close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐడియా కావాలి నాయనా..!

ఐడియా కావాలి నాయనా..! 

మా టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఎక్కువైందా? మీరు చెబితే తగ్గించేస్తాం. మా కొత్త టీవీ ప్రకటన నచ్చట్లేదా? ఈసారి మీరు చెప్పినట్టే తీస్తాం. మా ఉత్పత్తుల్లో మార్పులేవైనా కోరుకుంటున్నారా? ఏం కావాలో చెప్పండి, చేసేస్తాం... అంటూ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కస్టమర్‌ దేవుళ్ల అభిప్రాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఓ సంస్థని పెట్టడానికి కాస్త డబ్బుంటే చాలు. కానీ దాన్ని నిలబెట్టాలన్నా, సమర్థంగా నడిపించాలన్నా లక్ష ఆలోచనలు కావాలి. వాటికోసం అనేక సంస్థలు ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ని నమ్ముకుంటున్నాయి. ‘ఒక ఐడియా చెప్పండి బాబూ’ అంటూ వినియోగదార్లను ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తున్నాయి.

ప్పుడెప్పుడో రాతి యుగం నాటి సంగతి...
వైద్యులూ, ఔషధాలూ ప్రజలకింకా పరిచయం లేని రోజులు. ఎవరికైనా జబ్బు చేస్తే అదృష్టం కలిసొచ్చి దానంతటదే నయమై బతికి బయటపడాలి. లేదంటే ప్రాణం మీద ఆశ వదిలేసి చివరి ఘడియ కోసం ఎదురుచూడాలి. అలాంటి పరిస్థితుల్లో ఓ గ్రీకు మహారాజు కొత్త పరిష్కార మార్గం కనిపెట్టాడు. ఇళ్లల్లో రోగాలతో సతమతమవుతున్న వాళ్లని తీసుకొచ్చి వూరి మధ్యలో ఓ భవంతిలో వదిలి వెళ్లాలని చాటింపు వేయించాడు. అటుగా వెళ్లేవాళ్లెవరైనా ఆ రోగుల దగ్గరికి వెళ్లి గతంలో వాళ్లకా జబ్బు వచ్చుంటే, అది నయమయ్యేందుకు తీసుకున్న జాగ్రత్తలూ, లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆ వ్యాధి బారి నుంచి బయటపడుంటే వాళ్లు పాటించిన సూత్రాలూ... ఇలా తమకు తెలిసిన చిట్కాలను ఆ రోగులతో పంచుకోవాలన్నది రాజుగారి ఆలోచన. అంటే ఒక సమస్యకు వంద మంది ఇచ్చే సలహా నుంచి పరిష్కారం వెతుక్కోవడం అన్న మాట. ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’కు తొలి రోజుల్నాటి ఉదాహరణ ఇది.

నిన్నమొన్నటి నెపోలియన్‌ కాలం నాటి మాట...
యూరప్‌నంతా తన కాళ్ల కిందకి తెచ్చుకోవడానికి ఆ చక్రవర్తి తపించేవాడు. ఆయన లక్ష్యం నెరవేరాలంటే లక్షలమంది సైన్యం కావాలి. వాళ్లని ఏడాదంతా పోషించడానికి ఆహారం కావాలి. కానీ చలికాలంలో విపరీతంగా పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల ఆహారాన్ని ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచడం అసాధ్యమయ్యేది. దాంతో సైనికులు సరైన తిండి దొరక్క అలమటించేవారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ నియంత ప్రజల్ని ఆశ్రయించాడు. సైన్యానికి పంపే ఆహారం ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఏదైనా మార్గం చూపమని కోరాడు. వేలల్లో సూచనలందాయి. కానీ డ్యూరండ్‌ అనే ఓ పౌరుడు చూపిన పరిష్కారం నెపోలియన్‌కు బాగా నచ్చింది. ఇప్పుడు శీతల పానీయాల్ని అమ్మటానికి ఉపయోగిస్తున్న ఐరన్‌ టిన్‌లనే, అప్పుడు డ్యూరండ్‌ ఆహారాన్ని భద్రపరచడానికి తయారు చేసిచ్చాడు. అవి తేలిగ్గా ఉండటంతో పాటు, వాటిలో ఆహారం ఎక్కువకాలం నిల్వ ఉండటంతో అవి వాడుకలోకి వచ్చి సైనికుల ఆకలి బాధ తీరింది. అలా ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ నెపోలియన్‌ సమస్యను పరిష్కరించింది.

