close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డాక్టర్లూ... మీకు జోహార్లు!

‘వైద్యో నారాయణోహరిః’ అంటారు. ప్రాణం పోసే శక్తి దేవుడికి ఉంటే దాన్ని నిలబెట్టే శక్తి వైద్యుడి సొంతం. అందుకే ఈ సృష్టిలో భగవంతుడి తరవాత అందరూ అంత ఆర్తితో చేతులు జోడించేది వైద్యుడికే. కానీ వైద్యమూ, వైద్యుడూ కూడా ఖరీదుకు కేరాఫ్‌గా మారిన కార్పొరేట్‌ యుగమిది. అయితే, ఈ రోజుల్లోనూ డబ్బు కోసం ఆశ పడకుండా పేదరోగులకు అండగా నిలిచే అమృతమూర్తులు అక్కడక్కడా కొందరున్నారు. తెల్లకోటు మాటున వెన్నలాంటి మనసున్న అలాంటి కొందరు వైద్యుల గురించి ‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా...

పేదల వైద్యానికి పద్మశ్రీ

బెంగళూరుకు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టీబెగూర్‌ గ్రామం. ఆదివారం అందే ఉచిత వైద్య సేవల కోసం శనివారం సాయంత్రం నుంచే ఎద్దులబండ్లూ, రిక్షాలూ, సైకిళ్లూ, ఆటోల్లో తండోపతండాలుగా ఆ గ్రామానికి చేరుకుంటుంటారు జనం. అవును, డాక్టర్‌ భోగరాజు రమణారావు ప్రతి ఆదివారం ఆ ఊళ్లో పేదలకు ఉచితంగా వైద్యం చేసి మందులివ్వడంతోపాటు కడుపునిండా అన్నంపెడతాడు. నలభై ఐదేళ్ల నుంచీ ఒక్క ఆదివారం కూడా విడవకుండా వైద్య సేవలు అందిస్తున్న పద్మశ్రీ రమణారావు సొంతూరు ఏలూరు దగ్గర నిడమర్రు. తండ్రి నిజాం పాలనలో ఇంజినీర్‌గా పనిచేశారు. తుంగభద్ర డ్యామ్‌ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఆయన టీబెగూర్‌లో స్థిరపడ్డారు. అలా రమణారావు బాల్యమంతా అక్కడే గడిచింది. ఆయన ఎంబీబీఎస్‌ పూర్తి చేశాక ‘నిన్ను చదివించింది నీకోసం కాదు. పది మందికీ నువ్వు ఉపయోగపడాలి. ఎందుకంటే డాక్టర్‌కి దేవుడికున్నంత శక్తి ఉంటుంది’ అని చెప్పారు తండ్రి. దాంతో ప్రతి ఆదివారం పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు రమణారావు. 1974లో తమ వ్యవసాయ భూమిలో ఓ క్లినిక్‌ని ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం పేదలకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ తరవాత పీజీ చదువుకుంటూ కూడా సేవలు కొనసాగించాడు. కార్డియాలజిస్టుగా బెంగళూరులోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న రమణారావు అమితాబ్‌ బచ్చన్‌తోపాటు పలువురు కన్నడ నటీనటులూ రాజకీయ ప్రముఖులకు వ్యక్తిగత వైద్యుడు. సెలబ్రిటీల డాక్టరైనా ఏనాడూ ఆ డాబూ దర్పం ప్రదర్శించడు. సామాన్యులతో కలిసి సామాన్యుడిగా పల్లెటూళ్లో పల్లె ప్రజలతోనే కలిసి జీవిస్తున్నాడు. ఆయనకి విశ్రాంతీ విరామం తెలియవు. కుటుంబవేడుకలైనా, బంధువుల ఇళ్లకో, సొంతూరు నిడమర్రుకో వెళ్లాల్సి వచ్చినా ఆదివారం కాకుండా మిగతా రోజుల్లోనే. 

