close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలచక్రం

- డాక్టర్‌ కాంచనపల్లి

సాయం సంధ్యా సమయం. సుమారు ఆరు ఏడు గంటల ప్రాంతం. ఏప్రిల్‌ మాసంలో చల్లగాలులు ఆహ్లాదంగా శరీరానికి తాకుతున్నాయి.
ప్రకాశ్‌ అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌లోని ఆరెంజ్‌ కౌంటీ లేక్‌ ఫారెస్ట్‌ రోడ్డుపైన నడుస్తున్నాడు. బయట వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రకాశ్‌ మనసు గందరగోళంగా ఉంది.
ప్రకాశ్‌ కొడుకూ కోడలూ అమెరికాలో ఉంటారు. కొడుకు వేణు యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేస్తాడు. కోడలు కూడా అదే కంపెనీలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌.
ఇటీవలే ప్రకాశ్‌కి మనవరాలు పుట్టింది. మనవరాలి కోసమే హైదరాబాద్‌లో తాను చేస్తున్న ఉద్యోగానికి హాఫ్‌ పే లీవ్‌ పెట్టి వచ్చాడు.
నిజానికి తనకు అంత తొందరగా సెలవు దొరకలేదు. కానీ కొడుకు రావాల్సిందే అని బలవంతం చేయడం వల్ల ఎలాగో కమిషనర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకుని సెలవు గ్రాంటు చేయించుకున్నాడు. భార్య ఉమతో సహా అమెరికా వచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ మనసులో ఏదో తెలియని ఆవేదనా బాధా కలగసాగింది.
ఆర్థికంగా ఎలాంటి సమస్యలూ లేవు. తన భార్య కూడా ఉద్యోగే. ఇక్కడ కొడుకూ కోడలూ బాగా సెటిల్‌ అయ్యారు.
ప్రకాశ్‌ మనసు వ్యాకులపడుతోంది... తనకు ఎందుకిట్లా జరుగుతోంది... ప్రతి తండ్రికీ ఇట్లాగే జరుగుతుందా... ఇది అందరు తల్లిదండ్రుల ఆవేదనా... ప్రకాశ్‌ మనసు భారమవుతోంది.
లేక్‌ ఫారెస్ట్‌ రోడ్డు చాలా ఎత్తు మీద ఉన్నట్టు ఉంటుంది. రోడ్డుపై నుండి వెళ్తే తమ అపార్ట్‌మెంట్‌ కనిపిస్తుంది. బాల్కనీలో ఉమ నిలబడి ఇటే చూస్తోంది. ఒడిలో మనవరాలు కేరింతలు కొడుతోంది. అటే చూస్తూ నడుస్తున్న ప్రకాశ్‌ కనుకొలకుల్లో నీరు నిలిచింది. కొనగోటితో చిమ్ముకుంటూ నడుస్తున్నాడు. నడుస్తూ ఆలోచిస్తున్నాడు.

