close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్లస్సూ మైనస్సూ

- రాచపూటి రమేష్‌

దయం అయిదున్నర కావస్తూ ఉంది. చలికాలం కాబట్టి ముసుగుతన్ని బిగదీసుకుని పడుకుని ఉన్నాను.
ఎవరో తలుపుపై దబదబా బాదడం వినిపిస్తూ ఉంది. ‘ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా..!?’ అని నేను ఆశ్చర్యపోతూ తలుపు తీశాను.
‘‘ఇంత పొద్దెక్కినా ఇంకా ఈ నిద్రేమిట్రా సుబ్బూ’’ అంటూ రాకెట్‌లా లోనికి దూసుకువచ్చేశారు బీబీసీ ఆంజనేయులుగారు.
ఆంజనేయులుగారు తిరుపతిలో నేను చదువుకునే రోజుల్లో ఉద్యోగం చేస్తూ మా ఇంటి సమీపంలోనే ఉండేవారు. కాలేజీలో ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేసే ఆయన షేక్‌స్పియర్‌ నాటకాల్లోని సంభాషణలు బిగ్గరగా వల్లె వేస్తూ ఉదయాన్నే డాబాపై పచార్లు చేస్తూ కనిపించేవారు.

ఇప్పుడు నేను నెల్లూరులో ఉద్యోగం చేస్తూ ఉంటే, రిటైరై- కొడుకు దగ్గరకు వచ్చిన ఈయన కుటుంబం ఇటీవలే మా బాలాజీ నగర్‌కు వచ్చి చేరింది. ఒకరోజు బజారులో కనపడి పలకరించిన నేరానికి రోజూ ఉదయం ఏడింటికల్లా మా ఇంటికి వచ్చేసి, మాకు వచ్చే రెండు న్యూస్‌పేపర్లలోని వార్తలు గట్టిగా చదువుతూ, వాటిపై వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అందుకే ఆయన్ను బీబీసీ ఆంజనేయులుగా మా ఇంటిల్లిపాదీ వ్యవహరిస్తూ ఉంటారు.

ఆంజనేయులుగారు, నిన్న పేపర్లు చదివిన తరవాత మా ఆవిడిచ్చిన కాఫీ తాగి, గమ్మునే ఇంటికి వెళ్ళక ‘ఇదిగో సుబ్బూ, నీ వాలకం చూస్తూ ఉంటే బొత్తిగా సోంబేరిగా తయారయ్యేటట్లున్నావు. రేపు ఉదయం నుండీ నేను వాకింగ్‌ మొదలెట్టాలనుకుంటున్నా, అయిదున్నరకల్లా మీ ఇంటికి వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉంటే ఇద్దరమూ అలా చావడిబండ వరకూ వాకింగ్‌కు వెళ్ళొద్దాం’’ అనడం గుర్తుకొచ్చింది నాకు.

‘‘ఏమిటయ్యా, నీ నిద్రముఖం నువ్వూనూ... త్వరగా లేచి తయారుకా, వాకింగ్‌కు ఇప్పటికే ఆలస్యమైంది’’ అని నన్ను తొందరపెట్టారు.

‘‘వస్తాను సార్‌,
కాస్త ముఖం కడుక్కుని కాఫీ అదీ తాగి...’’ అని నసుగుతున్న నన్ను-‘‘నథింగ్‌ డూయింగ్‌, సూర్యుడు ఉదయించకముందే వాకింగ్‌ మొదలెట్టాలన్నారు మన పూర్వీకులు. అసలు నేను సర్వీసులో ఉన్నప్పుడైతే చీకట్నే లేచి, ఈ వేళకంతా వాకింగ్‌ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చేవాడిని’’ అని మిలటరీవాడిలాగా గదమాయించారు.

‘చచ్చింది గొర్రె’ అనుకుంటూ నేను ఆదరాబాదరా తయారై వచ్చాను.

వైట్‌ టీషర్ట్‌, వైట్‌ షార్ట్‌లో ఉన్న అయిదడుగుల ఆంజనేయులుగారు తీస్తున్న బస్కీలు ఆపి, ‘‘ఛలో ఛలో’’ అని బయటకు దారితీశారు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి... అరవై ఏళ్ళు దాటినా ఆయన నడిచే వేగాన్ని నేను అందుకోలేకపోయాను. నడుస్తూ మాట్లాడటం ఆయన హాబీలా ఉంది.

