close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్యాచ్‌ 22

- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

లిగిన కొత్త అల్లుడిలా సూర్యుడు మండిపోతూ ఉంటే, నలిగిన మామగారిలా జనం సర్దుకుపోతున్నారు. దామోదరం బండి పార్క్‌ చేసి, హెల్మెట్‌ లాక్‌ చేసి, కర్చీఫ్‌తో ఓసారి ముఖం తుడుచుకుని ఆఫీసు మెట్లెక్కసాగాడు.
అతని ఆఫీసు సిటీలో ఉన్న ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ సెకండ్‌ ఫ్లోర్‌లో ఉంది. కరెంటు పోవటంతో మెట్లెక్కుతూ ఉండగా ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న జి.ఆర్‌.ఈ. కోచింగ్‌ సెంటర్‌లో ఇంగ్లిషు క్లాస్‌ జరుగుతున్నట్లుంది. ‘డియర్‌ స్టూడెంట్స్‌... క్యాచ్‌ 22 అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఎటువైపు వెళ్ళినా ఇబ్బందిపడే రెండు పరస్పర విరుద్ధ పరిస్థితుల మధ్య ఇరుక్కునే సందర్భం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టన్నమాట. అరవైల్లో జోసెఫ్‌ హెల్లెర్‌ ఈ పేరుతో రాసిన నవల ఈ పదం వాడుకలోకి రావటానికి మూలం అని చెప్పుకోవచ్చు’ ...ఇలా సాగుతోందా పాఠం.
ఇదంతా విన్న దామోదరం నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. అతనికి ఆ క్షణం తెలియదు... అదంత నవ్వుకోవలసిన విషయం కాదనీ ఆ పరిస్థితికి అతనేమీ అతీతుడు కాడనీ.
ఆ విషయం మర్చిపోయి సీరియస్‌గా పనిలో ఉండగా అమ్మ దగ్గర నుండి ఫోను. ‘‘ఆఁ చెప్పమ్మా’’ అన్నాడు దామోదరం ఉత్సాహంగా. ‘‘నాన్నా దామూ, మన ఆవు ఈనిందిరా. నేను రేప్పొద్దున జున్ను తీసుకుని బయలుదేరి వస్తున్నా. పెరుగులోకి ఆవకాయా పప్పులోకి మామిడికాయలూ తెస్తున్నా. ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రంలోగా చెప్పు. మన రమణమ్మ కొడుకు కారులో వస్తున్నాడు. నేనూ వాడితో వస్తున్నాను. వాడు మనింటి దగ్గర దింపేస్తానన్నాడు. అంచేత నువ్వేమీ స్టేషన్‌కి రానవసరం లేదు’’ అని అమ్మ చెప్పగానే, ‘‘అలాగే అమ్మా. జున్ను తెస్తున్నావు కదా, చాలు. నువ్వు జాగ్రత్తగా రా’’ అన్నాడు దామోదరం ఫోన్‌ పెట్టేస్తూ సంతోషంగా.
దామోదరం తండ్రి ఈమధ్యే ఎనభై దాటాక పోయాడు. డెబ్భై ఏళ్ళ అతని తల్లి అన్నపూర్ణ తనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్‌తో, ఇంట్లో ఉన్న రెండు ఆవులూ, తండ్రి ఇచ్చిన రెండెకరాల పొలం మీద కౌలుతో ఊళ్ళోనే కాలక్షేపం చేస్తోంది. కొడుకు ఎంత రమ్మని బతిమిలాడినా, పాడీ పంటా వదిలేసి రాలేనని చెప్పేసింది. కాలూ చెయ్యీ ఆడినంతకాలం వాళ్ళకి భారం కాకూడదన్నది ఆమె ఆలోచన. కొడుకూ కోడలూ మనవలూ మాత్రం ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం వచ్చి వెళ్తారు. ఇదిగో ఆర్నెల్ల తర్వాత కొడుకు దగ్గరకి బయలుదేరుతోంది... అదీ దామోదరం సంతోషానికి కారణం. వెంటనే భార్యకి ఫోన్‌ చేసి చెప్పాడీ విషయం. కొడుకు పరీక్షే రాయనప్పుడు పక్కింటి కుర్రాడు ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయిన విషయం విన్నట్టు ‘ఆహాఁ’ అంది శరణ్య. అన్నపూర్ణ, శరణ్య విడిగా ఇద్దరూ మంచివాళ్ళే. కానీ తరతరాలుగా అత్తాకోడళ్ళ మధ్య ఉండే చిన్న గ్యాప్‌ వాళ్ళమధ్యా ఉంది. అన్నపూర్ణ మనసు చెరుకైనా, మాట కాస్త కరుకు. శరణ్య కూడా అత్తగారి ఎదురుగా ఏమీ మాట్లాడదు. ఎన్నో వ్యాజ్యాలకి రాజ్యాలు కారణమైనట్టు వీళ్ళిద్దరి మధ్య వైరానికి కూడా ఓ చిన్న ఇల్లు కారణమైంది. ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు తీసేసి అక్కడో మంచి ఇల్లు కట్టించమని శరణ్య కోరిక. దానికి ఆమె వాదన ఏంటంటే ‘ఏమండీ, మనం కనీసం నెలకోసారైనా మీ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ సరైన సదుపాయాలు లేక నేనూ పిల్లలూ ఇబ్బందిపడుతున్నాం. ఈ వయసులో అటాచ్డ్‌ బాత్‌రూమ్‌, ఏసీ లాంటివి ఆవిడకి కూడా అవసరమే కదా. ఆ పాత ఇల్లు పడగొట్టి ఓ చిన్న శ్లాబ్‌ ఇల్లు అన్ని సదుపాయాలతో కట్టిద్దామండీ. మనిద్దరి శాలరీలతో లోన్‌ తీర్చటం అంత కష్టం కాదు. మళ్ళీ పిల్లలు పెద్ద చదువులకి ఎదిగితే ఖర్చులు పెరుగుతాయి’ అని.
ఆ ఆలోచన బాగానే ఉండటంతో అదే విషయం దామోదరం తన తల్లికి చెప్పాడు. దానికి ఆవిడ ససేమిరా అని, ‘ఒరేయ్‌ దామూ, ఈ ఇల్లు నీకూ నీ పెళ్ళానికీ పాత కొంపే కావొచ్చు. నాకు మాత్రం మీ నాన్న జ్ఞాపకం. నా పుస్తెలతాడు అమ్మి, నేనూ మీ నాన్నా ఇటుకలు మోసి, బెందడి తొక్కి కట్టుకున్న ఇల్లు. కనీసం నేను వెళ్ళిపోయేవరకైనా దీన్ని ఇలా ఉండనీ.
ఆ తర్వాత నీ ఇష్టం. నాకేం మేడలూ ఏసీలూ అక్కర్లేదు’ అందావిడ.
ఇది కూడా సబబుగానే అనిపించి భార్యని కన్విన్స్‌ చేయడానికి ట్రై చేశాడు. శరణ్య అంతెత్తున లేచింది.
‘మనమేం ఆవిణ్ణి ఆ ఇల్లు మన పేర రాసిచ్చేయమన్నామా లేక ఖాళీ చెయ్యమన్నామా? ఆవిడ గురించేగా నేను కూడా ఆలోచించేది. మనమిక్కడ కంఫర్టబుల్‌గా ఉంటున్నాం కదా... పోనీ, పెద్దావిడ కూడా హాయిగా ఉంటుందన్న ఆలోచనతో చెప్పాను. దాన్ని కూడా తప్పుపడితే ఎలా? ఏం, ఆవిడ కోడలుగా వచ్చినప్పుడు ఆ ఇల్లు పూరిపాక కాదా? ఆవిడ అత్తగారు ఉండగానే ఆ పాకను కూల్చి పెంకుటిల్లు కట్టలేదా. కాలంతోబాటు మార్పు సహజం. దానికెందుకావిడ అంత రాద్ధాంతం చేయడం’ అంది శరణ్య విసురుగా.
ఆ తర్వాత ఇద్దరూ ఆ విషయం లేవనెత్తకపోయినా, వాళ్ళమధ్య ఓ సన్నని తెర మాత్రం లేచింది.