21వ శతాబ్దానికి వచ్చేసరికి క్రౌడ్‌ సోర్సింగ్‌ వ్యాపార విధానంలో భాగమైపోయింది. గతంలో తమ పనితీరుకి సంబంధించిన అన్ని విషయాల్నీ గోప్యంగా ఉంచడానికి ఇష్టపడిన సంస్థలు, ఇప్పుడు ప్రతి సమస్యనూ ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నాయి. తమ ఉత్పత్తుల్ని ఉపయోగించేది వాళ్లే కాబట్టి, వాటిని మెరుగుపరచాల్సిన బాధ్యతనూ వాళ్లకే అప్పగిస్తున్నాయి. సరికొత్త ప్రచార మార్గాలను చూపమని ఆహ్వానిస్తున్నాయి. కొత్త ఉత్పత్తుల తయారీకి కావల్సిన సూచనలను స్వీకరిస్తున్నాయి. వాటికి పేర్లు పెట్టే భారాన్నీ ప్రజలపైనే మోపుతున్నాయి. ఆఖరికి సంస్థలో అంతర్గత సమస్యలున్నా, వాటి పరిష్కార మార్గాలకు కూడా వినియోగదార్లమీదే ఆధారపడుతున్నాయి. మొత్తంగా ‘కస్టమర్‌ ఈజ్‌ కింగ్‌’ అని గాంధీజీ చెప్పిన మాటని ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ రూపంలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. చరిత్రలో ఈ పద్ధతికి సంబంధించిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపించినా, పదేళ్ల క్రితమే ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ అన్న పదం తొలిసారి ప్రపంచానికి తెలిసింది. అనేక రంగాలు అప్పుడప్పుడూ ఆ మార్గాన్ని అనుసరించినా, ప్రస్తుతం వ్యాపార రంగం పూర్తిస్థాయిలో దానిపైన ఆధారపడుతోంది. ప్రొడక్ట్‌ తయారీ నుంచి దానికి ప్రచారం కల్పించి మార్కెట్లోకి తీసుకొచ్చే వరకూ ప్రతి దశలో వినియోగదార్ల ఆలోచనలకు పట్టం కడుతోంది. డబ్బులంటే కష్టం కానీ, ఉచితంగా ఇచ్చే ఆలోచనకు ఏమంత భాగ్యం అనుకుంటున్నారేమో, సంస్థలు కోరడం ఆలస్యం ప్రజలు కూడా ఉదారంగా ఐడియా వరాలిచ్చేస్తున్నారు. అలాంటి లక్షల సూచనల్ని జల్లెడపట్టి అత్యుత్తమమైన వాటిని సంస్థలు ఎంపిక చేస్తున్నాయి. వాటి సాయంతో తమ అమ్మకాల్ని పెంచుకొని, మార్కెట్‌ని విస్తరించుకొని, వినియోగదార్లకు దగ్గరవుతున్న సంస్థలెన్నో.

ప్రచారభారం ప్రజలపైనే
ఎన్నికల్లో నేతల విజయానికే కాదు, మార్కెట్లో ఓ సంస్థ విలువ పెరగడానికీ ప్రచారమే కీలకం. మన ఉత్పత్తి నిజంగా నాణ్యమైందే కావచ్చు, మంచి ముడిసరకుతోనే దాన్ని తయారు చేసుండొచ్చు, మిగతావాటితో పోలిస్తే సరసమైన ధరకే అందిస్తుండొచ్చు, కానీ సరైన ప్రచారం లేనిదే అది అమృతమైనా ఉత్త నీరులా మిగిలిపోతుందన్నది వ్యాపార వర్గాల నమ్మకం. పది రూపాయల సబ్బుకోసం సినీ తారలకు కోట్ల రూపాయల పారితోషికాలూ, మూడు రూపాయల షాంపూ కోసం విదేశాల్లో ప్రకటనల షూటింగులూ... ఇలాంటి ఆర్భాటాలన్నీ ఆ నమ్మకంలో భాగమే. ఆ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెట్టే శక్తి సంస్థలకున్నా కొత్త ఆలోచనలూ కావాలిగా! మార్కెటింగ్‌ బృందం సలహాలు మూసవైపోతున్నాయి. యాడ్‌ ఏజెన్సీల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ సంస్థలకు వరంగా మారుతోంది. ఆ విషయంలో పెప్సీ, కోకకోలా లాంటి శీతల పానీయాల సంస్థలు తక్కినవాటికంటే ముందున్నాయి.