‘‘మా రెండోవాడు అనిల్‌ ఉన్నాడు చూశావూ... మొన్ననే ఎంటెక్‌ డిస్టింక్షన్లో పాసయ్యాడు. అసలు యూనివర్సిటీకే టాప్‌ర్యాంక్‌ మావాడిది. కానీ, ఎందుకో వాళ్ళు అనౌన్స్‌ చేయలేదు’’ ఉపోద్ఘాతం మొదలెట్టారు.

‘‘అలాగా సార్‌’’ అని ఆయాసపడుతూ అన్నాను. ఆయనతోబాటు వేగంగా నడవలేక వగరుస్తూ ఉన్నాను.

‘‘పాసవకమునుపే వాళ్ళ కాలేజీలో పెట్టిన ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలలో నాలుగు టాప్‌ ఎంఎన్‌సీలలో సెలెక్ట్‌ అయ్యాడు వాడు. సబ్జెక్టులో వాడికున్న టాలెంటూ కమ్యూనికేషన్‌ స్కిల్సూ చూసి ‘మా కంపెనీలో చేరంటే, మా దాంట్లో చేరు’ అని, ఆ కంపెనీలవాళ్ళు వాళ్ళల్లోవాళ్ళే ముష్టి యుద్ధం చేశారనుకో’’ గర్వంగా చెప్పారు.

‘‘ఇంతకూ మీవాడు ఏ ఆఫర్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాడు సార్‌’’ ఏదో ఒకటి అడగాలని అడిగాను.

‘‘వాళ్ళిచ్చే బోడి ఆఫరేమిటయ్యా? మావాడే వాళ్ళకు ఆఫరిచ్చాడు- స్టార్టింగ్‌ శాలరీనే ఇరవైలక్షలుండాలని. ఓ కంపెనీవాళ్ళు హ్యాపీగా ఒప్పేసుకున్నారు. మావాడు అందులోనే చేరుతున్నాడు’’ దర్పంగా చెప్పారు అల్లిబిల్లి ఆంజనేయులుగారు.

‘‘కాసేపు ఆ చెట్టుకింద ఆగి అలుపు తీర్చుకుందామా?’’ అన్నాన్నేను రొప్పుతూ.

‘‘కుదరదయ్యా, వాకింగంటే వాకింగే. కావాలంటే చావడిబండ మీద కూర్చుందాం’’ అన్నారు.

‘‘నేను నడవలేనట్లుగా రాగిచెట్టు కింద ఉన్న సిమెంటు చప్టాపైన కూలబడటంతో ఆంజనేయులుగారికి ఆగక తప్పిందికాదు.

నా పక్కనే ఉన్న మరో చప్టాపైన కూర్చుని సిగరెట్టు వెలిగించారు.

‘‘ఇంతకూ మాకు పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు సార్‌?’’ ఎక్కడ నడవమంటాడోనని- ఆయన్ను మాటల్లో దించాలని అడిగాను నేను.

కొండమీద నుండి బండరాళ్ళు దొర్లిపడ్డట్లుగా ఫెళ్ళుమని నవ్వారు.

‘‘చెప్పకూడదు కానీ సుబ్బూ, మావాడికి అన్నీ ప్లస్సేనయ్యా- చిన్నప్పటి నుండీ. అన్ని క్లాసుల్లో ఫస్టూ ఎంటెక్‌ డిస్టింక్షన్లో పాసూ... ఎంఎన్‌సీ కంపెనీలో ఏడాదికి ఇరవైలక్షలు తెచ్చే ఉద్యోగమూ... సొంత ఇల్లూ కారూ పదెకరాల తోటా... ఉక్కు పిడుగు లాంటి ఆరోగ్యంతో తల్లిదండ్రులూ... హైటూ వెయిటూ అందమూ అన్నీ ప్లస్సే.’’

‘‘మొన్న తాడేపల్లిగూడెం నుండి ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి బీటెక్‌ ఫస్ట్‌క్లాసులో పాసైంది. అది ప్లస్సనుకుంటే... రంగు- కారునలుపు- అది మైనస్సు. తండ్రికి యాభైలక్షల ఆస్తి- అది ప్లస్సనుకుంటే... తల్లికి క్యాన్సరు- అది మైనస్సు.

