close

చర్మాన్నీ పట్టించుకుందాం!

వ్యాయామం చేసేవాళ్లు ఫిట్‌నెస్‌తోపాటు చర్మసంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. లేదంటే ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు ఇబ్బంది పెడతాయి.
* వ్యాయామం చేసేవారికి చెమట పట్టడంతోపాటు చర్మగ్రంథులూ తెరుచుకుంటాయి. అందుకే చెమట తుడుచుకునే టిష్యూని ఒక్కసారి వాడి పడేయాలి. తువాళ్లను కూడా పదే పదే వాడటం వల్ల క్రిములు చర్మం లోపలికి వెళ్లి
పలు రకాల అలర్జీలకు కారణమవుతాయి.
* ఉదయం వాకింగ్‌, జాగింగ్‌లకు వెళ్లేవారు కాలమేదైనా సరే ముఖం, చేతులకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. ఉదయంపూట ఎండలో ఉండే యూవీ కిరణాల ప్రభావం నుంచి ఈ లోషన్‌తో బయటపడొచ్చు. అలానే ఇంటికి తిరిగొచ్చాక ముఖాన్నీ, చేతుల్నీ చల్లటి నీళ్లతో కడుక్కొని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే చర్మసమస్యలు ఇబ్బంది పెట్టవు.
* కొందరు ఆఫీసులూ, కాలేజీల నుంచి నేరుగా జిమ్‌లకు వెళుతుంటారు. అలాంటి వాళ్లు మేకప్‌ తుడి చేసుకున్నాకే వర్కవుట్లు మొదలుపెట్టాలి. లేదంటే వ్యాయామం వల్ల చెమటపట్టినప్పుడు మేకప్‌ తాలూకు ఫౌండేషన్లూ, క్రీములూ చర్మానికి హాని చేస్తాయి. వైట్‌హెడ్స్‌ మొటిమల వంటివి బాధించే అవకాశముంటుంది.
* కొందరు వ్యాయామం కోసం ఈత కొడుతుంటారు. అలాంటి వాళ్లు ఈత కొట్టడానికి కొన్నిగంటల ముందు ఒంటికి క్రీములూ నూనెలూ రాసుకోకుండా ఉంటే చర్మానికి మురికి పట్టకుండా ఉంటుంది. అలానే ఈత నుంచి తిరిగొచ్చాక గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసి మాయిశ్చరైజర్‌ రాసుకుంటే క్లోరిన్‌ ప్రభావం ఉండదు.


 

విహార యాత్రలతో గుండెకు మేలు!

రచూ విహారయాత్రలకు వెళ్లేవారికి గుండె సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు అమెరికాలోని సిరక్యూస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఏడాదిపాటు ఓ ఐదొందల మందిలో జీవక్రియ లక్షణాలూ, దానికి సంబంధించిన సిండ్రోమ్‌పై అధ్యయనం చేసి కనీసం మూడు నెలలకోసారైనా విహార యాత్రలకు వెళ్లేవారిలో జీవక్రియలన్నీ బాగున్నట్టు గుర్తించారు. జీవక్రియలన్నీ బాగుంటేనే ఎలాంటి సిండ్రోమ్‌లూ రాకుండా ఉంటాయనీ, అప్పుడే గుండె సమస్యలు దరిచేరవనీ చెబుతున్నారు.

ఎందుకంటే టూర్లకు వెళ్లినప్పుడు కొత్తవాతావరణంలో ఒత్తిళ్లనీ సమస్యల్నీ పక్కన పెట్టేయడం వల్ల మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. దాంతో మెటబాలిజం రేటు సక్రమంగా ఉండి గుండెకు మేలు జరుగుతుందట. అదే జీవక్రియలు సరిగాలేని పక్షంలో గుండెసమస్యల్ని ఎదుర్కోవడం తప్పదంటున్నారు సిరక్యూస్‌ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన బ్రేసీ హుస్కా. ఆ యాత్రలు కూడా పచ్చని చెట్లూ, లోయలూ, జలపాతాలూ ఎక్కువగా ఉండే చోట్లకూ, సముద్ర ప్రాంతాలకూ వెళ్లడం వల్ల ఒత్తిళ్లు దూరమై మేలు చేసే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయట. అందుకే తరచూ టూర్లు ప్లాన్‌ చేసుకోమని చెబుతున్నారు హుస్కా.


 

పరగడుపున తాగితే మంచిది

బీట్‌రూట్‌ను తినకపోయినా రోజూ పరగడుపున ఓ గ్లాసు జ్యూస్‌ తాగితే ప్రయోజనాలెన్నో. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్‌ అందుతుంది. టీనేజీ పిల్లలకు ఇస్తే రక్తహీనత సమస్య దూరమవడంతోపాటు హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. నీరసంతో ఇబ్బంది పడేవారు బీట్‌రసం తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఆ ప్రభావం రోజంతా పనిచేస్తుంది. ఈ రసం తీసుకుంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా అందుతాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి, సిలు బీపీని అదుపులో ఉంచుతాయి. గుండె సంబంధిత సమస్యలున్న వారికి బీట్‌రూట్‌ ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం ద్వారా నెలసరి సమయంలో బాధించే మూడ్‌స్వింగ్స్‌కీ చెక్‌పెట్టొచ్చు. గర్భిణులు ప్రతిరోజూ పరగడుపున బీట్‌రూట్‌ రసం తాగితే ఫోలిక్‌ యాసిడ్‌ బాగా అంది పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ రసం కాలేయాన్ని శుద్ధి చేయడంతోపాటు ఎముకబలాన్ని పెంచుతుంది. చదువుకునే పిల్లలకు ఇస్తే జ్ఞాపకశక్తి బాగుంటుంది.


 

లైంగిక సామర్థ్యం పెంచే ఆసనాలు

భార్యాభర్తలిద్దరూ ఉదయాన్నే యోగాసనాలు వేస్తే ఆరోగ్యంతోపాటు లైంగిక సామర్థ్యాన్నీ వృద్ధి చేసుకోవచ్చంటున్నారు సెక్స్‌ స్పెషలిస్టులు. ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది దంపతులకు వ్యక్తిగతంగా సమయం కేటాయించుకోవడానికి తీరికే ఉండట్లేదు. దాంతో లైంగిక జీవితంపై ఆ ప్రభావం పడటంతోపాటు ఇద్దరి మధ్యా అనుబంధం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరూ ఉదయాన్నే యోగాకు ఓ అరగంట సమయం కేటాయిస్తే మంచిదంటున్నారు వైద్యులు. వజ్రాసనం, బద్ధకోణాసనం, సేతుబంధాసనం వంటివాటిని జంటగా వేస్తే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. పొట్ట, కాళ్ల భాగంలో కండరాలకు పటుత్వం రావడంతోపాటు సౌకర్యంగానూ మారతాయి. సెక్స్‌ సమయంలోనూ శారీరక సామర్థ్యం సొంతమవుతుంది. ఎక్కువ సమయం లైంగికానుభూతిని పొందడం సాధ్యమవుతుందనీ, ఫలితంగా మానసికంగానూ అనుబంధం బలపడుతుందనీ వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.