*  *   *

ప్రకాశ్‌ కొడుకు ఇంజినీరింగ్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేసుకున్నాడు. క్యాంపస్‌ సెలెక్షన్స్‌ జరిగాయి. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ, ఇండియాలో ఉద్యోగం ప్రకాశ్‌కేమీ ఇష్టం అనిపించలేదు.
‘‘పోనీండి, ఇండియాలో ఉండటమే మేలు. మనమూ వాడూ కలిసి ఉండొచ్చు. మనకున్నది ఒక్కడే కదా’’ అంది భార్య ఉమ.
‘‘లేదు, వాడు అమెరికా వెళ్ళాల్సిందే. మరో యూనివర్సిటీలో అప్లై చేయమందాం. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం, వాడు బెంగళూరులో ఉద్యోగం ఏం బాగుంటుంది? కొడుకు తండ్రిని మించి ఒక్క అడుగైనా వేయాలి కదా’’ ప్రకాశ్‌ ఆవేశంగా అన్నాడు.
ఉమ నిట్టూర్చింది.
‘‘ఇంతకీ వాడేమంటున్నాడు?’’ అడిగింది.
‘‘నాన్న చెప్పిందే కరెక్ట్‌’’ లోపలికి వస్తూ అన్నాడు వేణు.
ఉమ సంభాషణ పొడిగించలేదు.
ప్రకాశ్‌కు తన అన్నదమ్ముల కొడుకులతో మహా పోటీ. వాళ్ళంతా అమెరికా వెళ్లిపోయారు. చివరికి వాళ్ళ అమ్మాయిలు కూడా వెళ్ళారు.
లోపలికి వచ్చి కిచెన్‌ దగ్గర కూర్చున్న కొడుకుకు టీ ఇస్తూ అడిగింది ఉమ ‘‘మరి ఉద్యోగంలో చేరవా?’’
‘‘లేదమ్మా. ఉద్యోగంలో చేరితే వెళ్ళలేను కదా, వీసా కోసం మళ్ళీ ట్రై చేస్తాను.’’
‘‘ఈసారి వీసా వస్తుందిలే’’ ప్రకాశ్‌ ఆత్మవిశ్వాసంతో అన్నాడు. అన్నట్టుగానే వేణుకి రెండోసారి వీసా వచ్చింది.
ప్రకాశ్‌ అన్నదమ్ములందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ ప్రకాశ్‌నీ వేణునీ అభినందించారు. కొందరు ఈర్ష్యపడ్డారు. అది గమనించి ప్రకాశ్‌ సంతోషపడ్డాడు. అది తన విజయం అనుకున్నాడు.
వేణు అమెరికా వెళ్లిపోయాడు. ఎం.ఎస్‌. పూర్తిచేసి ఉద్యోగంలో చేరిపోయాడు. అక్కడే, తనలాగే అమెరికా వచ్చిన తెలుగు అమ్మాయి సుమలత పరిచయమైంది. ప్రేమైంది... ప్రేమ పెళ్ళయింది.
ఆవైపు పెద్దలూ ఈవైపు పెద్దలూ అంగీకరించారు. హర్షించారు.
తరువాత వేణూ సుమలతలకు ఒక కూతురు పుట్టింది. అనివార్యంగా ఉమా ప్రకాశ్‌ అమెరికా రావల్సివచ్చింది.
అక్కడ మొదలయింది అసలు కథ.
ఓ రోజు రాత్రి ఉమా, వేణూ, ప్రకాశ్‌ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని డిన్నర్‌ చేస్తున్నారు. వేణు వచ్చినప్పటినుంచీ అక్కడి పద్ధతులు చెబుతున్నాడు. ప్రకాశ్‌కి ఇది నచ్చడం లేదు. హైదరాబాద్‌లో తానో పెద్ద ఆఫీసర్‌. అలాంటిది తనకు ఈ పిల్లకాయ ఇవన్నీ చెప్పడం ఏమిటి?
భోంచేస్తుండగా ఫోన్‌ వచ్చింది.
వేణు భోంచేయడం ఆపి మాట్లాడుతున్నాడు. పైపైన తేలిపోయే ఆంగ్ల పదాలతో గొంతులో ఒక రకమైన వైబ్రేషన్‌ తెస్తూ వేణు మాట్లాడుతుంటే ప్రకాశ్‌కు ముచ్చటేసింది.
చిన్నప్పుడు కాన్వెంట్‌కి వెడుతూ భయపడ్డ వాడేనా వీడు... తను వేలు పట్టుకొని తీసుకువెళ్ళిన వాడేనా వీడు... తాను కారు డ్రైవ్‌ చేస్తున్నప్పుడు కేరింతలు కొట్టినవాడేనా వీడు... తను దగ్గర కూర్చోపెట్టుకొని ఇంగ్లిష్‌ ఉచ్చారణ నేర్పించేవాడు. తన కొడుకు తనలాగా ఇంగ్లిష్‌ మాట్లాడాలని తనకెంత ఉబలాటముండేది?
‘‘ఏంటి డాడ్‌ తినండి, ఇదిగో సాలమన్‌ ఫిష్‌ బాగుంటుంది. వేసుకోండి’’ కొడుకు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాశ్‌.
‘‘నువ్వు మాట్లాడుతుంటే చూసి మీ డాడ్‌ ఎక్కడికో వెళ్ళిపోయారు’’ ఉమ అంది.
‘‘అవును మరి, నేను ఇంగ్లిష్‌ నేర్పితే అలా అలా నేర్చుకున్నవాడు... ఇప్పుడిలా మాట్లాడుతుంటే...’’ మురిపెంగా అన్నాడు ప్రకాశ్‌.
వేణు కనుబొమలు ముడుచుకున్నాయి.
‘‘మీరు ఇంగ్లిష్‌ నేర్పడం ఏమిటి డాడీ? అసలు మీరు మాట్లాడేది ఓ ఇంగ్లిషేనా? చాలుగానీ... తినండి... తినండి’’.
వేణు మాటలకు ఖంగుతిన్నాడు ప్రకాశ్‌. ఉమ మొహం కూడా మ్లానమైంది.
ప్రకాశ్‌ చేయి కడిగేసుకున్నాడు. వేణుకు మరో కాల్‌ వచ్చింది. ఇదేమీ గమనించకుండా వేణు మాట్లాడేస్తున్నాడు.

