close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆయుష్మాన్‌భవ!

పోషకాహారం తీసుకున్నా ఔషధాలు మింగినా అన్నీ నిండునూరేళ్లూ ఆరోగ్యంగా జీవించేందుకే. అయితే వాటితోబాటు ఇవి కూడా పాటిస్తే దీర్ఘకాలం జీవిస్తారని విభిన్న పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
* పేదవాళ్లతో పోలిస్తే ఎలాంటి దురలవాట్లూ లేకుండా సరిపడా సంపాదన ఉండేవాళ్లు మరో పదిహేనేళ్లు ఎక్కువకాలం జీవిస్తారట.
* నచ్చే పాటలు వినడం, పర్యటనలకు వెళ్లడం వంటివి మానసికోల్లాసాన్ని కలిగించడంతో శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు.
* నవ్వు ఒత్తిడినీ ఆందోళననీ తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు మెదడుకి రక్తసరఫరానీ తద్వారా ఆరోగ్యాన్నీ అందిస్తుంది.
* పర్వతాలమీదా కొండలమీదా- అంటే ఎత్తుల్లో జీవించేవాళ్లలో అక్కడి వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం తక్కువ ఉండటంతో రక్తప్రసరణ అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుని, మరింత సమర్థంగా పనిచేస్తుందనీ అందుకే వాళ్లలో హృద్రోగాలు తక్కువగా ఉన్నాయనీ దీర్ఘకాలం జీవిస్తున్నారనీ గుర్తించారు.
* అసలు చదవని వాళ్లకన్నా పత్రికలు, పుస్తకాలు చదివే వాళ్లలో ఆయుఃప్రమాణం ఎక్కువ.
* ఒంటరితనం రోగనిరోధకశక్తిని తగ్గించడం ద్వారా ఆయుష్షుని 50 శాతం తగ్గించేస్తుంది. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ పిల్లలతో గడిపితే జీవితంపట్ల ఆసక్తి పెరుగుతుంది.
* ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు మిగిలినవాళ్లకన్నా 14 సంవత్సరాలు ఎక్కువకాలం జీవిస్తారు.
* ఎన్ని మందులు మింగినా ఎందరు వైద్యుల్ని సంప్రదించినా దక్కని ఆరోగ్యం రోజూ ఓ అరగంట వేగంగా నడిస్తే దొరుకుతుంది.వాకింగ్‌ చేస్తున్నా ఇంట్లో ఉన్నా తోడుగా ఓ పెంపుడుకుక్క ఉంటే ఒత్తిడి, బీపీ వంటివి దూరంగా ఉంటాయి.
* లిఫ్ట్‌లూ ఎలివేటర్లకు బదులు రోజూ మెట్లు ఎక్కడంవల్ల వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలు తగ్గి, యౌవ్వనంతో ఉంచే మెదడు కణాల సంఖ్య పెరుగుతుంది.
* అందరిలో తప్పొప్పుల్ని ఎంచుతూ కూర్చోకుండా పెద్దమనసుతో క్షమించేస్తూ గతాన్ని మరిచి, భవిష్యత్తులోకి చూస్తూ, వర్తమానంలో ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తే ఆడుతూపాడుతూ అలవోకగా నూరు వసంతాలు పూర్తిచేసుకుంటారట.


బీపీ తగ్గించుకోవచ్చు... ఇలా!

రెస్‌వెరాట్రల్‌... ఈమధ్య ఈ పేరు వైద్యనిపుణులకే కాదు, సామాన్యులకీ సుపరిచితమైపోయింది. బ్లూబెర్రీలూ, ద్రాక్ష, పల్లీల్లో సహజంగా ఉండే ఈ పదార్థం గుండె ఆరోగ్యానికీ క్యాన్సర్ల నివారణకీ ఎంతో మంచిదని పరిశోధనల్లో తెలుస్తోంది. అయితే, ఇటీవల బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు రెస్‌వెరాట్రల్‌ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని ఎలుకలకి ఇచ్చి చూడగా బీపీ బాగా తగ్గినట్లు గుర్తించారు. దాంతో వాటిల్లో రెస్‌వెరాట్రల్‌ పనితీరుని సమీక్షించగా- అది ఓ ఆక్సిడెంట్‌గా పనిచేయడం ద్వారా రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి అవి వ్యాకోచించేలా చేస్తుందనీ దాంతో రక్తసరఫరా సరిగ్గా ఉంటుందనీ తేలిందట. దీన్నిబట్టి రెస్‌వెరాట్రల్‌ సమృద్ధిగా ఉండే ద్రాక్ష, బ్లూబెర్రీలు, పల్లీలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ తగ్గుతుందని చెబుతున్నారు.


నిద్రతో తీపికి చెక్‌!

మనిషికి నిద్ర ఎంతో అవసరం రోజుకి కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రపోవాలంటూ రకరకాల పరిశోధనలు వెల్లువెత్తుతున్నాయి. ఏడు గంటలకన్నా తక్కువగా నిద్రపోతే జీవక్రియ దెబ్బతిని హృద్రోగాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌కి చెందిన నిపుణులు సైతం పేర్కొంటున్నారు. అదే ఏడు గంటలకన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో ఆరోగ్యానికి హాని కలిగించే తీపి పదార్థాలూ ఉప్పూ తీసుకునే శాతం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు 150 మందిని ఎంపిక చేసి మరీ పరిశీలించారట. అందులో ఏడుగంటలకన్నా తక్కువ నిద్రపోయినవాళ్లలో క్రేవింగ్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఏడు గంటలకన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లు తీపిపదార్థాల కన్నా పండ్లూ కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతున్నట్లు తేలింది. కాబట్టి హాయిగా నిద్రపోతే ఆహారపులటవాట్లూ మారతాయన్నమాట.


టూకీగా...

పంటినొప్పి బాధ అంతా ఇంతా కాదు. అయితే అది అక్కడి వరకూ మాత్రమే పరిమితమైతే ఫరవాలేదు. కానీ తరచూ దంతాలు, చిగుళ్ల వ్యాధులతో బాధపడేవాళ్లలో  మతిమరపు వచ్చే అవకాశం  ఎక్కువని సియోల్‌ నేషనల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు అంటున్నారు.
* పోషకాలు తక్కువా క్యాలరీలు ఎక్కువా ఉండే తియ్యని శీతలపానీయాలు మధుమేహానికి దారితీస్తాయనీ కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదనీ హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటోకి చెందిన పరిశోధకులు.

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.