close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జోడీ నంబర్‌ వన్‌!

శిఖర్‌ ధావన్‌కు గాయమై ఆటకు దూరమవుతున్నాడనగానే,  ‘అరె... మంచి ఓపెనింగ్‌ జోడీని మిస్సవుతాం. ప్రపంచకప్‌ విజయంమీద దెబ్బపడుతుందేమో’ అని ఆందోళన చెందారు క్రికెట్‌ అభిమానులంతా. ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా గుర్తింపు పొందిన రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ తమ అనుబంధం గురించి ఏం చెబుతున్నారంటే...

మొదటిసారి కలిసింది...
రోహిత్‌: మా పరిచయమై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. మొదటిసారి బెంగళూరులో అండర్‌-19 ఎన్‌సీఏ క్యాంపులో కలిశాం. నాకపుడు 16 ఏళ్లు. తనకి 18 ఏళ్లు. అప్పటికి శిఖర్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడి వచ్చాడు. ఆ టోర్నీలో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు కూడా. దాంతో మేమంతా శిఖర్‌ని ఓ శిఖరంలా చూసేవాళ్లం.
ధావన్‌: అండర్‌-19కి ఆడి తిరిగి జాతీయ జట్టుకీ కలిసి ఆడుతున్నది మేమే అనుకుంటా. అండర్‌-19 ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాం. అప్పుడు మేం రూమ్మేట్స్‌ కూడా.

జోడీ కుదిరిందిలా...
రోహిత్‌:2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇద్దరం కలిసి మొదటిసారి టీమ్‌ ఇండియాకి ఓపెనింగ్‌ చేశాం. అంతకుముందు జరిగిన ప్రాక్టీసు మ్యాచుల్లోనూ మేం కలిసి దిగలేదు. నేను రెగ్యులర్‌ ఓపెనర్‌ అయిందీ ఆ టోర్నీనుంచే. ఆ ముందురోజు రాత్రి మహీ భాయ్‌ పిలిచి ‘రేపటి మ్యాచ్‌లో ఓపెనింగ్‌ చేస్తావా’ అని అడిగాడు. ‘ఓకే’ అన్నాను.
ధావన్‌: ఆరోజు టాస్‌కి ముందు వరకూ నాతోపాటు ఎవరు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నారో తెలీదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నపుడు ‘నా పార్ట్‌నర్‌గా ఎవరు దిగుతున్నారు’ అని అడిగాను. అప్పుడే రోహిత్‌ అని తెలిసింది. ఇద్దరం ప్యాడ్స్‌ కట్టి దిగాక స్ట్రైకింగ్‌ ఎవరు అని అడిగాడు... ‘నేనెప్పుడూ నాన్‌ స్ట్రైకర్‌నే’ అని చెప్పడంతో తను స్ట్రైకింగ్‌కి వెళ్లాడు. ఆ టోర్నీలో మన జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. అప్పట్నుంచీ మా జోడీ కొనసాగుతోంది.

మైదానంలో ఎలా...
ధావన్‌: క్రీజ్‌లో ఉన్నపుడు మా మధ్య సమన్వయం బావుంటుంది. పరుగు తీయాలా వద్దా అన్న విషయం ఎదుటివాళ్ల కళ్లలోకి చూస్తే తెలిసిపోతుంది. నేను ఫాస్ట్‌గా ఆడితే, తను కాస్త నెమ్మదిగా
ఆడతాడు. తను జోరుమీదుంటే నేనుతగ్గి ఆడతాను. ఇలాంటి చిన్న విషయాలే కలిసి ఓ పెద్ద ఇన్నింగ్స్‌కి పునాది పడేలా చేస్తాయి.
రోహిత్‌:  ఆట మధ్యలో తనకి భలే డౌట్లు వస్తాయి. బౌలర్‌ మారగానే ‘ఇతను ఔట్‌ స్వింగ్‌ వేస్తాడా, ఇన్‌ స్వింగా’ అని నన్ను అడుగుతాడు. డేల్‌ స్టెయిన్‌ లాంటి బౌలర్‌కి కూడా అడుగుతాడు. ఓవర్ల మధ్యలో క్రికెట్‌ విషయాలే మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు క్రికెట్‌తోపాటు ఇతర విషయాలూ చర్చించుకుంటాం. ఒకరి ఆటని మరొకరం ఆస్వాదిస్తాం. ఒకరి విజయాన్ని మరొకరం సెలబ్రేట్‌ చేసుకుంటాం.

మైదానం వెలుపల...
ధావన్‌: ఇద్దరం కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులం కూడా. దాంతో మా స్నేహం మైదానం వెలుపలా కొనసాగుతోంది. మా అబ్బాయి జొరావర్‌ వచ్చాక మా మధ్య అనుబంధం ఇంకా పెరిగింది. వాడు నాకంటే రోహిత్‌తోనే బాగా ఆడుకుంటాడు.
రోహిత్‌: ధావన్‌ను చూసే పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏంటన్నది తెలుసుకున్నాను. డైపర్లు మార్చడం, పిల్లల్ని ఆడించడం, బుజ్జగించడం... అన్నీ. రితికా, ఆయేషా కూడా మంచి ఫ్రెండ్స్‌! మేం ఒక కుటుంబంలోని సభ్యుల్లానే ఉంటాం. జొరావర్‌ మా పాప సమైరాతో బాగా ఆడుకుంటాడు. ముంబయిలో పెరిగినా నాకు హిందీ అంతగా రాదు. శిఖర్‌ మంచి హిందీ మాట్లాడతాడు. తన దగ్గర హిందీ నేర్చుకున్నా.

పార్ట్‌నర్‌లో ఏం నచ్చదంటే...
రోహిత్‌: సరిగ్గా ప్యాడ్‌కట్టి రెడీ అవ్వగానే, బాత్రూమ్‌కి వెళ్తాడు. నేను స్ట్రైకర్‌ని కదా ముందే వెళ్లి ఫీల్డింగ్‌ సెటప్‌ని చూసుకోవాలని ఉంటుంది.
ధావన్‌: నచ్చనిదంటూ ఏం లేదు కానీ రోహిత్‌కు కాస్త మతిమరుపు. ఓసారి ఫ్లైట్‌ సీటులో పాస్‌పోర్ట్‌ వదిలేశాడు. ఇంకోసారి బస్సులో ఐపాడ్‌ వదిలేశాడు. మధ్యమధ్యలో గుర్తుచేస్తుండాలి.

నచ్చే విషయాలు
రోహిత్‌:  మైదానంలో ఒక సైనికుడిలా పోరాడతాడు. ఛాలెంజ్‌ని బాగా స్వీకరిస్తాడు. అతడుంటే ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఆటని ఎంజాయ్‌ చేసే తీరు - విజయాన్ని ఆస్వాదించడంలో అతడికి అతడే సాటి.
ధావన్‌: కమిట్‌మెంట్‌ నచ్చుతుంది. తను ఇన్నింగ్స్‌ని నిర్మించే తీరు చూడండి. నెమ్మదిగా మొదలెట్టి చివరకు టాప్‌గేర్‌లోకి వెళ్తాడు

23  జూన్‌ 2019.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.