ఇక ఒంగోలు సంబంధం వాళ్ళంటావా... అమ్మాయిది అప్సరసలాంటి అందం. అది ప్లస్సనుకుంటే... బీఎస్సీలో ఇంకా రెండు సబ్జెక్టులు పాసవ్వాలి- అది మైనస్సు మరీ.

ఇక మ్యారేజీ బ్యూరోవాళ్ళు నెల్లూరు నుండి ఇంకో అలయెన్సు తీసుకొచ్చారు. అమ్మాయిది పెద్ద భూస్వాముల కుటుంబం. రాజకీయ పలుకుబడీ వంశమూ- అవి ప్లస్సనుకుంటే... ఆ అమ్మాయిదీ వాళ్ళ నాన్నదీ కొంచెం డామినేషన్‌ టైపన్నది మైనస్సు.’’

‘‘ఇక బయలుదేరుదాం సార్‌’’ టైమ్‌ చూసుకుని చెప్పాను నేను.

‘‘అలాగే’’ అని వాకింగ్‌స్టిక్‌ నేలకు గట్టిగా తాకించి, బూట్లు టకటకలాడిస్తూ బయలుదేరారు ఆంజనేయులుగారు. నేను ఉసూరుమంటూ ఆయన వెనకాల నడిచాను.

‘‘మావాడి ప్రొఫెసరు కోదండరామయ్య భలే సంబంధం తీసుకొచ్చాడయ్యో... అమ్మాయి సునీత బ్యాంకు ఆఫీసరుగా ఉద్యోగం చేస్తూ ఉంది. అది ప్లస్సనుకుంటే... వాళ్ళ నాన్న ఏసీబీ వాళ్ళ ట్రాప్‌లో ఇరుక్కుని సస్పెండయ్యాడు. ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది- అది మైనస్సు’’ పెద్దపెట్టున నవ్వి చెప్పారు.

‘‘అమ్మాయి తల్లిదండ్రులతో ఏం పని సార్‌. అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలు కదా’’ అన్నాను నేను నడక వేగం పెంచి.

‘‘భలేవాడివయ్యా, మావాడికన్నీ ప్లస్సులే ఉన్నాయి కాబట్టి, అమ్మాయికి కూడా అన్నీ ప్లస్సులే ఉండాలనుకుంటాం. అందులో తప్పేముందీ?’’ అని రాగాలు తీశారు.

నిజానికాయన చెబుతున్నట్లు- వాళ్ళ అబ్బాయి సకలగుణాభిరాముడేమీ కాదు. వాడు సిగరెట్లు కాల్చడం చాలాసార్లు చూశాను నేను. మందు అలవాటు కూడా ఉందేమో తెలియదు. పైగా ఛాయ కొంచెం తక్కువ.

అదీకాక ఆంజనేయులుగారి భార్య సరళమ్మగారు కొంతకాలంగా షుగర్‌ ఎక్కువై మంచానికంటిపెట్టుకుని ఉంది. కొన్ని రోజులుగా వంటమనిషి వచ్చి వంటచేసి వెళ్తూ ఉంది. ఆవిడ రానిరోజులు ఆయనే వంటింట్లో చేతులు కాల్చుకోవడం చూశాను నేను.
‘‘మరి అమ్మగారు ఇప్పుడు షుగర్‌ జబ్బుతో మంచంపట్టారు కదా సర్‌’’ ఉండబట్టలేక అడిగేశాను నేను.

‘‘భలేవాడివయ్యా, కొంపదీసి అది మావాడికి మైనస్సంటావేమిటి..? వచ్చిన కోడలు ఆమెకేమీ సపర్యలు చేయనవసరం లేదు. ఎండీ చదివిన డాక్టరు ఇంటికొచ్చి వైద్యం చేసి వెళ్తూ ఉన్నాడు. మంచి టాబ్లెట్సూ ఇన్సులిన్‌ ఇంజక్షన్లతో ఆమె వారం, పది రోజుల్లోనే కోలుకుని మొత్తం ఇంటిపని చక్కబెట్టుకోగలదు. పైపెచ్చు ఉక్కుముక్కలాగా నేనొకణ్ణి ఆమెకు అండగా ఉన్నాను కదా’’ ఫెళ్ళున నవ్వి అన్నారు.

