close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మబ్బులతో చెలిమి చేస్తారక్కడ!

‘మేఘాలయ... ఆ పేరు వినగానే ఎత్తైన కొండలూ లోతైన లోయలూ పచ్చని మైదానాలూ నల్లని మేఘాలూ కాలంతో పనిలేకుండా ఏడాదిపొడవునా వానచినుకులతో అలరారే మాసిన్రమ్‌, చిరపుంజి ప్రాంతాలూ మబ్బులతోనూ చిటపట చినుకులతోనూ చెలిమిచేసే ఖాసీ తెగా గుర్తొస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన ఆ కొండ ప్రాంతంలో చూడదగ్గ ప్రకృతి వింతలు ఎన్నో’ అంటూ వాటి గురించి చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కి చెందిన టి. నారాయణస్వామి.

గౌహతి విమానాశ్రయంలో దిగి అక్కడికి 125 కి.మీ.దూరంలోని మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కి బయలుదేరాం. అయితే ఆ రాత్రికి షిల్లాంగ్‌ ముందే ఉన్న చిన్న గ్రామం లాంగ్‌కివిట్‌లో బస చేశాం. పచ్చదనంతో నిండిన ఆ ప్రాంతంలో పక్షుల కిలకిలరావాలు వింటూ హాయిగా నిద్రపోయాం.

పరిశుభ్రతకి మారుపేరు!
మర్నాడు ఆసియాలోకెల్లా పరిశుభ్రమైన ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన మాలినాంగ్‌ అనే గ్రామానికి వెళ్లాం. 95 గడపలు ఉన్న చిన్న గ్రామం అది. వార్తల్లో విన్నప్పటికీ స్వయంగా కళ్లతో చూసేసరికి ఆశ్చర్యమేసింది. చూద్దామన్నా ఎక్కడా చెత్త కనిపించలేదు. ఎటు చూసినా పచ్చదనమే. ఇళ్లన్నీ  పొదరిళ్లలా ఉన్నాయి. పెరటి తోటలన్నీ పచ్చని మొక్కలూ విరబూసిన పూలతో కళకళలాడుతున్నాయి. ప్రహరీగోడలూ పచ్చనిమొక్కలే. ప్రతి ఇంటిముందూ వెదురుతో చేసిన చెత్త బుట్ట ఉంది. చెత్తంతా అందులో వేసి తరవాత దాన్ని ఓ గుంతలో వేసి మొక్కలకి ఎరువుగా వాడతారట. కుళ్లిపోని చెత్తని దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తారట. అక్కడ నివసించే 500 మందీ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో పాలుపంచుకుంటారట. నిద్రలేవడమే వాళ్లకి ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేసుకోవడంతోనే మొదలవుతుంది. పిల్లలకి సైతం చిన్నప్పటి నుంచీ ఇంటిచుట్టుపక్కలంతా శుభ్రం చేయడం నేర్పిస్తారు. తరవాతే స్కూలుకి వెళతారు. సందర్శకుల్నీ ఎక్కడా చెత్త వేయనివ్వరు. ముందే చెబుతారు. అక్కడ బస చేయాలనుకునేవాళ్లకి గెస్ట్‌హౌస్‌లు ఉంటాయి. అవి కూడా వెదురుతో కట్టిన పొదరిళ్లే. స్టిల్ట్స్‌మీద కట్టిన అవి చూడ్డానికి ట్రీ హౌసెస్‌లానే అనిపించాయి. వీటినే హోటళ్లుగానూ వాడతారు. పక్కా ఖాసీతెగ ఇళ్లలా ఉండే వాటి పై భాగంలోని గదిలో కూర్చుని టీ తాగితే ఆ అనుభూతే వేరు. గ్రామీణులంతా కలిసి 85 అడుగుల ఎత్తున్న టవర్‌ని వెదురుతోనే కట్టారు. స్కైవ్యూగా పిలిచే ఇది ఎక్కి చూస్తే సరిహద్దుకి అవతల ఉన్న బంగ్లాదేశ్‌ కనిపిస్తుంది.