* * * * *

ఇక ప్రస్తుతంలోకి వస్తే... అన్నపూర్ణ చేరుకోగానే - దామోదరం కిందకెళ్ళి అమ్మ చేతిలో సామాన్లు అందుకుని లిఫ్ట్‌లో తీసుకొచ్చాడు. ఇంట్లోకి రాగానే శరణ్య ఆవిణ్ణి చూసి ఎయిర్‌హోస్టెస్‌లా నవ్వి, గ్లాసుతో నీళ్ళందించింది. అన్నపూర్ణ కూడా చక్రవర్తి సామంతరాజుని పలకరించినట్టు శరణ్యని పలకరించింది.
దామోదరం గబగబా సంచి విప్పి, జున్ను క్యారేజీ బయటకి తీసి రెండు స్పూన్లు నోట్లో వేసుకుని, ‘‘ఆహా, అద్భుతం అమ్మా... మిరియాలూ బెల్లం వేసి నువ్వు చేసే జున్ను రుచి మరో జన్మకి కూడా మర్చిపోలేమమ్మా’’ అంటూ, ‘‘శరణ్యా, నువ్వు కూడా తిను’’ అన్నాడు క్యారేజ్‌ ఆమెవైపు తోస్తూ.
దానికి శరణ్య ‘‘నాకొద్దు, నేను జున్ను తినను’’ అంటూ లేచి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
దాంతో అప్పటివరకూ కొడుకు పొగడ్తకి పొంగిపోయిన అన్నపూర్ణ ఒక్కసారిగా చిన్నబుచ్చుకుంది. కోడలు అటు వెళ్ళగానే కొడుకుతో ‘‘చూశావుట్రా, దానికెంత పొగరో. పెద్దదాన్ని, పొయ్యి దగ్గర అంతసేపు నిలుచుని వండాను, పోనీ ఓ ముక్క నోట్లో వేసుకుని బావుందంటే దాని సొమ్మేమైనా పోతుందా?’’ అంది నిష్ఠూరంగా.
దానికి దామోదరం ‘‘అలా ఏం లేదమ్మా. తను జున్ను తినదు. ముర్రిపాలు లేగదూడకి ఉంచకుండా మనం వండేసుకుని తినకూడదని తనకి ఏవో సెంటిమెంట్లు... అంతే! నువ్వు అవేమీ పట్టించుకోకమ్మా’’ అంటూ మళ్ళీ తినడం మొదలుపెట్టాడు.
దానికి ఆవిడ ‘‘దాని మొహం... అన్ని పాలూ దూడకి వదిలేస్తే, పారుకుని ఛస్తుంది. చిన్నప్పటి నుంచి పాడిలో పుట్టి పెరిగాను... నాకా మాత్రం తెలీదా’’ అంటూ విసవిసా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది.
అలా టీకప్పులో తుపానులాంటి చిన్నచిన్న విషయాలతో ఓ వారం గడిచింది. ఓరోజు ‘‘అమ్మా, గుడికెళదాం... తయారవ్వు’’ అన్నాడు దామోదరం తల్లితో ఉత్సాహంగా.
‘‘నేను రాలేన్రా, మీరెళ్ళి రండి’’ అంది అన్నపూర్ణ టీవీ చూస్తూ.
‘‘అదేంటమ్మా, గుడికేగా రమ్మంటున్నది... రానంటావేం?’’ అన్నాడు కొంచెం విసుగ్గా ఆమె చేతిలోని రిమోట్‌ లాక్కుంటూ.
‘‘ఎందుకురా గుడికి? దేవుడి మీద పాలు పొయ్యకూడదట, పూలు కొయ్యకూడదట - ఇంకెందుకురా గుడికి. నేనెప్పుడూ వినలేదు ఇలాంటి భక్తి గురించి’’ అందామె నిష్ఠూరంగా.
‘‘అమ్మా, తను నేచర్‌ లవర్‌.
పసిపిల్లలు తాగే పాలు అనవసరంగా వేస్ట్‌ చేయకూడదనీ పూలు చెట్ల నుండి తెంపకూడదనీ తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అదేం పెద్ద తప్పుకాదు కదా. గుడికెళ్ళి దేవుడికి దణ్ణం పెట్టుకుని వద్దాం సరిపోతుంది’’ అన్నాడతను తల్లికి నచ్చచెబుతూ.
‘‘ఆ స్వామి మనకిచ్చినదాంట్లోంచి కొంచెం ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తే తప్పేంట్రా. అయినా బాగానే వెనకేసుకొస్తున్నావ్‌ పెళ్ళాన్ని. అందుకే మీరెళ్ళి రండి’’ అంటూ టీవీ రిమోట్‌ అతని చేతుల్లోంచి తిరిగి లాక్కుంది అన్నపూర్ణ.
