close
బాబు... బంగారం!

పొరుగింటి గాయత్రి గొలుసు చూడు... ఎదురింటి కామాక్షి కాసులపేరు చూడు... అంటూ నగల కోసం ఆడవాళ్లు భర్తల వెనక పడటం చూస్తూనే ఉంటాం. బంగారం మీద మోజు పడతులకు పుట్టుకతోనే వచ్చిన హక్కు మరి. ఆశ్చర్యం ఏంటంటే... ఈమధ్య మగ మహరాజులు స్వర్ణాభరణాల మీద మహిళలను మించి మనసు పారేసుకుంటున్నారు. కొందరు ఏకంగా కిలోల కొద్దీ నగల్ని దిగేసుకుంటున్నారు. కార్లూ బైక్‌లకు కూడా బంగారంతో తాపడం చేయించేస్తున్నారు.

 

పంకజ్‌ పరఖ్‌
బంగారు నగలు వేసుకోవడం అందరూ చేసే పనే. తాను ఇంకాస్త భిన్నంగా ఆలోచించి ఒంటినే బంగారంతో కప్పేసుకుందాం అనుకున్నాడు మహారాష్ట్రలోని నాసిక్‌కి చెందిన పంకజ్‌ పరఖ్‌. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగానూ వ్యాపారవేత్తగానూ స్థానికంగా ఎంతో గుర్తింపు పొందిన పంకజ్‌ చిన్నతనంలో ఫీజు కట్టడానికి డబ్బుల్లేక చదువు మానేశాడట. తర్వాత వస్త్ర వ్యాపారంలోకి వచ్చి బాగా సంపాదించాడు. చిన్నప్పట్నుంచీ బంగారం అంటే అతడికి తెగ మోజట. ఆ ఇష్టంతోనే పెద్దపెద్ద బంగారు గొలుసులు కొనుక్కుని వేసుకోవడం మొదలుపెట్టాడు. చివరికి తన 45వ పుట్టినరోజుకి ఏకంగా బంగారు షర్టునే కుట్టించుకున్నాడు. అచ్చంగా బంగారు దారాలతో తయారుచేసిన ఈ చొక్కా బరువు నాలుగు కిలోలకు పైనే. ఖరీదు కోటిన్నర రూపాయలు. అందుకే, ఇది ఖరీదైన చొక్కాగా గిన్నిస్‌ రికార్డుల్లోకీ ఎక్కింది. ఈ చొక్కాతో పాటు, అతడి గొలుసులూ ఉంగరాలూ బంగారు ఫోన్‌ కవర్‌... అన్నీ కలిపి ఒంటిమీద పది కిలోల బంగారం ఉంటుందట.

సన్నీ వాఘ్‌చౌరె
పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌కి చెందిన సన్నీ వాఘ్‌చౌరె అడుగు బయట పెట్టాలంటే రెండు మూడు కిలోల బరువైన బంగారు గొలుసులూ జానెడు పొడవుండే బ్రేస్‌లెట్టూ కనకపు వాచీ బంగారు చెప్పులూ బంగరు కళ్లజోడూ పుత్తడి మెరుగులద్దిన ఫోనూ ఉండాల్సిందే. ఆఖరికి ఇతడు ఎక్కే కారు కూడా స్వర్ణ సొగసులతో మెరిసిపోవాల్సిందే. బంగారం అంటే అతడికి అంత ఇష్టమట. వ్యాపారవేత్త అయిన సన్నీ బాలీవుడ్‌ సినిమాలకు పెట్టుబడి పెడుతుంటాడు. అందుకే, సినిమా ఫంక్షన్లలో టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపిస్తుంటాడు.

గోల్డెన్‌ బాబా...
బాబాలంటే సాధారణంగా మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని కనిపిస్తారు. కానీ సుధీర్‌ కుమార్‌ మక్కడ్‌ అనే ఈ బాబా మాత్రం ఒంటిమీద పదిహేను కిలోల బంగారాన్ని వేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. గోల్డెన్‌ బాబాగా పిలిచే ఈయన ఇంత బంగారం ఎందుకు వేసుకుంటున్నారూ... అంటే ‘బంగారం విలువైంది. మా గురువుగారు కూడా అంతే గొప్పవారు కదా అందుకే...’ అని చెప్పేస్తుంటారు అతడి అనుచరులు. సుధీర్‌ మక్కడ్‌ సన్యాసం తీసుకోకముందు దిల్లీలో దుస్తుల వ్యాపారం చేసేవారట. అన్నట్లూ ఈ బాబా బంగరు చొక్కానీ చేయించుకుంటున్నారట.

వియత్నాం బాబు
‘ఫెంగ్‌షుయ్‌ ప్రకారం ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత ఎక్కువ అదృష్టం వరిస్తుంది...’ ఎవరో ఈమాట చెప్పినప్పట్నుంచీ వియత్నాంకు చెందిన వ్యాపారవేత్త ట్రాన్‌ గొక్‌ ఫుక్‌ బంగారు నగలు చేయిస్తూనే ఉన్నాడు. మొదట అయిదు కిలోల బంగారంతో పెద్ద గొలుసునీ మరో ఎనిమిది కేజీలతో కడియాన్నీ ఉంగరాలనీ చేయించిన ఇతగాడు ఈమధ్య రెండు కిలోల బంగారం, 260 వజ్రాలతో టోపీని చేయించాడు. దీని ధర రూ.కోటిన్నర అట. ఇతడు తిరిగే కారూ బైక్‌లు కూడా స్వర్ణంతో పూత పూసినవే. ఈ సోకులన్నిటినీ వీడియో తీసి ఈమధ్య ఎవరో యూట్యూబ్‌లో పెట్టడంతో  ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది.

పుణెకు చెందిన హర్షవర్థన్‌ పాంఢర్కర్‌ కూడా ఇలాగే ఒంటి మీద కిలోల కొద్దీ బంగారంతో తిరుగుతూ యంగెస్ట్‌ గోల్డ్‌ మ్యాన్‌గా సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందాడు. ఈ బంగారు బాబులందరూ తమ నగలను ఎవరైనా కొట్టేస్తారేమోనని కాపలాగా బాడీగార్డుల్ని పెట్టుకున్నారు.
మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌లో, ముఖ్యంగా మహారాష్ట్రలో ఇలా కిలోల కొద్దీ బంగారం ధరించే అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు. పుణెలో అయితే డబ్బున్న కుర్రకారుకి ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది.  ఇలాంటి వారందరికోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు కూడా ఉన్నాయి.

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.