close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ సంస్థలు... యువతకు ప్రత్యేకం!

మన జనాభాలో సగం యువతే. అందుకే ఈ మధ్య ప్రత్యేకించి వాళ్లని లక్ష్యంగా చేసుకుని కంపెనీలు వస్తున్నాయి. వారి సరదాలూ, అవసరాలూ, అలవాట్లూ దృష్టిలో పెట్టుకుని వచ్చిన కంపెనీలు విజయవంతమవుతున్నాయి. అలాంటివే ఈ సంస్థలు కూడా!


భవిష్యత్తుకి మదుపు...

షాపింగ్‌ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల సేవలకు ఆప్స్‌ని ఉపయోగిస్తోంది యువత. వీటిద్వారా ఎంత కష్టమైన పని అయినా ఉన్నచోటనుంచి సులభంగా పూర్తిచేసే వెసులుబాటు ఉండటమే కారణం. ఆ కోవకే చెందుతుంది ‘గ్రో’ ఆప్‌ కూడా. ఈ ఆప్‌ ద్వారా స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు ఎంతో సులభంగా జరపొచ్చు. సాధారణంగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి అంటే, అందుకు చాలా నైపుణ్యం ఉండాలన్న భావన యువతలో ఉంది. ఆ భావనని తొలగించాలనే లక్ష్యంతో వచ్చారు ‘గ్రో’ వ్యవస్థాపకులు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీని ఫ్లిప్‌కార్ట్‌ పూర్వ ఉద్యోగులైన లలిత్‌ కెశ్రే, హర్ష్‌ జైన్‌, నీరజ్‌ సింగ్‌, ఇషాన్‌ బన్సాల్‌లు రూ.10లక్షలతో ప్రారంభించారు. ఈ విభాగంలో మరికొన్ని ఆప్‌లూ ఉన్నప్పటికీ ఖాతా తెరవడం నుంచి పెట్టుబడి పెట్టడం వరకూ ‘గ్రో’లో అన్నీ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. 2017లో ఆప్‌ని తీసుకొచ్చారు. దానికి ముందు ఏడాదిపాటు యువత ఉపయోగించే వివిధ రకాల ఆప్‌లనీ, స్టాక్‌ మార్కెట్‌ పనితీరునీ నిశితంగా గమనించి సులభంగా ఉపయోగించేలా ఈ ఆప్‌ని తయారుచేశారు. ఆప్‌తోపాటు ‘గ్రో’ వెబ్‌సైట్‌ కూడా ఉంది. దీన్లో గ్రో బ్యాలెన్స్‌(యూపీఐ ఉపయోగించి సింగిల్‌ క్లిక్‌తో షేర్లు కొనుగోలు చేయొచ్చు), అసిస్ట్‌(ఫండ్స్‌ ఎంపికలో సహాయపడే విభాగం), స్మార్ట్‌ సేవ్‌(మంచి రిటర్న్స్‌ ఇస్తోన్న కంపెనీల వివరాలు) ఇలా విభాగాలు ఉంటాయి. ఏడాదిన్నర వ్యవధిలో 20 లక్షల మంది ‘గ్రో’ ద్వారా లావాదేవీలు జరిపారు.


సంగీత ప్రియుల ‘బోట్‌’

