్చేంత స్తోమత అందరు అమ్మానాన్నలకూ ఉండకపోవచ్చు. కొందరు పిల్లలు అసలు అమ్మానాన్నలే లేనివాళ్లూ అయ్యుండొచ్చు. టాయ్‌బ్యాంక్‌.ఇన్‌, టాయ్‌బ్యాంక్‌.ఓఆర్జీ అనే రెండు స్వచ్ఛంద సంస్థలూ అలాంటి పిల్లల ఆశల్ని నెరవేర్చడానికే పుట్టుకొచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా లక్షల బొమ్మల్ని సేకరించి, వాటి సాయంతో బొమ్మల లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాయి. నిరుపేద పిల్లలకు ఉచితంగా బొమ్మల్ని పంచిపెడుతున్నాయి.

ఏం చేస్తాయంటే...
ఈ సంస్థలకు ఎవరైనా బొమ్మల్ని దానం చేయొచ్చు. పాత బొమ్మలను రీసైకిల్‌ చేసి వాటిని మళ్లీ ఆడుకునేందుకు వీలుగా చేసి పంచడం వీళ్ల ప్రధాన ఉద్దేశం. అందుకే మన దగ్గరున్న వాడిన బొమ్మలనూ వీళ్లు తీసుకుంటారు. కావాలంటే కొత్త బొమ్మల్నీ కొని ఇవ్వొచ్చు. ఇలాంటి వాడిన బొమ్మలను ఒక చోట చేర్చుతారు. వాటిని పరిశీలించి సాఫ్ట్‌ టాయ్స్‌లాంటివి మురికిపడితే డ్రైవాష్‌కు పంపి కొత్తరూపు తెస్తారు, రిపేర్లు అవసరమున్న బొమ్మలను బాగుచేస్తారు. తర్వాత వాటిని వయసుల వారీగా విభజించి ప్యాక్‌ చేస్తారు. ఆ బొమ్మలను పిల్లలకు అందుబాటులోకి తెచ్చేలా దేశంలోని వివిధ మారుమూల పల్లెలకు పంపుతారు. వీటిలో కొన్నింటిని పిల్లలకు సొంతంగా ఇచ్చేస్తారు. మరి కొన్నింటితో టాయ్‌బ్యాంక్‌ పేరిట బొమ్మల లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. దాన్ని చూసుకునేందుకు సిబ్బందీ ఉంటారు. చుట్టు పక్కల ఉన్న పిల్లలెవరైనా వచ్చి ఇక్కడున్న బొమ్మలతో ఆడుకోవచ్చు. సైన్సు బొమ్మల్లాంటి వాటితో పాటు క్యారమ్‌, చెస్‌లాంటివీ ఎలా ఆడాలో కూడా ఇక్కడ నేర్పిస్తారు. ‘ఇలా పిల్లలకు బొమ్మల్ని పంచడం అనేది నిజానికి కొత్త ఆలోచనేం కాదు, మనం ఆడుకున్న బొమ్మల్ని తర్వాత మన తమ్ముడికో చెల్లెలికో ఇచ్చేస్తాం కదూ! అచ్చం అలాంటి ఆలోచనే ఇది కూడా’ అంటారు టాయ్‌బ్యాంక్‌.ఇన్‌ డైరెక్టర్‌ విద్యున్‌ గోయెల్‌. పదిహేను సంవత్సరాలుగా పిల్లలకు ఈ సేవలు అందిస్తోందీ సంస్థ. ఇప్పటి దాకా పదిహేను లక్షలకు పైగా బొమ్మల్ని సేకరించి పంచింది. ఐదు లక్షల మందికిపైగా పిల్లలు వీళ్ల ద్వారా లబ్ధి పొందారు. ప్రస్తుతం దిల్లీ, జమ్మూ కశ్మీర్‌, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మన దేశంలోని 25 రాష్ట్రాలూ, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి అయిదువేలకు పైగా బొమ్మల లైబ్రరీలను ఏర్పాటు చేసి నడుపుతోంది. వీటన్నింటినీ వెనకబడిన ప్రాంతాల్లోని పాఠశాలలూ, మురికివాడలూ, అంగన్‌వాడీ కేంద్రాలూ, అనాథాశ్రమాల్లాంటి చోట్ల ఏర్పాటు చేశారు. వయసులవారీగా పిల్లలను విభజించి రకరకాల ఆటలూ ఆడిస్తారిక్కడ. మెదడుకు మేత పెట్టే బొమ్మలతో పాటు క్రీడా సామగ్రీ ఉంటాయి. ఇక, ఇదే కోవలోని టాయ్‌బ్యాంక్‌.ఓఆర్జీని శ్వేతాచారి 2004లో ముంబయిలో ప్రారంభించారు. తొలి విడత వెయ్యి బొమ్మలు సేకరించి పంచి పెట్టారు. ఆ ఉత్సాహంతో ప్రస్తుతం ముంబయితో పాటు మహారాష్ట్రలోని వెనకబడిన జిల్లాల్లో 260దాకా టాయ్‌ లైబ్రరీలను స్థాపించి నడుపుతున్నారు. రోజుకు 43 వేల మందికి పైగా పిల్లలు వీటిలో ఆడుకుంటున్నారు.

ఈ టాయ్‌లైబ్రరీల వల్ల బడిలో పిల్లలు గడిపే సమయం పెరుగుతోంది, అంగన్‌వాడీలో చిన్నారుల సంఖ్య అధికమవుతోంది, అంతేకాదు పిల్లల్లో ఐక్యత, పంచుకోవడం, కొత్తగా ఆలోచించడంలాంటి గుణాలూ వృద్ధి చెందినట్టూ గమనించాం... అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ సంస్థల వెబ్‌సైట్లలో ఉన్న సూచనల ప్రకారం మనమూ బొమ్మల్ని దానం చేయొచ్చు, ఇష్టమైన బొమ్మలతో ఆడుకున్న జ్ఞాపకాల్ని నిరుపేద చిన్నారులకు బహుమతిగా ఇవ్వొచ్చు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.