close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతడు... ఆమె... డబ్బు!

ప్రేమ కడుపు నింపుతుందా... అంటారు పెద్దలు. నిజమే, ప్రేమ కడుపు నింపదు. అలాగని మూడుతరాలకు సరిపోయే ఆస్తి ఉన్నా ప్రేమ లేకపోతే ఆ జీవితంలో ఆనందం ఉండదు. స్త్రీ పురుషులకు ఒకరికొకరి తోడు ఎంత అవసరమో, ఇద్దరూ కలిసి సంతోషంగా బతకడానికి డబ్బూ అంతే అవసరం. అందుకని ‘నీదీ... నాదీ...’ అంటూ డబ్బును వేరు చేయకుండా దంపతులిద్దరూ ‘మనదీ’ అనుకున్నప్పుడే సంసారం ఆనందసాగరం అవుతుందంటున్నారు నిపుణులు.

‘పసుపు కుంకుమల కింద మా నాన్న ఇచ్చిన మూడెకరాల పొలమూ అప్పుడే నా పేరున పెట్టమంటే పెట్టలేదు. నా పొలం ఉంటే నాకివాళ ఇలా ఒకరి మీద ఆధారపడి బతికే అవసరం ఎందుకొచ్చేదీ...’

‘మా నాన్న పీకల మీద కూర్చుని మీవాళ్లు కట్నం డబ్బు వసూలుచేశారు. అప్పుడే బ్యాంకులో వేస్తామన్నారు. ఏదీ... ఇదుగో అదుగో అంటూ ఉండగానే పిల్లలు పుట్టారు, బడికి కూడా వెళ్తున్నారు. అవి బ్యాంకులో ఉంటే వాటి మీద వడ్డీ వచ్చేది కదా నాకు. చేతిఖర్చుకు కూడా మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండేది కాదు...’

అమ్మమ్మా, నానమ్మల దగ్గరో; పెద్దమ్మా, మేనత్తల దగ్గరో ఎక్కడో ఓ చోట ఇలాంటి మాటలు మనలో చాలామంది వినే ఉంటాం. ఆ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఆడవాళ్లు కట్నంగా తెచ్చిన ఆస్తుల్ని వారి పేరునే ఉంచేవారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకో, భార్య ఆస్తి మీద సహజంగానే భర్తకు సర్వహక్కులూ ఉంటాయని భావించో తమ ఇష్టప్రకారం వాటిని వాడుకున్న కుటుంబాల్లో స్త్రీలకు లోపల లోపల ఎంతో కొంత అసంతృప్తి ఉండేది. అదే ఇలాంటి మాటల్లో బయటపడేది. అప్పుడు స్త్రీలు ఉద్యోగం చేయడం అరుదు కాబట్టి పుట్టింటి వారిచ్చిన ఆస్తినే ‘నాదీ...’ అని చెప్పుకునేవారు. బయటకు వెళ్లి ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే అవసరమూ తక్కువే కనుక పంపకాల సమయంలో తప్ప ఇంకెప్పుడూ ‘నీదీ నాదీ...’ అన్న ప్రస్తావన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వస్తోంది. ఉద్యోగం చేయకపోయినా కాస్తోకూస్తో చదువుకుని సమానత్వమూ ఆర్థిక స్వేచ్ఛా సాధికారతా అన్న మాటలు వింటూ పెరిగిన తరానికి ప్రతి చిన్న అవసరానికీ భర్తను డబ్బు అడగాలంటే ఆత్మాభిమానం అడ్డు వస్తోంది. మరో పక్క వరకట్నం నేరమని చట్టం చేసినా, స్త్రీలకు ఆస్తిహక్కు తెచ్చినా, అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా... డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా మగవారిదే పైచేయిగా ఉంటోంది. పెళ్లినాటి ప్రమాణాలు గుర్తు పెట్టుకుని, ఒకరి అవసరాలను మరొకరు కనిపెట్టుకుని, భాగస్వామి నోరు తెరిచి అడగాల్సిన అవసరమే రాకుండా చూసుకోగలిగితే ఇలాంటి పరిస్థితి రాదు. కానీ అందరికీ అంత అవగాహనా మానసిక పరిణతీ ఉండకపోవచ్చు. పైగా మనుషుల్లో రకరకాల స్వభావాల వారుంటారు.

