close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగద్రక్షకుడు జలానరసింహుడు..!

భారతదేశం విభిన్న ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం. వాటిల్లో విశేషమైందీ గుహలో నీటి ఒరవడితో ఏర్పడినదీ ఝరణీ నరసింహస్వామి ఆలయం. చుట్టూ పచ్చని కొండలతో నిండిన ప్రశాంతమైన వాతావరణం... లోపల మనిషిలోతు నీళ్లుండే గుహ... అందులో నిలువెత్తు నారసింహుడి విగ్రహం ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన  ఈ క్షేత్రాన్ని మనమూ ఒకసారి చూసొద్దాం!

దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం విష్ణుమూర్తి ధరించిన అవతారాలే దశావతారాలు. అన్ని అవతారాలూ లోకకల్యాణం కోసమే అయినా అందులో విభిన్నమైనదీ నరుడూ మృగమూ కలగలిసినదీ నరసింహస్వామి అవతారం. పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన స్వామి మరో భక్తుడి కోరికను మన్నించి అతడి పేరుమీదే స్వయంభూగా వెలసిన గుహాలయం బీదర్‌లోని నరసింహస్వామి క్షేత్రం.

ఇలా దర్శించుకోవాలి
ఝరణీ నరసింహస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామి ఒక గుహలోపల నీటిమడుగులో కొలువై ఉన్నాడు. స్వామివారి పాదాల నుంచి నిత్యం నీరు పెల్లుబికి రావడంతో ఈ గుహలోని స్వామిని జలానరసింహుడు అని కూడా పిలుస్తారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి ఎక్కడికి వెళుతుందనే విషయం ఇప్పటికీ ఒక అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఈ గుహలో నీరు ఎలాంటి హెచ్చుతగ్గులూ లేకుండా ఎప్పుడూ ఒకేస్థాయిలో ప్రవహించడం విశేషం. స్వామిని దర్శించుకోవాలనుకున్న భక్తులు సుమారు అర కిలోమీటరు మేర ఈ నీటి మడుగులో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవకుండా గుహలో విద్యుత్‌ దీపాలూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఇదీ కథ...
బీదర్‌లోని ఝరణీ నరసింహస్వామి ఆలయం స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. పూర్వం ఈ గుహలో జలాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి కఠినమైన తపస్సు చేస్తాడు. అదేసమయంలో విష్ణుమూర్తి నరసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. అనంతరం ఆ ఉగ్రరూపంతోనే అడవుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఒకవేళ జలాసురుడి తపస్సుకు మెచ్చిన శివుడు అతడికి అమరత్వాన్ని ప్రసాదిస్తే దేవగణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని భావించిన దేవతలంతా నరసింహస్వామి దగ్గరకు వెళి,్ల కాపాడమంటూ మొరపెట్టుకుంటారు. అంతట నరసింహస్వామి దేవతల ప్రార్థనను మన్నించి, జలాసురుడు తపస్సుచేసుకునే గుహకు చేరుకుని అతడిని సంహరిస్తాడు. ఆ సందర్భంలో అమరత్వం తప్ప మిగిలిన ఏదైనా వరాన్ని కోరుకోమని చెబుతాడు నారసింహుడు. అప్పుడు జలాసురుడు ‘ఈ క్షేత్రంలో నువ్వు స్వయంభూగా వెలసి, నా పేరుమీదుగానే జలానరసింహస్వామిగా పూజలందుకోవాలి’ అని వరమడుగుతాడు. జలాసురుడి కోరికమేరకు స్వామి జలా నరసింహస్వామిగా కొలువై భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.

చారిత్రకంగా...
కర్ణాటక- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లా బీదర్‌. ఒకప్పుడు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు మైసూర్‌ (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రానికి వెళ్లిపోయింది. చారిత్రకంగా బహమనీ సుల్తాన్‌ అహ్మద్‌ షా బీదర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకుని బహమనీ రాజ్యాన్ని విస్తరించాడు. ఈ కోట ఇప్పటికీ ఒక పర్యటక ప్రదేశంగా వెలుగొందుతోంది. మహాభారతంలో బీదర్‌ ప్రస్తావన ఉందనీ ఆ కాలంలో దీన్ని విదురానగరంగా, అహ్మద్‌ షా పరిపాలనా కాలంలో అహ్మదాబాద్‌ బీదర్‌గా పిలిచేవారనీ చరిత్రకారులు చెబుతారు.

ఇలా చేరుకోవచ్చు
ఝరణీ నరసింహస్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు ఉన్నాయి. రోడ్డుమార్గంలో... హైదరాబాద్‌కి 140కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి జహీరాబాద్‌ మీదుగా బస్సు సదుపాయం ఉంది. వాయుమార్గంలో... బసవకల్యాణ్‌ అనేది బీదర్‌కి 77కి.మీ. దూరంలో ఉన్న దేశీయ విమానాశ్రయం. అక్కడి నుంచి ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించి నరసింహుడిని దర్శించుకోవచ్చు. రైలు మార్గంలో...బీదర్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డుమార్గం ద్వారా ఆలయానికి వెళ్లొచ్చు.

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.