close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్నాథుడికి రథ నీరాజనం..!

జగాలనేలే జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో కలసి అమ్మదగ్గరకు పయనమయ్యే యాత్ర...  అలిగిన అమ్మవారిని ఊరడించే యాత్ర... భక్తకోటికి స్వామివారే స్వయంగా ఎదురెళ్లే యాత్ర...  ఇలా ఒకటారెండా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు పూరీ జగన్నాథుడి రథయాత్ర (జులై 4). జయజయధ్వానాలు మిన్నంటుతున్న వేళ మైమరపించే మంగళవాద్యాల నడుమ అత్యంత రమణీయంగా ముందుకు సాగుతాయి ఆ జగన్నాథుడి రథచక్రాలు.

నసంద్రంగా మారిన పూరీ నగరవీధుల్లో జగన్నాథుడు రథంమీద ఊరేగుతున్న మనోహర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవనడంలో సందేహం లేదు. నిజానికి ఆషాఢ శుద్ధ విదియనాడు జరిగే ఈ యాత్రకు సంబంధించిన సంబరాలు రెండు నెలల ముందే-అంటే వైశాఖ బహుళ విదియనాడే ప్రారంభమవుతాయి. రథాల తయారీకి కావల్సిన కలపను సేకరించడం, శాస్త్రోక్తంగా వాటిని పూరీకి తరలించడం, నగిషీలతో రథాలను తయారుచేయడం... ఇదంతా ఒక పండగలా జరుగుతుంది. రథయాత్రకు పక్షం రోజుల ముందు జ్యేష్ఠ పూర్ణిమ రోజున చతుర్ధామూర్తులను (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. దీన్నే దేవస్నాన యాత్రగా పేర్కొంటారు. దీంతో పురుషోత్తముడు జ్వరానికి గురై, అదే రోజు రాత్రి చీకటి మందిరానికి చేరతాడు. ఇక్కడ 14 రోజుల గోప్య సేవలు, చికిత్సల నేపథ్యంలో భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్ధామూర్తులకు దైతాపతులనే సేవాయత్‌లు సేవలు చేస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధద్రవ్యాలు మిళితం చేసిన కుండలను ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలను వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని ఫుల్లెరి తెల్లొ అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటాడు. ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ఆసనాన్ని తిరిగి అధిరోహించి భక్తులను విప్పారిన కళ్లతో వీక్షిస్తాడని నమ్మకం. అందుకే దీన్ని నేత్రోత్సవం అని అంటారు.

రథం కదిలె
ఆషాఢ శుద్ధ విదియనాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. గుండిచా మందిరానికి బయలుదేరే ముందు ముగ్గురు మూర్తులకు ఆలయ పొహండి (లోపలి నుంచి వెలుపలకు తేవడం) వేడుక జరుగుతుంది. తర్వాత రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలమీద బంగారు చీపురుతో ఊడ్చి, కస్తూరి కల్లాపి చల్లి, అర్చన చేస్తాడు. ఈ ప్రక్రియను చెరాపహర అంటారు. అనంతరం వరుసక్రమంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథుని రథాలు శ్రీక్షేత్ర ఆవరణ నుంచి గుండిచా మందిరానికి చేరతాయి. పెంచిన తల్లి సన్నిధిలో పురుషోత్తముడు తొమ్మిది రోజులు విడిది చేస్తాడు. ఈ సమయంలో గుండిచా మందిరంలో విభిన్న వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో హీరాపంచమి ముఖ్యమైంది. ఇది ఆలుమగల విరహవేదనకూ, ప్రేమానురాగాలకూ ప్రతీకగా నిలుస్తుంది. రథయాత్రలో తననూ తీసుకెళ్లాలని జగన్నాథుడిని మహాలక్ష్మి కోరుతుంది. అన్నాచెల్లెళ్ల యాత్రకు భార్యను వెంటతీసుకెళ్లడం సాధ్యంకాదని భావించిన పురుషోత్తముడు ఆషాఢ శుద్ధ పంచమి ఉదయానికి శ్రీక్షేత్రం చేరుకుంటానని మాటిస్తాడు. పంచమినాడు స్వామి తిరిగిరాకపోవడంతో మహాలక్ష్మి ఆగ్రహిస్తుంది. ఆ రాత్రి గుండిచా మందిరానికి చేరుకుని, స్వామిని తనవెంట రమ్మంటుంది. దశమి వరకూ రావడం సాధ్యంకాదన్న జగన్నాథుడితో జగడమాడి, కోపంతో రథచక్రాన్ని ధ్వంసం చేస్తుంది. అమ్మవారి పేరుమీదుగా ఈ క్రతువునంతా అర్చకులే నిర్వహిస్తారు. పదోరోజు స్వామి తిరిగి శ్రీక్షేత్రానికి చేరతాడు. దీన్నే బహుడా యాత్రగా చెబుతారు. ఇక రథయాత్రలోని అంతిమ ఘట్టాన్ని నీలాద్రి బిజె అని అంటారు.

రథాలమీద ఉన్న ముగ్గురు మూర్తులను ఆలయంలోనికి తీసుకెళ్లే వేడుక ఇది. దీనికి ముందు అలిగిన లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్నాథుడు అమ్మవారికి రసగుల్లాలు తినిపిస్తాడని అంటారు.

రథ నిర్మాణమిలా...
థయాత్ర కోసం తయారుచేసే రథాల నిర్మాణాన్ని కూడా ఒక యజ్ఞంగా నిర్వహిస్తారిక్కడ. రథాల తయారీకి అవసరమైన వృక్షాలను ఎంపిక చేసి, వాటిని 1072 కాండాలుగా నరికి పూరీకి తరలిస్తారు. వీటిని తిరిగి 2188 ముక్కలుగా ఖండిస్తారు. వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం, 703 భాగాలతో బలభద్రుడు, 593 భాగాలతో దేవీ సుభద్ర రథాలను తయారుచేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష్‌ అంటారు. ఎర్రటి చారలతో ఉన్న పసుపురంగు వస్త్రంతో దీన్ని ముస్తాబు చేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అంటారు. నీలిరంగు వస్త్రంతో దీన్ని అలంకరిస్తారు. దేవీ సుభద్ర రథాన్ని దర్పదళన్‌ అంటారు. నలుపు వస్త్రంతో ఈ రథం కనువిందు చేస్తుంది.

- అయినాల నాగభూషణం, న్యూస్‌టుడే, గోపాలపూర్‌(ఒడిశా)

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.