గతేడాది ఐపీఎల్‌ సమయంలో విరాట్‌ కోహ్లి, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి సందడి చేసిన పెప్సీ టీవీ ప్రకటనలు గుర్తుండే ఉంటాయి. ‘మేం నటించడం కాదు, మీరే ప్రకటనలు తీసి పంపించండి, వాటిని మేం ప్రసారం చేస్తాం’ అంటూ వాళ్లు చెప్పిన మాటలు వేలాది కుర్రాళ్లను ఆకర్షించాయి. దానికి స్పందనగా ఎన్నో ప్రచార వీడియోలు పెప్సీ ఆఫీసుకి చేరిపోయాయి. వాటిలో ఆరింటిని ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలోనే ఆ సంస్థ ప్రసారం చేసింది. మిగతా వీడియోల్నీ భద్రంగా దాచిపెట్టింది. అవన్నీ భవిష్యత్తులో ఆ సంస్థ ప్రచారానికి కావల్సిన ఐడియా బ్యాంకులా ఉపయోగపడనున్నాయి. నిజానికి పదేళ్ల క్రితమే పెప్సీ ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ ద్వారా ప్రకటనల రూపకల్పన మొదలుపెట్టింది. అప్పట్లో ఆసియాలో తన మార్కెట్‌ని విస్తరించడానికి పనికొచ్చే ప్రకటన కోసం కాన్సెప్టుని అందించమని ప్రజల్ని కోరింది. చివరికి చైనాకి చెందిన ఓ స్కూల్‌ టీచర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ ఆధారంగా యాడ్‌ని సిద్ధం చేసింది. ఆ తరవాతి ఏడాది మంచి ప్రచార సలహా ఇచ్చిన వాళ్ల ఫొటోల్ని పెప్సీ క్యాన్లపైన ముద్రిస్తామని మాటిచ్చింది. ఆ ప్రకటనకు స్పందనగా పాతిక లక్షలకుపైగా ఐడియాలు పెప్సీ గూటికి చేరాయి. మరోసారి చైనాలో ఒలింపిక్స్‌ జరుగుతున్న సమయంలో పెప్సీతో పాటు దేశంతోనూ తమకున్న అనుబంధాన్ని చిన్నచిన్న నినాదాల రూపంలో రాసి పంపించమని వినియోగదారుల్ని కోరింది. దానికి ఏకంగా రెండు కోట్ల మంది స్పందించారు. వచ్చినవాటిలో మంచి నినాదాల్ని ఎంపిక చేసి పెప్సీ సోడా క్యాన్లపైన ముద్రించింది. పెప్సీ పోటీ సంస్థ కోకకోలా కూడా క్రౌడ్‌సోర్సింగ్‌కే ఓటేస్తోంది. ఎప్పటికప్పుడు తన పదికోట్ల మంది ఫేస్‌బుక్‌ అభిమానుల నుంచి కొత్త ఆలోచనల్ని అది ఆహ్వానిస్తూ, వాటి సాయంతో అనేక ప్రకటనల్ని రూపొందించి ప్రసారం చేస్తోంది.

పదేళ్లుగా అదే ప్రచారం
కుర్రాళ్లలో సృజనాత్మకతకు లోటులేదు. కానీ దాన్ని ప్రదర్శించడానికి సరైన వేదికలే కరవయ్యాయి. ఆ సమస్యని తన ఉత్పత్తులకు ప్రచార మంత్రంగా మార్చుకోవాలని డోరిటోస్‌ చిప్స్‌ సంస్థ నిర్ణయించుకుంది. తొలిసారి క్రౌడ్‌సోర్సింగ్‌ ద్వారా నేరుగా ప్రకటనల్ని సేకరించిన సంస్థ అదే. పదేళ్ల క్రితం ముప్ఫయి సెకన్లు నిడివి ఉన్న ప్రకటనల్ని తీసి పంపించమని ‘డోరిటోస్‌’ వినియోగదార్లను కోరింది. ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో అప్పట్నుంచీ ఏటా ప్రకటనల కోసం ప్రజల మీదే ఆధారపడుతోంది. అలా పదేళ్లలో 32వేలకుపైగా వీడియోలు దానికి అందాయి. వాటినే ఎప్పటికప్పుడు టీవీ, ఇంటర్నెట్‌ ప్రచారం కోసం ఆ సంస్థ వాడుకుంటోంది.

