close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇవి... చిన్నారుల ఇళ్లు..!

ఇది పిల్లలకు స్వర్ణయుగం. వాళ్లు నోరు తెరిచి అడగాల్సిన పనిలేదు. అసలు వాళ్ల మనసులో ఓ కోరిక మొగ్గ తొడగాల్సిన అవసరమే లేదు. వాళ్ల ఊహా ప్రపంచాన్ని సైతం ఈతరం అమ్మానాన్నలే ఊహించేస్తున్నారు. సకల సౌఖ్యాలూ అమర్చడంతోబాటు ఆటపాటలకోసం సైతం వాళ్లదైన ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించేస్తున్నారు. అందులోభాగంగా వస్తున్నవే ఈ చిన్నారుల ఇళ్లు!

పిల్లలకోసం ప్రత్యేక గదులు కేటాయించడం, అందులో వాళ్లకోసం సకల హంగులూ సమకూర్చడం సాధారణ విషయమే. ఇంకాస్త డబ్బుంటే వాళ్లకోసం బొమ్మరిళ్లు(డాల్‌హౌసెస్‌) కొనివ్వడమూ తెలిసిందే. అయితే ఇటీవల మరో అడుగు ముందుకేసి  ఇంటి ఆవరణలోనే వాళ్లకోసం చిట్టిపొట్టి ఇళ్లను కట్టించేస్తున్నారు.

అచ్చం అలాంటి ఇల్లే!
సాధారణంగా పిల్లలు అన్ని విషయాల్లోనూ ఇంట్లోవాళ్లనీ, చుట్టుపక్కలవాళ్లనీ అనుకరిస్తుంటారు. ముఖ్యంగా వాళ్లకి అమ్మానాన్న, ఆ తరవాత స్కూల్లో టీచరే రోల్‌మోడల్స్‌. వాళ్ల హావభావాల్నీ ప్రవర్తననీ నిశితంగా గమనిస్తుంటారు. అమ్మాయిలు అమ్మల్నీ అబ్బాయిలు నాన్నల్నీ అనుకరిస్తూనే ఆటలు ఆడుతుంటారు. అయితే, అమ్మానాన్నలంటే ఎంత ప్రేమ ఉన్నా వాళ్లు ఆడుకునేటప్పుడు తమ ప్రపంచంలోకి పెద్దవాళ్లు రావడాన్ని అంతగా ఇష్టపడరు. ఆ పసిమనసుల ఆలోచనల్నీ ఊహల్నీ గమనించే కాబోలు, నేటి తరం తల్లిదండ్రులు పిల్లల ఆటలకోసం ఏకంగా మినీ ఇళ్లనే ఏర్పాటుచేస్తున్నారు. కొంతమంది నేరుగా మార్కెట్లో దొరికేవాటిని కొంటుంటే, మరికొందరు కొలతలు ఇచ్చి తమకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయిస్తున్నారు. రెడీమేడ్‌ ఇళ్లలో సాధారణంగా ఉండే చిన్న ఇళ్ల నుంచి పేద్ద భవంతుల వరకూ రకరకాల మోడల్స్‌ వస్తున్నాయి. వాటిల్లో తమ బడ్జెట్‌ని బట్టి నచ్చిన ఇంటిని కొని తమ చిన్నారులకు ఏ పుట్టినరోజు కానుకగానో ఇస్తున్నారు నేటి తల్లిదండ్రులు. కొందరైతే అచ్చంగా తమ ఇంటిని పోలిన వాటిని ఆర్డరిచ్చి కొనడానికే ఇష్టపడుతున్నారు. ఈ మినీ హౌసెస్‌లో నాణ్యమైన ప్లాస్టిక్‌తో కట్టినవాటితోపాటు చెక్కతో కట్టినవీ ఉంటున్నాయి. వీటిల్లో రకరకాల సైజులు కూడా చాలానే దొరుకుతున్నాయి. కొన్నయితే చాలా పెద్దగా రెండుమూడు అంతస్తుల్లో ఉండటంతోబాటు పెద్దవాళ్లు సైతం పట్టేంత పెద్ద సైజులోనూ తయారుచేస్తున్నారు.