బెంగళూరుతోపాటు ఆ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలోని 1500 మంది పేదలు రమణారావు సేవలకోసం వస్తుంటారు. తెల్లవారుజామున మూడున్నరకే వందలమంది క్లినిక్‌ ముందు బారులు తీరి ఉంటారు. ఉదయం ఎనిమిదిగంటల నుంచీ రమణారావు రోగుల్ని చూడటం మొదలుపెడతాడు. అక్కడ అన్ని రకాల పరీక్షలూ చేసే ల్యాబు సౌకర్యం కూడా ఉంది. రోగులకు మందులూ ఉచితమే. దూరం నుంచీ వచ్చేవారికి భోజన, వసతి సదుపాయమూ కల్పిస్తారు. రమణారావు తదనంతరం కూడా ఆ క్లినిక్‌ నడవాలని తన ఇద్దరు కొడుకుల్నీ మెడిసిన్‌ చదివించాడు. వాళ్లిద్దరితోపాటు మరో ముప్ఫై మంది వైద్యులూ ఆదివారం క్లినిక్‌లో సేవలందిస్తారు. అక్కడ ఒక్కరోజు వైద్య సేవలకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ క్లినిక్‌కి ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత వైద్యశాలగా పేరుంది. వారాంతంలో సేవ చేసే రమణారావు కేవలం వైద్యానికే పరిమితం కాలేదు. కర్ణాటక గ్రామీణ జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని అవసరాలన్నీ తీర్చాడు.  పల్లెల్లో 1000 మరుగుదొడ్లు నిర్మించాడు. నీటివసతి సరిగా లేని గ్రామాల్లో బోర్లు వేయించి నీళ్ల ట్యాంకులు కట్టించాడు. స్థానిక పల్లె ప్రజలకు కష్టమొస్తే కళ్లలో పెట్టుకుని చూసుకునే రమణారావు ఫొటో అక్కడ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది.

చిట్టిగుండెలకు అండగా

మిళనాడుకు చెందిన గోపీ చిన్నారుల హృద్రోగ నిపుణుడు. హైదరాబాద్‌, తమిళనాడు, బెంగళూరు వంటి చోట్ల పని చేశాడు. జీతం లక్షల్లోనే. కొన్నాళ్లు పోతే సొంత ఆసుపత్రి పెట్టుకోవచ్చు. కానీ గోపీ అలా ఆలోచించలేదు. హృద్రోగ సమస్యలతో పుట్టిన పేద చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయాలని మదురైలో ‘లిటిల్‌ మోపెట్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశాడు. అందుకు ఓ బలమైన కారణమే ఉంది.

2015లో రాయ్‌చూర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడు గోపీ కళ్ల ముందే ఆర్నెల్ల పసివాడు కన్నుమూశాడు. ఆ బాబు తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీలు. పుట్టుకతోనే బాబుకి గుండెజబ్బు.  దాన్ని గుర్తించకా, సకాలంలో చికిత్స అందించకా ఆర్నెల్లకే వాడికి నూరేళ్లూ నిండాయి. ఆ మరణం గోపీని ఎంతగానో కదిలించింది. దాంతో అక్కడ ఉద్యోగం మానేసి భార్య హేమతో కలిసి చిట్టి గుండెలకు గట్టి భరోసా ఇస్తున్నాడు. గుండె ఆపరేషనంటే లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకూ ఖర్చవుతుంది. అందుకే మదురైలోని దేవదాస్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించి అక్కడి రోగులకు తాను ఉచితంగా ఆపరేషన్లు చేస్తాననీ... అందుకు ప్రతిఫలంగా తనకి అవసరం ఉన్నప్పుడు ఆపరేషన్‌ థియేటర్‌ వాడుకోవడానికి ఇవ్వమనీ కోరాడు. గోపీ పేరున్న డాక్టర్‌ కావడంతో యాజమాన్యం వెంటనే ఒప్పేసుకుంది. ఆ తర్వాత ‘లిటిల్‌ మోపెట్‌ ఫౌండేషన్‌’ గురించి ప్రచారం చేశాడు. ఒక్క నెలలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పదిహేను మంది పేద చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స చేశాడు. తర్వాత పదిహేను లక్షల రూపాయలతో ఓ వాహనం కొని అందులో స్క్రీనింగ్‌ టెస్ట్‌ పరికరాలను అమర్చాడు. ఆ తర్వాత తమిళనాడులోని మారుమూల పల్లెలకు వెళ్లి అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు పరీక్షలు చేయడం మొదలుపెట్టాడు. తీవ్ర సమస్య ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడి మదురై తీసుకొచ్చి ఆపరేషన్‌ చేయడం ప్రారంభించాడు. నగరాల్లో వలస కూలీలుండే ప్రాంతాలూ, మురికి వాడలకు వెళ్లి అక్కడి చిన్నారుల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ గోపీ 250 సర్జరీలు చేశాడు. పాతికవేల మంది పిల్లలకు ప్రాథమిక పరీక్షలు చేశాడు. పిల్లలు ఆసుపత్రికి బయల్దేరినప్పట్నుంచీ మళ్లీ కోలుకుని ఇంటికి చేరే వరకూ గోపీదే బాధ్యత. అతను చేస్తున్న మంచి పనికి స్పందించి సాయం చేయడానికి ముందుకొచ్చిన వారిని రోగుల్ని దత్తత తీసుకోమంటాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ గోపీ బృందం తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తుంది. కష్టమంటే క్షణంలో స్పందించే గోపీకి ఎన్ని చిట్టి గుండెలో రుణపడి ఉంటాయి.