ఒక్కొక్కరిదీ ఒక్కోతీరు!
చిన్నప్పటినుంచీ మనం పెరిగిన వాతావరణమూ ఎదుర్కొన్న అనుభవాలూ కలిసి డబ్బు పట్ల మనకో దృక్పథాన్ని ఏర్పరుస్తాయట. ఆ దృక్పథాన్ని బట్టే డబ్బుతో మనం వ్యవహరించే తీరు ఉంటుందంటున్నారు మనస్తత్వ నిపుణులు. డబ్బు విషయంలో మనుషులు ఎన్నిరకాలుగా ఉంటారంటే...

నోరు విప్పరు: కొందరు అసలు డబ్బు గురించి మాట్లాడరు. తమ ఆర్థిక పరిస్థితి ఏమిటని కానీ ఎలాంటి ప్రణాళికలతో సంసారం గడపాలనుకుంటున్నారని కానీ భాగస్వామికి చెప్పరు.
అతిగా ఖర్చు: అవసరమా కాదా అని చూడకుండా ఖర్చుపెట్టడం కొందరికి అలవాటు. ఖర్చుకి తగినట్లుగా ఆదాయం పెరగదు కాబట్టి సంసారం అప్పులపాలవుతుందేమోనన్న ఆందోళన భాగస్వామిని వేధిస్తుంది.
పిసినారితనం: ఆనందంగా జీవించడానికి చాలినంత సంపాదన ఉన్నా కొందరు పిసినారితనంతో పైసా పైసా లెక్కపెడుతుంటారు. అలాంటివారితో జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలకూ మొహం వాచిపోవాల్సివస్తుంది.
దాచిపెడతారు: కొందరేమో కొన్ని విషయాలు మాత్రమే చెప్పి కొన్ని దాస్తారు. అలా దాచేవాటిల్లో అప్పులనుంచి పెట్టుబడుల దాకా ఏవైనా ఉండవచ్చు. ఆ విషయం మరొకరి ద్వారా తెలిసినపుడు రెండో వ్యక్తికి భాగస్వామి మీద నమ్మకం పోతుంది.
వాయిదా మనస్తత్వం: కొందరికి నెలసరి బిల్లులూ స్కూలు ఫీజులూ లాంటివి సమయానికి కట్టే అలవాటుండదు. కట్టొచ్చులే అంటూ వాయిదా వేస్తూ చివరి నిమిషంలో హడావుడిపడతారు.
పొదుపు మాటెత్తరు: సంపాదించేది ఖర్చులకే చాలడం లేదు, ఇంక పొదుపేం చేస్తాం అంటూ దాటవేస్తుంటారు కొందరు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా అంటే... అప్పుడు చూసుకోవచ్చులే అన్నది వారి సమాధానం. ఇదీ భాగస్వామిలో బీపీ పెంచే స్వభావమే.
అప్పు చెల్లించరు: అవసరం కోసం అప్పు చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం దాన్ని తీర్చేటప్పుడు ఉండదు. అలాంటివారికి ఆర్థిక విషయాల్లో పక్కాగా ఉండాలని భావించే భాగస్వామి వస్తే గొడవలు తప్పవు.
ఆధిక్య స్వభావం: ‘ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్లే జరగాలి...’ అనే పెత్తందారీ స్వభావం ఉన్నవారితో జీవితం దినదినగండమే. ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా ఒకరి ఆధీనంలోనే ఉండటంతో రెండోవారు నిర్లిప్తంగా జీవితం గడుపుతారు.