*  *   *

ఆకు కూరల్ని సోఫాలో కూర్చుని తుంచుతోంది ఉమ. ఆమెకు ఇండియా నుండి ఫోన్‌ వచ్చింది. తన పుట్టింటి నుండి కాల్‌ రావడంతో ఆమె మొహం వికసించింది. ఆకుకూరల మాట మరచిపోయి బాల్కనీలోకి వచ్చింది ‘‘అమ్మా, చెప్పు’’ అంటూ,
సంభాషణ పావుగంట కొనసాగాక వెనక్కి వచ్చింది.
సుమలత బెడ్‌రూమ్‌లో నుంచి హాల్లోకి వచ్చి రెండు చేతులూ నడుముకు ఆనించి నిలబడింది. కోపమూ అసహనమూ కలగలిపి కనిపిస్తున్నాయ్‌ ఆమె మొహంలో.
‘‘అత్తయ్యా, కూరలు అలా సోఫాలో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను?’’ స్కూల్లో పిల్లవాణ్ణి టీచర్‌ అడిగినట్టు అడిగింది సుమలత.
‘‘తీస్తూనే ఉన్నా కదా, ఫోన్‌ వస్తే వెళ్లాను’’ చెప్పింది ఉమ.
‘‘మీరు వచ్చినప్పటినుండీ ఎన్నిసార్లు చెప్పాను? మీరు మారరు కదా, కొన్ని రోజులైనా మీ ఇండియా పద్ధతులు కాస్త మరచిపోండి.’’
‘‘మరచిపోతున్నాను కదమ్మా, చిన్న విషయానికి ఇంతలా చెబుతావేం?’’
‘‘ఇంకా నన్నే అంటున్నారా? మీకు తెలియదు... చెబితే వినిపించుకోరు, పైగా ఆర్గ్యుమెంట్‌’’ విసవిసా లోపలికెళ్ళింది సుమలత.
ఉమ ఆకుకూర తీసుకొని మళ్ళీ తుంచసాగింది.