యాచకుల వైద్యుడు

పుణెకి చెందిన అభిజిత్‌ సోనావానే నిరుపేద. ఎన్నో కష్టాలు పడి అతని తల్లిదండ్రులు వైద్య విద్య చదివించారు. చదువయ్యాక ఇంటర్న్‌షిప్పుకి ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ జీతం వచ్చేది కాదు. దాంతో, తల్లిదండ్రులకు భారం కాకూడదనుకున్న అభిజిత్‌ చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం చేసేవాడు. అలా వచ్చిన డబ్బు సరిపోక పస్తులున్న రోజులెన్నో. కొన్నిసార్లు గుడిలో ప్రసాదం తిని ఆకలి తీర్చుకునేవాడు. ఆ గుడి దగ్గర భిక్షాటన చేసే వృద్ధ దంపతులు అభిజిత్‌ గురించి తెలుసుకున్నారు. అతడు ఆకలితో బాధపడటం చూసి చలించిపోయారు. తాము భిక్షాటన చేసిన డబ్బుతో అతనికి అన్నం పొట్లం కొనివ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు, పాకెట్‌మనీగానూ కొంత డబ్బు ఇచ్చేవారు. కన్నబిడ్డలు తరిమేస్తే రోడ్డున పడ్డ ఆ దంపతుల్ని అభిజిత్‌ అమ్మానాన్నలుగా భావించేవాడు. వారే ఇంటర్న్‌షిప్పు అయ్యేవరకూ అభిజిత్‌ని చూసుకున్నారు. కొన్నాళ్లకి ఇద్దరూ మరణించారు.

ఆ తరవాత అభిజిత్‌కు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పందొమ్మిది దేశాల్లో ఉచితంగా వైద్యసేవలు అందించే ‘ఇంటర్నేషనల్‌ మెడికల్‌ ఆర్గనైజేషన్‌’లో ఉద్యోగమొచ్చింది. ఎన్నోదేశాల్లో విధులు నిర్వహించాడు. అయినా ఏదో తెలియని అసంతృప్తి వెంటాడేది. కొన్నాళ్లకి తనకి సాయమందించిన వృద్ధ దంపతుల జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని ఉద్యోగం మానేశాడు. అలా నాలుగేళ్ల క్రితం ‘సోహం ట్రస్టు’ను స్థాపించి పుణె వీధుల్లో యాచకుల్ని వెతుక్కుంటూ వెళ్లి వైద్యం చేస్తున్నాడు. ఎవరైనా తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేస్తే అభిజిత్‌ ఊరుకోడు. వారిని బతిమాలో, కౌన్సెలింగ్‌ ఇచ్చో తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా చూస్తున్నాడు. ఆరోగ్యం బాగుండి యాచించే వారికి వృత్తి విద్యాకోర్సులు నేర్పించడం లేదా తన సొంత ఖర్చులతో చేతనైన దుకాణమేదో పెట్టించడం చేస్తున్నాడు. ఎంతోమందిని యాచన నుంచి బయటపడేసి చిరువ్యాపారులుగా మార్చాడు. వేలమందికి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేయించాడు. అభిజిత్‌ ఒంటిచేత్తో ఇన్ని సాయాలు చేస్తున్నాడంటే తన వెనక భార్య డాక్టర్‌ మనీషా సోనావానే పాత్ర ఎంతో ఉంది. ఆమె సొంతంగా ఓ క్లినిక్‌ నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంలో 30శాతం కుటుంబానికి కేటాయించి మిగతాదంతా భర్త సేవా కార్యక్రమాలకే ఇస్తుంది.