ఇంకో శనివారం... ‘‘శరణ్యా, అమ్మ రెడీ అయిపోయింది. నువ్వు కూడా త్వరగా తయారవ్వు, సినిమాకెళదాం’’ అన్నాడు దామోదరం ఉత్సాహంగా.
‘‘మీ ఇద్దరూ వెళ్ళిరండి, నాకు తలనొప్పిగా ఉంది’’ అంది శరణ్య మంచం మీద పడుకునే అటు తిరిగి.
‘‘అదేంటి శరణ్యా, నీకు మొన్నే చెప్పానుగా... ఇప్పుడు నువ్వు రానంటే అమ్మ ఫీల్‌ అవుతుంది’’ అన్నాడతను బుజ్జగిస్తూ.

‘‘వస్తే నేను ఫీల్‌ అవ్వాలి. పోయినసారి ఇలాగే సినిమాకెళ్తే ఏం జరిగిందో గుర్తులేదా? అయినా సినిమాకి ఎందుకు వెళ్తామండీ... ఎప్పుడో నెలకోసారి అదో ఎంటర్‌టైన్‌మెంట్‌. అందులో కూడా డబ్బులకి లెక్కలు చూసుకుంటామా. పిల్లలూ ఆవిడా కూడా సరదాపడతారని హాల్లో అందరూ కొన్నట్టే నేనూ టైమ్‌పాస్‌కి పాప్‌కార్నూ, కూల్‌డ్రింకూ కొంటే, ఆవిడ దానికి ఇంటికొచ్చి పేలాలకీ కోలాలకీ వేలకి వేలు తగలేస్తున్నానని మీకు చాడీలు చెప్పడం నేను వినలేదనుకున్నారా. ఆవిడ కాలంలోలా సినిమాకి సొజ్జి పులిహోర స్టీల్‌ క్యారేజీలో పట్టుకుని వెళ్ళాలా. అందుకే నేను రాను, మీరు వెళ్ళండి’’ అంది విసురుగా శరణ్య పడుకున్నదల్లా లేచి కూర్చుని.
‘‘శరణ్యా, ఏంటి నువ్వు కూడా. అమ్మ పాతకాలం మనిషి. ఏదో చాదస్తం. నువ్వు అవేమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా. ప్లీజ్‌ లేచి తయారవ్వు. అమ్మ వింటే బాగోదు’’ అని దామోదరం ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతను సినిమా ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేసుకోవలసి వచ్చింది.
మరోరోజు అన్నపూర్ణ హాల్లో ఉండటంతో శరణ్య చాకూ బెండకాయలు తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది. వెళ్తూవెళ్తూ దామోదరంకేసి ఓరగా చూసింది. ఆమె వెళ్ళిన రెండు నిమిషాలకి దామోదరం కూడా నెమ్మదిగా బెడ్‌రూమ్‌లోకి దూరాడు. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకుని బాగోదని లేచి ఇంటిపక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళింది కాసేపు సూర్య భగవానుడికి దణ్ణం పెట్టుకుందామని. ఓ అరగంట గడిచాక అప్పుడే పార్కులోకి వచ్చిన మరో పెద్దావిడ అన్నపూర్ణని పలకరించి, హిందీలో నవ్వుతూ ఏదో చెప్పింది. ఆమె మాటలు అర్థంకాక నవ్వుతూ తలాడించి, ఆమె వాకింగ్‌ మొదలెట్టగానే, అక్కడే ఉన్న పక్కింటావిణ్ణి అడిగింది- ఆమె అన్నదానికి అర్థం ఏమిటని. దానికి పక్కింటావిడ ‘‘ఆవిడ మీ ఇంటి వెనకాతల ఫ్లాట్‌లో ఉంటారట.
మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలట. మీ అల్లుడు చాలా మంచివాడట. పగలే కాబట్టి బెడ్‌రూమ్‌ కిటికీ తలుపు తెరిచి ఉందట.
మీ అల్లుడు మంచంమీద బుద్ధిగా కూర్చుని కూరలు చక్కగా తరుగుతున్నాడట...’’ ఆమె ఇంకా ఏదో ట్రాన్స్‌లేట్‌ చేసి చెబుతోంది. కానీ అన్నపూర్ణ అదేమీ వినే పరిస్థితిలో లేదు.