మూడేళ్ల క్రితం హ్యుండయ్‌ సంస్థ, తమ ఐ10 కార్ల ప్రచారం కోసం చిన్న కాన్సెప్టుని సిద్ధం చేయమని వినియోగదార్లను ఆహ్వానించింది. చివరికి భాస్కర్‌ కంచన్‌ అనే వ్యక్తి రాసిన స్క్రిప్ట్‌ని ఎంపిక చేసి, అతడినీ షారుక్‌ఖాన్‌నీ పెట్టి ప్రకటన తీసింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యటక సంస్థల్లో ఒకటైన ‘ఎయిర్‌ బీఎన్‌బీ’ తన ప్రకటనల కోసం పూర్తిగా పర్యటకుల్నే నమ్ముకుంది. తాము పర్యటన కోసం ప్రపంచంలో ఏ మూలకెళ్లినా, అక్కడి వీడియోలని పంపించమని పర్యటకుల్ని కోరుతోంది. వాటిని ఎడిట్‌ చేసి తమ వెబ్‌సైట్లో, టీవీ ప్రకటనల్లో వాడుకుంటోంది. అలా ఎంపికైన వీడియోలను పంపిన వాళ్లకి బుకింగ్స్‌లో రాయితీలను కల్పిస్తోంది. ప్రపంచమంతా తిరిగి సంస్థే వీడియోలను చిత్రించాలంటే తలకు మించిన భారమే. అంత పెద్ద సమస్యకు క్రౌడ్‌ సోర్సింగ్‌ సులువైన పరిష్కారంగా మారింది. ఆపిల్‌ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదార్లు ఐఫోన్‌లో తీసిన రకరకాల ఫొటోలను ఈమెయిల్‌ ద్వారా సేకరించింది. ఐఫోన్‌ కెమెరా ఎంత బాగా ఫొటోలను తీస్తుందో చెప్పేందుకు, అలా సేకరించిన వాటిల్లోంచి 77ఫొటోలను హోర్డింగులపైన ప్రకటనల కోసం వాడుకుంది. ప్రచారానికి ప్రజల్ని వాడుకుంటే ఐడియాలకు కొదవుండదు. సృజనాత్మకతకు లోటుండదు. ప్రకటనల ఖర్చు తగ్గిపోతుంది. సమయం ఆదా అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక్క దెబ్బతో లక్షలాది మంది దృష్టిని తమవైపు తిప్పుకునే అవకాశం దొరుకుతుంది. అలాంటప్పుడు ఏ సంస్థయినా ఆ మార్గాన్ని ఎందుకు వదులుకుంటుంది!

ఏది కావాలంటే అదే...
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన రీసెర్చి ల్యాబులూ, లక్షల్లో జీతాలు తీసుకునే పరిశోధకులూ, నెలల తరబడి సాగే పరిశోధనలూ... వినియోగదార్లని ఆకర్షించే ఉత్పత్తిని సృష్టించడానికి సంస్థలు పడే కష్టం మామూలుది కాదు. ఇప్పుడిప్పుడే అవి దారి మార్చుకుంటున్నాయి. వినియోగదార్లకేం కావాలో వాళ్లనే అడిగితే ఆ ఖర్చూ, శ్రమా మిగిలిపోతాయి కదా అనుకుంటున్నాయి. ‘లేస్‌’ సంస్థ కొత్త రకం చిప్స్‌ తయారీ కోసం అదే మార్గాన్ని ఎంచుకుంది. ‘డూ అజ్‌ ఏ ఫ్లేవర్‌’ పేరుతో తామెలాంటి రుచిలో లేస్‌ని ఇష్టపడతారో చెబుతూ, ఏ పదార్థాల్ని వాటి తయారీకి వినియోగించాలో తెలియజేయమని వినియోగదార్లని కోరింది. తమ షెఫ్‌ల సాయంతో వచ్చిన వాటిలోంచి నాలుగు ఫ్లేవర్లను ఎంపిక చేసి, తయారు చేసి మాల్స్‌లో తక్కువ ధరకు అమ్మకానికి పెట్టింది. మళ్లీ ఓటింగ్‌ నిర్వహించి చివరికి వాటిలోంచి ఒకదాన్ని ఎంపికచేసి పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టింది. లేస్‌ ‘చీజీ గార్లిక్‌ బ్రెడ్‌’ ఫ్లేవర్‌ అలా ప్రజల సాయంతో మార్కెట్లోకి వచ్చిందే. దాని ఉత్పత్తి మొదలైన మూడు నెలల్లోనే సంస్థ అమ్మకాలు ఎనిమిది శాతం పెరిగాయట. దాంతో క్రౌడ్‌ సోర్సింగ్‌ సాయంతో రెసిపీలని సేకరించి ‘సదరన్‌ బిస్కెట్స్‌ అండ్‌ గ్రేవీ’, ‘వెస్ట్‌ కోస్ట్‌ ట్రఫల్‌ ఫ్రైస్‌’ లాంటి రకరకాల ఫ్లేవర్లను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తోంది. కేవలం మన దేశ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని లేస్‌ నిర్వహించిన ‘సజెస్ట్‌ ఏ ఫ్లేవర్‌’ పోటీకి పద్నాలుగు లక్షల మందికిపైగా భారతీయులు స్పందించడం విశేషం.