కలెక్టర్‌ అయ్యాడు డాక్టర్‌

క్బాల్‌ అహ్మద్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌. మంగళూరులోని కస్తూర్బా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివాడు. 2009లో వైద్యవిద్య పూర్తి చేసిన ఇక్బాల్‌ చిన్నతనం నుంచీ సామాన్యుల సమస్యలెన్నింటినో దగ్గరగా చూశాడు. కలెక్టర్‌ అయితే ఎన్నో సమస్యల్ని పరిష్కరించొచ్చు అని ఎవరో అనడంతో తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. సివిల్స్‌ కోసం సాధన మొదలుపెట్టాడు. రాత్రింబగళ్లూ పుస్తకాలు వదలకుండా చదివి తొలిప్రయత్నంలోనే 2010లో సివిల్స్‌ ర్యాంకు సాధించాడు. శిక్షణ అనంతరం ఉత్తరాఖండ్‌ క్యాడర్‌కు ఎంపికయ్యాడు. విధుల్లో చేరాక ఆ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత ఉన్నట్టు గుర్తించాడు. తన ఎంబీబీఎస్‌ చదువు వృథా కాకుండా వైద్యుల కొరత ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్బాల్‌కి మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి లేకపోవడంతో వైద్యం చేయడానికి కుదరలేదు. దాంతో ఉత్తరాఖండ్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మరో ప్రభుత్వ సంస్థలో పనిచేయడానికి నిబంధనలు ఒప్పుకోకపోవడంతో కౌన్సిల్‌ నిరాకరించింది. దాంతో ఎప్పటికప్పుడు వినతులు సమర్పిస్తూనే ఉండేవాడు. పేదలకోసమే పనిచేస్తానన్నా కౌన్సిల్‌ వినలేదు. అయినా ఇక్బాల్‌ పట్టువదల్లేదు.

ఒకటికాదు రెండు కాదు ఏడేళ్లపాటు అలుపెరగకుండా ప్రయత్నించాడు. చివరికి ఇక్బాల్‌ సేవాభావంతోనే అనుమతి అడుగుతున్నాడని కౌన్సిల్‌ నమ్మింది. 2017లో వైద్యుడిగా రిజిస్టర్‌ చేసుకుని ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయడానికి ఇక్బాల్‌కు అనుమతిచ్చింది. అప్పటికి చంపావత్‌ కలెక్టర్‌గా ఉన్న ఇక్బాల్‌ జిల్లా పెద్దాసుపత్రిలో వైద్యం చేయడం మొదలుపెట్టాడు. కలెక్టరేట్‌కి వెళ్లడానికి ముందు ఓ రెండు గంటలు వైద్య సేవలు అందిస్తాడు. సాయంత్రం ఇంటికెళ్లకుండా ఆసుపత్రికెళ్లి రోగుల్ని చూస్తాడు. రాత్రివేళల్లో వైద్యులు అందుబాటులో లేకపోతే ఇక్బాల్‌ నైట్‌డ్యూటీకి వెళతాడు. వారాంతాల్లో మారుమూల గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేద రోగులకు తన ఖర్చులతో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నాడు. ఏడాదిక్రితం పౌరీగర్వాల్‌ జిల్లాకు బదిలీ అయ్యాడు ఇక్బాల్‌. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, ఉన్నత విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రాంతం మారినా ఇక్బాల్‌ మనసు మారలేదు. ప్రవృత్తిని పక్కన పెట్టలేదు.

మానసిక రోగులకు భరోసా

కేరళకు చెందిన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ లండన్‌లో 15 ఏళ్లపాటు పనిచేశాడు. వృత్తిపరంగా సంతృప్తి ఉన్నా, స్వదేశంలో సేవలు అందించలేకపోవడం మనోజ్‌ని బాధించింది. దాంతో నెలకి లక్షల్లో జీతం వస్తున్నా ఉద్యోగాన్ని వదులుకుని 2008లో ఇండియాకి తిరిగొచ్చాడు.