‘‘సరే ఉంటానండీ’’ అంటూ ఇంటికొచ్చేసింది.
వస్తూనే కోడలు బాత్‌రూమ్‌లో ఉందని నిర్ధారించుకుని కొడుకుని కడిగేసింది.
‘‘ఏరా, పెళ్ళాం కొంగట్టుకుని పడగ్గదిలోకెళ్తే... పోన్లే అన్యోన్యంగా ఉంటున్నారు అనుకున్నాను కానీ, ఇలా బెడ్‌రూమ్‌లో దూరి బెండకాయలు తరుగుతావనుకోలేదు. మగాళ్ళు ఇలాంటి పనులు చేయటం మన ఇంటా వంటా లేదు. నువ్వేమిట్రా ఇలా తయారయ్యావు. ఇంకా నయం, ఆవిడ నువ్వు నా అల్లుడనుకుంటోంది. కొడుకని తెలిస్తే నా పరువు పోయేది’’ అంటూ కొడుకుని ఉతికారేసింది ఉక్రోషంగా.
ఎక్కడ శరణ్య వింటుందోనని భయంగా బాత్‌రూమ్‌కేసి చూస్తూ ‘‘ఊరుకో అమ్మా, తను వింటే బాధపడుతుంది. ఇందులో తప్పేముంది. తను కూడా జాబ్‌ చేస్తోంది. పైగా పిల్లలతో బోల్డంత పని. సిటీలో ఇవన్నీ కామన్‌. నువ్వు ఎప్పుడో నాన్న టైమ్‌లో ఉన్నట్టు ఉండాలంటే ఎలా? అయినా ఇదేపని నీ అల్లుడు చేస్తే తప్పులేదు కానీ, కొడుకు చేస్తే నీకు నామోషీనా. ఇది అన్యాయం అమ్మా, దీన్ని ఇంకా పెద్దది చేయకు ప్లీజ్‌’’ అంటూ తలపట్టుకున్నాడు దామోదరం.
‘‘ఇన్నేళ్ళు నా దగ్గరున్నావు. ఏనాడైనా నీచేత ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టించానా.
నా కొడుకుని రాజాలా చూసుకున్నాను. ఇలా నీ పెళ్ళాం నీచేత ఇంటిపనులు చేయిస్తుంటే కాస్త బాధేసి అడిగానంతే. అయినా మీకూ మీకూ నప్పినప్పుడు మధ్యలో నాకేం నొప్పి, ఇవాళుండి రేప్పోయేదాన్ని’’ అంటూ ముక్కు చీదుతూ పూజ గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

* * * * *

ఇలా ఓ మూణ్నెల్లు గడిచేసరికి దామోదరానికి అర్థమైంది- వాళ్ళిద్దరినీ మేనేజ్‌ చేయడం తనవల్లకాదని. తల పట్టుకుని కూర్చున్న ఓ ఆదివారం అలసినప్పుడు దిండులా, ‘ఆసు’కీ ‘మూడు’కీ రెండులా వచ్చాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అన్నపూర్ణ చిన్నాన్న కొడుకు.
దామోదరంకంటే ఓ పదేళ్ళు పెద్దవాడైనా చాలా చురుగ్గా ఉంటాడు. అదే ఊర్లో ఉంటున్నాడు. వరసకి మామయ్యకంటే కూడా దామోదరానికి మంచి ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌. అన్నపూర్ణ వచ్చిందంటే చూడ్డానికి వచ్చాడు. ఓ గంట కూర్చున్నాక అతనికి విషయం చూచాయగా అర్థమైంది.
‘‘రారా అల్లుడూ, అలా వెళ్ళొద్దాం’’ అని దామోదరాన్ని తీసుకుని ఇంటిపక్కనే ఉన్న పార్కుకి వెళ్ళారిద్దరూ.