ఆ ప్రభావం అనుబంధం మీద...
కుటుంబ సంబంధాలపైన డబ్బు తీవ్ర ప్రభావమే చూపుతోందంటున్నాయి పలు సర్వేలు. ఉదాహరణకు ఓ సర్వేలో వచ్చిన సమాధానాల్ని విశ్లేషిస్తే...
* నూటికి పాతిక కుటుంబాల్లో డబ్బు వ్యవహారం మొత్తం భాగస్వాముల్లో ఎవరో ఒకరి చేతిలోనే ఉంటోంది. రెండోవారిది పూర్తిగా ప్రేక్షకపాత్రే.
* దంపతుల్లో ఒకరి అతి పొదుపు కారణంగా 37 శాతం కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయి.
* ‘మీ వాళ్లకోసం అయితే ఎంతైనా ఖర్చు పెడతావు. మా వాళ్ల దగ్గరికి వచ్చేసరికి చేతులు రావు...’ తరహా వాదోపవాదాలు 32 శాతం కుటుంబాల్లో మనస్పర్థలకు కారణమవుతున్నాయి.
* ఒకరు ఇల్లు కొందామంటే మరొకరు బంగారం కొనాలంటారు. అలా పెట్టుబడుల విషయంలో గొడవపడేవారు 22 శాతం.
* భాగస్వామి దుబారా ఖర్చుల గురించి 41 శాతం కుటుంబాలు గొడవపడుతున్నాయట.

ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్య వచ్చేది సంపాదనతో కాదు, స్వభావంతోనే. ఇద్దరి మధ్యా చక్కటి అవగాహన ఉంటే పేదరికంలోనూ ప్రేమగానే బతుకుతారు. ఆ అవగాహన లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఆ బంధంలో అందం ఉండదు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వారిద్దరి మధ్యా ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించాలంటారు నిపుణులు. నేటి సమాజంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సత్తా చాటుతున్న అమ్మాయిలు ఆర్థిక విషయాల్లోనూ సొంతనిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరి బ్యాంకు అకౌంటులూ ఏటీఎం కార్డులూ వారికి ఉంటున్నాయి. వాటితో పాటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు కూడా. చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు కొంతకాలం ఉద్యోగం చేసి ఆర్థిక స్వాతంత్య్రాన్ని అనుభవించాకే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ పరిణామాల్ని అబ్బాయిలూ, వారి కుటుంబ సభ్యులూ కూడా అర్థం చేసుకున్న చోట ఎలాంటి సమస్యా రాదు. కానీ ఇంట్లో తండ్రి ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడమూ తల్లి మౌనంగా ఉండడమూ చూస్తూ పెరిగిన కొందరు అబ్బాయిలు పెళ్లయ్యాక భార్య స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆ పరిస్థితి సమస్యలకు దారితీస్తోంది.

రోజులు మారాయి!
ఉద్యోగం చేస్తున్న చాలామంది స్త్రీల ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు భర్తల దగ్గరే ఉంటున్నాయంటున్నారు ఆర్థిక సలహాదారులు. ఇద్దరి మధ్యా అవగాహనతో ఇది జరిగితే ఫర్వాలేదు. అయితే అవసరాలకు తగినంత డబ్బు ఆమె దగ్గర ఉండేలా చూసుకోవాలి. ‘మొన్నే కదా నాలుగు వేలు తెచ్చిచ్చాను ఏం చేశావు’ అని లెక్కలడిగేవారైతే మాత్రం- సున్నిత మనస్కులకు అభిమానం దెబ్బతింటుంది. నా కార్డు నాకిచ్చెయ్యమని అడగలేకా, అవసరమైనప్పుడల్లా డబ్బు అడగలేకా ఇబ్బందిపడుతుంటారు. అదే ఆవేశపరులైతే ‘నా కార్డు నీ దగ్గరెందుకుండాలి, నా క్రెడిట్‌ కార్డు నువ్వు వాడితే బిల్లు నేనెందుకు కట్టాలి’ అని ఎదురుప్రశ్నిస్తారు. అలా మాటా మాటా పెరిగితే అనవసరమైన గొడవే. హైదరాబాద్‌లోని భరోసా కేంద్రానికి వస్తున్న భార్యాభర్తల కేసుల్ని పరిశీలిస్తే గొడవలకు దారితీస్తున్న మూడు ప్రధాన కారణాల్లో డబ్బు ఒకటి. ఈ కేసుల్లో దాదాపు సగం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లవి కాగా మూడొంతుల కేసుల్లో భార్య ఏటీఎం కార్డు భర్త తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కారణం. ఉద్యోగం చేస్తున్నా స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం చాలా సందర్భాల్లో వివాదాలకు తావిస్తోంది. ఈనాటి జీవనశైలిలో పురుషులకు ఎన్ని రకాలుగా డబ్బు అవసరమవుతుందో అన్ని రకాలుగా స్త్రీలకూ అవసరమవుతోంది. ఆఫీసులో ఎవరికైనా అర్జెంటుగా డబ్బు సర్దాల్సిరావచ్చు. అకస్మాత్తుగా బంధువులెవరో ఆస్పత్రిలో ఉన్నారని తెలియొచ్చు. స్కూల్లోనో కాలేజీలోనో ఉన్న పిల్లలకి ఏదో కొనాల్సి రావచ్చు. అలాంటప్పుడు చేతిలో తగినంత డబ్బైనా ఉండాలి, ఏటీఎం కార్డు అయినా ఉండాలి. ఇవే కాదు, తమ్ముడి కొడుకు పుట్టినరోజో, చెల్లెలి పెళ్లిరోజో ఉంటుంది... మంచి బహుమతి కొనివ్వాలనిపిస్తుంది. అలాంటి ఖర్చులు చేసుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. ఈ మధ్య ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు రిటైరైన అమ్మానాన్నల బాధ్యతలనూ పంచుకుంటున్నారు. ఇలా బాధ్యతలకోసమూ బంధాల కోసమూ ఖర్చు పెట్టినందుకు ఒకరు మరొకరికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి దంపతుల మధ్య రాకూడదు.

