close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనవాళ్లు అదరగొట్టేస్తున్నారు..!

ఒకప్పటిలా జర్నలిజం ఇప్పుడు కేవలం పత్రికలకో, టీవీలకో మాత్రమే సొంతం కాదు. పండితులకూ, మేధావులకే పరిమితం కాదు. ఇంటర్నెట్‌తోపాటూ కాస్త సామాజిక స్పృహా, పరిశీలనాశక్తీ, రాయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లెవరైనా వెబ్‌ఛానెళ్ళు ప్రారంభించవచ్చు. అందుకే ఇప్పుడు నెట్‌ తెరవగానే బోల్డన్నీ న్యూస్‌ సైట్‌లు పలకరిస్తున్నాయి. వాటిల్లో తమదైన కొత్తదనంతో అదరగొడుతున్నారు వీళ్లు.

క్రీడల్లో కొత్త కోణం...!

భారత్‌లో క్రీడలంటే క్రికెట్‌ మాత్రమే అనే అభిప్రాయం అందరిదీ! దాని ఊసు పెద్దగా లేకుండానే దేశంలోని మిగతా ఆటలూ, వాటిలోని మంచీచెడుల గురించి విశ్లేషిస్తుంది ‘పవర్‌ స్పోర్ట్స్‌’ (www.powersportz.tv). వెబ్‌ఛానెల్‌. మనదేశంలో పూర్తిస్థాయి క్రీడావార్తల కోసం వచ్చిన తొలి 24 గంటల లైవ్‌ డిజిటల్‌ ఛానెల్‌ ఇది. గత ఏడాది మేలో మొదలైన ఈ ఇంగ్లిష్‌ వెబ్‌ఛానెల్‌... ఏడాదిలో రోజుకి ఇరవైలక్షల వీక్షణల్నీ, 3.5 లక్షలమంది వీక్షకులనీ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన కాంతి డి.సురేశ్‌ దీని వ్యవస్థాపకురాలు. మగవాళ్ల ఆధిక్యం ఎక్కువగా ఉన్న క్రీడా పాత్రికేయ రంగంలో ఓ ఛానెల్‌కి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా సారథ్యం వహిస్తున్న ఘనత ఆమెది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసిన కాంతి ఆ తర్వాత ‘కనెక్షన్స్‌’ అనే గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ సంస్థను స్థాపించారు. హైదరాబాద్‌ రంజీట్రోఫీ క్రీడాకారుడు, ఐఏఎస్‌ అధికారి డి.సురేశ్‌ని ప్రేమించి పెళ్లాడారు. క్రీడారంగంపైన ఉన్న ఆసక్తితో దూరదర్శన్‌లో ఫ్రీలాన్స్‌ స్పోర్ట్స్‌ యాంకర్‌గా చేశారు. 2008 ఒలింపిక్స్‌నీ కవర్‌ చేశారు. పూర్తిస్థాయిలో స్పోర్ట్స్‌ జర్నలిజంలోకి రావాలని అప్పుడే ఉన్నా పిల్లలు మరీ చిన్నవాళ్లు కావడంతో ఆగిపోయారట. వాళ్లు కాస్త ఎదగగానే ‘పవర్‌ స్పోర్ట్స్‌’ను ప్రారంభించేశారు. కాంతి ప్రతిరోజూ జాతీయ, అంతర్జాతీయ క్రీడా సమస్యలపైన నిర్వహించే ‘టాకింగ్‌ టర్కీ విత్‌ కాంతి’ లైవ్‌ షోకి మంచి ఆదరణ ఉంది. మహిళా అథ్లెట్‌లు తమ ఆడతనాన్ని నిరూపించుకోవాలంటూ ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్‌ ఫౌండేషన్‌ చేసిన సూచనలపైనా, భారత బాక్సింగ్‌ సంఘాల్లో జరుగుతున్న కుమ్ములాటలపైనా ఆమె చేసిన టాక్‌ షోలు సంచలనం సృష్టించాయి!