బర్గర్ల తయారీతో ప్రపంచవ్యాప్తంగా పాగా వేసిన ‘మెక్‌ డొనాల్డ్స్‌’ కూడా కొత్త రకం బర్గర్ల తయారీకి క్రౌడ్‌సోర్సింగ్‌నే నమ్ముకుంది. తమ వెబ్‌సైట్లోని ప్రత్యేక అప్లికేషన్‌ ద్వారా వినియోగదార్లే నచ్చినవిధంగా ఆన్‌లైన్‌లో బర్గర్లను డిజైన్‌ చేసే అవకాశాన్ని కల్పించింది. దాదాపు లక్షా పదహారువేల మంది ఆ తయారీలో భాగమయ్యారు. ఓటింగ్‌ ద్వారా వాటిలోంచి ఐదు బర్గర్లను ఎంపిక చేసి తమ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. బిస్కెట్ల తయారీ సంస్థ ఓరియో కూడా తమ వందో వార్షికోత్సవం సందర్భంగా కొత్త రకం కుకీస్‌ని డిజైన్‌ చేసి తమ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయమని వినియోగదార్లని కోరింది. చివరగా ఒక కుకీని ఎంపిక చేసి ఉత్పత్తి మొదలుపెట్టింది. ఆఖరికి ‘బ్లాక్‌ క్రౌన్‌’ అనే బీర్‌ని కూడా బడ్‌వైజర్‌ సంస్థ వినియోగదార్ల సలహామేరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. పన్నెండు ఫ్లేవర్లలో బీర్లని తయారు చేసి అభిప్రాయం కోరగా, పాతిక వేలమంది బ్లాక్‌ క్రౌన్‌కే ఓటేశారు.

క్రౌడ్‌సోర్సింగ్‌ కేవలం ఆహార ఉత్పత్తులకే పరిమితం కాలేదు. శాంసంగ్‌, పెబెల్‌, లెగో లాంటి బహుళజాతి సంస్థలు కొత్త వస్తువుల తయారీలోనూ ప్రజల్ని భాగం చేస్తున్నాయి. ఎలాపడితే అలా మడుచుకోవడానికి వీలున్న టచ్‌ స్క్రీన్‌లను శాంసంగ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. వాటితో ఎలాంటి పరికరాల్ని తయారు చేస్తే బాగుంటుందో సూచించమంటూ వినియోగదార్లని అడిగి, ఎంపికైన ఆలోచనలకు బహుమతుల్నీ ప్రకటించింది. కాలిఫోర్నియాలోని శాంసంగ్‌ కార్యాలయంలో ఓ క్రౌడ్‌ సోర్సింగ్‌ విభాగమే పనిచేస్తోంది. సంస్థకి అందే సలహాలూ సూచనల మదింపు అంతా అక్కడే జరుగుతుంది.

బొమ్మల తయారీ సంస్థ లెగో కూడా కొత్త బొమ్మల్ని డిజైన్‌ చేయమని వినియోగదార్లని కోరుతోంది. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా వాటిలోంచి మంచి డిజైన్‌ని ఎంపిక చేసి తయారీ మొదలుపెడుతోంది. వాటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో ఒక శాతాన్ని రాయల్టీ కింద డిజైనర్‌కు చెల్లిస్తోంది. వినియోగదార్ల నుంచే సాంకేతికత, సూచనలను సేకరించి ‘పెబెల్‌’ సంస్థ స్మార్ట్‌వాచ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త అప్లికేషన్ల తయారీ కోసం ఆపిల్‌, నీటి వృథాని అరికట్టే షవర్ల తయారీ కోసం యూనీలివర్‌, టీషర్టుల డిజైనింగ్‌ కోసం లివైస్‌... ఇలా ఎన్నో సంస్థలు క్రౌడ్‌ సోర్సింగ్‌ మార్గాన్ని కళ్లకద్దుకొని మరీ అనుసరిస్తున్నాయి.

