close
ఒక్క బడి... వంద ఇళ్లను కట్టించింది!

యూనిఫామ్‌లో బడికొచ్చే పిల్లల్ని చూస్తే అందరూ ఒకేలా కనిపిస్తారు. కానీ ఆ బడి దాటి వారి ఇంటివరకూ నాలుగడుగులు వేస్తేగానీ తెలియదు ఆ చిన్నారుల్లో ఎంతమందికి కడుపు నిండా తిండి దొరుకుతుందో... సరైన గూడు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారు ఎంతమందో... అని. అలా... తమ బడిలో చదివే పిల్లల ఇళ్లకు వెళ్లిన ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌కి వారిలో చాలామందికి అసలు ఇళ్లే లేవని తెలిసింది. అంతే, అయిదేళ్లలో విద్యార్థులకోసం ఆ బడి వంద ఇళ్లను కట్టించింది!

మయానికి తరగతి గదిలోకొచ్చి పాఠాలు చెప్పి వెళ్లిపోయే ఉపాధ్యాయులు ఒకరకం. తాము చెప్పిన పాఠాలు పిల్లలకు ఎంతవరకూ అర్థమయ్యాయో తెలుసుకుని వెనకబడిన విద్యార్థుల సందేహాలు తీర్చి వారిని ముందుకు నడిపించేవారు మరోరకం. అక్కడితో ఆగిపోకుండా పిల్లల్ని బిడ్డల్లా అభిమానిస్తూ చదువుతో పాటు వాళ్లు జీవితంలోనూ ముందడుగు వేసేలా అండగా నిలబడే వారు ఇంకోరకం. ఈ మూడోకోవకు చెందిన ఉపాధ్యాయురాలే సిస్టర్‌ ‘లిజి చక్కలక్కల్‌’. కేరళరాష్ట్రం, కొచ్చికి దగ్గర్లోని తొప్పుంపడిలో ఉన్న ‘అవర్‌ లేడీస్‌ కాన్వెంట్‌ గర్ల్స్‌ హైస్కూల్‌’ ప్రిన్సిపల్‌ ఆమె. తమ బడిలో చదివే విద్యార్థుల్ని ఎంతో ప్రేమగా చూసుకునే లిజి తీరిక దొరికినప్పుడల్లా వారి తల్లిదండ్రులనూ కలిసేవారు. అలా అయిదేళ్ల కిందట ఎనిమిదో తరగతి చదువుతున్న క్లారా భాను అనే విద్యార్థిని ఇంటికి వెళ్లారు. ఆ చిన్నారి తండ్రి మేస్త్రీ. ఎంతోమందికి ఇళ్లు కట్టాడు. ఎప్పటికైనా తన కుటుంబం కోసం కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలన్నది అతడి కల. కానీ అది నెరవేరకుండానే అనారోగ్యంతో చనిపోయాడు. భాను కుటుంబం మొత్తం చాలా చిన్న గదిలో అద్దెకు ఉంటోంది. తండ్రి లేకపోవడంతో కడుపునిండా తినడానికే కష్టమవుతున్న పరిస్థితి వాళ్లది. ఆ దుస్థితిని చూసిన సిస్టర్‌ లిజి మనసు కరిగిపోయింది. ఎలా అయినా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలనుకున్నారు. విషయాన్ని తోటి ఉపాధ్యాయులతో చెప్పగా అందరూ తలా కొంత ఆర్థికసాయం అందించారు. అలా అయిదులక్షల రూపాయలు పోగయ్యాయి. ఆ మొత్తంతో 600 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇంటిని నిర్మించి భాను కుటుంబానికి అప్పగించారు. కానీ సిస్టర్‌ లిజి అంతటితో సంతృప్తి పడలేదు. ‘అలాంటి పిల్లలు తమ బడిలో ఇంకెందరో ఉన్నారు. వారికీ ఇళ్లు కట్టించి ఇస్తే బాగుంటుంది కదా’ అనే ఆలోచన వచ్చిందామెకు.

హౌస్‌ ఛాలెంజ్‌
అనుకున్నదే తడవుగా మిగిలిన ఉపాధ్యాయులతో కలసి ‘హౌస్‌ ఛాలెంజ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లిజి. పేద విద్యార్థినుల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు తోచినంత సాయం అందించమని అందరికీ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులూ వారి తల్లిదండ్రులూ చుట్టుపక్కల వారూ... ఇలా ఎంతోమంది సాయం అందించడానికి ముందుకొచ్చారు. విద్యార్థులు తమ పుట్టిన రోజులూ ఇతర వేడుకల్ని జరుపుకోవడం మాని ఆ ఖర్చుని విరాళంగా ఇవ్వడం మొదలు  పెట్టారు. తల్లిదండ్రులు పండుగలూ వివాహ వార్షికోత్సవాలకయ్యే ఖర్చు తగ్గించుకుని ఆ మొత్తాన్ని హౌస్‌ ఛాలెంజ్‌కి అందించేవారు. ఆ సాయంతో అయిదేళ్లలో వందకు పైగా ఇళ్లను కట్టించింది ‘అవర్‌ లేడీస్‌ కాన్వెంట్‌’. మరికొన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.

రూ.5 లక్షలకే ఇల్లు!
మామూలుగా రెండు పడకగదులు, వంటగది, అటాచ్డ్‌ బాత్రూమ్‌లతో 600చ.గజాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలంటే రూ.15లక్షల వరకూ ఖర్చవుతుంది. కానీ ఈ బడి రూ.5లక్షలతోనే అలాంటి ఇళ్లను కట్టించగలుగుతోంది. కారణం... ఈ బడి చేస్తున్న సేవను గుర్తించి వ్యాపారులు అతి తక్కువ ధరకే సామగ్రిని అందిస్తుంటే కూలీలు నామమాత్ర ధరకే పనులు చేస్తున్నారు. పేద విద్యార్థుల కుటుంబాలతో పాటు, గ్రామంలోని పేద వృద్ధులూ వితంతువులక్కూడా కొన్ని ఇళ్లను కట్టించి ఇచ్చారు. అంతేకాదు, స్థానిక కుట్టనాడ్‌ గ్రామంలో తుపాను వల్ల సర్వం కోల్పోయిన 150 కుటుంబాలకు అన్నీ తామై అండగా నిలిచింది అవర్‌ లేడీస్‌ కాన్వెంట్‌. ఆ గ్రామంలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన పన్నెండు కుటుంబాలకు కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు, దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేయించింది.

ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపిన ప్రిన్సిపల్‌ సిస్టర్‌ లిజిని అభినందించకుండా ఉండగలమా..?

- ఏలేటి ప్రభాకర్‌ రెడ్డి

-ఈనాడు, మహబూబ్‌నగర్‌

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.