*  *   *

మరోరోజు సుమలత ఆఫీసు నుంచి వచ్చేసరికి పాప ఏడుస్తోంది. ఉమ ఎంత ఊరడించినా ఆగడం లేదు.
‘‘ఏమైంది?’’ వస్తూనే మొహం చిట్లించి అడిగింది సుమలత.
‘‘ఏమో ఏడుస్తోంది.’’
సుమలత గబాగబా వచ్చి ఉమ చేతులనుండి పాపను తీసుకుంది. ఐదు నిమిషాలకి పాప ఏడుపు ఆపింది.
‘‘పెద్దవాళ్ళకే పిల్లలను లాలించడం బాగా తెలియాలి. మీకేమీ తెలియదు, వేణుని ఎట్లా పెంచారో ఏమో?’’
ప్రకాశ్‌, ఉమ మౌనంగా ఉన్నారు.
‘‘పాలు తాగిందా... ఏమైనా తిన్నదా?’’ మళ్ళీ వాళ్ళను చూస్తూ అడిగింది.
‘‘తాగింది, కొంచెం తిన్నది.’’
సుమలత ఫ్రిజ్‌ తెరచి చూసింది. అందులో పాప తినాల్సిన ఫుడ్‌ చాలా మిగిలే ఉంది. ‘‘తిందని చెబుతున్నారేమిటి? ఫుడ్‌ అంతా మిగిలే ఉంది కదా.’’
‘‘కొంచెం తిందని చెప్పాను కదమ్మా’’ ఉమ కూడా కొంచెం తీవ్రంగానే అంది.
‘‘అత్తయ్యా, మిమ్మల్ని అంతలేసి డబ్బులు పోసి ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసి పిలిపించింది దాని కోసమే. అట్లా తినకపోయినా తిన్నదని అబద్దాలు చెబితే ఎట్లా?’’
‘‘నేను కొంచెమే తిన్నదని చెబుతూనే ఉన్నాను, నువ్వే వినడం లేదు’’ ఉమ మళ్ళీ అంది.
‘‘ఎలాగైనా తినిపించాలి అత్తయ్యా, తినలేదని చెబితే ఎట్లా?’’
కింద కారు చప్పుడైంది. వేణు వచ్చాడులా ఉంది. సుమలత పాపను ఎత్తుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది.

*  *   *

ప్రకాశ్‌కి పూర్తిగా అర్థమైంది ఇక్కడ తాము కేవలం పనిమనుషులమే అన్నమాట. తండ్రిగా తనకూ తల్లిగా ఉమకూ ఎంతమాత్రం గౌరవంగానీ స్వతంత్రంగానీ లేదన్నమాట. హైదరాబాద్‌లో పెద్దమనిషిలా చెలామణి అయ్యే తను ఇక్కడ తన కొడుకు ముందు ఎంత హీనం అవుతున్నాడు?
ఇక్కడనుండి తొందరగా వెళ్లిపోవాలన్నా కుదరదే, టికెట్‌ బుక్‌ చేసేది వాళ్ళే. అమెరికా ఆనందాన్ని మరచిపోయి త్వరగా ఇండియా వెళ్ళాలన్న ఆలోచనలో మునిగిపోయాడు. తన ఊరూ తండ్రీ గుర్తుకొచ్చారు. తన తల్లీ తండ్రీ కూడా తనలాగే బాధపడ్డారా? తను ప్రవర్తించినట్టే తన కొడుకు ప్రవర్తిస్తున్నాడా? అక్కడే చెట్టుకింద చప్టా ఉంది. మెల్లిగా వెళ్ళి దానిమీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.