అన్నీ వాళ్ల ఆలోచనలతోనే...
సలహాల్ని తీసుకొని లాభాల్ని అందుకోడానికే కాదు, లోపాల్ని సరిదిద్దుకొని వినియోగదార్ల మనసు గెలుచుకోవడానికీ క్రౌడ్‌ సోర్సింగ్‌ అత్యుత్తమ మార్గమని ‘స్టార్‌ బక్స్‌’ నిరూపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌ బక్స్‌ కాఫీ షాప్‌కి మంచి పేరుంది. పదిమంది సలహాల్నీ పాటించబట్టే తామీ స్థాయిలో ఉన్నామని ఆ సంస్థ చెబుతోంది. తమ స్టోర్‌లతో పాటు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, పింట్రెస్ట్‌ లాంటి రకరకాల వేదికల ద్వారా తమ సేవల్ని మెరుగుపరచడానికి కావల్సిన సలహాల్ని నిత్యం కస్టమర్ల నుంచి స్టార్‌బక్స్‌ సేకరిస్తుంది. అలా కాఫీ తయారీ నుంచి స్టోర్‌లో ఫర్నిచర్‌ వరకూ వివిధ అంశాలకు సంబంధించి ఏడేళ్లలో లక్షా తొంభై వేల సూచనలు ఆ సంస్థ యాజమాన్యానికి చేరాయి. వాటిలో దాదాపు మూడొందల ఆలోచనలను వాళ్లు అమల్లో పెట్టారు. పునర్వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ కప్పులు, ఉచిత వైఫై, మొబైల్‌ స్టార్‌బక్స్‌ కాఫీ షాప్‌, చక్కెరలేని ఫ్లేవర్డ్‌ జ్యూస్‌ల లాంటి అనేక అంశాలు వినియోగదార్ల సలహా మేరకే స్టార్‌బక్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.

నాలుగేళ్ల క్రితం మార్స్‌ ఆర్బిటార్‌తో పాటు మరో రెండు ఉపగ్రహాలను తయారు చేయడానికి నాసా సిద్ధమైంది. అదే సమయంలో అనుకోకుండా ప్రభుత్వం నుంచి దానికందే బడ్జెట్‌లో దాదాపు 15వేల కోట్ల రూపాయల మేర కోతపడింది. దాంతో ఆ ప్రాజెక్టుని అటకెక్కించడమే మంచిదని శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు. కానీ నాసా అధికారులు దానికి ఒప్పుకోకుండా క్రౌడ్‌ సోర్సింగ్‌ వైపు మొగ్గు చూపారు. తక్కువ ఖర్చుతో ఉపగ్రహానికి పనికొచ్చే పరికరాలను తయారు చేసే టెక్నాలజీ తెలిసిన వాళ్లుంటే ముందుకు రావాలని ఆన్‌లైన్‌ వేదికగా అడిగారు. అలా నాలుగొందల మంది ముందుకు రావడంతో, వాళ్ల సాయంతో నాసా పరిమిత బడ్జెట్‌లోనే ఉపగ్రహ తయారీకి సిద్ధమైంది.

* * *

  పదేళ్ల క్రితం దాకా తమ ఉత్పత్తుల తయారీ కోసం సొంత సిబ్బందిపైనే సంస్థలు ఆధారపడేవి. కానీ సోషల్‌ మీడియా రాకతో వ్యాపార ముఖచిత్రమే మారిపోయింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ లాంటి వేదికల పుణ్యమా అని నేరుగా వినియోగదార్లకు చేరువయ్యే మార్గం వాటికి దొరికింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందుకోవడానికి అన్ని సంస్థలూ ముందుకొచ్చాయి. ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ సాయంతో వినియోగదార్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దానివల్ల ఒక అంశానికి సంబంధించి వేలాది సృజనాత్మక ఐడియాలు సంస్థల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఉచితంగా బోలెడంత ప్రచారం దొరుకుతోంది. వినియోగదార్లకు మరింత దగ్గరయ్యే అవకాశం కలుగుతోంది. ఫలితంగా సంస్థలకు ఏటా కోట్ల రూపాయల డబ్బు ఆదా అవుతోంది. ఎన్నో మెదళ్లు ఒకే అంశం గురించి ఆలోచిస్తాయి కాబట్టి, ఆ ఐడియా ఫెయిలయ్యే అవకాశాలూ తక్కువే!

మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్లూ, అనుభవం కలిగినవాళ్లూ, మెరుగ్గా ఆలోచించేవాళ్లూ మన చుట్టూ బోలెడు మంది ఉంటారు. అలాంటి నలుగురి సలహా ఓ వ్యక్తి ఉన్నతికి పనికొస్తే, లక్షలాది మంది సలహా ఓ సంస్థ ఎదుగుదలకు సాయపడుతుంది. అందుకే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాతతరం సంస్థలూ నమ్ముకుంటోన్న కొత్త సూత్రం... క్రౌడ్‌సోర్సింగ్‌.

‘నా ఆదాయంలో సింహభాగాన్ని ఈ ఏడాది సేవా కార్యక్రమాల కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తే బావుంటుందో కాస్త సలహా ఇస్తారా’ అంటూ అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ట్విటర్లో తనను అనుసరించే 2.5లక్షల మందిని అడిగాడు. దానికి ఒకే రోజులో 21వేల మంది స్పందించారు. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. తన బృందం ఆ సలహాలన్నింటినీ మదించి కొన్నింటిని ఎంపిక చేస్తుందనీ, ఆ పనులకే తన డబ్బుని ఖర్చు చేస్తాననీ అంటున్నాడు జెఫ్‌. ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ శక్తిని అర్థవంతంగా వాడుకుంటున్నందుకు ట్విటర్‌ వినియోగదార్లు బెజోస్‌పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ప్రతి ఏడాదీ జనవరి 1న ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకొని దాన్ని పాటించడం ఫేస్‌బుక్‌ సృష్టికర్త జుకెర్‌బర్గ్‌కి అలవాటు. గతేడాది మాత్రం తాను ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక ఆ భారాన్ని ఫేస్‌బుక్‌ వినియోగదార్లపైనే మోపాడు. అతడు చేసిన పోస్టుకి స్పందనగా వేలాది సూచనలు అందాయి. నెలకో కొత్త దేశానికి వెళ్లమనీ, రోజుకో మొక్క నాటమనీ, అప్పుడప్పుడూ యూనివర్సిటీల్లో స్టార్టప్‌ పాఠాలు చెప్పమనీ... ఇలా ఎవరికి తోచిన సలహా వాళ్లిచ్చారు. అందులో ‘కనీసం రెండు వారాలకి ఓ కొత్త పుస్తకం చదవండీ’ అంటూ ఓ అమ్మాయి చేసిన సూచనకు రెండు వేలకుపైగా లైకులొచ్చాయి. ఎక్కువ మంది అదే కోరుకుంటున్నారు కాబట్టి జుకెర్‌బర్గ్‌ కూడా ఆ అమ్మాయి మాటకే ఓటేశాడు.

చ్చంగా క్రౌడ్‌ సోర్సింగ్‌ని నమ్ముకొని పనిచేయడం మొదలుపెట్టిన తొలి మొబైల్‌ అప్లికేషన్‌ ‘వేజ్‌’. ట్రాఫిక్‌జామ్‌ వివరాలను చెప్పడం, గమ్యానికి దగ్గరి దార్లను చూపించడం, రోడ్డు ప్రమాదం జరిగిన రహదార్ల వివరాలను తెలియజేయడం... ఇలా ట్రాఫిక్‌కి సంబంధించిన అన్ని అప్‌డేట్లనూ ఎప్పటికప్పుడు అందించే అప్లికేషన్‌ ఇది. ఆప్‌ వినియోగదార్ల కారు ప్రయాణించే వేగాన్ని బట్టి ఇది ట్రాఫిక్‌ జామ్‌లను అంచనా వేస్తుంది.వాటి ఆధారంగా ఆ మార్గంలో ప్రయాణించే ఇతర ‘వేజ్‌’ వినియోగదార్లకు ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఎంత ఎక్కువమంది ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అంత కచ్చితమైన సమాచారాన్ని అది ఇవ్వగలుగుతుంది. అందుకే పదో, వందో కాదు కొన్ని లక్షల మంది దాన్ని వినియోగిస్తూ, సరైన సమాచారం ఇతర వేజ్‌ వినియోగదార్లకి అందేలా చూస్తున్నారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ లాంటి దేశాల్లో జీపీఎస్‌, క్రౌడ్‌సోర్సింగ్‌ ఆధారంగా పనిచేసే నంబర్‌వన్‌ ఆప్‌గా వేజ్‌ నిలుస్తోంది.