ఇలా చేస్తే...
డబ్బు భార్యాభర్తల మధ్య వివాదానికి కారణం కాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటంటే...
* పెళ్లికి ముందు ఇద్దరూ తమ ఆర్థిక పరిస్థితి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. అది ఎంత ఇబ్బందికరంగా అన్పించినా సరే, పరిస్థితి ఉన్నదున్నట్లుగా చెప్పేయడమే మంచిది. అప్పులూ పెట్టుబడులూ ఆర్థిక ప్రణాళికలూ మనసు విప్పి చెప్పేయాలి. చెప్పుకోకుండానే పెళ్లైపోయిందా... పర్వాలేదు, ఇప్పుడైనా చెప్పేయండి.
* డబ్బు పట్ల భాగస్వామి దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటారు ‘మనీ అండ్‌ మ్యారేజ్‌’ అనే పుస్తకం రాసిన మ్యాట్‌ బెల్‌. చాలా సందర్భాల్లో డబ్బు గురించి జరిగే గొడవకి కేవలం డబ్బే కారణం కాదట. లోతుగా ఆలోచిస్తే ఇంకేదో ఉంటుంది. కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి తెలియకపోవటం, భవిష్యత్తు పట్ల అభద్రత లాంటివి చాలాసార్లు గొడవలకు దారితీస్తాయి. మనసు విప్పి మాట్లాడుకుంటే భాగస్వామికున్న భయాలు తెలుస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
* వయసు పెరిగేకొద్దీ బాధ్యతలూ పెరుగుతాయి. ప్రాధాన్యాలు మారతాయి. అందుకని ఏడాదికోసారి భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఆ ఏడాది ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఖర్చులైనా పెట్టుబడులైనా ఇద్దరిదీ ఒకే మాట కావాలి.
* స్థిరమైన ఆదాయం ఉండే ఉద్యోగుల్లో మూడోవంతు మంది కూడా ఇంటి బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవటం లేదట. దంపతుల్లో ఒకరు లెక్కలన్నీ పక్కాగా ఉండాలనుకుంటే దానికి భిన్నమైన స్వభావం ఉన్న రెండోవాళ్లు ‘నీకు తెలియని ఖర్చులేముంటాయి, నేనేమీ వృథా చేయడం లేదుగా...’ అంటూ దాటవేస్తుంటే- ఆ సంసారం అభద్రతని పెంచిపోషిస్తున్నట్లే. గబుక్కున ఏదైనా అవసరమొస్తే డబ్బు ఉంటుందో ఉండదోనని భాగస్వామి తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. బడ్జెట్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అమలుచేయడం అలవాటు చేసుకుంటే అభద్రత స్థానంలో ధీమా వస్తుంది.
* భాగస్వామి ఆర్థిక క్రమశిక్షణ తప్పితే... అలా చేయడం సరైన పని కాదు అని నిర్మొహమాటంగా చెప్పాలి. అంతేకానీ, వారి వ్యక్తిత్వంపై ‘బాధ్యతారాహిత్యం’ లాంటి ముద్రలు వేస్తే అది బంధం మీద ప్రభావం చూపుతుంది.
* ఆర్థికవిషయాలు మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడేవారు ఆర్థిక సలహాదారు సేవలు పొందవచ్చు. అభిప్రాయభేదాలు రాకుండా పనులు చేసుకోవడానికి అది తోడ్పడుతుంది.