రోజుల్లో ప్రయాణాల్లోనూ ఏకాంతంలోనూ తోడుగా ఉండేది హెడ్‌ఫోన్స్‌ మాత్రమే. తరచూ ప్రయాణాలు చేసే యువతలో ఈ ట్రెండ్‌ ఇంకాస్త ఎక్కువ. దీన్ని గమనించిన అమన్‌ గుప్తా, సమీర్‌ మెహతా ‘బోట్‌’ పేరుతో హెడ్‌ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. దిల్లీ, ముంబయిల నుంచి ఈ సంస్థ పనిచేస్తోంది. ‘మాకున్న పరిమిత ఆర్థిక వనరులతో వంద రకాల ఉత్పత్తులమీద కాకుండా ముందు ఒక దానిమీదే దృష్టి పెట్టాలనుకుని హెడ్‌ఫోన్స్‌ని ఎంచుకున్నాం’ అంటారు అమన్‌. 2016లో మొదటి ఉత్పత్తిని తెచ్చారు. సాధారణంగా హెడ్‌ఫోన్లకు ఉండే వైర్లు త్వరగా తెగిపోతాయి. తమ ఉత్పత్తికి ఆ ఫిర్యాదు రాకూడదనుకున్నారు. దాంతోపాటు పొడవైన వైరు, వైర్‌లెస్‌ హెడ్‌సెట్‌, చిక్కులు పడని వైరు... వీటిమీద దృష్టిపెట్టారు. భారతీయ సంగీతంలో బేస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. దానిమీద కూడా దృష్టిపెట్టారు. ఆపైన తక్కువ ధరలో, ఫ్యాషనబుల్‌గా ఉండేట్టు చూసుకున్నారు. బోట్‌ పరికరాల డిజైనింగ్‌ అంతా ఇండియాలోనే. తయారీ మాత్రం చైనాలో. కొత్త డిజైన్‌ను తెచ్చేటపుడు ముందు పరిమితంగా విడుదలచేసి ఫీడ్‌బ్యాక్‌తో రెండో విడతలో మెరుగు పర్చుకుంటారు. కంపెనీలో ఉద్యోగులంతా దాదాపు 20-22 ఏళ్ల మధ్యవాళ్లే. ‘వినియోగదారులకు దగ్గరగా ఉద్యోగుల వయసు ఉన్నపుడే వారి అంచనాల్ని అందుకోగల’మంటారు సమీర్‌. త్వరలో భారత్‌లోనే తయారీని ప్రారంభించాలని చూస్తున్నారు.


గడ్డం దాసులకు...

డ్డం ఏళ్లనాటి ఫ్యాషన్‌. కానీ గడ్డానికి సంబంధించి మనదేశంలో ప్రత్యేకించి ఉత్పత్తులు లేకపోవడం అశుతోష్‌ వాలానీ, ప్రియాంక్‌ షాలను ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కాలేజీ రోజుల నుంచీ స్నేహితులు. చదువు పూర్తయ్యాక ఈ- కామర్స్‌ సంస్థల్లో(అశుతోష్‌-ఆజ్‌కీఐటెమ్‌, ప్రియాంక్‌- ఫ్లిప్‌కార్ట్‌) పనిచేశారు. చాలా వరకూ గడ్డానికి సంబంధించి ఉపయోగించే ఉత్పత్తుల్ని మనవాళ్లు చైనా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని గమనించారు. అప్పుడే ‘మనం వాటిని ఇక్కడ ఎందుకు తయారుచేయకూడదూ’ అనుకున్నారు. అలా ఇద్దరూ కలిసి అహ్మదాబాద్‌ కేంద్రంగా ‘బియార్డో’ సంస్థని 2015లో ప్రారంభించారు. మొదట గడ్డానికే ప్రత్యేకమైన నూనె, షాంపూలను తెచ్చారు. అవి క్లిక్‌ అయ్యాయి. వీరి తల్లిదండ్రులు కూడా వ్యాపారులే. వ్యాపారానికి అవసరమైన సలహాలూ, సూచనలూ చేసేవారు. వారి ప్రోత్సాహంతో మొదటి ఏడాదిలోనే కంపెనీని లాభాలబాట పట్టించారీ మిత్రులు. అనతి కాలంలోనే రూ.100 కోట్ల కంపెనీగా ఎదిగింది బియార్డో. మారికో సంస్థ ఈ కంపెనీలో దాదాపు రూ.50 కోట్లు పెట్టి సగం వాటాను కొంది. ఇప్పుడు గడ్డంతోపాటు హెయిర్‌ ఆయిల్‌, చెక్క దువ్వెనలూ, హెయిర్‌ కలర్‌, హెయిర్‌ సీరమ్‌, జెల్స్‌... ఇలా ఇతర ఉత్పత్తుల్నీ అందిస్తోందీ సంస్థ. వీటన్నింటినీ దేశీయంగా సేంద్రియ పదార్థాలతో తయారుచేయిస్తున్నారు. త్వరలో విదేశీ మార్కెట్‌లకూ విస్తరించాలని చూస్తున్నారు.

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.