close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంచి మనసులు!

‘సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడు పడవోయ్‌...’ అని వందేళ్ల కిందటే అన్నాడు మహాకవి గురజాడ. ఆ మాటలు అప్పుడే కాదు, ఇప్పుడూ అనుసరణీయమే అని రుజువు చేస్తున్నారు ఈ ముగ్గురూ!

 

ఊరి కల నిజమైంది!

రిటైర్మెంట్‌ సమయంలో వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకోవడం, కారూ బంగారం వంటివి కొనడం... ఇలా ఏవైనా మిగిలిపోయిన కలలుంటే వాటిని తీర్చుకోవాలని చూస్తారెవరైనా. కానీ, ఒడిశాకు చెందిన గంగాధర్‌ రౌత్‌ తన ఒక్కడి కలనే కాదు, ఊరందరి కలనూ నిజం చేయాలనుకున్నాడు. రౌత్‌ సొంతూరు కియోంఝర్‌ జిల్లా కాన్పూర్‌. ఆ ఊరిని ఆనుకుని ఏరు ప్రవహిస్తుంటుంది. నదికి అవతల పొలాలు ఉంటాయి. వర్షాకాలంలో అక్కడికి వెళ్లాలంటే అతి కష్టంమీద ఏరు దాటాలి. లేదంటే రెండు మూడు ఊళ్లు చుట్టుకుని వెళ్లాలి. దాదాపు 1200 జనాభా ఉండే ఆ ఊరి పెద్దలు ఎన్నోసార్లు అధికారుల్నీ, ప్రజా ప్రతినిధుల్నీ కలిసి తమ గోడు వినిపించినా లాభంలేకపోయింది. పదేళ్ల కిందట కొందరు రూ.6 లక్షలు విరాళాలు ఇవ్వడంతో వంతెన పనులు మొదలుపెట్టారు. కానీ ఆ డబ్బు స్తంభాల పునాదులకే సరిపోయింది. 2016లో రిటైరైన రౌత్‌ తనకు వచ్చిన డబ్బుతో ఆ వంతెన నిర్మాణం పూర్తిచేయాలనుకున్నాడు. రూ.10 లక్షలు వెచ్చించగా 270 అడుగుల పొడవున నిర్మిస్తున్న వంతెన పిల్లర్లూ కొంతమేర స్లాబ్‌పనీ పూర్తయింది. ప్రభుత్వం నుంచి తనకు మరో రెండు లక్షలు రావాల్సి ఉందనీ ఆ డబ్బు రాగానే మిగతా పని పూర్తిచేయిస్తానంటాడు. ఇదంతా చూసిన ప్రభుత్వం ఇప్పటికి కళ్లు తెరిచి మిగిలిన పనుల్ని పూర్తిచేస్తామని భరోసా ఇచ్చింది. తన పిల్లలు జీవితంలో స్థిరపడ్డారనీ వాళ్లకి తన డబ్బు అవసరంలేదనీ అంటాడు రౌత్‌.

 

స్కూటరే నీళ్ల ట్యాంకర్‌...

క్కోసారి గుక్కెడు మంచి నీళ్ల కోసం ఎంత అవస్థ పడాల్సి వస్తుందో. అందుకే సామాన్యుల దాహాన్ని తీర్చాలనుకున్నాడు  నంద్యాలకు చెందిన షేక్‌ హుస్సేన్‌ వలీ. పోలియో సోకడంతో వలీ రెండుకాళ్లూ పనిచేయవు. ఒకరి సాయంలేనిదే ఉన్నచోటనుంచి కదల్లేడు. కాళ్లు లేనంత మాత్రాన తన జీవితం అలా నాలుగు గోడలకే పరిమితమైపోకూడదనీ, నలుగురికీ ఉపయోగపడేదిగా ఉండాలనీ భావించాడు. అందుకోసం ఒక స్కూటర్‌ని కొని దాన్ని సంచార చలివేంద్రంలా మార్చాడు. ఈ రిక్షామీద నీళ్లబాటిళ్లను తీసుకెళ్లి, రద్దీగా ఉండే ప్రతాప్‌ టాకీస్‌ దగ్గర అందరికీ ఉచితంగా అందిస్తాడు. గత 20 ఏళ్లుగా అతడు ఈ సేవలు అందిస్తున్నాడు. ఎందుకిలా అంటే... ‘నాకు ఇల్లు ఉంది. ప్రభుత్వం వికలాంగుల పింఛను కూడా అందిస్తుంది. ఇంట్లోవాళ్లు నాకోసం రోజంతా చాలా పనులు చేసి పెడతారు. బదులుగా నేను ఊరకే కూర్చుంటే ఏం ప్రయోజనం. అందుకే ఈ విధంగా సేవలు అందిస్తున్నాను’ అంటాడు వలీ. సాధారణ రోజుల్లో 200 మందీ వేసవిలో 400 మందీ వలీ స్కూటర్‌ దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతారు. పెట్రోలు ఖర్చులకుగానూ గొడుగులు రిపేరు చేస్తుంటాడు. 56 ఏళ్ల వలీ కొన్నాళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నా కూడా తన సేవల్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు.

 

‘పాజిటివ్‌’ తండ్రి

ఇంట్లో పిల్లలు లేకుంటే అది పెద్ద లోటే. ఆలోటుని ఏడేళ్లు అనుభవించారు సాల్మన్‌, ఫెల్వియా శాంతి. అందుకే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నారు. అంతలో శాంతి గర్భం దాల్చడంతో ఎంతో సంతోషించారు. ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసే సాల్మన్‌కు బిడ్డ పుట్టాక కూడా- ఓ అనాథను దత్తత తీసుకోవాలన్న ఆలోచన దూరం కాలేదు. ఆ క్రమంలో తల్లిదండ్రులు దూరమై, కుటుంబ సభ్యులు పట్టించుకోని హెచ్‌.ఐ.వి. సోకిన ఆరేళ్ల అర్పుతను దత్తత తీసుకున్నారు. శాంతి, సాల్మన్‌ ఇద్దరూ ఉద్యోగులే. దాంతో అర్పుత ఒంటరితనానికి లోనవుతుండటం గమనించి మరో హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ పిల్లాడిని దత్తత తీసుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముసలాయన వచ్చి ‘మా కొడుకూ కోడలూ చనిపోయారు. వారం వారం నేను వీళ్లని చికిత్స కోసం చెన్నై తీసుకురావాల్సి వస్తోంది. ఈరోజో, రేపో అన్నట్టుంది నా పరిస్థితి. మీరే ఈ పిల్లల్ని ఆదుకోవాలి’ అని తన నిస్సహాయతను తెలియజేయడంతో ఆ పిల్లల్నీ చేరదీశారు. అప్పుడే హెచ్‌ఐవీ పిల్లలు ఎలాంటి దయనీయ జీవితాన్ని గడుపుతున్నారో అర్థమైంది సాల్మన్‌కు. తర్వాత ‘షెల్టర్‌ ట్రస్ట్‌’ పేరుతో ఎన్జీఓ పెట్టి అలాంటి పసివాళ్లు మరింతమందిని చేరదీశాడు. ఒకప్పుడు తండ్రి కాలేదని బాధపడిన సాల్మన్‌ ఇప్పుడు 45 మందికి నాన్నయ్యాడు!
- వి.మల్లికార్జున న్యూస్‌టుడే, నంద్యాల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.