*  *   *

భార్యాభర్తల్ని బతుకుబండిని నడిపే రెండు చక్రాలతో పోలుస్తారు పెద్దలు. బండి మీద బరువు రెండువైపులా సమానంగా పడేలా చూడమంటారు.
ఒక పక్క భారం పెరిగినా మరో పక్క చక్రం సహకరించకున్నా ఆ బండి ప్రయాణం కష్టమే.
బండి చక్రాల్లాగే భార్యాభర్తల మధ్య కూడా సమన్వయం అవసరం. అడుగడుగునా డబ్బుతో పనిపడే ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఆ సమన్వయానికి తొలి పునాది వేసేది ఆర్థిక అవగాహనే.
అదొక్కటి ఉంటే చాలు... మనీతో మరే గొడవా రాదు. నీదీ నాదీ ఒకే మాటా ఒకే బాటా... అని పాడుకుంటూ ఏ జంటైనా ఆనందంగా కలల్ని పండించుకోవచ్చు!

 

చేయకూడనివీ... చేయాల్సినవీ!

ఇద్దరి మధ్యా ఎంత ప్రేమ ఉన్నా సరే, చాలామంది డబ్బు విషయాలు మాట్లాడుకోవటానికి ఇబ్బంది పడతారు. ఆ మొహమాటాన్ని వదిలించుకోవాలంటున్నారు నిపుణులు. డబ్బు గురించి నిస్సంకోచంగా మాట్లాడుకోగలిగినప్పుడే దాన్ని ఆరోగ్యకరమైన అనుబంధంగా పరిగణించాలట. చాలామంది దంపతులు చేస్తున్న పొరపాట్లేమిటో, వాటిని ఎలా అధిగమించాలో కూడా వారు చెబుతున్నారు.

ఎవరి ఖాతాలు వారు నిర్వహిస్తూ ఇంటి అద్దె, బిల్లుల్లాంటివి ఈ నెల నేను, వచ్చే నెల నువ్వు- అని వంతులు వేసుకుని కడుతుంటారు.

పాలూ తేనెలా కలిసిపోయి ఇద్దరూ ఒకటే మాటగా భావిజీవితాన్ని గడపమని దీవిస్తారు పెళ్లిలో. అటువంటప్పుడు ఈ నీ, నా... తేడాలెందుకు? జీతాలకోసం ఇద్దరివీ వేర్వేరు ఖాతాలున్నా పెళ్లయ్యాక ఉమ్మడి ఖాతా తెరిచి ఇద్దరి జీతాలనూ అందులోకి బదిలీ చేసుకోవాలి. ఆ మొత్తానికి అనుగుణంగా ఇంటి బడ్జెట్‌ వేసుకోవాలి.

ఇంట్లో ఒకరే ఆర్థిక వ్యవహారాలు చూస్తుంటారు. ఇంకొకరికి వాటి గురించి అసలేమీ పట్టదు. దీనికి రెండు కారణాలు ఉంటాయి. లెక్కలన్నీ తన అదుపులో ఉండడం ఒకరికి ఇష్టం కావచ్చు. లేదా అసలు ఆ లెక్కల జోలికి వెళ్లడం ఇంకొకరికి ఇష్టం లేకపోవచ్చు.