*  *   *

రాఘవయ్యకు మనవడిని చూడాలని ఆత్రంగా ఉంది. నిన్ననే కొడుకు ప్రకాశ్‌ ఫోన్‌ చేశాడు. అమృతమ్మ, రాఘవయ్య కరీంనగర్‌ జిల్లాలోని సొంత ఊరు పెద్దాపురంలో ఉంటారు. రాఘవయ్య కొడుకుని చాలా కష్టపడి చదివించాడు. రాఘవయ్య బడిపంతులు. తనమీద ఆధారపడిన చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఉండటంతో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే. పెద్దాపురంలో పీజీలో సీటు వచ్చింది ప్రకాశ్‌కి. ప్రకాశ్‌ ఉస్మానియాలో పీజీ చేస్తూ కాంపిటీటివ్‌ పరీక్షలు రాశాడు. పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్నాడు. రాఘవయ్య ఆ ఖర్చంతా భరించాడు. తన బంధువర్గంలో కొడుకుని ఉన్నతంగా చూడాలన్నది రాఘవయ్య కోరిక కూడా. రాఘవయ్య కోరిక నెరవేరింది. పోటీ పరీక్షలో గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌గా సెలెక్ట్‌ అయ్యాడు. తరవాత బంధువుల అమ్మాయి ఉమను ఒక పెళ్లిలో చూసి, ఆమెని ఇష్టపడ్డాడు. రాఘవయ్యకు ఇష్టం లేకపోయినా కొడుకు మాటని కాదనలేకపోయాడు.
ప్రకాశ్‌కి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఉమ కూడా స్కూల్‌ టీచర్‌. తరవాత వాళ్లకు వేణు పుట్టాడు.
రాఘవయ్య, అమృతమ్మలకు వేణు అంటే అంతులేని ప్రేమ. వేణు కోసం తరచుగా పల్లెటూరు విడిచి హైదరాబాద్‌ వచ్చేవారు.
ఓరోజు ప్రకాశ్‌ ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. ఉమ వచ్చి కాఫీ చేసి అత్తామామలకు ఇచ్చింది. తాను రాత్రి వంట చేయడంలో మునిగిపోయింది.
రాఘవయ్య రూమ్‌లో మనవడితో ఆడుకొంటున్నాడు. వేణుకు సుమారు నాలుగేళ్ళు ఉంటాయి. స్కూల్‌కి వెడుతున్నాడు.
‘‘వేణూ, హోమ్‌వర్క్‌ చేసుకో’’ ఉమ వంటింట్లోంచి కేకేసింది.
వేణూ, రాఘవయ్యా ఆమెను పట్టించుకోలేదు. రాఘవయ్య పోతన పద్యం చెబుతున్నాడు మనవడికి.
కలడందురు దీనుల యడ కలడందురు పరమయోగి గణముల పాలన్‌...
వేణు పద్యాన్ని ముద్దుగా చెబుతున్నాడు. రాఘవయ్యకు నశ్యం పీల్చడం అలవాటు. నశ్యం ముక్కులో పెట్టి గట్టిగా తుమ్మాడు. ముక్కునుంచి కాస్త నశ్యం ఎగిరి వేణు మీద పడింది. ఉమ ఒక్క ఉదుటున పరుగెత్తుకొచ్చి వేణుని బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్ళి స్నానం చేయించింది. బయటకు తీసుకొచ్చి వీపుమీద రెండు బాదింది. ‘‘వెధవా, హోమ్‌వర్క్‌ చేసుకోరా అంటే వినవ్‌, ఇప్పుడు బాగయిందా?’’ కొడుకు మీద అరిచింది.
‘‘ఇప్పుడేమయిందమ్మా, అట్లా కొడుతున్నావ్‌?’’ రాఘవయ్య అన్నాడు.
‘‘ఇంకేం కావాలి? మీరు నశ్యం పెట్టుకుంటే వాష్‌బేసిన్‌ దగ్గరకు వెళ్లి పెట్టుకోండి, ఇట్లాచేస్తే ఎట్లా?’’ చీదరగా చూస్తూ అంది.
రాఘవయ్య చిన్న బుచ్చుకున్నాడు. మెల్లగా లేచి తనకు కేటాయించిన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.