రత్నంలాంటి నది!
తరవాతి మజిలీ డాకి. భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి చేరుకోవాలంటే ఉమ్న్‌గాట్‌ అనే నది దాటి వెళ్లాలి. నదిపైన 1932వ సంవత్సరంలో బ్రిటిష్‌వాళ్లు నిర్మించిన పురాతన వంతెన మీదుగా నడిచి వెళ్లాం. ఆ సరిహద్దుకి అటు బంగ్లా, ఇటు భారత్‌ సైనికులు కాపలా కాస్తారు. కొండ మీదున్న డాకి గ్రామం నుంచి చూస్తే బంగ్లాదేశ్‌ గ్రామాలు కనిపిస్తుంటాయి. వంతెనమీద నుంచి కిందకి చూస్తే- నదిమీద తిరుగుతున్న పడవలన్నీ గాల్లో ఉన్నట్లే ఉంటాయి. తరవాత పచ్చని నీళ్లతో మెరుస్తున్న ఉమ్న్‌గాట్‌ నదిమీద పడవ షికారుకి వెళ్లాం. పారదర్శకంగా ఉన్న ఆ నీళ్లమీద విహరించడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ నది లోతు 12- 15 అడుగులకి మించదు. నది అడుగుభాగంలో రకరకాల ఆకారాల్లోనూ రంగురంగుల్లోనూ రాళ్లూ వాటి మధ్యలో ఈదుతోన్న చేపల్నీ చూస్తే గమ్మత్తుగా అనిపించింది. చుట్టు పక్కల గ్రామాల వాళ్లంతా ఈ నదిలోనే చేపల్ని పట్టుకోవడానికి వస్తుంటారు. జైంటియా, ఖాసీ కొండల చుట్టూ ఉన్న ఈ నది భారత్‌-బంగ్లాదేశ్‌కీ సరిహద్దు అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో బంగ్లాదేశీయులు అనధికారికంగా వచ్చి చేపలు పట్టుకుని వెళుతుంటారట.

చినుకు చినుకుకో చిత్రం!
అక్కడినుంచి చినుకుకి పెట్టింది పేరయిన చిరపుంజికి బయలుదేరాం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశమైన చిరపుంజిది ప్రస్తుతం రెండో స్థానం. అయినప్పటికీ చినుకు అనగానే అందరికీ ఈ పేరే గుర్తొస్తుంది. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్నంతసేపూ చూపు మరల్చకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాం. పచ్చని తివాచీలు కప్పుకున్న పర్వతశ్రేణుల్నీ ఎవరో తరుముకుని వస్తున్నట్లుగా కొండల్లోనుంచి లోయల్లోకి జాలువారే జలపాతాల్నీ మాతోపాటే ప్రయాణిస్తున్న మబ్బుల గుంపుల్నీ చూస్తుంటే కలిగే అనుభూతిని మాటలతో వర్ణించడం కష్టం. ఖాసీకొండల అంచుల్లో ఉన్న చిరపుంజి చుట్టూ లోయలే. వాటి మీదుగా తేలివచ్చే మేఘాలన్నీ అక్కడి ఎత్తయిన ప్రదేశానికి రాగానే చల్లబడి వర్షిస్తాయి. కానీ వాన నీరంతా నేలలోకి ఇంకకుండా లోయల్లోకి జారిపోతుంది. చిత్రంగా ఇక్కడ పెద్ద శబ్దంతో కురిసే వాన రాత్రివేళల్లోనే ఎక్కువ కురుస్తుందట. ఆ వాన శబ్దానికి తట్టుకోలేక ప్రజలు ఇంటిమీద దట్టంగా గడ్డి కప్పుకుంటారు. ఒక్క వర్షాకాలంలోనే రోజంతా కురుస్తుంటుంది. అదీ జూన్‌-జులై నెలల్లోనే ఎక్కువ. ఆ రెండు నెలల్లో ఆకాశానికి చిల్లులు పెట్టినట్లు వర్షం పడుతూనే ఉంటుంది. మిగిలిన కాలాల్లో భారీ వర్షాలు రాత్రివేళలోనే కురుస్తాయట. దాంతో వాళ్ల దైనందిన జీవనానికి పెద్ద ఇబ్బంది ఉండదు. మొత్తంగా మార్చి నుంచి అక్టోబర్‌ వరకూ వానలే. మిగిలిన నెలల్లోనూ అడపాదడపా పడుతూనే ఉంటాయి. ప్రజలు ఆ వానలోనే తమ పనులన్నీ చేసుకుంటారు. వాన గురించి అడిగితే దాని గురించి పెద్దగా ఆలోచించం అంటారు. ఒకప్పుడు ఇక్కడ పండ్లు కూడా బాగా పండేవట. ఇప్పటికీ ఇక్కడ పండుతున్న కమలా, పైనాపిల్‌ పండ్లు ఎంతో రుచిగా ఉన్నాయి.

మేం ముందుగా చిరపుంజిలోని నోకాలికాయ్‌ జలపాతానికి వెళ్లాం. 4,065 అడుగుల ఎత్తులోనుంచి పడుతున్న ఆ జలపాత సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అందుకే చాలాసేపు అక్కడే దాన్ని చూస్తూ ఉండిపోయాం. తరవాత దానికి సమీపంలోనే ఉన్న మాస్మై గుహలు చూడ్డానికి వెళ్లాం. అప్పటికే అక్కడ జనం బారులు తీరి ఉన్నారు. గుహ పొడవు సుమారు 150 మీటర్లు. లోపల కన్నుపొడుచుకున్నా కానరాని చీకటిగా ఉంటుందట. అందుకే అక్కడ లైట్లు పెట్టారు. పైనుంచి పడుతోన్న నీటిధారలన్నీ గడ్డకట్టి, కత్తుల్లా వేలాడుతున్నాయి. సున్నపురాళ్లతో ఏర్పడిన ఈ గుహల్లో రకరకాల ఆకారాల్లోని స్టాలగ్‌మైట్స్‌ చూడ్డానికి వింతగా అనిపించాయి.తరవాత సెవెన్‌సిస్టర్స్‌గా పిలిచే నోసింగ్‌టియాంగ్‌ ఫాల్స్‌కి వెళ్లాం. కిందకి చూస్తే బంగ్లాదేశ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జలపాతంలో ఉన్న మరో విశేషమేమంటే చిన్న చిన్న జలపాతాలన్నీ కలిసి ఒకే జలపాతంలా కనిపిస్తాయి. అక్కడ నుంచి సీతాకోకచిలుకల మ్యూజియానికి వెళ్లాం. భిన్న జాతులకు చెందిన రంగురంగుల సీతాకోకచిలుకలన్నీ ఉన్నాయక్కడ.