కారణమేదైనా అది మంచి పద్ధతి కాదు. ఆర్థిక బాధ్యతలు ఒకరికి బరువూ కాకూడదు, ఇంకొకరికి అక్కరలేనివీ కాకూడదు. ఏ నిర్ణయమైనా కలిసి తీసుకుంటేనే సంసారనావ సాఫీగా సాగుతుంది.

ఒకరే సంపాదిస్తున్నప్పుడో, ఒకరి జీతం ఎక్కువైనప్పుడో... సంపాదించేది నేనే అయినప్పుడు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి- అనుకుంటుండవచ్చు.

తప్పే. పెళ్లయ్యాక ఇద్దరూ వేరు వేరు కాదు. సంపాదన ఒక్కరిదైనా ఇద్దరిదైనా, ఎక్కువైనా తక్కువైనా- దాని మీద హక్కు ఇద్దరిదీ అవుతుంది. ఇద్దరి నిర్ణయంతోనే ఖర్చు చేయాలి. తద్వారా వచ్చే ఏ ఆనందాన్నయినా ఇద్దరూ కలిసే అనుభవించాలి.

ఒకరికి బ్రాండెడ్‌ వస్తువులంటే ఇష్టం. మరొకరికి తక్కువ ధరలో మన్నికైనవి ఎంచికొనడం అలవాటు. ఆ విషయంపై నువ్వలా, నువ్విలా... అని తరచూ గొడవపడుతుంటారు.

పెళ్లంటే సర్దుకుపోవటం... కలిసి జీవించేటప్పుడు కొద్దిపాటి సర్దుబాటు ఇద్దరికీ తప్పదు. బడ్జెట్‌ దాటకుండానే కోరికలనూ ఇష్టాలనూ నెరవేర్చుకునే మార్గాలను వెతుక్కోవాలి.

జీతం ఎంతో భాగస్వామికి చెప్పకుండా దాచుకోవటం, తనవారికోసం ఖర్చుపెట్టుకోవటం కొంత మందికి అలవాటు.

ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. ఫలానా అవసరానికి దాచాను లేదా వాడాను అని చెప్పెయ్యాలి. మీరు చెప్పకుండా భాగస్వామికి తెలిస్తే మీమీద నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ సంపాదించుకోవడం కష్టం.

‘కాబోయే భర్తది పెద్ద ఉద్యోగమట. పెద్ద ఇల్లూ కారూ ఉండేవుంటాయి...’, ‘తనదీ మంచి ఉద్యోగమే కాబట్టి జీతం ఎక్కువే రావచ్చు. పెళ్లి కాగానే లోను తీసుకుని ఇల్లు కొనుక్కోవాలి...’- పెళ్లికి ముందు ఇలాంటి అంచనాలు పెళ్లయ్యాక తారుమారు కావచ్చు. అది అసంతృప్తికి దారితీస్తే అనుబంధంలో తేడా వస్తుంది.

ఆ అంచనాలన్నీ ఎవరికివాళ్లు ఊహించుకున్నవే కానీ ఎదుటివాళ్లిచ్చిన వాగ్దానాలు కాదని గుర్తుంచుకుంటే, ఊహకీ వాస్తవానికీ తేడా ఉంటుందని అర్థం చేసుకుంటే అసంతృప్తి దరిదాపుల్లోకి రాదు.

అమ్మ కాదంటే నాన్న అవునంటాడు, నాన్న కాదంటే అమ్మ అవునంటుంది- అని తెలుసుకున్న పిల్లలు ఆ పరిస్థితుల్ని తమకనువుగా వాడుకుంటారు.

పిల్లలు చిన్నప్పటినుంచే పరిస్థితులను ఉపయోగించుకునే అవకాశవాదులుగా మారకూడదనుకుంటే, వాళ్లూ పెద్దయ్యాక ఆర్థిక విషయాల పట్ల మంచి అవగాహనతో ఉండాలంటే- ముందు పెద్దలు మారాలి. పిల్లలకు పాకెట్‌మనీ ఇవ్వడమైనా, అడిగినవి కొనిపెట్టడమైనా- ఇద్దరూ కలిసి నిర్ణయించుకుని ఒకే మాట మీద నిలబడాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.