మనోజ్‌ కుమార్‌ స్వస్థలం కోళికోడ్‌. అక్కడ పలువురు నిపుణుల్ని కలిశాడు, ప్రభుత్వ మానసిక రోగుల ఆసుపత్రులకు వెళ్లాడు. గ్రామాల్లో తీవ్రమైన మానసిక సమస్యలున్నవారిని ఇంట్లోవాళ్లే వదిలేస్తున్నారని తెలిసి బాధపడ్డాడు. ఏదైనా ఒక ప్రాంతంలో హాస్పిటల్‌ ప్రారంభిస్తే అలాంటివారందరికీ వైద్యసేవలు అందించడం కష్టమని గ్రహించిన మనోజ్‌ ‘మెంటల్‌ హెల్త్‌ యాక్షన్‌ ట్రస్ట్‌’(ఎమ్‌హెచ్‌ఏటీ) పేరుతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. దీన్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగులూ, గృహిణులూ, ఇతర వృత్తుల్లో ఉన్న వెయ్యి మందిని వలంటీర్లుగా ఎంపిక చేసుకున్నాడు. వారికి కౌన్సెలింగ్‌ చేయడంలో శిక్షణ ఇవ్వడంతోపాటు మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ఎమ్‌హెచ్‌ఏటీ క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. వలంటీర్లు క్షేత్రస్థాయిలో తమ కుటుంబాల్లో, లేదా తాముండే ప్రాంతంలో ఎవరికైనా మానసిక సమస్య లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే వారిని నెట్‌వర్క్‌లో తమ పైనుండే నిపుణుల దగ్గరకు పంపుతారు. వారు కూడా మానసిక సమస్య లక్షణాలున్నట్లు గుర్తిస్తే ఆ వ్యక్తిని వైద్య నిపుణులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడించి నిర్ధారించుకుంటారు. మనోజ్‌ కూడా రోగులతో వీడియో కాల్‌లో మాట్లాడతాడు. వారికి ఎలాంటి చికిత్స అవసరం అన్నది తానే నిర్ణయిస్తాడు. దాన్నిబట్టి స్థానిక వైద్యులు రోగుల ఇంటి వద్దకే వెళ్లి అందుకు సంబంధించిన థెరపీలూ, కౌన్సెలింగులూ, ఇతర చికిత్సలు అందిస్తుంటారు. అందుకయ్యే ఖర్చంతా మనోజ్‌దే. ఈ నెట్‌వర్క్‌ ద్వారా వలంటీర్లు రోజుకి రెండువేల మందిని పరీక్షిస్తారు.

ఇంటికి పెద్ద దిక్కు అయినవారు ఈ సమస్య నుంచి బయట పడితే వారికి ఆర్థికసాయం చేయడంతోపాటు ఆరునెలలకు సరిపడా నిత్యావసరాలూ, ఇంటి అద్దె అందిస్తున్నాడు మనోజ్‌. అలానే కుటుంబ నిరాదరణకు గురైన వారికోసం పాలియేటివ్‌కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించాడు. వందలమంది అక్కడ మానసిక సాంత్వన పొందుతున్నారు. ఇక బాగయ్యే అవకాశం లేనివారు తుది శ్వాసవరకూ ఆ కేంద్రంలోనే మనోజ్‌ పర్యవేక్షణలోనే ఉంటున్నారు. గ్రామాల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మానసిక సమస్యల్ని ఎలా గుర్తించాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు మనోజ్‌. ఎమ్‌హెచ్‌ఏటీ నెట్‌వర్క్‌ ద్వారా పలు మెంటల్‌హెల్త్‌ కోర్సుల్లో శిక్షణ కూడా ఇస్తున్న ఆయన ఆర్థిక సమస్యలెదురైనా వెనకడుగు మాత్రం వెయ్యడం లేదు.

కన్నవారికి అన్నం పెట్టడమే భారమనుకుంటున్న ఈరోజుల్లో... తల్లిదండ్రుల్ని ఇంటినుంచి తరిమేసే బిడ్డలున్న ఈ సమాజంలో... నేనూ నా భార్యా నా పిల్లలూ బాగుంటే చాలు అన్న స్వార్థ ప్రవృత్తి పెరుగుతున్న తరుణంలో... వ్యక్తిగత సుఖమూ సంపాదనా అన్న మాటే మరచి, వైద్య‘సేవ’లే ఊపిరిగా పేదల ప్రాణాలు నిలపడమే పరమావధిగా బతుకుతున్న ఈ వైద్యులు కనిపించని ఆ నారాయణుడి కంటే గొప్పవారంటే... కాదనగలరా!

-పద్మ వడ్డె

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.