ఓ రెండుమూడు ప్రశ్నల అనంతరం దామోదరం మొత్తం విషయం చెప్పి భోరుమన్నాడు. ‘‘మామయ్యా, నాకేం చెయ్యాలో బోధపడటం లేదు. ఏదో గుడి, సినిమా లాంటి చిన్నచిన్న విషయాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవచ్చు. కానీ సర్దుకోరు. వీటన్నిటికీ మూలం ఊళ్ళో ఇల్లు కట్టడం. దానికి వాళ్ళిద్దరిమధ్యా సంధి లేదు, నా దగ్గర సొల్యూషన్‌ లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను మామయ్యా. నువ్వే ఏదైనా సలహా చెప్పి నన్ను ఒడ్డున పడేయాలి’’ అన్నాడు బాధగా.
వాళ్ళిద్దరూ పార్కులో బెంచీమీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఇద్దరు చిన్నపిల్లలు ఒకే బాల్‌ గురించి కొట్టుకుంటున్నారు. వాళ్ళ నాన్న దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తున్నాడు.
అంతా విన్న వెంకటేశ్వర్లు ‘‘ఒరే దామూ, వేర్వేరు వయసులూ వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చి, ఒకే వ్యక్తిమీద సమాన హక్కులు కలిగి ఉన్న అత్తాకోడళ్ళు సఖ్యతగా కలిసి ఉండాలని అనుకోవడం దురాశ అవుతుంది. ఇందులో ఎవర్నీ తప్పు పట్టవలసిన అవసరం లేదు. దేవుడు మగాడికి రెండు చెవులిచ్చింది- ఇద్దరు చెప్పిందీ వినడానికి మాత్రమే కాదు, తనని తాను బ్యాలెన్స్‌ చేసుకుంటూ నిలబడటానికి కూడా.
ఆడవాళ్ళు పసిపిల్లల్లాంటివాళ్ళు. నువ్వు వాళ్ళకి దొరికిన బంతివి. ఇదంతా వాళ్ళకి నీమీదున్న విపరీతమైన ప్రేమ కారణంగా వచ్చే చిన్నచిన్న ఇబ్బందులు మాత్రమే. నాకప్పుడు బహుశా పదేళ్ళుంటాయేమో.
మీ నానమ్మా మీ అమ్మా ఇలాగే వాదులాడుకుంటూ ఉంటే, మీ నాన్న నన్ను తీసుకుని బజారుకి వచ్చేసేవాడు. అక్కడ టీ తాగుతూ నాకో పకోడీ కొనిపెట్టి ‘నా పరిస్థితి- కరవమంటే కప్పకీ విడవమంటే పాముకీ కోపంలా ఉందిరా’ అనేవాడు. నాకర్థమయ్యేది కాదు. మీ తాత కూడా ఇలాగే మథనపడేవాడట. మీ నాన్న చెప్పేవాడు- అప్పట్లో ఇదే స్థితిని ‘అడకత్తెరలో పోకచెక్క’ అనేవారట. ఇప్పుడేమంటున్నారో మరి’’ అని అతను అనేలోగా దామోదరం అందుకున్నాడు ‘క్యాచ్‌22’ అని ఏదో గుర్తొచ్చినవాడిలాగా.

దానికి వెంకటేశ్వర్లు ‘‘ఏదైనాగానీ, నేనో సలహా చెబుతా విను. వర్షం పడుతోందని విసుక్కుంటూ కూర్చోకూడదు. గొడుగు వెతుక్కోవాలి. మీ అమ్మా మీ ఆవిడా ఎవరిమాట బాగా వింటారో వాళ్ళిద్దరికీ నీ సమస్య చెప్పు. ఏదో ఒకలాగా సర్దిచెప్పమని చెప్పు. ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నా చాలు. నీ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్టే’’ అంటూ ఉండగా దామోదరం ఉత్సాహంగా ‘‘ఆఁ అవును మామయ్యా, మా ఆవిడకి వాళ్ళ అక్క మాటంటే చాలా గురి. ఆవిడ ఏం చెప్పినా వింటుంది. ఇక, మా అమ్మకి మా పిన్ని అంటే చాలా ప్రేమ. మా పిన్ని చెబితే మా అమ్మ కాదనదు. ముందు మా వదినగారితో ట్రై చేస్తా. ఎనీవే థ్యాంక్స్‌ మామయ్యా. నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది’’ అని ఇద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుని వెళ్ళిపోయారు.
