close

బెనారసు... ఎంత సొగసు..!

నిన్నమొన్నటివరకూ పట్టులంగా ఓణీ అనగానే కంచిపట్టు కట్టిన ముద్దుగుమ్మే కళ్లముందు కదిలేది. ఈమధ్యే ఆ కంచిపట్టు సరసన పోచంపల్లి పట్టు వచ్చి చేరింది. ఇప్పుడు ఆ రెండింటినీ పక్కకి నెట్టేస్తూ వచ్చిన మరో పట్టు ఫ్యాబ్రిక్కే బెనారస్‌. అటు సంప్రదాయ పెళ్లీపేరంటాల్లోనూ ఇటు ఆధునిక పార్టీల్లోనూ హల్‌చల్‌ చేస్తూ ఎత్నిక్‌ కమ్‌ మోడ్రన్‌ లుక్‌తో అందరి మనసుల్నీ దోచుకుంటోంది.
డియారంలోని ముళ్లులానే ఫ్యాషన్లూ గుండ్రంగా తిరుగుతూనే ఉంటాయి. అందుకే ఒకప్పుడు అందమైన పట్టు వస్త్రంగా పేరొంది, ఆ తరవాత కొంతకాలం కనుమరుగైనప్పటికీ మళ్లీ నిండైన జరీతో హుందాగా రెపరెపలాడుతోంది బెనారస్‌ సిల్క్‌.
బెనారస్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది చిన్నా పెద్దా జరీ బుటీలతో నిండిన పట్టుచీరే. ఆకులూ పువ్వులూ కొమ్మలూ రెమ్మలూ ఏవైనాగానీ వెండి, బంగారు రంగు జరీ దారాలతో అల్లిన బుటీల్లో అందంగా మెరిసే ఆ చీరలంటే ముచ్చటపడని
మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అప్పట్లో అతివల చీరల వార్డ్‌రోబ్‌లో ఒక్కటైనా బెనారస్‌ ఉండాలనుకునేవారు. మనతో పోలిస్తే ఉత్తరాది వాళ్లయితే మరీనూ. వేడుక ఏదయినా బెనారస్‌ అయితేనే ఆడంబరంగా ఉంటుంది అనుకుంటారు. అందుకే అక్కడ చీరల్లో బెనారస్‌ అందంగా కనువిందు చేస్తుండేది.

బెనారస్‌ ఫ్యాషన్‌!
కృత్రిమ రంగులూ నాణ్యతలేని సిల్కు, జరీదారాల కారణంగా ఆమధ్య బెనారస్‌ ప్రభ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే నాటి రాజుల వస్త్ర విశేషంగా పేరొందిన బెనారస్‌ను ఎలాగైనా మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనుకుని, బెనారస్‌నేత ప్రత్యేకంగా చీరల్ని డిజైన్‌ చేయించి, అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోలలో ప్రదర్శించడం ప్రారంభించిన ఘనత మాత్రం ప్రముఖ డిజైనర్లు సత్యపాల్‌, రీతూకుమార్లదే. ఆ పరంపరని మిగతా వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. ఫలితమే ఒకప్పుటి సంప్రదాయ బెనారస్‌, నేటి ఆధునిక దుస్తుల్లోనూ కొత్త అవతారమెత్తింది. విదేశీయులకీ ఆ దారాల మెరుపు బాగా నచ్చేయడంతో ఇండోవెస్ట్రన్‌ డిజైన్లలోనూ బెనారస్‌ పట్టు అందంగా మెరుస్తోంది. లాంగ్‌ గౌన్లూ, అనార్కలీలూ, స్కర్టులూ, కుర్తీలూ, షరారాలూ; ట్యునిక్‌, జాకెట్‌, ట్యూబ్‌ టాప్‌, సిగరెట్‌ ట్రౌజర్‌, బ్లౌజ్‌... ఇలా అన్ని ఫ్యాషన్‌ దుస్తుల్నీ బెనారస్‌ క్లాత్‌తో డిజైన్‌ చేస్తున్నారు.

ఆ మధ్య టస్సర్‌, రా సిల్క్‌, చందేరీ క్లాత్‌తో డిజైన్‌ చేసిన లాంగ్‌ అనార్కలీల మీదకి గ్రాండ్‌గా కనిపించేలా బెనారస్‌ దుపట్టా వేసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా మొత్తం డ్రెస్సునే బెనారస్‌తో కుట్టేస్తున్నారు. లెహంగాలయితే సరేసరి. దాన్నే కాస్త మార్చి లంగా ఓణీలానూ కుట్టేయడంతో అది దక్షిణాది అమ్మాయిలకీ తెగ నచ్చేసినట్లుంది. పెళ్లి నిశ్చితార్థ, రిసెప్షన్‌ వేడుకలకోసం బెనారస్‌ లంగా ఓణీల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. పైగా ఒకప్పుడు బెనారస్‌లో జరీ దారాల బుటీలే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు రంగుల దారాలతో నేసిన జాంథానీ ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది. దీంతోబాటు అక్కడక్కడా ఎంబ్రాయిడరీ చేసినట్లుగా అల్లిన కట్‌ వర్క్‌ జాంగ్లా, చీర మొత్తంగా జరీ పూల ఎంబ్రాయిడరీలతో అల్లిన జమావార్‌ టాంకోయ్‌ రకం నేతలు ఈతరం అమ్మాయిలని అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అబ్బాయిల షేర్వాణీలూ కుర్తాల్లో కూడా ఇప్పుడు బెనారస్‌దే హవా. నిండు రంగుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించడంతో పిల్లల ఫ్యాషన్లూ బెనారస్‌తోనే తళుకులీనుతున్నాయి.