*  *   *

ఆదివారం ఉదయం 8 గంటలు.
రాఘవయ్య డ్రాయింగ్‌రూమ్‌లో పేపరు చదువుతున్నాడు. అమృతమ్మ రెండు కప్పుల్లో టీ తెచ్చి ఒకటి రాఘవయ్యకిచ్చి మరో కుర్చీలో కూర్చుని ఒకటి తను తాగుతోంది.
ఆదివారం కొడుకూ కోడలూ ఆలస్యంగా లేస్తారు. రాఘవయ్యా అమృతమ్మలు మాత్రం అలవాటుగా ఆరింటికే లేచారు. టీవీ కార్యక్రమాలూ ప్రవచనాలూ అయ్యాక రెండోసారి టీ తాగుతున్నారు.
ప్రకాశ్‌ లేచి బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చుని పేపర్‌ తిరగేస్తున్నాడు.
‘‘టీ తాగుతావా ప్రకాశ్‌’’ అడిగింది అమృతమ్మ.
‘‘నేనింకా బ్రష్‌ చేసుకోలేదు, ఉమ లేచి పెడుతుందిలే’’ అన్నాడు ప్రకాశ్‌.
అమృతమ్మ మళ్ళీ అంది ‘‘లేచి వెళ్లి ముఖం కడుక్కో, టీ ఎక్కువే పెట్టాను, నీకూ ఇస్తాను.’’
ప్రకాశ్‌ కాస్త విసుగ్గా అన్నాడు ‘‘అమ్మా, నువ్వు చేసిన టీ నాకు నచ్చదు. ఉమ పెడుతుందిలే.’’
అమృతమ్మ మనసు చివుక్కుమంది. మౌనంగా ఉండిపోయింది.
తరవాత ఉమ లేచి టీ పెట్టింది. ప్రకాశ్‌ బ్రష్‌ చేసుకుని వచ్చాడు. ఉమ చేసిన టీ తాగుతూ రాఘవయ్యతో ‘‘సాయంత్రం మా ఫ్రెండ్స్‌ వస్తున్నారు’’ అన్నాడు.
‘‘ఓ, నేను బయటకివెళ్ళి మటన్‌, చికెన్‌ లాంటివేమైనా తేనా?’’ రాఘవయ్య ఉత్సాహంగా అన్నాడు.
‘‘నేను వండి పెడతాను, మీరు వెళ్లి తీసుకురండి’’ అమృతమ్మ అంది.
‘‘అవన్నీ నేను చూసుకుంటాను, వంట సంగతి ఉమ చూసుకుంటుంది. మీరు మా ఫ్రెండ్స్‌తో సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి నాన్నా. మీ భారత భాగవతాలన్నీ వాళ్లకు చెప్పకండి. నువ్వు కూడా నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించీ మన ఊరు గురించీ సోది చెప్పకమ్మా...’’
ఇద్దరూ మరింత చిన్నబుచ్చుకున్నారు.
‘‘అసలు మీరు మీ బెడ్‌రూమ్‌లోనే ఉండండి. తప్పనిసరైతే నేనే మిమ్మల్ని వాళ్లకు పరిచయం చేస్తాను, ఓ చిరునవ్వు నవ్వండి చాలు’’ అన్నాడు.
రాఘవయ్య లేచి వరండాలోకి వెళ్ళాడు. అమృతమ్మ లోపలికి వెళ్లిపోయింది.
తెల్లవారి ఇద్దరూ ఊరికి వెళ్ళడానికి తయారయ్యారు.
‘‘అదేమిటి, వెళ్ళిపోతున్నారు? నెలరోజులు ఇక్కడ మనవడితో గడపాలని వచ్చారు కదా’’ అన్నాడు ప్రకాశ్‌.
‘‘లేదు, వెళ్ళాలి. చాలా పనులు మిగిలిపోయాయి.’’
‘‘పనులు ఎప్పటికీ ఉండేవేగా’’ ఉమ వచ్చి అంది. రాఘవయ్యా అమృతమ్మా వాళ్ళ మాటలు వినకుండా తయారయ్యారు.
వేణు వచ్చి ‘‘నేనూ ఊరొస్తాను నానమ్మా’’ అని ఏడవడం మొదలుపెట్టాడు.
అమృతమ్మ వేణుని దగ్గరకు తీసుకుని ‘‘మళ్ళీ వస్తాగా’’ అంటూ బుజ్జగించింది.

*  *   *

ప్రకాశ్‌కి ఆనాటి తల్లిదండ్రుల ఆవేదన ఇప్పుడు తమపట్ల వేణు ప్రవర్తనతో అర్థమవుతోంది. అప్పుడంటే తన అమ్మకూ నాన్నకూ మనసు నొచ్చుకున్నా కోపమొచ్చినా వెంటనే వెళ్లి బస్సెక్కేసేవారు. ఇప్పుడు అట్లాకాదే... ఫ్లైట్‌ బుకింగ్‌ డేట్‌ వరకైనా ఆగాల్సిందే కదా.
భారతీయ కుటుంబ వ్యవస్థలో... పేద కుటుంబాలలో తిండిపెట్టని సంతానమూ, మధ్యతరగతి కుటుంబాలలో సూటిపోటి మాటలతో నిర్లక్ష్య ధోరణీ, ధనిక కుటుంబాలలో ఏకాకులను చేస్తూ... తల్లిదండ్రులను ఎంత బాధకు గురిచేస్తున్నారో! ఇది వ్యక్తుల లోపమా... కుటుంబ వ్యవస్థలో లోపమా? ఈ నిర్లక్ష్యానికీ అగౌరవానికీ ప్రతిఫలమే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలు... నిట్టూరుస్తూ అనుకున్నాడు ప్రకాశ్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.