చెట్లవేళ్ల వంతెన!
తరవాత ప్రయాణం అక్కడికి దగ్గరలోనే ఉన్న మాసిన్రమ్‌. ఏటా 11,872 మీటర్ల వర్షపాతం నమోదయ్యే ఆ ప్రాంతంలో ఎటుచూసినా సున్నపురాయీ బొగ్గుగనులే.  ప్రపంచంలోనే అత్యంత తేమ ప్రదేశమైన మాసిన్రమ్‌నీ పలకరించి అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్ల వేళ్ల వంతెనలు చూడ్డానికి వెళ్లాం. వేగంగా పరుగులు తీస్తున్న సెలయేళ్ల మీద రబ్బరు, మర్రి, రావి చెట్ల వేళ్లతో వంతెనల్ని అల్లడం మేఘాలయ వాసుల ప్రత్యేకత. ఆ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ వేళ్ల వంతెనలు స్వాగతిస్తుంటాయి. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే వాటి వేళ్లను కలుపుతూ అల్లి వదిలేస్తారట. అవి పెరిగేకొద్దీ దృఢంగా మారి, సెలయేరుమీద వారధి కట్టేస్తాయి. వీటి ఆధారంగా స్థానికులు ఆ సెలయేళ్లని దాటుతుంటారు. 50-60 మీటర్ల పొడవుండే ఈ వంతెనమీదుగా నడిచి ఆవలి ఒడ్డుకు చేరుకున్నాం.

అక్కడి నుంచి తిరిగి షిల్లాంగ్‌కి చేరుకున్నాం. నగరంలోని వాణిజ్య కూడలిలో రకరకాల దుకాణాలు ఉన్నాయి. అక్కడ దొరకనిది ఉండదట. అందుకేనేమో జనం తిరునాళ్లలోలా ఉన్నారు. మేం కూడా కొన్ని వస్తువులు కొనుక్కుని హోటల్‌కి చేరుకున్నాం. మర్నాడు కజిరంగా జాతీయ అభయారణ్యం చూడ్డానికి బయలుదేరాం. దారిలో షిల్లాంగ్‌ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిఫెంట్‌ జలపాతం దగ్గర ఆగాం. ఇది మూడు నదుల కలయికతో ఏర్పడింది. రెండు నదులు భూ ఉపరితలంలోనే కనిపిస్తే, ఒకటి మాత్రం కొండవాలులోని దిగువ భాగాన కనిపిస్తుంది. ఎగుడుదిగుడు కొండల్లోనుంచి వయ్యారంగా వంపులు తిరుగుతూ జలజలా జాలువారుతోన్న ఆ అందాల్ని చూసి తీరాల్సిందే.

అక్కడి నుంచి ఉమియమ్‌ సరస్సు అందాలు చూడ్డానికి వెళ్లాం. ఉమియమ్‌ అంటే కంటినీరు అని అర్థమట. ఇది  షిల్లాంగ్‌కి ఉత్తర దిశగా 15కి.మీ.దూరంలోని కొండ చరియల మధ్యలో ఉంది. అక్కడికి చేరుకునేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇది మంచి పిక్నిక్‌స్పాట్‌. దాంతో స్థానికులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. దారిలో ఇవన్నీ చూసుకుంటూ కజిరంగాకు చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. హోటల్‌కి చేరుకుని మర్నాడు ఉదయాన్నే బయలుదేరి జీపు సఫారీకి వెళ్లాం. అక్కడ ఖడ్గమృగాల్నీ జింకల్నీ బైసన్లనీ అడవి పందుల్నీ చూశాం. రెండు గంటలపాటు తిరిగినా పులులుగానీ సింహాలుగానీ కనిపించలేదు. బ్రహ్మపుత్రానదీ దాని ఉపనదులూ వాటి మధ్యలో వెలిసిన గడ్డి మైదానాలతోనూ జీవవైవిధ్యంతోనూ అలరారే కజిరంగాలో ప్రకృతి అందాలకు లోటు లేదు. అవన్నీ చూసి మబ్బులతో విహరించిన అనుభూతితో హైదరాబాద్‌కి తిరుగుప్రయాణమయ్యాం.

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.