లోతు ఉండాలె

వోక్స్‌ స్పేస్‌ డాట్‌ ఇన్‌... (www.voxspace.in)... హైదరాబాద్‌ కేంద్రంగా వస్తున్న ఆన్‌లైన్‌ పత్రిక ఇది. ‘టీవీలూ, పత్రికలూ సమయం, స్థలాభావం కారణంగా ప్రతి విషయాన్నీ లోతుగా ఇవ్వలేకపోతున్నాయి. మేం ఆ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం...’ అంటోంది వోక్స్‌ స్పేస్‌. కేవలం అదొక్కటే కాదు... పత్రికలు అంతగా శ్రద్ధ చూపని ఎన్నో విషయాలని విశ్లేషణాత్మకంగా ఆంగ్లంలో అందిస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు సిద్ధార్థ నాయుడు, సాయి సంతోష్‌ నేతృత్వంలో పదిమంది యువతీయువకులు దీన్ని నడుపుతున్నారు. అన్ని పత్రికల్లాగే రీజినల్‌, ట్రెండింగ్‌, లైఫ్‌ స్టైల్‌, సెలెక్ట్స్‌(సినిమా/డాక్యుమెంటరీ రివ్యూలూ, ఇంటర్వ్యూలూ) తదితర అంశాల కింద వ్యాసాలను ఇస్తున్నా... ప్రతిదాంట్లోనూ తమదైన ఒరిజినాలిటీ, కొత్త దృష్టికోణంతో ఆకట్టుకుంటున్నారు. రాజకీయ వార్తలకి దూరంగా ఉంటూనే... రెండేళ్లలోనూ రెండు లక్షలమంది వీక్షకులని సొంతం చేసుకుంది వోక్స్‌ స్పేస్‌!

‘ఫోర్బ్స్‌’కి ఎక్కారు!

శిరీష నారుమంచిది కూడా హైదరాబాదే. హోమ్‌సైన్స్‌ పట్టభద్రురాలైన ఆమె నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత భర్త రామ్‌నారాయణతోపాటూ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. శిరీషకి ఉద్యోగానికి వెళ్లాలని ఉన్నా... దేశంకాని దేశంలో పిల్లలకి దూరమవుతాననే బాధ వెంటాడేది. అందుకే ఇంట్లో ఉంటూనే పనిచేయాలనుకున్నారు. అలాంటి ఉద్యోగం కల్పించే సంస్థల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇంట్లో ఉంటూనే ‘సెర్చ్‌ ఇంజిన్‌ ఎవల్యూటర్‌’గా ఉద్యోగం సాధించారు. ఆ పనితో మంచి ఆదాయం రావడంతోపాటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలూ, జిగ్స్‌, సైడ్‌ హజిల్స్‌ పేరుతో అందివచ్చే ఆదాయమార్గాల గురించీ ఆమెకి తెలిసొచ్చింది. ఆ వివరాలు తనలాంటి తల్లులూ, విద్యార్థులూ, అదనపు ఆదాయం కోరుకునే ఉద్యోగులకి అందివ్వాలనుకున్నారు. దాని కోసం పాత్రికేయురాలిగా అవతారమెత్తి ‘క్రౌడ్‌వర్క్‌ న్యూస్‌’ అనే వెబ్‌సైట్‌ (www.crowdworknews.com) ను ప్రారంభించారు. దేశ సరిహద్దులకి అతీతంగా ఆన్‌లైన్‌లో దొరుకుతున్న వివిధ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలూ, వాటిక్కావాల్సిన విద్యార్హతలూ, నైపుణ్యాలూ, వాటిల్లో రాణించడానికి కావాల్సిన సలహాలని చక్కటి ఇంగ్లిషులో ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సైట్‌కి వచ్చే పాఠకుల సంఖ్య పెరగడంతో తాను చేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగం మానేసి దీన్నే నిర్వహిస్తున్నారు. ఆమె కృషితో ఈ ఛానల్‌ రెండేళ్లలో రెండు లక్షలమంది రోజువారి పాఠకుల్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఫోర్బ్స్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి పత్రికలూ ఈ వెబ్‌సైట్‌ గురించి ప్రస్తావించాయి!

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.