అసలేమిటీ బెనారస్‌?
కాశీ లేదా వారణాసినే బనారసి అనీ పిలుస్తారు. అక్కడి మగ్గాలకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీన భారతావనిలో రాజుల దుస్తులన్నీ అక్కడే నేసేవారట. ఆ తరవాత పర్షియన్ల రాకతో ముఖ్యంగా మొఘల్స్‌ కాలంలో గుజరాత్‌ నుంచి మరికొందరు నేతకారులు వారణాసికి రావడంతో ఆ నగరం అందమైన నేత వస్త్రాలకి మారుపేరుగా మారింది. అంతేకాదు, బనారసి అన్న పేరు అక్కడి వస్త్రాలకి మారుపేరుగా స్థిరపడిపోయింది. అచ్చంగా మల్బరీ పట్టుదారాలతో నేసిన కటాన్‌; జరీ, సిల్కు దారాలు కలగలిపి నేసిన కోరా ఆర్గంజా; పలుచని దారాలతో నేసే జార్జెట్‌; షాటిర్‌ రకం వస్త్రాలన్నీ బెనారస్‌ ఫ్యాబ్రిక్స్‌గా పేరొందాయి. వీటిమీద బంగారు, వెండి జరీదారాలతో బుటీలు(చిన్నవి), బుటాలు(పెద్దవి), జాల్‌(లతలు), రేఖాగణిత డిజైన్లు వచ్చేలా నేసేవారు. తరవాత సిల్కుదారాలకన్నా బంగారు లేదా వెండిరంగు జరీ పోగుల్ని ఎక్కువగా జోడించి నేసిన టిష్యూ బెనారస్‌ క్లాత్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే- జరీ, సిల్కు దారాలతోనే చీరను అల్లి వాటిమీద మళ్లీ జరీ దారాలతోనే డిజైన్లు నేస్తారు. ఈ నేత బాలీవుడ్‌ తారలకీ సంపన్నులకీ తెగ నచ్చేసింది. దాంతో సెలెబ్రిటీలంతా తరచూ ఈ ఫ్యాబ్రిక్‌తో కుట్టిన డ్రెస్సులోనే మెరుస్తున్నారు.

అప్పట్లో బెనారస్‌ నేతలో కవిత్వాన్నీ చొప్పించేవారట. ఇప్పుడు వధూవరుల పేర్లనీ వేడుక తేదీలనీ కూడా నేతలో చొప్పించేస్తున్నారు కొందరు కళాకారులు. దుస్తులమీద బొమ్మ వేసినట్లూ నేస్తున్నారు మరికొందరు. ఒకప్పుడు బెనారస్‌ అంటే ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల సిల్కు నేతమీదే జరీ డిజైన్లు నేసేవారు. కానీ ఇప్పుడు లేత రంగుల్లోనూ బెనారస్‌ నేత అందం కనువిందు చేస్తోంది. పైగా గిఛా, ముఘ, టస్సర్‌ రకం పట్టు దారాల్నీ కాటన్‌ దారాల్నీ కూడా బెనారస్‌ మగ్గాల్లో నేస్తున్నారు. పూర్వం సిల్కు దారాలకి సహజ రంగుల్ని మాత్రమే అద్దేవారు. జరీ దారాల్ని కూడా అచ్చంగా వెండి, బంగారంతోనే చేసేవారు. దాంతో అప్పట్లో బెనారస్‌ చీర పెట్టెలో ఉందీ అంటే అమ్మాయికి ఆస్తి కింద లెక్కే. వారసత్వపు ఆస్తిగా తరతరాలకీ ఇచ్చి తీరాల్సిందే. కానీ కృత్రిమ జరీల వాడకం ఎక్కువయ్యాక బెనారస్‌ ఇప్పుడు అన్ని రకాల ధరల్లోనూ దొరుకుతూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. పైగా సంప్రదాయ దుస్తులతోబాటు వెస్ట్రన్‌, ప్యూజన్‌ దుస్తుల్లోనూ కనువిందు చేస్తోంది. అందుకే బెనారస్‌ నిస్సందేహంగా ఇప్పుడు అందరి ఛాయిస్‌.

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.