ఆటలో అభినయం!
ఈ ఇళ్లన్నింటిలోనూ మామూలు ఇంట్లో ఉన్నట్లే వంటగది, పడకగది, హాలు, వరండా, బాల్కనీ... ఇలా అన్ని గదుల్నీ, ఇంటిముందు లాన్‌తో సహా ఏర్పాటు   చేస్తున్నారు. వంటింట్లో బుల్లి ఓవెన్‌, స్టవ్‌, ఫ్రిజ్జూ...వంటి అన్ని సామాన్లనీ ఉంచడంతోబాటు ఇతరత్రా ఫర్నిచర్‌నీ అందంగా సర్దేస్తున్నారు. పండ్లూ కూరగాయలతోబాటు చాక్లెట్లూ బిస్కెట్లు... వంటి రకరకాల తినుబండారాల్నీ ఉంచుతున్నారు. కొన్ని ఇళ్లలో బుజ్జి బుజ్జి ఫ్యాన్లూ ఏసీలూ కూడా బిగిస్తున్నారట. ఇంటిముందు చిట్టిపొట్టి తోటల్నీ పెంచుతున్నారు. దాంతో పిల్లలు ఇంట్లో కుటుంబసభ్యులు చేసే పనులన్నింటినీ ఈ మినీహౌసెస్‌లో అభినయించేస్తూ ఆడుకుంటారు. వాషింగ్‌మెషీన్‌లో బట్టలు వేయడం, వ్యాక్యూమ్‌క్లీనర్‌తో గదుల్ని క్లీన్‌ చేయడం, ఫ్రిజ్‌ సర్దుకోవడం, వంట చేయడం, తోటపని, చదువుకోవడం... ఇలా అన్నీ చేసేస్తుంటారు. టీచర్లై తోటిపిల్లలకి పాఠాలూ చెబుతారు. స్నేహితుల్ని పిలిచి పార్టీలూ చేసుకుంటారు. కొత్త సంవత్సరం, క్రిస్‌మస్‌, దీపావళి, సంక్రాంతి... ఇలా వాళ్లకి తెలిసిన అన్ని పండగలూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ‘దీనివల్ల వాళ్లలో ఆలోచనాశక్తి పెరగడంతోబాటు, ఓ పద్ధతిలో పనులు చేసుకోవడం అనేది ఎవరూ చెప్పకుండానే అలవాటవుతుంది. స్నేహితుల్ని పిలిచి ఆడుకోవడం వల్ల కలిసిమెలిసి జీవించడం నేర్చుకుంటారు. నువ్విది చేయి, నేనది చేస్తా అని ఒకరికొకరు చెప్పుకోవడంవల్ల భవిష్యత్తులో ఉద్యోగజీవనానికి అవసరమైన టీమ్‌స్పిరిట్‌ చిన్నప్పుడే అనుభవంలోకి వస్తుంది.తమ కుటుంబంలోనూ చుట్టుపక్కల ప్రపంచంలోనూ చూసినవన్నీ గుర్తుతెచ్చుకుని చేయడం వల్ల వాళ్లలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అది కేవలం ఆట కాదు, అనుకరణతో నేర్చుకునే జీవితపాఠం’ అంటున్నారు మానసిక నిపుణులు.

నిజానికి ఈ మినీ హౌసెస్‌ అనేవి మనతో పోలిస్తే విదేశాల్లోనే ఎక్కువ. వాళ్లు తమకి కావాల్సిన మోడల్‌ని చెప్పి చేయించుకుంటుంటారు. ఇంట్లో ఫర్నిచర్‌ని సైతం తమ పిల్లల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని మరీ డిజైన్‌ చేయిస్తుంటారు. ఇప్పుడిప్పుడు ఈ ట్రెండ్‌ మనదగ్గరా పెరుగుతోంది. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా చిన్నారుల ఆటలకోసం ఓ ప్రత్యేక లోకాన్నే సృష్టించేస్తున్నారు. అందుకే ఇది పిల్లలకి స్వర్ణయుగం!

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.