‘‘మరింకేం సార్‌, ఏదో ఒక సంబంధం చూసి వెంటనే మీ అనిల్‌కు పెళ్ళి చేసేయండి. మాకూ విందు భోజనం తినే భాగ్యం కలుగుతుంది’’ అన్నాన్నేను నవ్వుతూ.

‘‘చెప్పాను కదయ్యా సుబ్రమణ్యం, ఒకటి ప్లస్సుంటే ఒకటి మైనస్సు సంబంధాలే తగులుతున్నాయనీ’’ అన్నారాయన.

‘‘నాకు తెలిసిన ఒక హోమియో డాక్టరు సంబంధం చెప్పమంటారా?’’ అన్నాను నేను.

‘‘ఏదీ కృష్ణానగర్‌లో సూపర్‌ మార్కెట్‌ నడుపుతున్న రంగారావు కూతురు సంబంధమా... అమ్మాయి బావుంది కానీ, వంకర పళ్ళూ చట్టిముక్కూ మైనస్సులుగా పరిణమించాయి ఆమెకు. తండ్రి ఆస్తిపాస్తులూ ఒక్కతే కూతురవడం ప్లస్సేననుకో’’ మళ్ళీ ఫార్ములాలు వల్లించనారంభించారు.

‘‘నేను చెప్పే అమ్మాయి ఆవిడ కాదు సార్‌, అమ్మాయి తండ్రి హోమియో డాక్టరు. అమ్మాయి బీటెక్‌ చదివి, బెంగళూరులో ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తూ నెలకు యాభైవేలు తెచ్చుకుంటూ ఉంది. మంచి కుటుంబం. ఒకడే అన్నయ్య, లాయరు’’ అన్నాన్నేను.

‘‘అంతా బావుందయ్యా. కానీ, అన్నయ్య లాయరవడం మనకు కొంత మైనస్సేనయ్యా. మాటమాట అనుకుని, ఏదైనా పంతాలకుపోతే డొమెస్టిక్‌ వయొలెన్సు యాక్టు కింద కేసు పెట్టగలడు’’ అని మళ్ళీ నవ్వారు.

‘‘అన్నట్లు మరచానయ్యో, రెండు రోజుల క్రితం బొంబాయి నుండి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి అక్కడే చార్టెర్డ్‌ అక్కౌంటెంటుగా సొంత ప్రాక్టీసు నడుపుకుంటూ ఉందట. తండ్రీ సిఏనే, తరతరాలకు కావలసినంత సంపాదించాడు. అమ్మాయి చక్కని చుక్క. ఒక్కతే కూతురు’’ అని గర్వంగా చెప్పారు.

‘‘మరింకేం సార్‌, నాకన్నీ ప్లస్సులే కనిపిస్తున్నాయి’’ అన్నాను నేను ఆకాశం వంక చూస్తూ.

‘‘ఏం ప్లస్సులూ... నా బొంద, మా అనిల్‌ను బొంబాయికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోమని, ఇల్లరికం పెట్టుకుంటామంటారు. మావాడు తల్లిదండ్రులను మరచిపోయి అక్కడే దిష్టిబొమ్మలా పడి ఉండాలి- అది పెద్ద మైనస్సు. అదీగాక...’’
ప్లస్సూ మైనస్సూ... అని లెక్కలు వేసుకుంటూ ఒళ్ళు తెలియకుండా నడుస్తూ ఉన్న ఆంజనేయులుగారు ఎదురుగా స్కూలు పిల్లల లోడుతో వేగంగా వస్తున్న షేర్‌ ఆటోను గమనించలేదు. అసలే ర్యాష్‌గా వస్తున్న ఆటోవాడు పరాగ్గా నడుస్తున్న ఆంజనేయులుగారిని గుద్దేసి క్షణాల్లో పరారయ్యాడు. నేను ఆటోను గమనించి, ఆయన్ను పక్కకు లాగుదామనుకునేలోగా ప్రమాదం జరిగిపోయింది.

ఇప్పుడు ఆంజనేయులుగారికి సరళమ్మగారి పక్కనే మరో మంచంవేసి, రెండు కాళ్ళకూ కట్లతో పడుకోబెట్టి ఉన్నారు. మరో ఆరునెలలదాకా ఆయన లేచి తిరిగే అవకాశం లేదు. అనిల్‌కొచ్చే పెళ్ళి సంబంధాలవారికి అదే పెద్ద మైనస్‌ పాయింటు అయి కూర్చుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.