ఆ తర్వాత వెంకటేశ్వర్లు చెప్పినట్టుగానే దామోదరం ముందుగా అతని వదినగారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దానికి ఆవిడ ‘‘నేను చెప్పి చూస్తాను దామూ, కానీ ఈ విషయంలో నా మాట ఎంతవరకు వింటుందో చెప్పలేను, చూద్దాం’’ అంది. వదినగారు గట్టిగా భరోసా ఇవ్వకపోవడంతో దామోదరం తన పిన్నికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆవిడ మాత్రం అంతా విని, అమ్మకి తాను చెబుతాననీ తన మాట కచ్చితంగా వింటుందనీ హామీ ఇచ్చింది. దాంతో దామోదరం కొద్దిగా ఊపిరి తీసుకున్నాడు.
ఇది జరిగిన వారానికి ఆఫీసు నుంచి దామోదరం అలసిపోయి ఇంటికొచ్చేసరికి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని అతని తల్లి పూరీలు వత్తుతోంది. శరణ్య కిచెన్‌లో వాటిని వేయిస్తోంది. దామోదరాన్ని చూసి అన్నపూర్ణ ‘‘అమ్మాయ్‌, వీడొచ్చాడు. వేడివేడిగా పెట్టవే పాపం తింటాడు’’
అంది ప్రేమగా.
దామోదరం కాళ్ళూ చేతులూ కడుక్కుని బాల్కనీలో ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాడు.
శరణ్య ఓ పళ్ళెంలో నాలుగు బాగా పొంగిన పూరీలూ పక్కనే కప్పులో బంగాళదుంప-ఉల్లిపాయ కూర పెట్టి తీసుకొచ్చి ఇస్తూ కొంచెం లోవాయిస్‌లో ‘‘ఏమండీ, మా అక్క ఫోన్‌ చేసింది...
మా బావవాళ్ళ అన్నయ్య బిల్డర్‌ కదా, నెక్స్ట్‌ఇయర్‌ బీచ్‌రోడ్‌లో మంచి వెంచర్‌ వేస్తున్నారట. అక్కావాళ్ళు అందులో ఓ ఫ్లాట్‌ తీసుకుంటారట. మనల్నీ బుక్‌ చేసుకోమని చెప్పింది. తక్కువ రేటుకి ఇప్పిస్తానంది. అందుకని మనం మన ఊళ్ళో ఇల్లు కట్టేబదులు ఆ లోనేదో ఈ ఫ్లాట్‌కే పెట్టుకుంటే మంచిది కదా. అత్తయ్యగారు కూడా సంతోషిస్తారు. ఈ విషయం ఆవిడకి మీరే చెప్పండి, పాపం పెద్దావిడ. ఆవిడ మనసు కష్టపెట్టాం’’ అంది సంతోషంగా.
శరణ్య ఏదో పనిమీద కిందకి వెళ్ళగానే బాల్కనీలోకి అన్నపూర్ణ వచ్చింది. ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. ‘‘ఒరేయ్‌ దామూ, పొద్దున్నే మీ పిన్ని ఫోన్‌ చేసిందిరా. నాకంటే చిన్నదైనా అది చెబితేకానీ నాకర్థం కాలేదు చూడు. మీ ఆవిడ చెప్పింది కూడా రైటే. చిన్నపిల్లయినా నా గురించి ఆలోచించింది. నేనే తనని సరిగా అర్థంచేసుకోలేకపోయాను. ఈ వయసులో నేను ఇబ్బందిపడకూడదని తను ఆలోచిస్తే నేను మొండిగా మాట్లాడాను. ఈ మాఘమాసం మన పంతులుగారితో శంకుస్థాపన ముహూర్తం పెట్టిస్తాను. మీరు చెప్పినట్టే ఊళ్ళో మన పెంకుటిల్లు తీసేసి చిన్న డాబా ఇల్లు కట్టించు. నువ్వు లోన్‌ పనులూ అవీ చూసుకుని డబ్బు సమకూర్చుకో. కావాలంటే నా పెన్షన్‌ మీద కూడా లోన్‌ పెడదాం. నా బంగారం బ్యాంకులో పెట్టు’’ అంది అన్నపూర్ణ సంతోషంగా.
ఖైదీ కష్టపడి సొరంగం తవ్వితే అది జైలర్‌ రూమ్‌లో తేలినట్టు తన సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మొదటికొచ్చిందని తల పట్టుకున్నాడు దామోదరం.

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.