ప్రపంచాన్ని గడగడలాడించిన మంగోలియన్‌ మహావీరుడు చెంగిజ్‌ఖాన్‌. అతడు చనిపోయాక సమాధి ఎక్కడ నిర్మించారన్న విషయాన్ని అతడి వంశస్థులు రహస్యంగా ఉంచారు. క్రమంగా ఆ విషయం కాలగర్భంలో కలిసిపోయింది. రెండొందల ఏళ్లుగా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ప్రదేశాల్లో చరిత్రకారులు చెంగిజ్‌ఖాన్‌ సమాధి కోసం సాగిస్తోన్న అన్వేషణ ఫలించట్లేదు. ఆ వీరుడిని మంగోలియన్లంతా దేవుడిలా కొలుస్తారు కాబట్టి, ఆయన పాలించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ స్థలం అపవిత్రమవుతుందని స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యేది. దాంతో నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ సాయంతో ఆ సమాధిని వెలికితీసే ప్రయత్నం మొదలుపెట్టింది. శక్తిమంతమైన ఉపగ్రహాల సాయంతో మంగోలియాలో చెంగిజ్‌ఖాన్‌ పాలనలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి కొన్ని లక్షల ఫొటోలను ఆ ఛానల్‌ తీసింది. వాటిలోంచి పదమూడొందల ఫొటోలను తుది జాబితాకు కుదించింది. ఆన్‌లైన్‌ ద్వారా చరిత్రపైన పట్టున్న దాదాపు 28వేల మందికి వాటిని చూపించి, అక్కడున్న ఆనవాళ్ల ద్వారా సమాధి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలరేమో ప్రయత్నించమని అడిగింది. వాళ్లందరి సలహా మేరకు ఆ జాబితాను వంద ప్రాంతాలకు కుదించి, పరిశోధకులు నేరుగా ఆ ప్రదేశాల్ని పరిశీలిస్తున్నారు. ఆ ప్రయత్నం ఫలించి సమాధి జాడ తెలిస్తే, ‘క్రౌడ్‌ సోర్సింగ్‌’ సాధించిన అతిపెద్ద విజయాల్లో అదీ ఒకటిగా నిలిచిపోతుంది.

పాలనా వ్యవహారాల్లో క్రౌడ్‌ సోర్సింగ్‌ని భాగం చేసిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే, ‘ప్రణాళికా సంఘం పనితీరు ఇప్పటి అవసరాలకు సరిపోదు. దాని స్థానంలో ఎలాంటి కొత్త వ్యవస్థ ఏర్పడితే బావుంటుందో సూచించండి’ అంటూ ట్విటర్‌ వేదికగా ఆయన ప్రజల్ని కోరారు. ప్రజా సంక్షేమ పథకాల్లో మార్పు చేర్పులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు సలహాల్ని స్వీకరిస్తూ, మంచి సూచన చేసినవాళ్లకు అవార్డులనూ అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ‘స్వచ్ఛ భారత్‌’ లోగో కూడా క్రౌడ్‌సోర్సింగ్‌ ఫలితమే. అప్పట్లో భారతీయ కరెన్సీ చిహ్నాన్నీ, ఆధార్‌ లోగోని కూడా క్రౌడ్‌సోర్సింగ్‌ సాయంతోనే ఎంపిక చేశారు.

తేడాది తమ జాతీయ జెండా డిజైన్‌ని మార్చాలనుకున్న న్యూజిలాండ్‌, ప్రజల నుంచే కొత్త డిజైన్లను ఆహ్వానించింది. దానికి ప్రతిగా పదివేలకు పైగా డిజైన్లు అందాయి. వాటిలో నాలుగింటిని ఎంపిక చేసి మళ్లీ ఓటింగ్‌ నిర్వహించగా ఓ జెండాను అత్యధికంగా 42శాతం మంది ఆమోదించారు. కానీ మిగతావారంతా పాత జెండానే కొనసాగించమని కోరడంతో ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. అలా ఎంతో డబ్బు ఖర్చుపెట్టి శ్రమకోర్చి నిర్వహించిన ఆ కార్యక్రమం వృథాగా మిగిలిపోయింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్రౌడ్‌సోర్సింగ్‌ విఫలమయ్యే అవకాశాలూ ఉంటాయని చెప్పడానికి దీన్నొక ఉదాహరణగా చూపిస్తారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.