close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అబ్బ... ఏం కారండీ..!

ఇంట్లో మనక్కావల్సిన వసతులన్నీ ఉంటాయి. డబ్బుండాలిగానీ దాన్ని ఇష్టమొచ్చినంత విలాసవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి ఆ వసతులన్నీ కార్లోనూ ఉంటే... ఫ్రిజ్‌, టీవీ, కాఫీ మెషీన్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ లాంటి అలంకరణ... ఇలా అన్ని సౌకర్యాలూ అందులో ఉంటే ఎంత దర్జాగా ఉంటుందో కదా... అలాంటిదే కార్ల్‌మన్‌ కింగ్‌ కారు.

కప్పుడు కారుంటే బాగా ధనవంతులని అర్థం. కానీ ఈరోజుల్లో కారుల్లో తిరగడం మామూలు విషయం అయిపోయింది. మరి అపర కుబేరులకీ మామూలు వాళ్లకీ తేడా ఏంటీ అంటే... బాగా డబ్బున్న వారి ఇళ్లలానే వారి కార్లు కూడా విలాసానికి మారుపేరులా ఉంటాయి. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారైందే కార్ల్‌మన్‌ కింగ్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ ఎస్‌యూవీ. ఖరీదైన కార్బన్‌ ఫైబర్‌తో తయారైన ఈ కారు వజ్రాన్ని పోలిన డిజైన్‌తో పైకి చూస్తేనే మిగిలిన కార్లకన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇక, మిలమిలా మెరిసే కాంతులతో ఖరీదైన లెదర్‌ అలంకరణలతో ఉండే దీని లోపలికి తొంగి చూస్తే చిన్నసైజు ఫైవ్‌స్టార్‌ హోటల్లోకి అడుగు పెట్టినట్లే ఉంటుంది. ఎనిమిది అడుగుల పొడవుతో విశాలంగా ఉండే ఈ కారు వెనక భాగంలో విలాసంగా ఉండే రెండే సీట్లుంటాయి. వీటిలో కూర్చుంటే ఎంతగా అలసిన శరీరమైనా సాంత్వన పొందుతుంది. ఇవి మసాజ్‌ చెయిర్లు కూడా మరి. ఆ సీట్లలో వెనక్కు వాలి ఎదురుగా ఉన్న 45 అంగుళాల 4కె టీవీలో ఎంచక్కా నచ్చిన సినిమాలు చూడొచ్చు. దాహం వేస్తే టీవీ కిందే ఉండే ఫ్రిజ్‌లో నుంచి పానీయాలు తీసుకుని చల్లగా తాగొచ్చు. ఈ కారులో కాఫీ మెషీన్‌ కూడా ఉంటుంది. కారు రిమోట్‌లో ఓ బటన్‌ నొక్కితే చాలు, పక్కనే ఉన్న అర తెరుచుకుని గ్లాసులూ కాఫీ కప్పులూ బయటికి వస్తాయి. వాటిలో పోసి తమతో ప్రయాణించే అతిథులకీ అందించొచ్చు. ఇక, కారులోనూ ఆఫీసు పని చేసుకునేవారికోసం కుర్చీ హ్యాండిల్‌లోపల ల్యాప్‌టాప్‌ వర్కింగ్‌ టేబుల్‌తో సహా అమరి ఉంటుంది. బటన్‌ నొక్కగానే, అది పని చేసుకోవడానికి వీలుగా తెరుచుకుంటుంది. ఇవేకాదు, ప్లే స్టేషన్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్‌ సిస్టం, మూసి తెరుచుకునే వీలున్న డైనింగ్‌ టేబుల్‌, విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్‌... ఇలా కార్ల్‌మన్‌లోని సౌకర్యాలు ఎన్నో. అంతేనా... రెండు సీట్లుండే డ్రైవర్‌ క్యాబిన్‌కూ వెనక సీట్లకూ మధ్య పార్టిషన్‌ ఉంటుంది కాబట్టి వెనక ప్రయాణించేవారికి పూర్తి ఏకాంతం లభిస్తుంది.

రూ.14 కోట్లు
కార్ల్‌మన్‌ కింగ్‌ కార్లన్నీ ఫోర్డ్‌ ఎఫ్‌-550 ట్రక్‌ని రీ మోడలింగ్‌ చేసి తయారుచేసినవే. 1800 మందితో కూడిన బృందం ఎన్నో ప్రయోగాలు చేసి మరీ దీనికి తుది రూపు ఇచ్చిందట. కారు పనితీరు గురించి చెప్పాలంటే 6.8 లీటర్ల సామర్థ్యం ఉన్న వీ10 ఇంజిన్‌, 398 హార్స్‌పవర్‌ గల ఈ వాహనం గంటకు 140కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 5000 కిలోలకు పైగా బరువుండే ఈ ఎస్‌యూవీని ఈమధ్య న్యూయార్క్‌ ఇంటర్నేషనల్‌ ఆటో షోలో ప్రదర్శించడంతో వార్తల్లోకొచ్చింది. ఈ కస్టమైజ్డ్‌ కారుని ఎవరైనా తమ అభిరుచికి తగ్గట్లూ మార్పులు చేయించుకోవచ్చు. అన్నట్లూ... రూ.14 కోట్ల విలువైన కార్ల్‌మన్‌ కింగ్‌ ప్రపంచంలోనే ఖరీదైన ఎస్‌యూవీ అట.

23  జూన్‌ 2019


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు